Tuesday, October 1, 2024
Homeఓపన్ పేజ్plastic Relations: తరుగుతున్న బంధాలు..పెరుగుతున్న దూరాలు

plastic Relations: తరుగుతున్న బంధాలు..పెరుగుతున్న దూరాలు

దూరం పెంచినా, తుంచినా అంతా మన చేతుల్లోనే

భారతదేశం ప్రపంచానికే ఆదర్శవంతమైన దేశం. మన దేశ సంస్కృతీ సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, కుటుంబ వ్యవస్థలు అపురూపమైనవి. మన సంస్కృతీ సౌధానికి ఇల్లు, కుటుంబం అనేవి అత్యంత ప్రధానాధారాలు. భారత దేశానికి కుటుంబ వ్యవస్థ ఒక ఆత్మ వంటిది. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలకు మనదేశం పుట్టిల్లు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో తల్లి, తండ్రి, పిల్లలు, తాత, బామ్మలు.. ఇలా మూడు, నాలుగు తరాలకు సంబంధించిన వారందరూ కలిసి హాయిగా జీవించేవారు. వారి మధ్య బలమైన, ఉన్నతమైన బంధాలు ఉండేవి. దీని వల్ల కుటుంబానికి ఒకరకమైన భద్రత లభించేది. గతంలో పెద్దగా ఆస్తులు, ఆదాయ వనరులు లేకపోయినప్పటికీ మనుషులుచక్కని ఆప్యాయత, అను బంధాలతో ఉన్నంతలోనే తృప్తిగా గడిపారు. ప్రపంచం ఒక వసుదైక కుటుంబమని, సంస్కృతి సంప్రదాయాలకు విశ్వగురువు భారత్‌ అని అంటారు. ‘వసుధైవ కుటుంబం’ అనాదికాలం నుంచి భారతీయ కుటుంబవ్యవస్థకు మార్గ దర్శకంగా నిలిచింది. అయితే ప్రస్తుతం ఆధునిక మకిలిని ఒంటబట్టించుకుని మన దేశ సంస్కృతి తాలూకు ఔన్నత్యా నికి భంగకరంగా ప్రవర్తిస్తున్నాం. ప్రగతి పేరిట ప్రవర్తన, ఆధునికత పేరిట అపసవ్యవిధానాలతో తరతరాల మన సంస్కృతికి తూట్లు పొడుస్తూ, బంధాలను బలహీనం చేసుకుంటున్నాం.
పెరుగుతున్న అగాధం..
ప్రపంచీకరణ ప్రయాణంలో కుటుంబ సంబంధాలు, మానవ సంబంధాలలో పెనుమార్పులు చోటుచేసుకున్నాయి. జారిపోతున్న బంధాలతో ఆధునిక మానవుడు ఒంటరివాడై పోతున్నాడు. జీవితం యాంత్రికమై పోయింది. బతుకు యాత్రలో ఊపిరిసలపని వేగంతో ఆందోళనను, ఒత్తిడిని గుండెలనిండా నింపుకొని పయనిస్తున్నాడు. తరాలు మారుతున్న నేపథ్యంలో బంధాలన్నీ తెగిపోతున్న దారంలా సన్నబారిపోతున్నాయి. పేగుబంధాలు, రక్తబంధాలు, వైవాహిక బంధాలు, స్నేహబంధాలు.. ఇలా అన్నీ ఆర్థిక సంబంధాల ముందు మసకబారిపోతున్నాయి. జీవనశైలిలో వచ్చిన మార్పులు కుటుంబవ్యవస్థను, అనుబంధాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. కుటుంబంలోని అందాలు, ఆనందాలు హరించిపోతున్నాయి. కుటుంబ సభ్యులు కష్టసుఖాలు పరస్పరం పంచుకోవాల్సి ఉండగా ‘ఎవరికివారే యమునా తీరే’ అన్న విధంగా మెలగుతు న్నారు. జీవితంలో సౌఖ్యాలు, విలాసాలు పెరిగాయి కానీ పరిణతి చెందాల్సిన మనుషుల వ్యక్తిత్వం మాత్రం కుంచించుకుపోతోంది. నేడు పిల్లలకు అసలు కుటుంబ సంబంధాలు, బంధుత్వాలు పరిచయం చేయడం తగ్గిపోతోంది. దాంతో రేపటి రోజున మన తరువాత మన పిల్లలకు మన అనేవారే లేని, మిగలని పరిస్థితి ఏర్పడుతుంది. మన కుటుంబాల్ని మనమే ఎడం చేసుకుంటూ.. మనలో మనమే దూరం పెంచుకుంటూపోతున్నాం.
దిగజారిపోతున్న విలువలు
కాలానుగుణంగా వచ్చిన మార్పుతో ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు తగ్గి చిన్న కుటుంబాలు ఎక్కువయ్యాయి. కానీ, కుటుంబ వ్యవస్థ ఏదైనప్పటికీ శతాబ్దాలుగా భారతీయ కుటుంబాలను నిలబెట్టి పోషించిన ప్రధాన విలువలపై ఎప్పడూ రాజీ పడకూడదు. అయితే నేడు మనుషుల్లో హెచ్చుమీరుతున్న భేషజాలు, స్వార్థం, ఈర్ష్య, అసూయల వల్ల నైతిక విలువలు దిగజారి పోతున్నాయి. మానవ సంబంధాలు, మమతలు కరువైపోతున్నాయి. కుటుంబ విలువల్లేవు, కట్టుబాట్లు లేవు. పెద్దలంటే గౌరవం లేదు. అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్ళు, భార్యాభర్తలు, అత్తాకోడళ్ళ మధ్య బలమైన అనుబంధం కొరవడింది. హృదయాల్ని స్పృశించాల్సిన అనుబంధాలు ఆర్థికబంధాలుగా మారిపోతున్నాయి. దైనందిన జీవితంలో విలువలతో కూడిన ప్రవ ర్తన, స్వభావం ద్వారా వ్యక్తిత్వ నిర్మాణం జరుగుతుంది. కానీ, నేటి యువతకు క్రమశిక్షణకు అవసరమైన సంస్కారాలను, విలువలను అందించడానికి కుటుంబంలో పెద్దలు కరువవుతున్నారు. కొన్ని కుటుంబాలలో పెద్దలు ఉన్నా వారిని లక్ష్యపెట్టడం లేదు. బంధం, అనుబంధం, బంధు త్వం, స్నేహం అనే సంస్కారం నేర్పే వ్యవస్థ లేనపుడు మనిషి మనిషిగా జీవించలేడు. భారతీయ సంస్కృతిలో వివాహ వ్యవస్థ అపూర్వమైనది. గతంలో మన సమాజంలో నిశ్చయ వివాహాలు ఒక పద్దతిలో కట్టుబడి దీర్ఘకాలం మనగలిగేవి. అయితే నేడు మన వివాహవ్యవస్థ బలహీనపడి పాశ్చాత్య దేశాలలో మాదిరి అవుతోంది. కారణం సామాజిక పెడపోకడలు. చిన్నచిన్న విషయాలకు కూడా భార్యా భర్తలు తరచూ గొడవలు పడటం, విలువలకు తిలోదకా లిచ్చి విడిపోవడాలు సర్వసాధారణమైపోతోంది.
వృద్ధులపట్ల నిరాదరణ
ఆధునిక సమాజంలో చాలా ఇళ్ళల్లో ముసలి తల్లి దండ్రుల ఆలనా పాలనా కరవైంది. ఉద్యోగాలు, వ్యాపారాల వల్ల నేడు పిల్లలు ఎక్కడెక్కడో ఉంటున్నారు. దాంతో వృద్ధులు ఒంటరి జీవితం పాలై, బిడ్డల సాంత్వన కోసం, ఆత్మీయ స్పర్శకోసం ఆరాటపడుతున్నారు. అనారోగ్య సమస్యలతో, ఒంటరితనంతో జీవన సంధ్యాసమయంలో వాళ్ళు అంతులేని ఘర్షణలకు, ఆవేదనలకు గురౌతున్నారు. పిల్లలతో కలిసి ఉంటున్న కుటుంబాల్లో సైతం చాలామంది పెద్దలు నిరాదరణకు గురికావడం మనం చూస్తూనే ఉన్నాం. చిన్నచిన్న కారణాలతోనే పిల్లల నుంచి అవమానాలు, ఈసడింపులు, సూటిపోటి మాటలు ఎదు ర్కొంటున్నారు. బిడ్డలను పెంచి పెద్దచేసి లోకంలో జీవించడానికి కారణభూతులైనవారు తల్లిదండ్రులు. వారు ఇంటిల్ల పాదికీ పెద్దదిక్కు. మన సమస్యల చిక్కుముడులను చిటికెలో విప్పే అనుభవమూర్తులు. ఇంట్లో పిల్లలకు తెలియని విషయాలు, నీతి కథలు నేర్పించే బోధకులు. తరతరాలుగా వస్తున్న బంధాల విలువల కొనసాగింపునకు మూలస్తంభాలు. అటువంటి వారిని కంటికిరెప్పలా కాపాడుకోవాల్సింది పోయివారిని నిర్లక్ష్యం చేయడం, వృద్ధా శ్రమాలకు పంపించడం వంటిచర్యలకు పాల్పడుతున్నారు నేడు కొందరు సంతానం. ఇలాంటి ప్రవర్తనలతో కుటుంబ బాంధవ్యాలు, సామాజిక విలువలు ఎంతగానో విచ్ఛిన్న మవుతున్నాయి.
బంధాలు బలపడాలంటే..
కుటుంబవ్యవస్థ పటిష్ఠంగా రూపుదిద్దుకుంటేనే బం ధాలు బలపడతాయి. దానికి కుటుంబ సభ్యుల ఆలోచనా విధానంలో మార్పు రావాలి. వారి మధ్య ప్రేమాను రాగాలు, అన్యోన్యతలు పెంపొందాలి. ముఖ్యంగా భార్యా భర్తల మధ్య సర్దుబాట్లు, ఒకరి సమస్యల్ని మరొకరు అర్థం చేసుకునే ఓర్పు, పరిష్కరించుకునే నేర్పు ఉండాలి.ఒకరి అభిరుచులను మరొకరు గౌరవించుకుంటూ, అరమరికలకు తావులేకుండా ఒకరి మనస్సులో మాటను మరొకరితో పంచుకోవాలి. అపుడే వారి బంధం మరింత బలపడుతుంది. కుటుంబంలో ఇల్లాలి పాత్రే ప్రధానం. భర్త, పిల్లలు, అత్తమామల్ని ఆప్యాయతతో చూసుకోవడంలోనూ, ఇంటివ్యవహారాలు నిర్వహించడంలోనూ ఇల్లాలి పాత్ర కీలకం. అందుకే ‘ఇంటికి దీపం ఇల్లాలు’ అన్నారు. ఇంట్లోవారి మధ్య ఎటువంటి పొరపొచ్చాలు లేకుండా ఉండాలంటే ఆ ఇంటి ఇల్లాలు ఓర్పు, సహనం, సంస్కారాలాతో మెలగాలి. వృద్ధులను ఆదరణతో చూసుకోవాల్సిన బాధ్యతకన్నవారిపై ఉంది. మానవీయ విలువలతో, సంస్కారంతో పెద్దరికానికి పెద్దపీట వేయాలి. మార్గనిర్దేశకులైన వారి సలహాలు, సూచనలు పాటించడం మేలైన మార్గం. కుటుంబంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు సమష్టి ఆలోచనల ద్వారా పరిష్కరించుకోవాలి. ‘నేను’ అని కాకుండా ‘మనం’ అనే భావంతో కుటుంబ సభ్యులు మసలుకుంటే అనుబంధాలు వికసిస్తాయి. నేడు పిల్లలకు దగ్గర బంధుత్వాలు గురించి కూడా తెలియడం లేదు. అందువల్ల మన వారసత్వాన్ని పిల్లలకు తెలియజెప్పాలి. కుటుంబ విలువలను తెలియజేసే పాఠ్యాంశాలను, కార్యక్రమాలను రూపొందించి భావితరాలకు అవగాహన, ప్రేరణ కల్పించాలి. దూరమై పోతున్న చుట్టరికాలు, తరిగిపోతున్న ఆత్మీయతల వల్లకుటుంబానికి తద్వారా సమాజానికి తీరని లోటు ఏర్పడుతుంది. కాబట్టి బంధాలు, అనుబంధాల బలోపేతం కోసం ప్రతి ఒక్కరూ కంకణ బద్దులుకావలసిన అవసరం ఎంతైనా ఉంది.
పీ.వీ.ప్రసాద్‌

  • 9440176824
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News