Friday, November 22, 2024
Homeఓపన్ పేజ్POCSO Act: పోక్సో చట్టం లోపాలమయం

POCSO Act: పోక్సో చట్టం లోపాలమయం


లైంగిక నేరాల నుంచి బాలబాలికలకు రక్షణ కల్పించడానికి ఉద్దేశించిన పోక్సో చట్టాన్ని పార్లమెంట్‌ పునఃపరిశీలించాల్సిన అవసరం ఉందంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డి.వై. చంద్రచూడ్ పిలు పునిచ్చారు. ఈ చట్టంలో ఉన్న లొసుగులు, లోపాల కారణంగా దాని ముఖ్య ఉద్దేశం, దాని ప్రయోజనం ఆశించిన స్థాయిలో నెరవేరడం లేదని ఆయన స్పష్టం చేశారు. ఒక వయసుకు వచ్చిన పిల్లలు తమ బాంధవ్యాలన్నిటినీ నేరపూరితం చేయడం దేశంలో మరీ ఎక్కువైపోతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన ఆందోళనకు అర్థం లేకపోలేదు. దేశంలో పోక్సో చట్టం అమలు జరుగుతున్నప్పటికీ, బాలలపైనా, చిన్నారులపైనా జరుగుతున్న లైంగిక దాడులు ఈ ఏడాది కూడా సుమారు 35 శాతం పెరిగాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. దేశంలోని వివిధ హైకోర్టులు ఇటీవలి కాలంలో అనేక పర్యాయాలు బాలలపై జరుగుతున్న అత్యాచారాల గురించి ఆయా ప్రభుత్వాల దృష్టికి తీసుకు రావడం జరిగింది. సుప్రీంకోర్టు కూడా పోక్సో కేసులో అడ్డూ ఆపూ లేకుండా పెరగడం పట్ల అనేక సందర్భాలు లో ఆందోళన వ్యక్తం చేసింది. దిగువ స్థాయి కోర్టుల నుంచి హైకోర్టుల దాకా వివిధ కోర్టుల ముందుకు వస్తున్న పోక్సో కేసులను పరిశీలిస్తే ఆందోళన, ఆవేదన కలుగుతున్నాయని నేషనల్‌ క్రిమినల్‌ రికార్డ్స్ బోర్డు కూడా ఈ మధ్య వ్యాఖ్యానించింది.

- Advertisement -


దరిమిలా, ఏ చట్టాన్ని నిర్లక్ష్యం చేసే, విస్మరించే స్థితిని దాటిపోయామని, పార్లమెంట్‌ వెంటనే కల్పిం చుకుని, ఈ చట్టాన్ని తగిన శాసనం ద్వారా మరింత పటిష్ఠం చేయాలని చంద్రచూడ్‌ విజ్ఞప్తి చేశారు. చిన్న పిల్లలకు సంబంధించి, అంటే 18 ఏళ్ల లోపువారికి సంబంధించి లైంగిక దాడులు, అత్యాచారాలు, సంబంధిత నేరాలను నిరోధించడం ఈ చట్టం ప్రధాన లక్ష్యం. టీనేజర్లు, మైనర్లు, పిల్లలపై లైంగిక దాడులు జరిగినా, మైనర్లే లైంగిక దాడులకు పాల్పడినా ఈ చట్టం తగిన విధంగా విచారించి శిక్షలు విధించడానికి అవకాశం ఉంది. అయితే, టీనేజర్ల లైంగిక కార్యకలాపాలను నిరోధించడానికి ఈ పోక్సో చట్టం సరిపోవడం లేదని, పూర్తి స్థాయిలో లేదా యథాతథంగా ఈ చట్టాన్ని ఉపయోగించడానికి ఏమాత్రం అవకాశం ఉండడం లేదని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అసలు ఇటువంటి కేసులు విచారణ దశలోనే న్యాయమూర్తులను ఇరకాటంలో పడేస్తున్నాయని, విచారణను ప్రశ్నార్థకం చేస్తున్నాయని ప్రధాన న్యాయమూర్తి సైతం బహిరంగంగానే చెబుతున్నారు. విచారణలో సమాధానాలే లేని ప్రశ్నలెన్నో ఉత్పన్నమవుతున్నాయని హైకోర్టు న్యాయమూర్తులు వాపోతున్నారు.


పిల్లల సాధారణ ఆరోగ్యంతో పాటు, లైంగిక ఆరోగ్యానికి కూడా సంబంధించి ప్రభుత్వానికి పిల్లల ఆరోగ్య సంరక్షణ నిపుణులు తరుచూ సమర్పిస్తున్న అధ్యయన నివేదికలను కూడా పరిశీలించి పోక్సో చట్టాన్ని ఏవిధంగా సవరించాలో ఒక అవగాహనకు రావాలని న్యాయ నిపుణులు సూచిస్తున్నారు. దేశంలో సుమారు 26 కోట్ల మంది మైనర్లు ఉన్నా, వారిని సామాజికంగా, మానసికంగా సంస్కరించే వ్యవస్థ మాత్రం లేదని, వారు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశమే లేదని ఈ మధ్య ఒక సదస్సులో చంద్రచూడ్‌ వ్యాఖ్యా నించారు. 2019 నుంచి 2021 వరకు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే జరిగి నప్పుడు, మైనర్లలో సుమారు 40 శాతం మంది 12 ఏళ్ల నుంచి 16 ఏళ్ల లోపే లైంగిక సంబంధాలను అను భవిస్తున్నట్టు తేలింది. ఇంతకు ముందు వరకూ 16 ఏళ్ల లోపు వారిని మాత్రమే పోక్సో చట్టం పరిగ ణనలోకి తీసుకునేది. 2012 నుంచి అది ఆ వయసు పరిధిని 18 ఏళ్లకు పెంచింది. అందుకు తగ్గట్టుగానే భారతీయ శిక్షా స్మృతిని, ఇతర చట్టాలను కూడా పోక్సోకు అనుబంధం చేయడం జరిగింది.
దిగువ స్థాయిలో విచారణ కోర్టులు చట్టం ప్రకారం ఎటువంటి వివక్షా పాటించడానికి అవకాశం లేనప్పటికీ, పోక్సో కేసులకు సంబంధించినవారు ప్రతిసారీ హైకోర్టులనే ఆశ్ర యించడం జరుగుతోంది. ముఖ్యంగా ఇందులోని బాధితుల కన్నా నేరస్థులు క్షమాభిక్ష కోసం హైకోర్టులనే సంప్రదించడం సర్వసాధార ణమైపోయింది. మైనర్లే అయినప్పటికీ పరస్పర అంగీకారంతో ఇద్దరి మధ్యా (ముఖ్యంగా 16-18 ఏళ్ల మధ్య) లైంగిక సంబంధం ఏర్ప డినప్పుడు, హైకోర్టులు మరింత జాగ్రత్తగా విచారించి, వారిని నిర్దోషులుగా వదిలిపెట్టడం ఆనవాయితీ అయిపోయింది. న్యాయమూర్తులందరూ అదే విధంగా వ్యవహరిస్తున్నారని కాదు. గత ఏడాది మద్రాస్‌ హైకోర్టు ఇటువంటిదే ఒక కేసులో, ‘సమాజం తీవ్రమైన మార్పులకు లోనవుతున్న విషయాన్ని విస్మరించకూడదు. ఇద్దరు మైనర్ల మధ్య పరస్పర అంగీకారంతో లైంగిక సంబంధం కొనసాగుతున్నప్పుడు తప్పనిసరిగా ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది’అని వ్యాఖ్యానించిం ది. మొత్తం మీద ప్రతి నాలుగు పోక్సో కేసుల్లో కనీసం ఒక కేసు పరస్పర అంగీకారంతోనే లైంగిక సంబంధం పెట్టుకున్న కేసే అవుతోందని ఎన్ఫోర్డ్‌ ప్రోయాక్టివ్‌ హెల్త్‌ ట్రస్ట్‌ అనే సంస్థ ఇటీవల ఒక నివేదికలో వెల్లడించింది.

-జి. రాజసుక

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News