గాలి కదుపు లేదు కడలికంతు లేదు, గంగవెల్లువ కమండలంలో ఇమిడేదేనా …? ఉరికే మనసుకు గిరిగీస్తే అది ఆగేదేనా…! ఇది ఓ కవి ఊహ. నిజమే కవికి కవి ఊహకు కవి వేగానికి హద్దులుండవు, అంతుండదు, అందుకే ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై ఈ అడవి దాగిపోనా అంటాడు, చెట్టైనా, పుట్టైన అన్నీ తానై ఊహిచుకుంటాడు, దేనికి అతీతుడు కాడు కాలేడు కూడా. మహాకవి కాదేదీ కవిత కనర్హం అన్నట్లు అన్నీ కవిత వస్తువులే అది అగ్గిపుల్ల కావచ్చు, సబ్బు బిల్లా కావచ్చు, చిన్న పిల్లాడి లాగా, పండు ముసలిలాగా, యవ్వనంతో తొనికీసలాడేపడుచు యువతిలాగా కన్నెపరువాలు ఒలకబోస్తు ప్రియుడి కోసం వలపులు, తలపులు, అన్నీ తనే ఊహించుకుంటూ నువ్వేం మాయ చేశావో గాని ఓ మనసా చెప్పమ్మ నిజాన్ని అంటాడు, మరోచోట సిరి మల్లెపువ్వా సిరి మల్లె పువ్వా చిన్నారి చిలమ్మ నా వాడు ఎవడే నాతోడు ఎవడే? అంటూ ప్రశ్నిస్తాడు, మరోచోట ప్రకృతిని, ఋతువులను నదీ, నదాలను, ఏర్లను, సెలయేర్లను వర్ణిస్తూ తరలిరాద తనే వసంతం తన దరికిరాని వనాల కోసం, గగానాల దాక అల సాగకుంటే మేఘాల రాగం ఇల చేరుకోదా అంటాడు. వసంతం వనాల దగ్గరికి వస్తుంది కానీ వసంతం వనం దగ్గరికి వెళ్ళదు అనే వాస్తవిక దృశ్యాలతో అవాస్తవిక దృశ్యాన్ని సందర్భాన్ని బట్టి ఊహించి అక్షరూపం ఇస్తాడు. ప్రియుడి వేదనకు, ఆవేదనకు అక్షర రూపం ఇచ్చే క్రమంలో తానే ఆ విరహ వేదనను అనుభవిస్తునట్లుగా తాద్యాత్మీకరణం చెంది ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం చేసినాను ప్రేమ సాగర మధనం మింగినాను హలాహలం అంటూ వర్ణిస్తాడు, మరోచోట పల్లవించవా నా గొంతులో పల్లవి కావా నా పాటలో అంటూ ప్రేమ పల్లవిని అందుకుంటాడు. ప్రియురాలు దూరమైనప్పుడు ఆ విరహ వేదనను తట్టుకోలేక మేఘ సందేశం పంపుతూ ఆకాశదేశానా ఆషాడ మాసన మెరిసేటి ఓ మేఘమా, మెరిసేటి మేఘమా విరహమో, దాహమో విడలేని మోహమో వినిపించు నా చెలికి మేఘ సందేశం అంటూ మేఘ సందేశం పంపుతాడు. తనలో వైరాగ్యం ఆవహించినప్పుడు ఆగదు ఏ నిమిషం నీ కోసము అంటూ కాలం విలువను, గతం గొప్పతనాన్ని వివరిస్తాడు, అదే మరోచోట ఓటమి ఎదురైనప్పుడు ఎప్పుడు ఒప్పుకో వద్దురా ఓటమీ అంటూ గెలుపు కోసం తలుపు తెరిచే వుంది ప్రయత్నం చేయమంటూ స్పూర్తిని రగిలిస్తాడు మరోచోట. అలాగే నువ్వు ఎంత ఎదిగినా ఒదిగి వుండాలని, మౌనంగానే ఎదుగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్ది ఒదగమని అర్ధమందులో వుంది అంటూ నిగూఢమైన అర్ధాన్ని బోధిస్తాడు గురువులా. అన్నదమ్ముల అనుబంధాలు మనీ బంధాలుగా మారుతున్న ఈరోజుల్లో సెంటు భూమి దగ్గర, వంద రూపాయల దగ్గర కూడా ఆస్తి గొడవలు హత్యలు, ఆత్మహత్యలు నిత్యం మనం ఎక్కడో చోట చూస్తూనే వున్నామ్. అలాంటి వారికి గుణపాఠం చెప్పటానికి నేనున్న గర్భంలోనే ఏడాది నువ్వున్నావు తమ్ముడా, ఇప్పుడు నువ్వాడ నేనీడ మనకెందుకు అడ్డుగోడ తమ్ముడా? అంటూ ప్రశ్నిస్తాడు. బంధాలు, బంధుత్వాలు ఈ జన్మలోనే భౌతికంగా ఎవరు ఎవరి నుండి దూరమైనా కంటికి కంపించరు, బ్రతికి ఉన్నప్పుడే కలిసిమెలిసి వుండాలని ఆస్తి పంపకాలు, అంతస్థుల అంతరాలు పక్కన పెట్టాలని బొధిస్తాడు, ఇందులో అలాగే తల్లిదండ్రులను పిల్లలు పెరిగి పెద్దైన తర్వాత మాకు ఏం ఆస్తులు ఇచ్చారని అడగవద్దంటూ ఏమిచ్చావని ఏమిచ్చావని నింధించకురా నాన్నను అంటూ హెచ్చరిస్తాడు. నాన్నైనా, అమ్మైన నీకు విలువైన జీవితాన్ని ఇచ్చారు ఇంత కన్నా కావాల్సింది ఏముంది? నీలో ప్రతిభ వుంటే నువ్వే సంపాదించుకోవాలి కానీ తల్లిదండ్రులను నిందించవద్దు అంటూ సున్నితంగా మందలిస్తాడు. తండ్రి ప్రేమకు దూరమై పెరిగి పెద్దవాడైతే ఆ తండ్రి ప్రేమ ఎంత గొప్పదో నాన్న నువు నా ప్రాణం అనినా సరిపోదట ఆమాట నాన్న నీకై ప్రాణం ఇవ్వనా ఇదిగో నా మాట అంటూ నాన్న గొప్పతనం గూర్చి వివరిస్తాడు. సమస్య వచ్చినప్పుడు దానికి జవాబు కూడా నీ వద్దనే వుంటుందని నీ ప్రశ్నలు నీవే ఎవ్వరూ బదులివ్వరుగా, నీ చిక్కులు నీవే ఎవరూ విడిపించరుగా, పదినెలలు తనలో నిన్ను మోసిన అమ్మైన అప్పుడో ఇపుడో కననే కనను అంటుందా? అంటూ ప్రశ్న నీదే సమాధానం కూడా నీ దగ్గరే ఉంటుంది వెతకుతూ ముందుకు సాగాలని సూచిస్తాడు.
వెంటనే తేరుకొని పదహారు సంవత్సరాల పడుచుప్రాయంలోకి వెళ్ళి మరీ పదహారేళ్ళ వయస్సు పడిపడి లేత మనసు పట్టుకో పట్టుకో పగ్గమేసి పట్టుకో అంటూ యవ్వనంలోని మాధుర్యాన్ని కళ్ళెం వేసి పట్టుకోమంటాడు. వెళ్ళిపోతే తిరిగి రానిది యవ్వనం అంటూ మరోచోట నిండు జాబిల్లీకై నా వుంది మచ్చ నీకు లేనందుకే వచ్చా అంటూ ప్రియురాలిని బుట్టలో వేసుకోవడానికి పొగడుతూ నెల్లూరి నెరజాణ నే కుంకుమల్లే మారిపోనా అంటూ తన్మయత్వం చెందుతూ నీ నవ్వు చెప్పింది నాతో నేనెవ్వరో ఏమిటో అంటాడు. మరో చోట నిదురరాని పడకిళ్ళు బ్రహ్మచారి పొదరిల్లు అంటూ బ్రహ్మచారి గూర్చి వివరిస్తాడు. వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు బాల్య స్నేహితుడు కనిపిస్తే ఆనాటి ఆ స్నేహ మానందగీతం ఆ జ్ఞాపకాలన్ని మధురతిమధురం ఈనాడు ఆహాయి రాదేల నేస్తం ఆ రోజులు మునుముందిక రావేమిరా లేదురా సుఖం రాదురా ఆ గతం ఏమిటో జీవితం అంటూ గతం గుర్తు చేసుకొని బాధపడతాడు. ఇలా రాసుకుంటూ పోతే మనిషి జీవితంలో బాల్యం నుండి వృద్ధాప్యం వరకు మనిషి పొందే ఉద్వేగాలు, అనుభూతులు, సంఘటనలు చూడటం లేదా తను స్వయంగా అనుభవించి ప్రతి స్పందిస్తాడు. ఒక కవికి మాత్రమే అన్ని రకాల స్పందలను తన స్పందనగా తనకు తానుగా సంఘర్షించుకొని సన్నివేశంలోకో, సంఘటనలోకో, సందర్భంలోకో పరకాయ ప్రవేశం చేసి చిన్న పిల్లవాడిగా, యువకుడిగా, యువతిగా, సరిహద్దులు కాపాడే సిపాయిగా పండు ముసలిగా దేశంలో జరిగే నేరాలు, ఘోరాలు, అవినీతి అక్రమాలు చూసి చిటికలో స్పందిస్తాడు. నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవశ్చవాన్ని మారదు లోకం అంటూ ఆవేశంగా ఊగిపోతాడు. తెలుగు వీర లేవరా దీక్ష భూని సాగరా దేశమత స్వేచ్చ కొరకు తిరుగుబాటు చేయరా అంటూ పరాయి పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటుని ప్రకటిస్తాడు, అంటే ఇక్కడ కవి స్పందన, కవి కల్పన సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని ఓ పాత్ర ద్వారా హెచ్చరిక పంపిస్తాడు, రామబాణం ఆపిందా రావణ కాష్ఠం? కృష్ణగీత ఆపిందా నిత్యకురుక్షేత్రం అంటాడు.
నేటికి ప్రపంచవ్యాప్తంగా ఏదో మూలన ఘర్షణలు జరుగుతూనే వున్నాయ్ మనుషుల మధ్య విభజన రేఖలు గీసిన మత గ్రంధాలు, వాటిని మనిషి సరిగ్గా అర్ధం చేసుకోకపోవడం ఫలితంగా స్వార్ధ రాజకీయ నాయకులు అధికారం కోసం ప్రజల మధ్య కులాల కుంపట్లు, మతాల మంటలు రాజుకుంటున్నాయ్ అంటూ దీనికి ప్రతిగా మరోచోట తెల్లవారక ముందే పల్లె లేచింది తన వారందరినీ తట్టి లేపింది అంటూ పల్లె సొగసులు వివరిస్తాడు. వాక్యం రసాత్మకం కావ్యం అంటాడు విశ్వనాధుడు. వ్రాసిన వాక్యం ఏదైన రస్మాత్మకంగా వుంటే అది పాఠకులకు, ప్రేక్షకులకు, వీక్షకులకు చేరి ఆలోచింపజేస్తుంది. అది ఒక్క కవికి మాత్రమే దైవ వరంగా లభించింది. వ్రాసే వాక్యం ఏదైనా కావచ్చు. ఒక మనిషిని ఇంతలా కదిలించగలిగే శక్తి కేవలం సాహిత్యానికే వుంది, అది అక్షరానికి మాత్రమే వుంటుంది. అందుకే విశ్వశ్రేయం కావ్యం అన్నారు పెద్దలు. కవి స్పందనను ఊహించటం, కవి వేగానికి మీటర్లు పెట్టి లెక్కించడం సాధ్యం కాదు. కవి ఏవిధంగానైనా స్పందించగలడు. బాధితుల వైపు బాధ్యుల వైపు నిలబడగలడు, కవికీ కవితా వస్తువు ఏది నిషేదం కాదు, అందుకే కవి కల్పనకు అంతుండదు అవధులు అంతకన్నా వుండవు. కవి నిత్య చిరంజీవి, రాజు జీవించు రాతి విగ్రహముల యందు కవి జీవించు ప్రజల నాలుకల యందు అన్న ఓ కవి అక్షరాలు అక్షర సత్యాలు. కవికి ఇంత కన్నా ఏం కావాలి. ఇది చరిత్ర చెప్తున్న సత్యమే కదా…!
డాక్టర్ మహ్మద్ హసన్
సాహిత్య విమర్శకులు
సెల్ నెం. 9908059234.