Impact of Family Feuds on Governance: భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం. ఇక్కడ అనేక జాతీయ, ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. చాలా వరకు రాష్ట్రాల్లో జాతీయ పార్టీల హవా కొనసాగుతుండగా.. కొన్ని రాష్ట్రాలు మాత్రం సంప్రదాయంగా ఎప్పటినుంచో ప్రాంతీయ పార్టీలకు పెట్టని కోటలుగా ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో చాలాకాలం పాటు జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ ఆధిపత్యమే కొనసాగింది గానీ, తర్వాత ప్రాంతీయ పార్టీల గుప్పిట్లోకి వెళ్లిపోయింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన దశాబ్ద కాలం తర్వాత మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. తమిళనాడు లాంటి రాష్ట్రాలు మాత్రం జాతీయ పార్టీలను చాలాకాలం నుంచి దూరం పెట్టాయి.
అయితే.. ఇదే గడ్డ మీద జరిగిన వారసత్వ యుద్ధాల చరిత్ర ఏమీ తక్కువ కాదు. ఒక్కసారి మొఘల్ సామ్రాజ్యం నాటి పరిస్థితులను తిరగేస్తే.. ఢిల్లీ పీఠం కోసం మొఘల్ చక్రవర్తి షాజహాన్ కుమారుల మధ్య జరిగిన నెత్తుటి పోరాటం మన కళ్లకు కట్టినట్టు కనిపిస్తుంది. “యా తఖ్త్, యా తఖ్తా” (సింహాసనం లేదా శవపేటిక) అనే సిద్ధాంతంతో నాడు ఔరంగజేబు తన సొంత సోదరుడు దారా షికోను అంతం చేసి, కన్నతండ్రినే జైల్లో పెట్టి రాజ్యాధికారాన్ని చేజిక్కించుకున్నాడు. మొఘల్ చక్రవర్తులు అందరూ దాదాపుగా వారసత్వం కోసం ఇలాంటి యుద్ధాలు చేసినవాళ్లే. తమ సొంత అన్నదమ్ములను, తండ్రులను కూడా వాళ్లు జైళ్లలో పెట్టించడం, హతమార్చడం లాంటివి చేశారు.
శతాబ్దాలు గడిచాయి. రాచరికం పోయి ప్రజాస్వామ్యం వచ్చింది. కానీ మన రాజకీయ నాయకుల ఆలోచనా విధానంలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. నేటి రాజకీయ కుటుంబాల్లో జరుగుతున్న ఆధిపత్య పోరు చూస్తుంటే ఆధునిక ప్రజాస్వామ్యంలో మొఘలాయిల కాలం నాటి “వారసత్వ యుద్ధాలు” మాత్రం ఇంకా ఇప్పటికీ అలాగే కొనసాగుతున్నాయని అనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో అన్న జగన్ మోహన్ రెడ్డి మీద ఆయన చెల్లెలు షర్మిల, తెలంగాణలో కన్న తండ్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మీద ఆయన కుమార్తె కవిత, మహారాష్ట్రలో బాబాయ్ శరద్ పవార్ మీద అబ్బాయి అజిత్ పవార్… ఇలా దేశవ్యాప్తంగా సాగుతున్న ఈ అంతర్యుద్ధాలు కేవలం కుటుంబ గొడవలు కావు. ఇవి అధికారం, ఆస్తి, ఆధిపత్యం కోసం జరుగుతున్న తీవ్రమైన రాజకీయ సంఘర్షణలని చెప్పక తప్పదు. అయితే, వీటివల్ల ఆయా రాష్ట్రాల్లో జరుగుతున్న పరిణామాలు కేవలం పార్టీలకు మాత్రమే పరిమితం కాలేదు. రాష్ట్ర అభివృద్ధి మీద, పార్టీల భవితవ్యం మీద, ఇంకా అనేక అంశాల మీద ప్రభావం పడుతోంది. వివిధ రాష్ట్రాల్లో పరిస్థితులు, వాటి ఫలితాలు ఎలా ఉన్నాయన్న విషయాలు పరిశీలిద్దాం.
ఆంధప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ రాజశేఖరరెడ్డి సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి రాష్ట్రంలో సుదీర్ఘకాలం పాటు అధికారం చలాయించిన తర్వాత ఎన్టీ రామారావు సుడిగాలిలా దూసుకొచ్చి అంత పెద్ద పార్టీని గద్దెదించేశారు. చాలా కాలం పాటు ఎన్టీఆర్, ఆయన తర్వాత చంద్రబాబు నాయుడు రాష్ట్ర పరిపాలనా పగ్గాలను చేబట్టారు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద ప్రజల్లో ఉన్న తీవ్ర వ్యతిరేకతను అధిగమిస్తూ రాష్ట్రవ్యాప్త పాదయాత్ర చేసి వైఎస్ రాజశేఖరరెడ్డి మళ్లీ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. ఆయన హఠాన్మరణం తర్వాత పరిణామాల్లో ఆయన కుమారుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెరమీదకు వచ్చారు. ఆయన వెంటనే అధికారం చేపట్టలేకపోయినా, తర్వాత సుదీర్ఘ పోరాటం తర్వాత అధికారంలోకివచ్చారు. ఈ మధ్య కాలంలో ఆయన జైలుకు వెళ్లినప్పుడు అన్నకు మద్దతుగా పాదయాత్ర చేసిన షర్మిల.. ఇప్పుడు అదే అన్న మీద ఆస్తుల కోసం తీవ్ర స్థాయిలో న్యాయపోరాటం చేస్తున్నారు. ఈ గొడవకు ప్రధాన కేంద్రబిందువు “సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్”. ఈ కంపెనీ షేర్ల పంపకం విషయం ఇప్పుడు నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ పరిధిలో ఉంది. సరస్వతి పవర్ కంపెనీలో వాటాల వివరాలను పరిశీలిస్తే ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. జగన్ మోహన్ రెడ్డి చేతిలో ప్రస్తుతం 29.88 శాతం వాటా అంటే సుమారు 74.26 లక్షల షేర్లు ఉన్నాయి. ఆయన భార్య భారతి వద్ద 16.30 శాతం అంటే 41 లక్షల షేర్లు ఉన్నాయి. కానీ.. జగన్ తల్లి విజయమ్మ పేరున అత్యధికంగా 48.99 శాతం, అంటే 1.22 కోట్ల షేర్లు ఉన్నాయి. మిగిలిన కొద్దిపాటి వాటాలు క్లాసిక్ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ వద్ద ఉన్నాయి.
గతంలో తన తల్లికి ప్రేమతో రాసిచ్చిన గిఫ్ట్ డీడ్ రద్దు చేయాలని, ఆ వాటాలను తిరిగి తమ పేరు మీదకు మార్చాలని జగన్ కోర్టు మెట్లు ఎక్కారు. అయితే… అన్నగా తన చెల్లెలికి ఇవ్వాల్సిన న్యాయబద్ధమైన వాటాను ఎగవేసేందుకే ఆయన సాకు చూపిస్తున్నారని షర్మిల ఆరోపించడంతో పాటు ఈ కేసులో తాను కూడా ఇంప్లీడ్ అయ్యి, తన తల్లికి మద్దతుగా అంటూ రంగంలోకి దిగడం పరిస్థితి తీవ్రతను పెంచింది. తల్లిని, చెల్లెలినికూడా కోర్టుకు లాగడం ద్వారా హిందూ అవిభక్త కుటుంబ సంప్రదాయాలకు జగన్ విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారన్న విమర్శలు సైతం తలెత్తాయి. ఒక రకంగా ఈ గొడవ కారణంగానే 2024 ఎన్నికల సమయంలో షర్మిల తన అన్నపై తీవ్రస్థాయిలో పోరాటానికి దిగారు. తమ బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్యను అడ్డుగా పెట్టుకుని, ఆయన కుమార్తె, తమ సోదరి సునీతను వెంటబెట్టుకుని ప్రతిచోటా జగన్‌కు వ్యతిరేకంగా అత్యంత ఉధృతంగా ప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పగ్గాలు చేపట్టి అటు వైఎస్ అభిమానుల ఓట్లను, ఇటు దళిత, క్రిస్టియన్ల ఓట్లను చీల్చడం ద్వారా జగన్ ఓటమికి ప్రధాన కారణం అయ్యారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడి పోరాడడంతో పాటు.. షర్మిల చేసిన ఈ ప్రచారం జగన్ పార్టీ దారుణంగా ఓడిపోవడానికి ప్రధాన కారణమైంది.
ఇక తెలంగాణలో పరిస్థితి మరోలా ఉంది. రాష్ట్ర ఏర్పాటు కోసం ఒక్కటై పోరాడిన కల్వకుంట్ల కుటుంబం.. ఆ తర్వాత అనుకోని పరిస్థితుల్లో ముక్కలు చెక్కలు అయిపోతోంది. దశాబ్దకాలం పాటు తెలంగాణ రాష్ట్రానికి తిరుగులేని నాయకుడిగా, తెలంగాణ సమాజంలో జాతిపితగా కూడా పేరు పొందిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.. తన కుమార్తె విషయంలో మాత్రం ఏమీ చేయలేకపోతున్నారు. అధికారం కోల్పోయిన తర్వాత భారత రాష్ట్ర సమితిలోను, కల్వకుంట్ల కుటుంబంలోను విభేదాలు భగ్గుమన్నాయి. అది ఏకంగా కవిత తమ పుట్టింటి పార్టీని తోసిరాజని, తన సొంత పార్టీ పెట్టుకునే వరకు వెళ్లింది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇబ్బందులు పడినప్పుడు తనను పార్టీ ఏమాత్రం పట్టించుకోకుండా వదిలేసిందన్న తీవ్ర అసంతృప్తి కవితలో ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో చోటుచేసుకున్న అవినీతిపై ఆమె చేసిన వ్యాఖ్యలు పార్టీ పునాదులను కదిలించాయి. తన తండ్రి కేసీఆర్ అమాయకుడని చెబుతూనే, మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ లాంటి వారు ఆయనను తప్పుదోవ పట్టించారని, వారి వల్లే కేసీఆర్ కు “అవినీతి మరక” అంటుకుందని ఆమె బహిరంగంగానే ఆరోపణలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలకు హరీష్ రావు, సంతోష్ కుమార్ కారణమని, వారి కుట్రల వల్లే తాను బలిపశువును అయ్యానని కవిత వాపోయారు. ఈ పరిణామాలతో ఆగ్రహించిన కేసీఆర్, కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం సంచలనం సృష్టించింది.
సస్పెన్షన్ అనంతరం కవిత మరింత ఘాటుగా స్పందించారు. బీఆర్‌ఎస్ పార్టీ రాజ్యాంగమే ఒక “జోక్” అని, క్రమశిక్షణ కమిటీ అనేది రాత్రికి రాత్రే పుట్టుకొచ్చిందని ఆమె ఎద్దేవా చేశారు. ఇక్కడ కూడా కనిపిస్తున్న ప్రధాన సమస్య… మళ్లీ అదే వారసత్వ పోరు. కేటీఆర్ ను తన రాజకీయ వారసుడిగా కేసీఆర్ ప్రమోట్ చేయడం, అదే సమయంలో కవిత, హరీష్ రావుల ప్రాధాన్యం తగ్గించడం ఈ గొడవలకు అసలు కారణం. ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడవు అన్నట్లుగా, కొడుకు ఎదుగుదల కోసం కూతురు, మేనల్లుడిని పక్కన పెట్టారన్న భావన ఈ కుటుంబంలో చిచ్చు రేపింది.
చివరకు కవిత తాను స్థాపించిన తెలంగాణ జాగృతిని ఒక పూర్తిస్థాయి రాజకీయ పార్టీగా మారుస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాదు.. ఆమెకు తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ నాయకులు ప్రజా సంఘాలు, ఉద్యోగ, కుల సంఘాలు, వివిధ యూనివర్సిటీల విద్యార్థి సంఘాల నాయకులు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. వీరిలో సింగరేణి కార్మికులు కూడా ఉండడం మరో విశేషం. కేటీఆర్‌కు వారసత్వం ఇవ్వడమే ఆ కుటుంబంలో చిచ్చుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది.
ఇతర రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి
ఈ కుటుంబ రాజకీయాల సెగ తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాలేదు. మహారాష్ట్రలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఆధిపత్యాన్ని సవాలు చేస్తూ ఆయన మేనల్లుడు అజిత్ పవార్ పార్టీని నిలువునా చీల్చారు. పార్టీలోని మెజారిటీ ఎమ్మెల్యేలను (దాదాపు 40 మందిని) తన వైపు తిప్పుకుని, శరద్ పవార్ ను ఒంటరి చేశారు. మొఘల్ చరిత్రలో రాకుమారులు ఇతర రాజ్యాలతో చేతులు కలిపి సొంత రాజ్యంపై దండెత్తినట్లుగా, అజిత్ పవార్ బీజేపీ-శివసేన కూటమితో చేతులు కలిపి ఉప ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకున్నారు. తాజాగా శివసేనలోని రెండు వర్గాలు కలిసిపోయి, బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తమ సత్తా చాటాలని ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే, ఇప్పటికి మహారాష్ట్రలో బీజేపీ ఆధిపత్యం గట్టిగానే ఉంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సొంతంగా అధికారం చేపట్టేంత బలం మళ్లీ పుంజుకుంది. ఈ నేపథ్యంలో ముంబై కార్పొరేషన్ పగ్గాలు ఎవరి చేతికి వస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.
ఉత్తరప్రదేశ్ లో ములాయం సింగ్ యాదవ్ బతికుండగానే కొడుకు అఖిలేష్ యాదవ్, బాబాయ్ శివపాల్ యాదవ్ మధ్య జరిగిన ఆధిపత్య పోరు సమాజ్‌వాదీ పార్టీని బలహీనపరిచింది. పాలనా పగ్గాలు అఖిలేష్ చేతిలో ఉన్నా, పార్టీ యంత్రాంగంపై శివపాల్ పట్టు సాధించడం ఇద్దరి మధ్య ఘర్షణకు దారితీసింది. పంజాబ్ లో బాదల్ కుటుంబంలో సుఖ్బీర్ సింగ్ బాదల్, మన్‌ప్రీత్ బాదల్ మధ్య వచ్చిన విభేదాలు అకాలీదళ్ పతనానికి కారణమయ్యాయి. తమిళనాడులో కరుణానిధి వారసత్వం కోసం స్టాలిన్, అళగిరి మధ్య జరిగిన యుద్ధం చివరికి అళగిరి బహిష్కరణతో ముగిసింది.
ఈ కుటుంబ కలహాల వెనుక ఉన్న బలమైన తాత్విక కారణం “జీరో-సమ్ గేమ్”. అంటే, రాజకీయాల్లో అధికారం అనేది పంచుకోవడానికి వీలులేని వస్తువు. ఒకరికి లాభం జరగాలంటే మరొకరికి కచ్చితంగా నష్టం జరగాల్సిందే. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కుర్చీ ఒక్కటే ఉంటుంది. జగన్ ఆ కుర్చీలో కూర్చుంటే షర్మిలకు అధికారం ఉండదు. కేటీఆర్ పగ్గాలు చేపడితే కవిత, హరీష్ రావు ప్రాధాన్యత కోల్పోతారు. ఈ అభద్రతాభావమే రక్త సంబంధాలను కూడా శత్రుత్వంగా మారుస్తోంది. పార్టీలను ప్రజా సంస్థలుగా కాకుండా, తమ “ప్రైవేట్ ఆస్తులు”గా భావించే ఫ్యూడల్ మనస్తత్వం ఈ నాయకుల్లో నరనరాన జీర్ణించుకుపోయింది.
ప్రజలపై పడుతున్న ప్రభావం
నాయకులు ఇళ్లలో గొడవలు పడుతుంటే, బయట ప్రజలు దానికి మూల్యం చెల్లించుకుంటున్నారు. కుటుంబ గొడవల వల్ల పాలన గాలికి పోతోంది. మహారాష్ట్రలో ఎన్సీపీ చీలిక సమయంలో అధికారులు ఎవరి ఆదేశాలు పాటించాలో తెలియక అయోమయానికి గురయ్యారు. సచివాలయంలో ఫైళ్లు కదలలేదు. ఉత్తరప్రదేశ్ లో యాదవ్ కుటుంబ గొడవల వల్ల గోమతి రివర్ ఫ్రంట్ వంటి భారీ ప్రాజెక్టులు నిలిచిపోయాయి. ప్రభుత్వ నిధులు, సమయం అంతా అంతర్గత కుమ్ములాటలను చక్కదిద్దడానికే సరిపోతోంది. ప్రజా సమస్యలను పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు.
ఇక నాయకులను నమ్ముకున్న కార్యకర్తలు, ఆ నాయకుల కుటుంబ సభ్యులే ఒకరినొకరు తిట్టుకుంటుంటే ఎవరి పక్షం వహించాలో తెలియక సతమతమవుతున్నారు. ఇది క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణాన్ని దెబ్బతీస్తోంది. ఈ కుటుంబాల ఆస్తి పంపకాలు, న్యాయ పోరాటాల ఖర్చు పరోక్షంగా ప్రజల నుంచే వసూలు చేస్తున్నారు. అవినీతి ద్వారా సంపాదించిన సొమ్ము కోసమే ఈ పోరాటాలు జరుగుతున్నాయన్నది బహిరంగ రహస్యం.
చరిత్ర నేర్పే గుణపాఠం ఒక్కటే. మొఘల్ సామ్రాజ్యం అంతర్యుద్ధాలతోనే బలహీనపడి విదేశీయుల పాలయ్యింది. ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు కూడా వారసత్వ పోరుతో బలహీనపడితే, ఆ ఖాళీలో తాము దూరిపోయేందుకు జాతీయ పార్టీలు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే బీజేపీ కూటమిలో ఒక భాగస్వామిగా ఉంది. ప్రాంతీయ పార్టీలు పూర్తిగా బలహీనపడిపోతే ఆ స్థానాన్ని ఆక్రమించేందుకు సిద్ధమవుతోంది.
కుటుంబం కోసం పార్టీని, పార్టీ కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టే ఈ ధోరణి మారకపోతే, ప్రజాస్వామ్యం కేవలం కొన్ని కుటుంబాల సొంత ఆస్తిగా మిగిలిపోతుంది. ఓటర్లు కూడా కుటుంబ రాజకీయాల పట్ల విసిగిపోతున్నారు. వారు ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రాంతీయ పార్టీలు మనుగడ సాగించాలంటే ముందు ఇంటి వ్యవహారాలను చక్కబెట్టుకోక తప్పదు.
సమయమంత్రి చంద్రశేఖర శర్మ
(తెలుగుప్రభ ఎడిటర్)

