Sunday, October 6, 2024
Homeఓపన్ పేజ్Pollution: విస్తరిస్తున్న కాలుష్య భూతం

Pollution: విస్తరిస్తున్న కాలుష్య భూతం

ప్రత్యామ్నాయ ఇంధనాలను ప్రోత్సహించండి

కాలుష్య భూతం క్రమంగా తన కబంధ హస్తాలను విస్తరిస్తోంది. ప్రస్తుతం నగరాలు, పట్టణాల్లో విలయం సృష్టిస్తున్న ఈ విలయం అతి సమీప భవిష్యత్తులో గ్రామాలను కూడా చుట్టుముట్టే అవకాశం ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమవుతున్నాయి. దేశంలోని సుమారు 50 ప్రధాన నగరాల్లో 39 నగరాలు కాలుష్య ప్రమాదంలో చిక్కుకుని విలవిల్లాడుతున్నట్టు తాజా అంతర్జాతీయ సర్వేలు తెలియజేస్తున్నాయి. ఇది నిజంగా ఆందోళన కలిగించే పరిణామం.
ప్రపంచంలో ఇంత పెద్ద సంఖ్యలో నగరాలు కాలుష్యం వాతపడడమనేది అతి అరుదైన,
అత్యంత ఆందోళనకరమైన విషయమని ఐక్యరాజ్య సమితి సైతం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. నిజానికి ఇవి 2022లో జరిగిన సర్వేలు. అప్పటితో పోలిస్తే 2023 చివరి నాటికి ఈ కాలుష్యం ఏ స్థాయికి చేరుకుంటుందో అర్థం చేసుకోవచ్చు. ప్రతి నగరంలోనూ సగటున పి.ఎం 2.5 కాలుష్యం కేంద్రీకృతమై ఉన్నట్టు అంచనా.
అంతకన్నా ఆందోళనకరమైన విషయమేమిటంటే, ఈ అత్యంత ప్రమాదకర కాలుష్యం క్రమంగా కొత్త ప్రాంతాలకు కూడా వ్యాపిస్తోంది. ప్రముఖ స్విట్జర్లాండ్ కంపెనీ ‘ఐ.క్యు ఎయిర్స్ లైవ్’ సర్వే ప్రకారం, ముంబై నగరంలో వాయు నాణ్యత ప్రస్తుతం 158 యూనిట్లు. ఇది అత్యధికం. కాగా, ఆ తర్వాతి స్థానం 152 యూనిట్లతో ఢిల్లీ నగరానికి దక్కింది. ముంబైలో సముద్ర గాలి కారణంగా కొంత ప్రమాదం తగ్గే అవకాశం ఉంది కానీ, ఢిల్లీ మాత్రం ఈ కాలుష్యాన్ని అదుపు కూడా చేయలేని పరిస్థితి ఏర్పడింది.

- Advertisement -

అయితే, సముద్ర గాలి వీచే ముంబైలో కూడా కాలుష్యం పరిస్థితి నానాటికీ ప్రమాదకర స్థాయికి చేరుకోవడం అటు ప్రభుత్వాలను, ఇటు ప్రజలను భయభ్రాంతుల్ని చేస్తోంది. దేశంలో అనారో గ్యాలు పెరగడానికి, సరికొత్త అనారోగ్యాలు ప్రబలడానికి రెండవ అతి పెద్ద కారణం కాలుష్యమేనని వైద్య పరిశోధన సంస్థలు తెలియజేస్తున్నాయి. దీనితో ప్రబలుతున్న అనారోగ్యాల కారణంగా పెద్ద ఎత్తున పని దినాలు నష్టపోవడం, ప్రజారోగ్యం మీద ప్రజారోగ్య
వ్యయం పెరగడం వంటివి జరుగు తున్నాయి. ఫలితంగా ప్రభుత్వ వ్యయం అంచనాలకు మించి ఆయేటికాయేడు పెరిగిపోతోంది. పంట పొలాలలో వ్యర్థాలను తగులపెట్టడం
వల్ల ఏర్పడే కాలుష్యం వల్ల ఢిల్లీ, పంజాబ్, హర్యానా రాష్ట్రాలు శ్వాసకోశ సంబంధమైన వ్యాధులు పెరిగిపోయిన కారణంగా గత అయిదేళ్లలో 1,500 కోట్ల డాలర్లు నష్టపోయినట్టు ‘ది ఇంటర్నేషనల్ ఫుడ్ పాలిసీ రిసెర్చ్ ఇన్ స్టిట్యూట్’ వెల్లడించింది. కేవలం కాలుష్య సంబంధమైన వ్యాధుల కారణంగా దేశవ్యాప్తంగా 10,000 కోట్ల డాలర్ల నష్టం వాటిల్లుతోందని కూడా అది తెలిపింది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన కాలుష్య స్థాయిని భారతదేశంలో అనేక నగరాలు దాదాపు ఇరవై రెట్లు మించిపోయాయి. 1981లో వాయు కాలుష్య నియంత్రణ చట్టాన్ని ప్రవేశపెట్టినప్పటి నుంచి, అంటే నాలుగు దశాబ్దాల నుంచి భారత్ ఈ వాయు కాలుష్యం మీద పోరాటాలు సాగిస్తూనే ఉంది. కాలుష్యాన్ని నివారించడానికి ఎన్నో చర్యలు తీసుకుంది. ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది.
అయితే, కాలుష్యానికి ప్రధాన కారణాలుగా ఉన్న రోడ్ల దుమ్ము, చెత్త తగులవేత, వ్యర్థాల దహనం, వాహన పొగలు, డీజిల్ జనరేటర్లు, పారిశ్రామిక వ్యర్థాలు, బహిరంగ చెత్త దహనాలు వంటివి పెరుగుతూనే ఉన్నాయి తప్ప తగ్గడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రధానంగా రెండు విషయాల మీద దృష్టి కేంద్రీకరించాల్సి ఉంటుంది. అవిః పంట పొలాలలోని వ్యర్థాలను బహిరంగంగా దహనం చేయడం, రవాణా వ్యవస్థలు సృష్టించే కాలుష్యం. వాహనాల నుంచి వచ్చే పొగ, రోడ్ల మీద లేచే దుమ్ము అనేక మొండి వ్యాధులకు కారణమవుతున్నాయి.
పొలాల్లో రైతులు చెత్తను, వ్యర్థాలను దహనం చేయకుండా నివారించడానికి ప్రభుత్వం మార్గాలు కనుగొనాల్సి ఉంది. ప్రభుత్వ కాలుష్య నివారణ విధానాల్లో ఇదే ప్రధాన అంశం కావాల్సి ఉంది. పంటకు సంబంధించిన గడ్డిని, ఇతర చెత్తను తగిన విధంగా తొలగించడానికి యంత్రాలను సమకూర్చడం, జరిమానాలు విధిస్తామని బెదరించడం వల్ల ఉపయోగమేమీ ఉండడం లేదు. పంట పొలాల్లో చెత్తను దహనం చేయకుండా ఉండడానికి రైతులకు ప్రోత్సాహకాలు ఇవ్వడం వల్ల ఫలితం ఉండవచ్చు.

వాహనాల ద్వారా వచ్చే కాలుష్యాన్ని నివారించడానికి వాహనాలను అప్ గ్రేడ్ చేయడం, రవాణా సౌకర్యాలను విస్తరించడం వంటివి జరగాల్సి ఉంది. వాటి మీద ప్రభుత్వాలు మరింతగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. ప్రత్యామ్నాయ ఇంధనాలను ప్రోత్సహించాల్సి ఉంటుంది. బ్యాటరీల ధరలు మరీ ఎక్కువగా ఉండడం వల్ల, చార్జింగ్ వ్యవస్థలు పరిమితంగా ఉండడం వల్ల ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాల వైపు ఎక్కువగా మొగ్గు చూపించడం లేదు. వాటికి ఆశించిన స్థాయిలో మార్కెట్ పెరగడం లేదు. ధరలను తగ్గించే విధంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉత్పత్తిదారులకు ప్రభుత్వం ఇతోధికంగా సహాయం చేయాల్సి ఉంటుంది. ఈ దిశలో నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News