చైనాను దాటి అత్యధిక జనాభా ఉన్న దేశంగా మనదేశం ఆవిర్భవిస్తోంది. మరి ఇంత జనాభాకు అవసరమైన మౌలిక సదుపాయాలు, అభివృద్ధి వంటి వాటి సంగతేంటి. ముఖ్యంగా రేపటి పౌరులైన నేటి చిన్నారులకు అవసరమైన స్కూలు, చదువు, విజ్ఞానం, ఆటపాటలు వీటన్నిటి సంగతేంటి. వీరి పోషకాహారం, వీరి భద్రతతో పాటు ఇతరత్రా అన్ని సమకూర్చే స్థితిలో భారతీయ తల్లిదండ్రులంతా ఉన్నారా. ఉంటే ఎంత మంది చిన్నారుల తల్లిదండ్రులు ఇవన్నీ తమ పిల్లలకు సమకూర్చే ఆర్థిక స్థితిగతుల్లో ఉన్నారు. ఒకవేళ పేదరికం కారణంగా ఇలాంటి మౌలిక సదుపాయాలు చిన్నారులకు కల్పించలేకపోతే మరి వారి పరిస్థితి ఏమిటి. ఇవన్నీ మన తల్లిదండ్రులు, పాలకులు ఆలోచించి అవసరమైన చర్యలు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాల్సిందే.
అసలే కరోనా కారణంగా ఆన్ లైన్ క్లాసులంటూ కాస్తో కూస్తో నేర్చుకున్న బేసిక్ ను కూడా పిల్లలంతా మరిచిపోయి.. మళ్లీ మొదటికి వచ్చారు. ఈనేపథ్యంలో అత్యధిక చిన్నపిల్లలున్న మనదేశం వీరిని ఎలాంటి పౌరులుగా తీర్చిదిద్దుతోందని మన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై ప్రత్యేక కసరత్తులు చేస్తున్నాయా. ప్రాథమిక, ఉన్నత విద్యా ప్రమాణాలు ఏస్థాయిలో ఉన్నాయి. మార్కులు వస్తున్నాయి సరే, పాసవుతున్నారు కానీ వీరికి ఉండాల్సినంత ఐక్యూ ఉందా. స్టాండర్డ్ ఉందా ఇవన్నీ పట్టించుకునేదెవరు. ప్రస్తుతం ఈ అంశాలన్నీ బేతాళ ప్రశ్నలుగా మారాయి.
వంద శాతం అక్షరాస్యత సాధించాలనే లక్ష్యంతో పేరు రాయటం వచ్చిన వారిని కూడా అక్షరాస్యులుగా మన ప్రభుత్వాలు గుర్తిస్తున్న దేశంలో ఉన్న మనం పిల్లల చదువుల్లో స్టాండర్డ్ ను లెక్కిస్తే మనం ఎక్కడున్నామని స్కూళ్ల యాజమాన్యాలే నిలదీస్తాయేమో. ఇందులో మళ్లీ ఇంకో వర్గం కూడా ఉంది. సంపన్నుల చదువుల కేటెగెరీ, మధ్యతరగతి ఐక్యూ స్టాండర్డ్స్ మరో లెవెల్..ఇక పేద ప్రజల పిల్లల తెలివితేటలు, ప్రావీణ్యం మరో స్థాయిగా విభజించక తప్పదు. ఎందుకంటే ఇంటర్నేషనల్ స్కూల్, కార్పొరేట్ స్కూల్, ప్రైవేటు స్కూళ్లు, సర్కారీ బడులు. వీటిలో సర్కారీ బడులలో కనీసం భవనాలు, బాత్రూంలు లేక చిన్నారులు చాలా అవస్థలు పడుతుంటారు. అన్నీ ఉన్నా బోధించేందుకు టీచర్ల కొరతతో అరకొర చదువులు సాగిస్తున్నారు గ్రామాల్లోని బాలబాలికలు.
ఆన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ 2022 నిర్వహించిన దేశవ్యాప్త అధ్యయనంలో కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. దేశవ్యాప్తంగా నిర్వహించిన ఈ అధ్యయనం నాలుగేళ్ల తరువాత జరగటం విశేషం. వీరు ఇచ్చిన 340 పేజీల ఈ నివేదికలో గ్రామీణ విద్యార్థుల్లో ఎందుకు నాణ్యమైన విద్య అందటం లేదో.. వాటికి కారణాలు, పరిష్కారాలను సూచించింది. ప్రథమం ఫౌండేయషన్ చేపట్టిన ఈ సర్వేలో 700,000 మంది 16 ఏళ్ల లోపు చిన్నారులను 19,000 గ్రామాల్లో 616 జిల్లాల్లో పరిశీలించారు. ఈ సమగ్ర నివేదికలో ఒక శుభవార్త ఏమిటంటే కోవిడ్-19 కంటే ముందుతో పోల్చితే అన్ని స్కూళ్లలోనూ విద్యార్థుల సంఖ్య బాగా పెరిగింది. 6-14 ఏళ్ల మధ్య ఉన్న చిన్నారులను స్కూళ్లకు పంపేందుకు ఊళ్లలోని తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారన్నమాట. 2022కు ముందు 97.2 శాతం మంది చిన్నారులు స్కూళ్లకు వచ్చేవారు..కానీ 2022కు వచ్చిసరికల్లా 98.4 శాతం మంది పిల్లలు స్కూళ్లలో చేరినట్టు నివేదిక వెల్లడించింది. ఇలా స్కూళ్లకు వస్తున్న పిల్లల్లో అమ్మాయిల సంఖ్య బాగా పెరగటం గొప్పగా మనమంతా చెప్పుకోవాల్సిన మరో మార్పు.
మూడేళ్లు మొదలుకుని చాలా మంది పిల్లలు అంగన్వాడీలకు వెళ్తున్నారు. ఇలా అంగన్వాడీలకు వచ్చే చిన్నారుల సంఖ్య విపరీతంగా పెరగటం ఆశ్చర్యకరం. 2022కు పూర్వం 2018లో అంగన్వాడీలకు 57.1 శాతం ఉండగా 2022లో ఇది 68.8శాతానికి పెరగటం విశేషం. కరోనా కారణంగా ఆర్థికంగా కుదేలైన కుటుంబాల సంఖ్య బాగా పెరిగిన నేపథ్యంలో పల్లెల్లో సర్కారీ స్కూళ్లకు అడ్మిషన్లు పెరుగుతున్నాయి.
2018లో 65.8శాతం మంది 6-14 ఏళ్ల మధ్య చిన్నారులు గవర్నమెంట్ స్కూలుకు వచ్చేవారు కానీ 2022లో ఇది 72.9 శాతానికి పెరిగింది. దేశంలోని ప్రతి రాష్ట్రంలోనూ ఇలా సర్కారీ బడులకు వచ్చే పిల్లల సంఖ్య క్రమంగా పెరగటం ఆసక్తికరం. ట్యూషన్లకు హాజరయ్యే పిలల్ల శాతం కూడా క్రమంగా పెరుగుతోంది. 2018లో 26.4 శాతం మంది పిల్లలు ట్యూషన్లకు వెళ్లి చదువుకునేవారు..కానీ 2022లో ఈ సంఖ్య 30.5 శాతానికి పెరిగింది.
ఇంత జరగుతున్నా పిల్లల్లో చదివే నైపుణ్యం మాత్రం ఏమాత్రం మెరుగుపడలేదు. ఇది చాలా బాధించే విషయం. స్కూళ్లు మారుతున్నారు, ట్యూషన్లు పోతున్నారు, క్లాసులు మారుతున్నారు, పాసు అవుతున్నారు కూడా, ఏళ్లు గడిచిపోతున్నాయి కానీ కనీస నాణ్యత మాత్రం లేదు. గడగడా పట్టుమని మూడు లేదా రెండు భాషల్లో పిల్లలు చదవలేక పోతున్నారంటే అదేం నాణ్యత ఉన్న విద్య. విచిత్రమైన మరో విషయం ఏమిటంటే ప్రైవేటు స్కూళ్లలోనూ ఇదే దుస్థితి. ప్రభుత్వం, ప్రైవేటు స్కూళ్లలో ఎక్కడ చదివినా అత్యధికులకు చదవటం రావటం లేదు. ఇక గణితంలో వీరికున్న పట్టు మరింత అధ్వానంగా ఉంది. 10వ తరగతి పిల్లాడైనా గుణింతాలు గడగడా చెప్పలేని పరిస్థితి. కూడికలు, తీసివేతలు, ఎక్కాలు ఏవీ చక్కగా రాకపోతే లెక్కల్లో ఏమి వచ్చినట్టు. ఇలాంటి వారు భవిష్యత్తులో ఇంజినీర్లు, డాక్టర్లు అయితే పరిస్థితి ఏమిటి. అసలు ట్యూషన్లు వెళ్తున్న పిల్లల్లో అత్యధికులు సైన్స్, మ్యాథ్స్ కోసమే వెళ్తున్నారట. అంటే వీళ్లకు ఇవన్నీ బ్రహ్మ పదార్థాలుగా మారిపోయాయి. ఉత్తరాదిలో లెక్కలు, సైన్సులో బాగా వెనుకబడుతున్నారు. పిల్లలు పావు భాగం కంటే తక్కువ మంది ఈ రెండు సబ్జెక్టుల్లో పాస్ అతి కష్టంమీద పాస్ అవుతున్నారు.
విద్యలో విప్లవాత్మకమైన మార్పులు తెస్తామంటూ సర్కారు 2020లో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని తెచ్చింది. పిల్లలకు చిన్నప్పుడే సరైన ఫౌండేషన్ పడాలని, బేసిక్స్ బాగా రావాలని రుద్దేలా విద్యావిధానంలో మార్పులు తెచ్చి, గుణాత్మక విద్యను పెంపొందించేలా కేంద్ర ప్రభుత్వం ఎంత కసరత్తు చేస్తున్నా ఫలితాల్లో మాత్రం మార్పు రాలేదు.
మన విద్యావ్యవస్థను అన్ని విధాలా బలోపేతం చేయాలి. అంటే సిలబస్, పుస్తకాలు, చదువు చెప్పే టీచర్లు, బోధనా విధానం, స్కూళ్లలో తాగు నీరు, బాత్రూములు, భద్రత, స్కూలు భవనం, ఆటలాడే స్థలం, పిల్లలకు నాణ్యమైన ఉచిత మధ్యహ్న భోజనం లాంటివన్నీ అమరితే పిల్లలు మెరికల్లా తయారు అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ ఉండి కూడా పిల్లలు సరిగ్గా చదువుకోలేక, కనీస స్థాయిని అందుకోలేక పోయారంటే వారిలో మానసిక సమస్యలున్నట్టు అర్థం చేసుకోవచ్చు.
భవిష్యత్తులో పిల్లలు ఆనందకరమైన జీవితం, సురక్షితమైన బ్రతుకులు బతకాలంటే ఆర్థికంగా వృద్ధిలోకి వచ్చి దేశ భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉండాలంటే పిల్లల చదువు నాణ్యతతో ఉండాలి. అప్పుడే ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న భారత దేశంలో అత్యంత నాణ్యమైన మానవ వనరులు ఉన్నట్టు. నాణ్యమైన మానవ వనరులున్న దేశం అగ్రరాజ్యంగా మారుతుంది. అందుకే చదువుపై ఇంత శ్రద్ధ పెట్టడం ఇప్పుడున్న పరిస్థితుల్లో అత్యవసరం.