Friday, November 22, 2024
Homeఓపన్ పేజ్poverty falling: దేశంలో పేదరికం తగ్గుముఖం పడుతోందా ?

poverty falling: దేశంలో పేదరికం తగ్గుముఖం పడుతోందా ?

భారతదేశంలో పేదరికం తగ్గుముఖం పడుతోందని ఒక ప్రతిష్ఠాత్మక సర్వే నివేదిక వెల్లడిస్తోంది. చాలా ఏళ్లుగా భారతదేశ సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులపై అధికారికంగా, సాధికారికంగా అధ్యయనం చేసి ప్రతి ఏటా నివేదికలు అందజేస్తున్న డి.హెచ్.ఎస్. హౌస్ హోల్డ్ సంస్థ నవంబర్ మూడవ వారంలో అనేక ఆశ్చర్యకరమైన వివరాలతో ఒక నివేదికను విడుదల చేసింది. ఆ నివేదికలోని వివరాల ఆధారంగా జాన్ డ్రెజ్అనే సీనియర్ పాత్రికేయుడు పలు దేశ, విదేశ దినపత్రికల్లో వ్యాసాలు రాయడం జరిగింది. ఈ సంస్థ తన తాజా నివేదికలో 2005-06, 2014-15, 2021-22 సంవత్సరాలలో దేశ ఆర్థిక పరిస్థితిని, పేదరికం స్థాయిని, నిరుద్యోగం వగైరా అంశాల గురించి విపులంగా చర్చించింది. జాన్ డ్రెజ్ ఈ వివరాలను సాకల్యంగా తెలియజేశారు. నిజానికి, ఈ నివేదిక యు.పి.ఏ నాయకత్వ కాలం నాటి పరిస్థితుల్ని, ఎన్.డి.ఎ నాయకత్వ కాలం నాటి పరిస్థితుల్ని గణాంక వివరాలతో సోదాహరణంగా తెలియజేసిందనే చెప్పాల్సి ఉంటుంది.

- Advertisement -

అంతవరకూ మందకొడిగా సాగుతున్న పేదరిక నిర్మూలన 2014-15 నుంచి వేగం పుంజుకుంది. ఈ సమయంలో బహుకోణీయ (ఎం.పి.ఐ) పేదరికం వేగంగా తగ్గుముఖం పట్టడం ప్రారంభించింది. కోవిడ్ సమయంలో కూడా ఈ వేగం తగ్గలేదని కూడా సర్వే నివేదిక తెలియజేసింది. 2011-12 కాలంలో కొద్దిగా వేగం పుంజుకున్న పేదరిక నిర్మూలన ఆ తర్వాత స్తంభించిపోగా, 2014 తర్వాత మాత్రం కనీవినీ ఎరుగనంత వేగంగా పతనం కావడం ప్రారంభించిందని, ఆ వేగం ఇప్పటికీ అదే విధంగా కొనసాగుతోందని కూడా తెలిపింది. ఈ పేదరిక నిర్మూలనకు సంబంధించిన గణాంకాలను తాము ఏ విధంగా మదింపు చేసిందీ అది వివరించింది. పేదరిక నిర్మూలనను గణించడం కోసం ఆక్స్ ఫర్డ్ పావర్టీ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ (ఓ.పి.హెచ్.ఐ) అనే సంస్థ రెండు రకాలైన పద్ధతులను (సూచీలను) రూపొందించింది. డెమాగ్రాఫిక్ అండ్ హెల్త్ సర్వీస్ (డి.హెచ్.ఎస్) ప్రపంచంలోని అనేక దేశాలలో ఇవే పద్ధతులు ఉపయోగించి లోతుగా అధ్యయనాలు, సర్వేలు జరిపింది.

ఇందులో ఒక పద్ధతి కింద ఇంటింటికీ వెళ్లి తిండికీ, బట్టకీ లోటు ఉందా లేదా అన్న ప్రశ్నను మాత్రమే సంధించడం జరిగింది. ఇది మొదటి సూచీ కాగా, రెండవ సూచీ కింద దారిద్ర్య రేఖకు దిగువ ఉన్న వారి సంఖ్యలను, వారికి సంబంధించిన జీవన ప్రమాణాలను, ఇతర గణాంకాలను సేకరించడం జరిగింది. పౌష్టికాహారాన్ని తీసుకుంటున్నారా? పిల్లలు ఎంత మంది? ఆరోగ్యం ఎలా ఉంది? మందులకు ఎంత ఖర్చు అవుతుంది? కుటుంబ నియంత్రణ పాటించారా? ఇటువంటి వివరాలను ఒక పక్క ప్రభుత్వ లేక అధికారిక లెక్కల నుంచి, మరోపక్క ఇంటింటికీ వెళ్లి సేకరించడం జరిగింది. నిజానికి, కొన్ని కుటుంబాలలో ఆస్తిపాస్తులున్నా పౌష్టికాహారం తీసుకోవడం తక్కువగా ఉంటుంది. ఆస్తిపాస్తుల్ని నమ్ముకుని ఉద్యోగం చేయకపోవడం కూడా ఉంటుంది. అయితే, బహుకోణీయ అధ్యయనం అయినందువల్ల ఈ గణాంకాలను బట్టి కూడా ఒక అంచనాకు వచ్చినట్టు డి.హెచ్.ఎస్ సర్వేలో పాల్గొన్న జాన్ డ్రెజ్ తెలియజేశారు. ఈ సర్వే నివేదికల ఆధారంగా ప్రభుత్వాలు పేదరిక నిర్మూలన విషయంలో తమ విధానాలను, దృక్పథాలను మార్చుకోవడానికి, కొత్త పథకాలు, కార్యక్రమాలు, చర్యలు చేపట్టడానికి వీలు కలుగుతుంది. వాస్తవానికి వివిధ ప్రభుత్వాలు, వివిధ దేశాలు ఈ సర్వేల ఆధారంగానే తమ ప్రాధాన్యాలను రూపొందించి, అందుకు తగ్గట్టుగా తమ విధానాలను మార్చుకోవడం జరుగుతోంది.

కాగా, 2014-15 ముందునాటి పేదరికం పరిస్థితులను, ఆ తర్వాత కాలం నాటి పరిస్థితులను ప్రత్యేకంగా అధ్యయనం చేసిన డి.హెచ్.ఎస్ వివిధ పట్టికలు, బాక్సుల సహాయంతో అధ్యయన వివరాలను నిష్పక్షపాతంగా అందించే ప్రయత్నం చేసింది. ఈ నివేదికను రూపొందించడంలో తమకు పక్షపాతం గానీ, దురుద్దేశాలు కానీ లేవని అది పదే పదే పేర్కొంది. 2005 నుంచి 2015 వరకు ఆరోగ్యం, విద్య, జీవన ప్రమాణాలను అధ్యయనం చేసిన ఈ సంస్థ ఆరోగ్యం 7.3శాతం, విద్య 10 శాతం, జీవన ప్రమాణాలు 9.7 శాతం మాత్రమే పురోగతి సాధించాయని పేర్కొంది. కాగా, 2015 తర్వాత ఆరోగ్యం 11 శాతం, విద్య 8.4 శాతం, జీవన ప్రమాణాలు 17.2 శాతం పురోగతి సాధించాయని తెలిపింది. పేదరిక నిర్మూలన పథకాలను పటిష్టంగా అమలు చేయడం, వాటికి అత్యధికంగా నిధులు కేటాయించడం, పథకాలు అందరికీ అందేలా చర్యలు తీసుకోవడం వల్ల పేదరిక నిర్మూలన వేగం పుంజుకొందని అది వివరించింది. 2015 తర్వాత నెలసరి వినియోగం గణనీయంగా పెరిగిందని సూచీలు తెలియజేస్తున్నాయి. అదే విధంగా నిరుద్యోగం, విద్య, పౌష్టికాహారం, ఆరోగ్యం వంటి అంశాల్లో కూడా గణనీయమైన సానుకూల మార్పులు చోటు చేసుకున్నట్టు అది వెల్లడించింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News