Sunday, July 7, 2024
Homeఓపన్ పేజ్Poverty: పేదరికమే శాపంగా మారిందా

Poverty: పేదరికమే శాపంగా మారిందా

పేదరికం శాపంగా మారి చిన్నారుల భవితవ్యం అంధకారంగా మారడం. అత్యంత బాధాకరమైన విషయం. ఒక దేశం సుభిక్షంగా అన్ని రంగాలలో ప్రగతి సాధించినప్పుడే నిజమైన అభివృద్ధి. ప్రపంచంలోని చాలా దేశాలలో బాల కార్మిక వ్యవస్థ అనధికారికంగా కొనసాగుతున్న క్రమం అభం శుభం తెలియని చిన్నారులలో శాపంగా మారింది అని చెప్పవచ్చు.
బాలకార్మిక వ్యవస్థ (Child Labour) తీవ్రమైన మానవ హక్కుల సమస్య. బాల కార్మికుడు అన్న దానికి సార్వత్రికంగా ఆమోదించిన నిర్వచనం “బాల్యాన్ని నాశనం చేసే రీతిలో బాలుడు లేదా బాలిక పనిచేయడం” చిదులమవుతున్న పసి హృదయాలు, వెంటాడుతున్న ఆర్థిక సమస్యలు దీనికి ప్రధాన కారణం అని చెప్పవచ్చు.. బాలల శారీరక, మానసిక అభివృద్ధికి ఆటంకమై వారికి కనీస అక్షరాస్యతను, వినోదాన్ని కూడా పొందే అవకాశాన్ని ఇవ్వని పనిని, స్థితిని బాలకార్మిక వ్యవస్థ అంటారు. పాఠశాలల్లో విద్య అభ్యసించే రోజులతో అక్షర జ్ఞానానికి నోచుకోకుండా భారమైన శ్రమకు బలైపోతున్న బాలల జీవితాలు మనం సాధించిన అభివృద్ధిని ప్రశ్నిస్తున్నాయి. ఇది అత్యంత బాధాకరమైన పరిస్థితి. ఒకరకంగా నాగరికతకే తలవంపుగా పరిణమించాయి. బాలకార్మిక వ్యవస్థ ఒక్క భారతదేశానికే పరిమితం కాలేదు. అభివృద్ధి చెందిన దేశాల్లో సైతం బాలకార్మికులు తారసపడక తప్పదు.
ప్రపంచ వ్యాప్తంగా 2000 నాటికి 246 మిలియన్ల మంది బాలకార్మికులు ఉంటే 2012 ముగిసేనాటికి 168 మిలియన్ల మంది ఉన్నారు. మొత్తం బాలబాలికల జనాభాలో 11 శాతం మంది బాలకార్మికులే. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో అత్యధికంగా 77.7 మిలియన్ల మంది బాలకార్మికులున్నారు. సబ్ సహారన్ ఆఫ్రికాలో 59 మిలియన్లు, లాటిన్ అమెరికా, కరీబియన్ ప్రాంతంలో 12.5 మిలియన్లు, ఉత్తర ఆఫ్రికా, మధ్య ప్రాచ్యంలో 9.2 మిలియన్ల మంది బాలకార్మికులు ఉన్నారు. ఇట్టి యొక్క బాల కార్మిక వ్యవస్థ పేద దేశాల్లో బాలకార్మికులుగా మారుతున్న సంఘటనలు ఎక్కువగా నమోదవుతున్నాయి. అయితే జనాభా పరంగా చూస్తే అత్యధిక శాతం అధిక జనాభా కలిగిన దేశాలలో గమనించవచ్చు. ఆసియా పసిఫిక్ దేశాలలో బాలకార్మికుల సంఖ్య భారీగా ఉంది. అయితే సబ్ సహారన్ ప్రాంతంలో బాలకార్మిక జాబితాలో చేరుతున్న సంఘటనలు ఎక్కువగా నమోదవుతున్నాయి. సబ్ సహారన్ ఆఫ్రికాలో ప్రతీ ఐదుగురు బాలబాలికల్లో ఒకరి కంటే ఎక్కువ మంది బాలకార్మికులుగా ఉంటున్నారు.

- Advertisement -

ఆర్థిక మాంద్యం, సంక్షోభం వల్ల బాలకార్మికుల సంఖ్య భారీగా పెరుగుతుందని భావించారు. అయితే అందుకు విరుద్ధంగా బాలకార్మికుల సంఖ్య పతనమైంది. దీనికి కారణం బాలకార్మికులు అధికంగా ఉన్న అభివృద్ధి చెందుతున్న దేశాలపై ఆర్థిక మాంద్యం. సంక్షోభం ప్రభావాలు స్వల్పంగా ఉండటం ఒక కారణమైతే , మాంద్యం సమయంలో బాలకార్మికులకు ఉపాధి లభించకపోవడం మరో కారణం.
బాల కార్మిక వ్యవస్థ సత్ఫలితాలనిస్తున్న నిర్మూలన కార్యక్రమాలను ఒక కోవలో పరిశించినట్లయితే….బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన కార్యక్రమాలు సత్ఫలితాలిస్తున్నాయని అంతర్జాతీయ కార్మిక సంస్థ వెల్లడించింది. ముఖ్యంగా గత నాలుగేళ్లుగా పరిస్థితి చాలా మెరుగ్గా ఉందని గణాంక సహితంగా తెలిపింది. ప్రభుత్వాలు, కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థలు, పౌర సమాజం చేపట్టిన చర్యలు సరైన మార్గంలో పయనిస్తున్నాయని అంతర్జాతీయ కార్మిక సంస్థ (International Labour Organisation) స్పష్టం చేసింది.

   మన దేశంలో బాలకార్మిక వ్యవస్థ

2001 జనాభా లెక్కల ప్రకారం దేశం మొత్తం మీద 5 నుంచి 14 ఏళ్ల లోపు వయసులో ఉన్న 1.26 కోట్ల మంది బాలబాలికలు ఆర్థిక కార్యకలాపాల్లో (బాలకార్మికులుగా) ఉన్నారు. వీరిలో 12 లక్షల మంది ప్రమాదకర వృత్తుల్లో ఉన్నారు. 2004-05లో జాతీయ నమూనా సర్వే అంచనా ప్రకారం దేశంలో 89 లక్షల మంది బాలకార్మికులున్నారు. 2009-10 లో 5-14 ఏళ్ల వయసున్న బాలకార్మికుల సంఖ్య 49.84 లక్షలు.
UNICEF ప్రకారం దాదాపు సగం మంది, ప్రణాళిక సంఘం(Planning Commission) అంచనా ప్రకారం సుమారు 43 శాతం మంది బాలబాలికలు ఎనిమిదో తరగతిలోపే బడిమానేస్తున్నారు. షెడ్యూల్డ్ కులాల్లో ఇది 55 శాతం, షెడ్యూల్డ్ తెగల్లో 63 శాతం దాకా ఉందని అంచనా. బడి మానేసిన ప్రతి పిల్లవాడూ అనివార్యంగా బాలకార్మికుడిగానే జీవిస్తున్నాడని వివిధ అధ్యయనాలు తెలియజేస్తున్నాయి.
అనధికారిక గణాంకాల ప్రకారం భారత్ లో 10 కోట్ల మంది బాలకార్మికులు ఉన్నారు. భారతదేశంలో మొత్తం బాలల జనాభాలో 14 శాత మంది వివిధ పనుల్లో చెమటోడ్చుతున్నారని అంచనా. మొత్తం కార్మికుల్లో 4 శాతం మంది బాలలేనని అంచనా.
ప్రతీ పదిమంది బాలకార్మికుల్లో తొమ్మిది మంది వ్యవసాయ సంబంధిత పనుల్లో నిమగ్నమవుతున్నారు. ప్రతి ముగ్గురిలో ఇద్దరు శారీరక హింసకు గురవుతున్నారు. దాదాపు యాభై శాతం మంది ఏదో ఒక రూపంలో భౌతికంగా వేధింపులకు బాధితులవుతున్నారు.
50 శాతం మంది వారమంతా ఎలాంటి విశ్రాంతి లేకుండా పనిచేస్తున్నారు. అందులో కొంత మంది ఏదో ఒక రూపంలో లైంగిక వేధింపులకు గురవుతున్నారు.
బాలకార్మికులు అసంఘటిత రంగంలో పనిచేస్తారు. కాబట్టి వారికి హక్కులు, కనీస వసతులు కరువు అవుతున్నాయి. తేలిగ్గా మోసానికి గురవుతున్నారు. వారి కష్టానికి తగిన వేతనం లభించడంలేదు . శ్రమ దోపిడీకి గురవుతున్నారు. నిర్దిష్ట పనిగంటలు లేవు. సెలవులు, బోనస్, పెన్షన్, గ్రాట్యుటీ, ప్రావిడెంట్ ఫండ్ లాంటి ఏ సామాజిక భద్రతా చర్యలు వర్తించవు. వేతనాలు అతితక్కువ. పని పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి.
సూరత్ లోని వజ్రాలు చెక్కుడు పరిశ్రమల్లో, శివకాశీలోని మందుగుండు తయారీ పరిశ్రమల్లోనూ, జైపూర్ లోని రాళ్ల చెక్కుడు పనిలోనూ, ఫిరోజాబాద్ అద్దాల పరిశ్రమల్లోనూ, మురాదాబాద్ లోని లోహ పరిశ్రమల్లోనూ, అలీఘర్ లోని తాళాల పరిశ్రమల్లోనూ, మీర్జాపూర్ తివాచీల తయారీలోనూ, మార్కాపూర్ లోని పలకల తయారీ పరిశ్రమలోనూ హీన మైన, హేయమైన వాతావరణంలో బాలకార్మికులు పనిచేస్తున్నారు. పరిశీలించి చూస్తే ఈ పరిశ్రమలన్నీ ప్రమాద భరిత పనులకు సంబంధించినవే. ఎంతో మంది పిల్లలు హోటళ్లలోనూ, దుకాణాలలోనూ, గృహాలలోనూ సేవకులుగా పనిచేస్తున్నారు.
కాశ్మీరులోని తివాచీల పరిశ్రమలో పనిచేస్తున్న వారిలో 60 శాతం మంది క్షయ, ఆస్తమా వ్యాధులతో బాధపడుతున్నట్లు పలు సర్వేలు చెబుతున్నాయి. ఫిరోజాబాద్ గాజుల పరిశ్రమలో పనిచేసే పిల్లలు అస్తమా, బ్రాంకైటిస్, కంటి సంబంధించిన వ్యాధులకు గురవుతున్నారు. శివకాశీలో టపాకాయల పరిశ్రమలలో ప్రమాదాలకు బలైపోతున్నారు. భవన నిర్మాణ రంగంలో పనిచేసే బాలలు ప్రమాదాలు ఎదుర్కొంటున్నారు . భారీ యంత్రాలతో పనిచేసే వారు సరైన శిక్షణ, సరైన భద్రత లోపించడంతో ప్రమాదాల బారిన సంఘటనలు కూడా ఉన్నాయి.
బాల కార్మికులుగా చిన్నారులు మారడానికి కారణాలను పరిశీలించి నట్లయితే…. తల్లిదండ్రుల పేదరికం పిల్లలకు శాపంగా మారుతోంది. పేదరికం వల్ల పిల్లలు తమ మనుగడ కోసమే కాకుండా తమ కుటుంబ అవసరాల కోసం పనిచేయాల్సిన దుస్థితి. పిల్లలను అదనపు ఆదాయం తెచ్చేవారిగా పేద కుటుంబాలు భావిస్తున్నాయి. తల్లిదండ్రుల నిరక్షరాస్యత: ఎక్కువ మంది తల్లి తండ్రులు నిరక్ష్యరాస్యులు కావడంతో పిల్లల భవిషత్తు ప్రశార్థకంగా మారుతోంది. అర్థిక పరిస్థితి, అవగాహన లోపం వల్ల ప్రాథమిక విద్యను కూడా అందించలేకపోతున్నారు.సాంఘిక ఆర్థిక స్థితిగతులు (కుటుంబ పరిమాణం, నిరుద్యోగిత మొదలైనవి.)
బాలకార్మిక వ్యవస్థ వల్ల కలిగే దుష్ఫలితాలపై అవగాహనా లోపం ప్రధానంగా చెప్పవచ్చు.

భారీ పారిశ్రామికీకరణ, పట్టణీకరణ ఒక కోవలో చెప్పాలంటే పల్లెల నుంచి పట్టణాలకు వలస: గ్రామాల్లో ప్రత్యామ్నాయ ఉద్యోగావకాశాలు లేక పనికోసం వలసకు వెళ్లిన చోట పిల్లలను చదివించే పరిస్థితి ఉండదు. వారు కూడా బాలకార్మికులుగా మారుతున్నారు.

   ప్రస్తుత విద్యావిధానంపై  పేద తల్లిదండ్రులకు విశ్వాసలోపం. 

బాల కార్మిక వ్యవస్థపై సమాజంలో తీవ్రమైన అవగాహన, వ్యతిరేకత లేకపోవడం. పిల్లలను పనిలో పెట్టుకోవడాన్ని సమాజం వ్యతిరేకించిన నాడే ఈ పరిస్థితి నుంచి బయటపడగలం. పేద కార్మికుల చిన్నారుల ముఖాలలో వెలుగులను చూడగలం.

డా. చిటికెన కిరణ్ కుమార్
సభ్యులు, ఇంటర్నేషనల్ బెనెవోలెంట్ రీసెర్చ్ ఫౌండేషన్
9490841284
రాజన్న సిరిసిల్ల.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News