Homeఎడిటోరియల్ / బహుళమార్పు కోరుతున్న కాలమిది!

మార్పు కోరుతున్న కాలమిది!

ఉపఎన్నికలు సాధారణంగా స్థానిక రాజకీయాల ప్రతిబింబంగా పరిగణించబడతాయి. అయితే కొన్ని సందర్భాల్లో అవి రాష్ట్ర, జాతీయ రాజకీయాల దిశను సూచించే సంకేతాలుగా మారుతాయి. బీహార్‌లో బీజేపీ బలమైన స్థావరంగా భావించిన అసెంబ్లీ స్థానంలో ప్రశాంత్‌ కిషోర్‌ సాధించిన విజయం అలాంటి పరిణా మంగానే కనిపిస్తోంది. గత ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచిన సీటు కొద్ది నెలల్లోనే చేతులు మారడం కేవలం అధికార వ్యతిరేక ఓటు ఫలితంగా మాత్రమే కాకుండా, ప్రజలు రాజకీయాల్లో ప్రత్యామ్నాయాన్ని అన్వేషిస్తు న్నారనడానికి సంకేతంగా కూడా పరిగణించాల్సిన అవసరం ఉంది. ప్రశాంత్‌ కిషోర్‌ ఇప్పటివరకు ఎన్నికల వ్యూహ కర్తగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. నరేంద్ర మోదీ నుంచి మమతా బెనర్జీ, జగన్‌ మోహన్‌ రెడ్డి నుంచి ఎం.కె. స్టాలిన్‌ వరకు పలువురు నాయకుల ఎన్నికల విజయాల్లో ఆయన వ్యూహాలు కీలక పాత్ర పోషిం చాయి. అయితే వ్యూహకర్తగా విజయవంతం కావడం ఒక ఎత్తు; అదే ప్రజల తీర్పును ప్రత్యక్షంగా ఎదుర్కొని గెలవడం మరో ఎత్తు. ఈ ఉపఎన్నికలో ఆయన సాధిం చిన విజయం, వ్యక్తిగత విశ్వసనీయతను ప్రజల మద్ద తుగా మార్చ గలిగారనడానికి స్పష్టమైన సంకేతం. అభ్యర్థి ఎంపిక, స్థానిక నాయకత్వంపై అసంతృప్తి, అభివృద్ధి ఫలితాలపై ప్రజల అంచనాలు, అధికార పార్టీ పట్ల సహజంగా ఏర్పడే వ్యతిరేకత వంటి అంశాలు అధికార పార్టీకి ప్రతికూల పరిస్థితిని సృష్టించే అవకాశం ఉంటుంది. ఆఖరి నిమిషంలో అభ్యర్థిని మార్చడం కూడా ప్రతికూల ప్రభావం పడడంలో ప్రభావం చూపించి వుంటుందన్న వాదనలో నిజం లేకపోలేదు. సంస్థాగతంగా బలంగా ఉన్న పార్టీకి కూడా స్థానిక రాజకీయ పరిస్థితునులను నిర్లక్ష్యం చేసే అవకాశం లేదని ఈ ఎన్నిక స్పష్టం చేసింది.

- Advertisement -

అదే సమయంలో ప్రశాంత్‌ కిషోర్‌ ప్రచారం కూడా సాంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా సాగింది. ఆయన వ్యక్తిగత దూషణల కంటే పాలన, ఉపాధి, విద్య, వలసలు, స్థానిక అభివృద్ధి వంటి అంశాలను చర్చలోకి తీసుకురావడానికి ప్రయత్నించారు. కుల సమీకర ణాలు, బీహార్‌ రాజకీయాల్లో ఇప్పటికీ కీలకమైనవే అయినప్పటికీ, యువతలో అభివృద్ధి, అవకాశాలు, పరిపాలన వంటి అంశాలపై పెరుగుతున్న అసంతృప్తిని ఆయన సమర్థంవంతంగా ప్రచారాస్త్రాలుగా మలచగలి గారని ఈ ఫలితం సూచిస్తోంది. ఇటీవల జంతర్‌ మంతర్‌ వద్ద కాక్రోచ్‌ జనతా పార్టీ నిర్వహించిన జెన్‌ జీ ఉద్యమం వంటి సామాజిక ఉద్య మాల ప్రభావం, ఆ ఉద్యమంలో బీహార్‌ యువత భాగస్వామ్యం అందరికీ తెలిసిందే. అలాంటి ఉద్య మాలు నేరుగా ఓట్లుగా మారకపోయినా, ప్రభుత్వాల జవాబుదారీతనం, ప్రజాస్వామ్య విలువలు, పౌరహక్కు లపై చర్చను బలపరుస్తాయి.

ఆ వాతావరణం అధికార వ్యతిరేక భావనకు అనుకూలంగా మారితే, అది ఎన్నికల ఫలితాలపై పరోక్ష ప్రభావం చూపే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఈ విజయాన్ని ఒకే కారణంతో వివరించడం కంటే, అనేక సామాజిక-రాజకీయ అంశాల సమ్మేళ నంగా చూడడం సముచితం. ‘ఈ దేశంలో ప్రతిపక్ష పార్టీలు బలహీనంగా ఉండవచ్చు; కానీ ప్రతిపక్ష స్థానం మాత్రం ఎప్పుడూ బలంగానే ఉంటుంది’ అనే ప్రశాంత్‌ కిషోర్‌ వ్యాఖ్య భారత ప్రజాస్వామ్య స్వభావాన్ని సూటిగా వివరిస్తుంది. వ్యక్తులు, పార్టీలు కాలానుగుణంగా బలహీనపడవచ్చు. కానీ ప్రజాస్వామ్యంలో ప్రత్యామ్నాయం అవసరం ఎప్పటికీ తగ్గదు. భారత ఓటరు ఒకే పార్టీకి శాశ్వత రాజకీయ ఆధిపత్యాన్ని ఇవ్వడు; అధికారాన్ని సమర్థిం చడంలో ఎంత చైతన్యం చూపిస్తాడో, దానిని ప్రశ్నిం చడంలో కూడా అంతే చురుకుగా వ్యవహరిస్తాడు. అందువల్ల బలమైన ప్రతిపక్షం లేకున్నా, ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని వెతికే సామాజిక శక్తి ఎప్పుడూ సజీవంగానే ఉంటుంది అనడానికి ఆయన వ్యాఖ్య ప్రత్యక్ష సాక్ష్యం.

ఈ ఉపఎన్నికలో ఇతర ప్రతిపక్ష పార్టీల పాత్ర గురించి కూడా చెప్పుకోవాల్సివుంది. అవి ప్రత్యక్షంగా విజయం సాధించకపోయినా, అధికార వ్యతిరేక ఓటును విభజించకుండా ఉండడం, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాత్మకంగా వ్యవహరించడం ద్వారా అవి గెలుపును ప్రభావితం చేసినట్లుగా చెబుతున్నారు. భవిష్యత్తులో ప్రాంతీయ పార్టీల మధ్య సమ న్వయం పెరిగితే, జాతీయ రాజకీయాల్లో కొత్త కూట ముల అవకాశాలు కూడా పెరగవచ్చు.

అయితే ఒక ఉపఎన్నికను దేశవ్యాప్త రాజకీయ తీర్పుగా భావించడం కూడా సరికాదు. కానీ ఇలాంటి ఎన్నికలు ప్రజల మనోభావాల్లో మార్పును ముందుగానే సూచించే రాజకీయ బారోమీటర్‌ గా పనిచేస్తాయి. ఈ ఫలితం అధికార పార్టీలకు తప్పనిసరిగా ప్రజాభిప్రా యాన్ని వినాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తే, ప్రతిపక్షాలకు విశ్వసనీయ ప్రత్యామ్నాయం నిర్మించాల్సిన బాధ్యతను గుర్తు చేస్తోంది. ప్రశాంత్‌ కిషోర్‌ విజయం అంతిమంగా ఒక వ్యక్తి విజయమే కాదు; భారత ప్రజాస్వామ్యంలో మార్పు కోసం ప్రజలు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారనే శాశ్వత సత్యానికి మరో ఉదాహరణ.

గుండెబోయిన శ్రీనివాస్
9985194697

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News