Jubilee Hills By Election Detailed Information: రాజధాని నడిబొడ్డున జరగనున్న జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కదనరంగాన్ని తలపిస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నువ్వానేనా అన్నట్టుగా ప్రచారాన్ని ప్రారంభించాయి. బీజేపీ సైతం.. తనదైన వ్యూహాలతో ముందుకెళ్తుంది. ఈ ఉపఎన్నికల ఫలితం కేవలం ఒక శాసనసభ స్థానాన్ని నిర్ణయించడమే కాకుండా.. రాష్ట్ర రాజకీయలపై బలమైన సందేశాన్ని పంపే అవకాశం ఉంది. దీంతో త్రిముఖ పోరు తప్పదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ ఉపఎన్నిక మూడు పార్టీలకే కాకుండా.. ముగ్గురు ప్రధాన వ్యక్తుల రాజకీయ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపనుంది. సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావుకు ఈ ఉపఎన్నిక అగ్నిపరీక్షగా నిలిచింది. ఈ ముగ్గురు కీలక నేతల నాయకత్వంపై ఈ ఫలితం ప్రభావం చూపే అవకాశం ఉంది. అయితే ఈ ఎన్నికల ఫలితంపై వారి ప్రభావం ఎలా ఉండనుంది.. ఎన్నికల తర్వాత వారి రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం!
రేవంత్ పాలనపై రెఫరెండం: అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ సర్కార్ ఎదుర్కొంటున్న తొలి ఉపఎన్నిక ఇది. నిజానికి ఈ స్థానం అధికార పార్టీకి చెందిన సిట్టింగ్ స్థానం కాకపోయినా.. ఈ గెలుపు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వానికి రెఫరెండంగా నిలువనుంది. అంతే కాకుండా సాధారణ ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రకటించి ఆరు గ్యారెంటీల అమలుకు ప్రజల ఆమోదంగా ఎంతవరకు ఉందనే అంశంపై సైతం..ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరోకోణంలో చూస్తే..ఈ ఉప ఎన్నిక బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలకు కాంగ్రెస్ కళ్లెం వేయాల్సిన అవకాశం ఉంది. రేవంత్ సర్కార్ పై కేటీఆర్ ఆరోపిస్తున్న ‘బుల్డోజర్ పాలన’ వంటి విమర్శలను తిప్పికొట్టాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డిపై ఉంది. ఈ విజయం ఆయన పాలనకు మరింత బలాన్నిస్తుంది.
కాంగ్రెస్ గెలిస్తే భవిష్యత్తులో జరిగే పరిణామాలు: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోరులో కాంగ్రెస్ గెలిస్తే ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో విశ్వాసం పెరిగిందనే సందేశం బలంగా వెళ్తుంది. దీంతో రాబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు, ఇతర నామినేటెడ్ పోస్టుల నియామకాలకు పార్టీకి మరింత బలాన్నిస్తుంది. అంతే కాకుండా సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంపై కాంగ్రెస్ అధిష్టానంకు మరింత నమ్మకం పెరుగుద్ది.
కాంగ్రెస్ ఓడితే పెనుమార్పులు తప్పవు: రాజధాని నడిబొడ్డున గల జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ ఓటమి పాలైతే దాని పరిణామాలు తీవ్రంగా ఉండనున్నాయి. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంపై అత్యధిక ప్రభావం పడే అవకాశం ఉంది. పాలనపై ప్రతిపక్షాల విమర్శలకు మరింత బలం చేకూరుతుంది. దీంతో పార్టీ అంతర్గత విభేదాలు .. ఒక్కసారిగా బహిర్గతం అయ్యే అవకాశం ఉంది. అదే జరుగుతే రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు తప్పవు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఓడిపోతే.. రేవంత్ రెడ్డి పదవికి ముమ్మాటికి ప్రమాదం పొంచి ఉన్నట్టేనని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
కేటీఆర్ నాయకత్వ పటిమకు గీటురాయి: ఇప్పుడు ఉన్న పరిస్థితిలో జూబ్లీహిల్స్ సీటును నిలబెట్టుకోవడం బీఆర్‌ఎస్‌కు అత్యవసరం. ఈ ఉప ఎన్నిక.. గత ప్రభుత్వం చేసిన అభివృద్ధికి, ప్రస్తుత కాంగ్రెస్ పాలన పట్ల ప్రజల్లో ఉన్న అసంతృప్తికి ‘రిఫరెండం’గా ఉంటుందని కేటీఆర్ పదేపదే పేర్కొంటున్నారు. కేటీఆర్ ప్రచారాన్ని గమనిస్తే.. రేవంత్ రెడ్డి వైఫల్యాలతో హైదరాబాద్ అభివృద్ధి నిలిచిపోయిందనే అంశాలపైనే కేంద్రీకృతమై ఉంటుంది. నిజానికి ఇది బీఆర్‌ఎస్ సిట్టింగ్ స్థానం. ఈ స్థానాన్ని నిలబెట్టుకోవడం ఆ పార్టీకి అత్యంత ముఖ్యం. అందుకే కేటీఆర్ ఈ ఎన్నికను కాంగ్రెస్ పాలనపై ‘రెఫరెండం’గా పదే పదే అంటున్నారు.
గెలిస్తే పునరుజ్జీవం.. ఓడితే నాయకత్వంపై మరింత ఒత్తిడి: బీఆర్‌ఎస్‌కు గెలుపు అనేది పార్టీ అధినేతకే కాకుండా కార్యకర్తల్లో సైతం నైతిక స్థైర్యాం నింపుతుంది. ఇటీవల కేటీఆర్ చెప్పినట్టుగా.. బీఆర్ఎస్ ‘జైత్రయాత్ర’ ఇక్కడి నుంచే ప్రారంభమవుతుందనే మాటలు నిజం అవుతాయి. అంతే కాకుండా బీఆర్‌ఎస్ పార్టీ ఇప్పటికీ.. పట్టణ ఓటర్లపై పట్టు కోల్పోలేదనే సంకేతాన్నిస్తుంది. అయితే ఓడితే మాత్రం బీఆర్‌ఎస్ మరింత బలహీనపడే అవకాశం ఉంది. ఇది పార్టీలో మరిన్ని వలసలకు దారితీసే అవకాశం లేకపోలేదు. అంతేకాకుండా కేటీఆర్ నాయకత్వ పటిమపై మరింత ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది.
ప్రత్యామ్నాయ శక్తిగా నిరూపించుకునేందుకు ఇదే సరైన సమయం: రాష్ట్రం బీజేపీని ప్రధాన ప్రత్యామ్నాయ శక్తిగా నిలబెట్టాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్రావు కృషి చేస్తున్నారు. జూబ్లీహిల్స్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉండటం వల్ల ఈ గెలుపు బీజేపీకి చాలా అవసరం. బీజేపీ గెలిచినా..లేదా గట్టి పోటీ ఇచ్చి గణనీయమైన ఓట్లు సాధించినా.. ఇతరుల గెలుపోటములపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. అంతే కాకుండా కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కు ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ ఉందనే సంకేతం వెళ్తుంది. అంతకాకండా ఈ ఎన్నికల ఫలితం రాబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ వ్యూహాలకు మరింత పదును పెట్టేందుకు తోడవుతుంది. అయితే ఈ ముక్కోణపు పోరులో గెలుపు ఎవరికనేది ఓటరు నాడి, స్థానిక సమస్యలు, రాష్ట్ర రాజకీయాలపై ప్రధానంగా ఆధారపడి ఉంటుందనేది నగ్నసత్యం.


