Wednesday, October 30, 2024
Homeఓపన్ పేజ్Priyanka the new Indira: ఇందిరా గాంధీ వారసురాలు ప్రియాంకేనా?

Priyanka the new Indira: ఇందిరా గాంధీ వారసురాలు ప్రియాంకేనా?

కాంగ్రెస్‌ పార్టీలో ప్రియాంక గాంధీకి క్రమంగా ప్రాధాన్యం పెరుగుతోంది. పార్టీ నాయకులంతా ఆమె నివాసానికే బారులు తీరుతున్నారు. మున్ముందు ఆమే ఇందిరా గాంధీ వారసురాలిగా మారే అవకాశం ఉందని కూడా పార్టీలో సంకేతాలు వినిపిస్తున్నాయి. వాయనాడ్‌లో ఆమె గెలిచిన మరుక్షణం నుంచి కాంగ్రెస్‌ రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకోబోతున్నట్లు సీనియర్‌ నాయకులు సైతం అభిప్రాయపడుతున్నారు. కేరళలోని వాయనాడ్‌ స్థానం నుంచి లోక్‌ సభకు పోటీ చేయాలని ప్రియాంక గాంధీ నిర్ణయించుకోవడం ఊహించిన పరిణామమే. ఆమె గెలవడం వల్ల అటు కాంగ్రెస్‌ పార్టీకి, ఇటు ఆమె కుటుంబానికి ఎంతో ప్రయోజనం ఒనగూడబోతోందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.
అయితే, ఆమె ఏం ఆలోచిస్తున్నారన్నది కూడా ఇక్కడ పరిశీలించాల్సిన విషయం. ఆమె మాటల్లోనే చెప్పాలంటే ఆమె తరచూ, “మా అన్నయ్యకి సహాయం చేయడానికి నేనెప్పుడూ రెడీగానే ఉంటాను. ఆయన ఏం అడిగితే అది సహాయం చేస్తాను” అంటుండడాన్ని బట్టి కేవలం తన కుటుంబానికి మాత్రమే ఉపయోగపడతారని అనుకోలేం. ఆమె రాజకీయాలన్నీ సోదరుడు రాహుల్‌ గాంధీ చుట్టూనే తిరుగుతుంటాయి. ఆమె ఎక్కడ ప్రసంగాలు చేసినా, ఎక్కడ ప్రకటనలు చేసినా రాహుల్‌ గాంధీని తన ‘నాయ కుడు’గానే సంభోదిస్తుంటారు. ఆయన గతంలో కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడుగా వ్యవహరించడం వల్ల ఆమె ఆయనను ఈ విధంగా సంభోధిస్తుండ వచ్చు కానీ, ఆమెకు రాహుల్‌ గాంధీ రాజకీయ చాతుర్యం మీద అపారమైన నమ్మకం ఉందనడంలో ఏమాత్రం సందేహం లేదు.
గత ఎన్నికల్లో వాయనాడ్‌ రాయబరేలీ లోక్‌ సభ స్థానాల నుంచి విజయం సాధించిన రాహుల్‌ గాంధీ ఏ స్థానాన్ని వదిలేయాలా, ఏ స్థానాన్ని ఉంచుకోవాలా అనే సందిగ్ధంలో పడినప్పుడు, గత జూన్‌ 17న ప్రియాంక గాంధీ కల్పించుకుని ఈ సందిగ్ధావస్థ నుంచి రాహుల్‌ ను బయటపడేశారు. రాహుల్‌ రాయబరేలీని అట్టిపెట్టుకుని, వాయనాడ్‌ లోక్‌ సభ స్థానానికి రాజీనామా చేయాలని, తాను వాయనాడ్‌ ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని సూచించారు. ఈ ప్రతిపాదనకు సహజంగానే కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే కూడా తన ఆమోదం తెలియజేశారు. 1991-96 సంవత్సరాల మధ్య మాత్రమే నెహ్రూ కుటుంబం నుంచి ఒక్కరు కూడా లోక్‌ సభకు ఎన్నిక కాలేకపోయారు.1991మేలో రాజీవ్‌ గాంధీ హత్యకు గురయ్యారు. ఆ కుటుంబానికి చెందిన మేనకా గాంధీ ఫిలిభిత్‌ నుంచి జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.
ఇది ఇలా ఉండగా, 2009 ఏప్రిల్‌లో ప్రియాంక గాంధీ ఒక ఇంటర్వ్యూ ఇస్తూ, ‘నిజం చెప్పాలంటే, నేను రాజకీయాలకు సరిపోతానా అనిపిస్తుంది. నాకు రాజకీయాల్లో ప్రవేశించడం ఏమాత్రం ఇష్టం లేదు. రాజకీయాల్లో కొన్ని విషయాలు నాకు నచ్చవు. కుటుంబ జీవితం గడ పడమే నాకిష్టం’ అని అన్నారు. అయితే, 2019లో ఆమె కాంగ్రెస్‌ పార్టీలో అధికారికంగా చేరిపోవడమే కాకుండా, క్రియాశీల రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించడం కూడా ప్రారంభించారు. కుటుంబమంతా రాజకీయాల్లో కీలక పాత్ర పోషించడమనేది నెహ్రూ కుటుంబానికి కొత్తేమీ కాదు. నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 1959లో ఇందిరా గాంధీ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలిగా పనిచేశారు. తన కుమార్తెను తన తర్వాత ప్రధానమంత్రిని చేయడానికే నెహ్రూ ఆమెను కాంగ్రెస్‌ అధ్యక్ష పదవిలో కూర్చోబెట్టారని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులకు సైతం అర్ధమైపోయింది.

- Advertisement -

కొద్దిపాటి శిక్షణ అవసరం
అయితే, కాలక్రమంలో ఇందిరా గాంధీని తన ప్రతిభను నిరూపించుకున్నారు. పార్టీ అధ్యక్షురాలిగా ఆమె కేరళ సంక్షోభాన్ని పరిష్కరించడంతో పాటు, భాష, ప్రాంతీయ సమస్యలతో అట్టుడుకుతున్న మహారాష్ట్ర, గుజరాత్‌ లను వేర్వేరు రాష్ట్రాలుగా విభజించగలిగారు. 1960లో ఆమె పదవీ కాలం ముగిసినప్పుడు, ఆమె పార్టీ అధ్యక్షురాలిగా కొనసాగాలంటూ పార్టీ పెద్దలు ఒత్తిడి తీసుకువచ్చారు కానీ, ఆమె నిర్ద్వంద్వంగా, నిర్మొహమాటంగా తిరస్కరించారు. ఇందిరా గాంధీ ప్రధాన మంత్రిగా ఉన్న సమయంలో సంజయ్‌ గాంధీ కొద్ది కాలం పాటు పార్టీ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు. అయితే, ఆయన ఏ పదవీ నిర్వహించనప్పుడు మాత్రం పార్టీ వ్యవహారాల్లోనూ, పాలనా వ్యవహారాల్లోనూ ఎక్కువగా కల్పించుకునేవారు. ఆయనను పార్టీ అధ్యక్షుడిని చేయాలని కొందరు నాయకులు పట్టుబట్టారు కానీ ఇందిరా గాంధీ గానీ, సంజయ్‌ గాంధీ గానీ అందుకు అంగీకరించలేదు.
అయితే, ఇందిరా గాంధీ ప్రధానమంత్రిగా ఉండగానే రాజీవ్‌ గాంధీ 1983లో పార్టీకి ప్రధాన కార్యదర్శి అయ్యా రు. సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీలు కూడా కలిసే పార్టీ బాధ్యతలు నిర్వహించడం జరిగింది. ఇక 2004 నుంచి 2014 వరకూ కాంగ్రెస్‌ నాయకత్వంలోని యు.పి. ఏ అధికారంలో ఉన్నప్పటికీ, రాహుల్‌ గాంధీ రాజకీయంగా ఎదగడం సాధ్యం కాలేదు. బాధ్యతలు స్వీకరించ డం ఇష్టం లేకపోవడం, పదవులేవీ స్వీకరించకపోవడం, రాజకీయాల పట్ల ఆసక్తి లేకపోవడం, పార్టీ విషయాల్లో సీరియస్‌గా ఉండకపోవడం వంటి కారణాల వల్ల రాహుల్‌ గాంధీని పార్టీలో ఎవరూ సరిగ్గా పట్టించుకోకపోవడం జరి గింది. అయితే, 2014లో పార్టీ ఓటమి తర్వాత ఆయనలో రాజ కీయాల పట్ల ఆసక్తి ప్రారంభమైంది. బీజేపీని ఓడిం చాలన్న ఏకైక లక్ష్యంతో కాంగ్రెస్‌ పార్టీలో క్రియా శీల పాత్ర పోషించడం ప్రారంభించిన తర్వాత ఆయన పట్ల పార్టీలో నమ్మకం, ఆసక్తి ఏర్పడడం జరిగింది. చివరికి గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తన సంఖ్యాబలాన్ని పెంచుకో వడంతో ఆయనకు ప్రతిపక్ష నాయకుడి పదవి లభించింది.
సరికొత్త నాయకురాలు
ఇటీవలి వరకూ ప్రియాంక గాంధీలో ఆ మాత్రం ఆసక్తి కూడా కనిపించలేదు. ప్రధాని నరేంద్ర మోదీ మీద దాడి చేసినప్పుడల్లా రాహుల్‌ గాంధీకి ప్రియాంక సహాయ సహకారాలు అందిస్తూ వచ్చారు. పార్లమెంటులో పార్టీ బలం 102కు చేరే సరికి, ప్రియాంక గాంధీలో కూడా పార్టీలో క్రియాశీల పాత్ర పోషించాలన్న కోరిక కలిగినట్టు కనిపిస్తోంది. ప్రియాంక మీద రాహుల్‌ గాంధీకి కూడా ఎంతో నమ్మకం. పార్టీలో అహ్మద్‌ పటేల్‌ లేని లోటు ప్రి యాంక తీరుస్తున్నారని ఆయన భావిస్తున్నారు. ఆయన ఉద్దేశంలో ప్రియాంక ఓ వ్యూహకర్త. ఎటువంటి సంక్షోభా న్నయినా చక్కబెట్టగల నేర్పరి. పార్టీలో ఏకాభిప్రాయ సాధనలో ఆమెను మించినవారు లేరు. త్వరలో జరగ బోయే మహారాష్ట్ర, జార్ఖండ్‌ జమ్మూ కాశ్మీర్‌, హర్యానా శాసనసభ ఎన్నికలకు వ్యూహాలను రూపొందించే బాధ్యతను కూడా ఆయన ఆమెకే అప్పగించారు. అంతేకాదు, పార్టీలో అందరి సాధక బాధకాలను ఓర్పుగా వినగలిగిన వ్యక్తి ప్రియాంకే. పార్టీలో రాహుల్‌ గాంధీతో సహా ప్రతివారూ ఆమెను ఒక టీమ్‌ లీడర్‌గా పరిగణించడం జరుగుతోంది.
వాయనాడ్‌ ఉప ఎన్నికల్లో పోటీ చేయబోతున్న ప్రియాంక గాంధీ ఇక్కడ గెలిచే అవకాశమే ఎక్కువగా ఉంది. రాహుల్‌ గాంధీ రెండుసార్లు ఇక్కడి నుంచి పోటీ చేసి గెలవడంతో పాటు, ఇక్కడి ప్రజలకు బాగా చేరువయ్యారు. ఇక్కడి బీజేపీ వ్యతిరేక వర్గాలకు ఆయన సరైన ఆలంబన అయ్యారు. నెహ్రూ కుటుంబం పట్ల, కాంగ్రెస్‌ పార్టీ పట్ల ఇక్కడి ప్రజల్లో అచంచలమైన విశ్వాసం ఏర్పడింది. అంతకు మించి వారిలోని బీజేపీ వ్యతిరేకతకు సరైన దిక్సూచి వారికి రాహుల్‌ గాంధీలో కనిపించింది. బహుశా ప్రియాంక గాంధీకి కూడా ఇది బాగానే ఉపయోగపడవచ్చు.
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఈ 77 ఏళ్ల కాలంలో సుమారు 59 ఏళ్ల పాటు కాంగ్రెస్‌ పార్టీయే అధికారంలో ఉంది. అందులోనూ ఎక్కువగా నెహ్రూ కుటుంబమే అధికారంలో ఉంది. కాంగ్రెస్‌ పార్టీ నాయ కులు, కార్యకర్తల ఉద్దేశంలో నెహ్రూ కుటుంబ వారసు లంతా తిరుగులేని నాయకులు. ఎన్నికల్లో గెలవాలన్నా, అధికారం చేపట్టాలన్నా వారి వల్లే సాధ్యం అవుతుంది. నెహ్రూ నుంచి రాహుల్‌ వరకూ ఆ కుటుంబానికి చెందిన వారెవరూ విఫలం కాలేదు. పార్టీ నుంచి నిష్క్రమించడమూ జరగలేదు. పార్టీలోకి రాకపోవడం, పార్టీలో పదవులు చేపట్టకపోవడం, పార్టీలో క్రియాశీల పాత్ర పోషించక పోవడం, అధికారం పట్ల విముఖత ప్రదర్శించడం వంటి వన్నీ పార్టీని బలోపేతం చేయడానికే పనికి వస్తాయని, మధ్య మధ్య ఇటువంటి వ్యూహాలను అనుసరించక తప్ప దని వారికి గట్టి నమ్మకం. పార్టీ నాయకులకు నెహ్రూ కుటుంబం తప్ప మరేమీ పట్టదు. నెహ్రూ కుటుంబాన్ని మించి మరేమీ కనిపించదు. ఇప్పుడు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీలు కూడా దీన్ని ఉపయోగించుకునే పనిలో నిమగ్నం అయ్యారు.
-కె.వి. రాఘవానంద

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News