Friday, October 18, 2024
Homeఓపన్ పేజ్Prof. Saibaba: చిరస్మరణీయమైన వ్యక్తి సాయిబాబా

Prof. Saibaba: చిరస్మరణీయమైన వ్యక్తి సాయిబాబా

ప్రభుత్వాన్ని విమర్శిస్తే ఇంతేనా?

ప్రభుత్వాలు, పాలకులు రాజకీయ అసమ్మతివాదులతోనూ, కారాగారాల్లోని ఖైదీలతోనూ ఎంత సంస్కారవంతంగా వ్యవహరిస్తుందన్న దాని మీదే ఆ దేశ నాగరికతా బలం ఆధారపడి ఉంటుంది. “నేను చాలా చిన్నవాడిని. చాలా చిన్నవాళ్ల హక్కుల కోసం చాలా తక్కువ స్థాయిలో పాటు పడుతున్నాను. ఇంత పెద్ద ప్రభుత్వానికి నన్ను చూస్తే భయమెందుకో అర్థం కావడం లేదు” అని ప్రొఫెసర్‌ జి.ఎన్‌. సాయిబాబా ఆశ్చర్యపోతుండేవారు. “విచిత్రంగా ప్రభుత్వాలకు మా ఆశయాలన్నా, ఆశలన్నా, కలలన్నా, మా ప్రేమాభిమానాలన్నా ఎందుకో భయం” అని ఆయన వ్యాఖ్యానించేవారు. ఒక విభిన్నమైన సిద్ధాంతాన్ని అనుసరించినా, రాజకీయంగా అసమ్మతిని వ్యక్తం చేసినా, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా మనసులోని మాట చెప్పినా ప్రభుత్వాలు భరించలేక పోవడం అన్నది ప్రజాస్వామ్య మూల సిద్ధాంతానికే విరుద్ధం. ఒక వ్యతిరేక అభిప్రాయం వెలువడడం తరువాయి ప్రభుత్వం వారి మీద విరుచుకుపడుతుంది. వారి మీద వీలైనన్ని రాక్షస చట్టాలను ప్రయోగిస్తుంది.
ప్రొఫెసర్‌ సాయిబాబా తన అయిదవ ఏట నుంచి పోలియో కారణంగా నడిచే శక్తిని కోల్పోయారు. జీవితంలో అడుగడుగునా కష్టనష్టాలు ఎదురవుతున్నప్పటికీ, ఎదురీదుతూ, పదవ తరగతిలో జిల్లాలోనే ప్రథమ స్థానం సంపాదించారు. చనిపోయే వరకు ఆయనను చక్రాల కుర్చీలో చూసిన వారికి 2008 ముందు నాటి ఆయన పరిస్థితి తెలిసి ఉండకపోవచ్చు. అరచేతులకు హవాయి చెప్పులు తొడుక్కుని పాకుతూ ఉండేవారు. దిగ్భ్రాంతికర విషయమేమిటంటే, ఆయన ఈ విధంగా పాకుతూ దేశమంతా పర్యటించారు. జీవితంలో అనేక సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ లెక్క చేయకుండా ఆయన అనేక ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నారు. ఆదివాసీలు, దళితులు, అల్ప సంఖ్యాక వర్గాలు, మహిళల హక్కుల కోసం పోరాడుతుండేవారు. ఈ పోరాటాలు, ఉద్యమాలే ఆయనకు రెండు కాళ్లలా పనిచేశాయి. ఢిల్లీ విశ్వవిద్యాలయానికి సంబంధించిన రామ్‌ లాల్‌ ఆనంద్‌ కాలేజీలో ఆయన ఇంగ్లీషు విభాగంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ గా ఉద్యోగం సంపాదించారు. ఆయనకు కాళ్లు పనిచేయవు కానీ, చేతులు మాత్రం బలంగా పని చేస్తూ ఉండేవి. అయితే, చెరసాలలో ఆయనను చిత్రహింసలు పెట్టిన కారణంగా ఆ చేతులు కూడా పనిచేయడం మానేశాయి.
మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణతో ఆయన మీద 2014లో కేసు పెట్టారు. ఆ కేసుపై విచారణ జరిపిన తర్వాత 2017లో గడ్చిరోలి సెషన్స్‌ కోర్టు ఆయనకు జీవిత ఖైదు విధించింది. చాలా ఏళ్ల పాటు ఆయనను జైలులో చిత్రహింసలు పెట్టారు. ఆయన అక్కడ దుర్భర, దుస్సహ జీవితాన్ని గడపాల్సి వచ్చింది. 2021లో ఆయనను అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ బాధ్యతల నుంచి తొలగించడం జరిగింది. ఆయనను సంఘ విద్రోహ కార్యకలాపాల నిరోధక చట్టం కింద అరెస్టు చేయడానికి, ఆ తర్వాత విచారించడానికి సరైన ఆధారాలు లేవంటూ 2022 అక్టోబర్‌ నెలలో బాంబే హైకోర్టు ఆయనను తాత్కాలికంగా విడుదల చేసింది. ఆ తర్వాత 2024 మార్చిలో హైకోర్టు ఆయనను పూర్తిగా విడుదల చేసింది. ఆయనకు ఉగ్రవాదులు లేదా మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనడానికి ఆధారాలు లేవని, ఆయనకు ఏ విధంగానూ వారితో సంబంధాలు లేవని కోర్టు తేల్చి చెప్పింది. ఆయన కమ్యూనిస్టులు, మావోయిస్టుల భావజాలాన్ని డౌన్‌ లోడ్‌ చేసుకున్నంత మాత్రాన వారితో ఆయనకు సంబంధాలున్నట్టుగా భావించలేమని కూడా స్పష్టం చేసింది. ఆయనకు చాలా కాలం పాటు బెయిలు ఇవ్వడానికి కోర్టులు నిరాకరించాయి. 2024 మార్చిలో విడుదలైన సాయిబాబా అనారోగ్యాల వాతబడి చివరికి అక్టోబర్‌లో కన్నుమూశారు.
మరింత ఆందోళనకరమైన విషయమేమిటంటే, ఆయనను తన భార్య వసంత కుమారితో తెలుగులో మాట్లాడుకోనివ్వలేదు. నిజానికి తెలుగు సాహిత్యం పట్ల అభిరుచి కారణంగానే వారిద్దరూ భార్యాభర్తలయ్యారు. ఈ దంపతులకు చలం, రంగనాయకమ్మ, కొడవటిగంటి కుటుంబ రావు, శ్రీశ్రీ, ప్రేంచంద్‌, రవీంద్రనాథ్‌ ఠాగూర్‌, పెరియార్‌, శరత్‌ బాబు రచనలంటే చాలా ఇష్టం. జైలు అధికారులు వారిని సాహిత్యం గురించి మాట్లాడుకోనివ్వలేదు. కుల, మత, వర్గ, వర్ణాలకు అతీతమైన సమానత్వ సమాజం గురించి వారిద్దరూ కలలుగనేవారు. అసమానతలను తగ్గించడం గురించి మాట్లాడుకునేవారు. ఇటువంటి వ్యక్తి మీద ప్రభుత్వాలు, పోలీసులు చట్టాలన్నిటినీ ప్రయోగించి భావ ప్రకటనా స్వేచ్ఛను, వ్యక్తి స్వేచ్ఛను కాలరాయడం ఏ విధమైన న్యాయమో అర్థం కాని విషయం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News