Wednesday, January 14, 2026
Homeఓపన్ పేజ్Chakma Student Murder: ‘మేము కూడా భారతీయులమే’

Chakma Student Murder: ‘మేము కూడా భారతీయులమే’

Northeast India Discrimination: 2026 నూతన సంవత్సరాన్ని ఈశాన్య రాష్ట్రాల విద్యార్థినీ విద్యార్థులు ‘మేము కూడా భారతీయులమే’ అనే నినాదంతో ప్రారంభించారు. అవును ఇది నిజమే. డెహ్రాడూన్‌లో మూక దాడికి గురైన త్రిపుర విద్యార్థి ఏంజెల్‌ చక్మా హత్యకు నిరసనగా ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ దగ్గర జరిగిన నిరసనలో ఈ నినాదాలు చేశారు. ఈ నిరసనలో పాల్గొన్న ఒక విద్యార్థిని మాట్లాడుతూ ‘మేము కూడా భారతీయులమే. మమ్మల్ని చైనీస్, నేపాలీ అని అవమానిస్తున్నారు. తోటి భారతీయులే మమ్మల్ని ఇలా అవమానిస్తుంటే మా మనసు గాయపడుతుంది. మిగతా భారతీయులలాగా మేము కూడా వివక్ష లేని, స్వేచ్ఛగా జీవించే హక్కు కోసం పోరాడుతున్నాము’ అని నినదించింది.

- Advertisement -

త్రిపురకు చెందిన 24 ఏళ్ల విద్యార్థి ఏంజెల్‌ చక్మా ఉత్తరాఖండ్‌ రాజధాని డెహ్రాడూన్‌లో ఎంబీఏ ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్నాడు. తన తమ్ముడు మైకేల్‌ చక్మాతో కలిసి ఒక దుకాణం దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఉన్న ఆరుగురు యువకులు ఏంజెల్‌ చక్మాను చూసి చింకీ, మోమో, చైనీస్ అని హేళన చేశారు. దీంతో ఏంజెల్‌ చక్మా ‘నేను భారతీయుణ్ణి’ అని వారితో అన్నాడు. అయినా వారు హేళన చేస్తూ తీవ్రంగా కొట్టారు. కత్తితో పొడిచారు. దీంతో 17 రోజులు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ డిసెంబర్‌ 26వ తేదీన ఏంజెల్‌ చనిపోయాడు. దీంతో ఢిల్లీతోపాటు ఈశాన్య రాష్ట్రాలలో వేలాదిమంది విద్యార్థినీ, విద్యార్థులు రోడ్ల మీదకు వచ్చి తమ నిరసనలు వ్యక్తం చేశారు.

దేశంలో 2015లో ఉత్తరప్రదేశ్‌లో మొహమ్మద్‌ అఖ్లాక్‌ మీద జరిగిన మూక దాడి నుండి మొదలుకొని నేడు డెహ్రాడూన్‌ లో చక్మాపై జరిగిన దాడి వరకు ఇవి కొనసాగుతూనే ఉన్నాయి.ఆ మాటకొస్తే పోయిన డిసెంబర్‌ నెలలో బంగ్లాదేశీయులు అనే అనుమానంతో కేరళలో వలస కార్మికుడు రామ్‌ నారాయణ్‌ భగేల్‌, ఒడిస్సాలో వలస కూలి జూయల్‌ షేక్‌ లు మూక దాడులలో మరణించారు. వీరిద్దరు కూడా భారతీయులే. ఏంజెల్‌ చక్మా కూడా ‘నేను చైనీయున్ని కాదు భారతీయుడిని’ అని కొన్ని గుర్తింపు కార్డులు చూపించే ప్రయత్నం చేశాడు. అయినా దాడి జరిగింది. ఈ దాడులు విద్వేషంతోనే జరుగుతున్నాయనేది వీటిని క్షుణ్ణంగా గమనిస్తే అర్థమవుతుంది.

ఢిల్లీలో జరిగిన నిరసనలో పాల్గొన్న ఈశాన్య రాష్ట్రానికి చెందిన జేఎన్‌యూ విద్యార్థిని మాట్లాడుతూ ‘కరోనా సమయంలో నేను హాస్టల్‌ బయటి ప్రాంగణంలో ఉండగా, ఒక అనుమానాస్పద వ్యక్తి బైకు మీద వచ్చి పాన్‌ తిన్న నోటితో నామీద ఉమ్మాడు. కరోనా వైరస్, స్మాల్‌ పీపుల్‌ అని నిందించాడు. బయటికి వెళ్తే మమ్మల్ని చైనీస్, నేపాలీ అని ఎగతాళి చేస్తున్నారు. ఈ అవమానాల నుంచి రక్షణ కోసం ఈశాన్య రాష్ట్రాల ప్రజలకు ఒక ప్రత్యేక చట్టం కావాలి’ అని డిమాండ్‌ చేసింది. నిజంగా దేశంలో ఇలాంటి పరిస్థితులు నెలకొనడం ఒక విషాదం. మతం, ఆహార్యం, ఆహారం ప్రాతిపదికలుగా భారతీయతను కొలిచే పరిస్థితి రావడం విచారకరం. ఈ సందర్భంగా షారుఖ్‌ ఖాన్‌ హీరోగా వచ్చిన చక్‌ దే ఇండియా సినిమాను ఒకసారి గుర్తు చేసుకోవాలి.

భారత మహిళల హాకీ జట్టుకు షారుఖ్‌ ఖాన్‌ కోచ్‌గా ఉంటాడు. జట్టులో ఇద్దరు ఈశాన్య రాష్ట్రాల క్రీడాకారిణులు ఉంటారు. వీరిని ఇద్దరు పోకిరీలు చక్మాను ఎగతాళి చేసినట్లే చేస్తారు. దీంతో జట్టులోని మహిళా సభ్యులందరూ కలిసి వారిని చితక్కొడతారు. ఈ పోకిరీలు మరికొంత మంది పోకిరీలను తీసుకువస్తే జట్టు సభ్యులందరూ కలిసి వారిని పరుగులు పెట్టిస్తారు. ఇదే స్ఫూర్తితో భారత మహిళల హాకీ జట్టు ప్రపంచకప్‌ను సాధిస్తుంది. ప్రస్తుతం చక్మా విషయంలో కూడా దేశ ప్రజలందరమైన మనము ఇదే ఐక్యమత్యాన్ని ప్రదర్శించామా? ఒకసారి ఆలోచన చేయాలి.

అమెరికా పోలీసులు నల్లజాతీయుడైన జార్జ్‍ ఫ్రాయిడ్‌ను తుపాకీతో కాల్చి చంపినందుకు, ‘బ్లాక్‌ లైవ్స్​‍ మ్యాటర్స్​‍’ పేరుతో ఎంత పెద్ద ప్రజా ఆందోళన వచ్చిందో మనందరం చూసాం. ఈ ఆందోళనకు తలొగ్గి చివరికి పోలీసులు క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. ఈ నూతన సంవత్సరంలోనైనా గత కొన్నేళ్లుగా ‘భారతీయత’ అనే పదం అర్థం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వచ్చిందో నేడు మనందరం పునరాలోచించుకోవాలి. ప్రస్తుతం ‘భిన్నత్వంలో ఏకత్వం’ అనేది పాఠ్యపుస్తకాలలో, బడుల గోడల మీదనే సరిపోదు. అది రోడ్లమీద నినాదాలుగా మారాలి. నాయకుల ప్రసంగాలలో ప్రతిధ్వనించాలి. అప్పుడే నిజమైన భారతీయత వర్ధిల్లుతుంది. ‘హిందూ దేశ్‌ కే నివాసి సబ్‌ జనే ఏక్‌ హై’ అనే పాటకు నిజమైన సార్ధకత లభిస్తుంది.

సలీమ్‌ పాషా
(న్యాయవాది, రాజకీయ విశ్లేషకులు)

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News