Thursday, September 19, 2024
Homeఓపన్ పేజ్Psychological tsunamis with Ego: అంతరంగ సంద్రంలో అల్లకల్లోల సుడిగుండాలు

Psychological tsunamis with Ego: అంతరంగ సంద్రంలో అల్లకల్లోల సుడిగుండాలు

అవాస్తవం ప్రబలితే ..

ఎక్కడ చూసినా జన సందోహం. ఎక్కడ చూసినా బ్రతుకుదెరువు కోసం ఉరుకులు, పరుగులు. లేనివారు పొట్ట కోసం ఆరాట పడుతుంటే, ఉన్నవారు తరతరాలకు తరగని సంపద కోసం తపన పడుతున్నారు. ధనార్జన కోసం మానవత్వాన్ని సైతం మంట గలిపే వికృత క్రీడ విశృంఖల విహారం చేస్తున్నది. ఎవరేమనుకున్నా మాకేంటి అనే తరహాలో ” నవ్వి పోదురు గాక నాకేంటి సిగ్గు…”అనే తరహాలో జన జీవితంలో చోటు చేసుకుంటున్న విపరీత విపత్కర ధోరణులు అత్యంత ఆందోళన కలిగిస్తున్నాయి. మానవ స్వార్ధ చింతన యావత్ మానవాళినే కాకుండా, సకల జీవరాశులకు చేటు తెస్తున్నది. మానవ వ్యాపార దృక్పథం విలువలకు తిలోదకాలిస్తున్నది. సకల వ్యసనాలతో యువత చెడుదారి పట్టింది. అనారోగ్యవంతమైన సమాజం భవిష్యతరాల భద్రతను ప్రశ్నార్ధకం చేస్తున్నది. ధరణిపై దాడి పెరుగుతుంటే, ప్రకృతిపై పైశాచికం ప్రబలుతుంటే, జనమంతా అల్లకల్లోలమై, అంటువ్యాధులకు భీతిల్లుతుంటే, మార్పు లేని మనసు లేని మానవ వ్యవస్థలో మనసున్న మనుషులంతా దారం తెగిన పతంగంలా దిక్కులేక ఎగిరిపోతే దిక్కులన్నీ బిక్కుబిక్కుమని విలపిస్తున్నాయి. కడుపు కాలే వాడొకడైతే, ఆకలైనా తినలేని పరిస్థితి కొందరిది. అరగని దైన్య స్థితి ఇంకొకడిది. ఇదే నేటి పేద, ధనిక జీవనముఖ చిత్రంలో అగుపిస్తున్న వైరుధ్యం. మనసు చచ్చిన భావ దారిద్యంలో మతులు చెడి గతులు తప్పిన నైరాశ్యం లో జీవిస్తున్న మానవాళి ముక్తి లేదు…భుక్తి లేదు. విముక్తి లేదు. చెట్టు కొమ్మపై కూర్చుని గూడు లేక విలపించే పక్షులేమో వేటగాళ్ళ కాటుకు కనుమరుగౌతుంటే, వేటాడే పులులన్నీ కీకారణ్యాన్ని వీడి జనారణ్యంలో పరుగెడితే, హత్యలతో, అత్యాచారాలతో తమ జాతిని తామే నంజుకు తినే మానవ దానవత్వాన్ని చూసి, మనసు లేని క్రూర మృగాలన్నీ చలించి పోక తప్పదు. మనసున్న మనిషి చచ్చి, మృగంగా మారిన సమయంలో మార్పు రావాలని కోరుకోవడం అత్యాశే కాగలదు.
మృగత్వంతో కూడిన నరత్వంలో మానవత్వం పునరావృతం కావాలని ఆశించే మనసున్న మనుషుల మంచితనాన్ని ఆహ్వానించాలి. కలకాలం బ్రతకాలనే అత్యాశ మానవ జీవనాన్ని అతలాకుతలం చేస్తున్నది. కదిలే కాలానికి కాకి లెక్కలెందుకు? కాల ప్రవాహంలో కలిసి పోయే జీవులకు కలకాలం బ్రతకాలనే కోరికెందుకు? కాలం పరిగెడుతూనే ఉంటుంది. మరణం భయపెడుతూనే ఉంటుంది. కరిగే కాలానికి కళ్లెం వేయగలమా? తరిగే ఆయువుకు అడ్డుకట్ట వేయగలమా? యుగాలెన్నో కాల గర్భంలో కలిసిపోయాయి. కాలమనే నావలో కన్నీళ్లనే సంద్రంలో కష్టాల సుడిగుండాల్లో బ్రతుకు భారాన్ని మోస్తున్న జనం మోముల్లో ఇకనైనా ఆనందం చిగురించేనా? ఆవేదనల బాటను వీడి, అష్టకష్టాల తుఫానులను దాటి, సుఖమనే తీరాన్ని దాటించే దిక్చూచి ఏది? కాలం పరుగెడుతూనే ఉంటుంది. కాల ప్రవాహంలో మానవ జీవితాలు కూడా కొట్టుకు పోవడం సహజం. ఈ వాస్తవాన్ని గ్రహించాలి. ఉన్నా, పోయినా మన చరిత్ర పదికాలాలు పదిలంగా ఉంచుకోవాలి. చావు పుట్టుకలు దేహానికే కాని ఆత్మకు లేవు. ఆత్మ జ్ఞానం అహంకారానికి అతీతమైనది. మన తప్పొప్పులను మన ముందుంచి నిలదీసే శక్తి కేవలం మన మనసుకే ఉంటుంది. మనస్సాక్షిని మోసం చేసే ధైర్యం ఎవరికీ లేదు. మనం చేసే పొరపాట్లన్నీ మన అంతరాత్మ కు విరుద్థమైనవే. అయినా కొన్నిసార్లు ఇలాంటి పొరపాట్లు చేయడం తప్పకపోవచ్చు. మన తప్పిదాలు కేవలం మనకే నష్టం కలిగిస్తే చింతించనక్కర లేదు. సమాజానికి నష్టం కలగరాదు. కొన్నిసార్లు మనలోని అహం మన అంతరాత్మకు విరుద్ధంగా మనల్ని తప్పుదారి పట్టించడం వలన జరిగే పరిణామాలకు మనమే బాధ్యులం. యుక్తాయుక్త విచక్షణ మాత్రమే దీనికి విరుగుడు.మనం ఏదయినా ఒక మంచి పని చేసేటప్పుడు మన మనసుకు ఎంతో తృప్తి కలుగుతుంది. అలాంటి తృప్తి మరికొన్ని పనులకు ప్రేరణనిస్తుంది. అహం వలన ఆత్మతృప్తి కలుగదు. ఆత్మతృప్తి వలన మనశ్శాంతి కలుగుతుంది. సమాజ పరంగా, వ్యక్తిత్వ పరంగా ఉభయతారకంగా పనిచేసే విధంగా ఉండే ఒక అరుదైన మానసిక ఉల్లాసం “సేవా భావం”వలన కలుగుతుంది. సమాజ సేవలో తరించడమంటే అనంతమైన మానసిక ఉల్లాసాన్ని పొందడమే. ఇది భౌతికమైనది కాదు. మానసిక పరమైనది. “సేవ” అనే భావాన్ని కేవలం భౌతికంగా అన్వయిస్తే అది అహానికి దారితీస్తుంది. మనం ఏ చిన్న మంచి పని చేసినా, దానిని భౌతికంగా అన్వయించుకోకూడదు. మనం చేసే ఒక మంచి పనిలోనే దైవాన్ని గాంచాలి. ఎప్పటికప్పుడు ఆత్మవిమర్శతో ముందుకు సాగాలి. మన పాదాలు నేల మీదే ఉండాలి. మనం ఒదిగే ఉండాలి. అహం దరిచేరితే గర్వం ప్రవేశిస్తుంది. గర్వాన్ని దరిచేరనీయకుండా మనమంతా ఈ అనంత విశ్వంలో కేవలం అల్పులం, అజ్ఞానులం అని భావించుకుంటూ వెలుతురు వైపు సాగితేనే యథార్ధదర్శనం కలుగుతుంది. అలా కాకుండా గర్వాన్ని పెంచుకుంటూ పోతే మానవ ధర్మానికే అర్ధం మారిపోతుంది. ఏ చిన్న సత్కార్యం చేసినా అది మనం జన్మించినందుకు మనం ఈ జగతికి చేసే ఒక నీటి బిందువంత ప్రత్యుపకారం మాత్రమే అని జ్ఞప్తియందుంచుకోవాలి.
చావుపుట్టుకలకు అతీతమైనది జ్ఞానం. అహం అనేది అజ్ఞానం నుండి జనించేది. అహం వీడితే వాస్తవం కనుల ముందు సాక్షాత్కరిస్తుంది.అహం అనే భావన త్యజిస్తే మిగిలేది కేవలం తానే…ఏమీ లేని “నేనే’. మనం పుట్టేటప్పుడు మనతో ఏమీ లేవు…పోయేటప్పుడు ఏవీ మనతో రావు. ఇది యథార్ధం. ఇదే నిత్యం..ఇదే సత్యం. యథార్ధం కంటకప్రాయంగా మారిన నేపథ్యంలో యథార్ధవాదులు లోక విరోధులుగా మిగులుతున్నారు. మౌనాన్ని ఆశ్రయిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మౌనధారణ కూడా మంచిని చంపేసే ఆయుధంగా మారడం దురదృష్టకరం. అయినప్పటికీ లోకంలో చోటు చేసుకుంటున్న అవాంఛనీయ పరిణామాలకు మనం ఉత్ప్రేరకంగా మారకూడదు. సర్వ కాల సర్వావస్థలయందు విజ్ఞతనెరిగి ప్రవర్తించడమే మేలు. మంచిని ప్రోత్సహించడం, మంచిని పెంచడం కూడా నిజమైన మానవ సేవగానే పరిగణించాలి. సద్భుద్ధితో సత్సాంగత్యం లో జీవితం గడపాలి. బ్రతికితే కోయిలలా జీవించాలి. సజ్జన సాంగత్యంలో జీవించాలి, గతించాలి. “అబద్ధం” ప్రపంచాన్ని చూట్టేస్తే “నిజం” గడప కూడా దాటలేని పరిస్థితుల్లో ప్రపంచ గమనం సాగుతున్నది. ఒంటరిగానైనా, అనాథగానైనా కోయిలలా జీవించి గతించాలి. అంతరాత్మ ప్రబోధంతో నిస్వార్ధ జీవనం సాగించాలి. గర్వం అంతరాత్మ గొంతును నొక్కేస్తే నిజం మూగవేణువులా రోదిస్తుంది. ఆత్మాభిమానాన్ని కాపాడుకుంటూ, మనం మన ధర్మాన్ని స్వేచ్ఛగా నిర్వహించాలి. ప్రతీ పనిలో ఇదే భావం కనబరచాలి. మనం చేసే ప్రతీ మంచి పని అత్మతృప్తి కోసమే కానీ ఆత్మస్తుతి కోసం కాదు. ఈ విశాల భావం మన మనసులో ఉన్నంత వరకు గౌరవం, గుర్తింపు కూడా వాటంతటవే ప్రాప్తిస్తాయి. మనం చేసే సత్కార్యంలో స్వార్ధం దరిచేరనీయకూడదు. అహాన్ని ఆదిలోనే త్రుంచివేయాలి. విశ్వమంతా ఈ భావాన్ని అనుసరించాలి. నేను ‘నేను’ గా ఉన్నప్పుడే నిజమైన జ్ఞానం అలవడుతుంది. నేను అంటే ఏదో మరేదో..అనే భౌతికపరమైన భావనకు తీసుకపోయి, కాల్పనికమైన సౌధాల్లో విహరించడం- నేలను విడిచి సాము చేయడమే. వాస్తవంలో జీవించి” నేను నేనే” నాతో ఏమీ లేదు. ఏమీ రావు, చిత్తశుద్ధితో కూడిన సత్కార్య ఫలం తప్ప అనే భావన ఉత్తమమైనది. ” నేను” అనే భావనకు గర్వం, అసూయ, అహంకారం వంటి కృత్రిమమైన ఆభరణాలు సన్మార్గం నుండి తప్పించి పతనం వైపు పయనింపచేస్తాయి. అహం పనికి రాదు. మనం అజ్ఞానులం అనుకుని జ్ఞానం వైపు పయనించాలి. మనం కేవలం మానవ మాత్రులం. అహం వీడి జీవించడం అసాధ్యం. కొంతలో కొంతైనా దాని తీవ్రతను తగ్గించుకోవడమే మనముందున్న ఉత్తమ పరిష్కారం. నిజాన్ని కొంతవరకైనా బ్రతికించగలగాలి. అవాస్తవం ప్రబలితే అన్యాయమైపోయేది సమాజమే. మన పరిజ్ఞానం అసంపూర్ణం. అహం మనల్ని మరింత అధః పాతాళంలోకి తొక్కేస్తుంది. సర్వత్రా అహం నిండిన లోకంలో ఇది కష్టసాధ్యం. ఒక చెంప మీద కొడితే, రెండో చెంప చూపించే రోజులు పోయాయి. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు. సహృదయముంటేనే ముచ్చట్లు. అహం వలన జనించిన దుర్గతిని రూపుమాపడం మన తరమా? కాలమే సమాధానం చెప్పాలి. స్వార్ధ చింతనలేని సద్బుద్ధి స్థిరపడిననాడు మనల్ని మనం అవగతం చేసుకునే అవకాశం కలుగుతుంది. అదే నిజమైన ఆత్మ సాక్షాత్కారం. బ్రతుకు దెరువు కోసం అంతరాత్మను చంపుకోవడం, భౌతికంగా జీవించి ఉన్నా, మానసికంగా మరణించినట్టే. ఆత్మసాక్షికి విరుద్ధంగా ప్రవర్తించడం మానసిక దౌర్భల్యం.
– సుంకవల్లి సత్తిరాజు.
(సామాజిక విశ్లేషకులు,మోటివేషనల్ స్పీకర్)
మొబైల్: 9704903463.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News