Thursday, September 19, 2024
Homeఓపన్ పేజ్BSF jurisdiction extended: వివాదం సృష్టించిన బి.ఎస్.ఎఫ్ పరిధి

BSF jurisdiction extended: వివాదం సృష్టించిన బి.ఎస్.ఎఫ్ పరిధి

అంటే రాష్ట్రాల అధికారాల్లో కేంద్రం జోక్యం విపరీతంగా పెరిగి..

సరిహద్దు భద్రతా దళాల ప్రాదేశిక అధికార పరిధిని విస్తరిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పంజాబ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు తీవ్రంగా విరుచుకుపడుతున్నాయి. సరిహద్దు భద్రతా దళా (బి.ఎస్.ఎఫ్)ల పరిధిని విస్తరించే ముందు రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించి ఉండాల్సిందని పంజాబ్ ప్రభుత్వం వ్యాఖ్యానించింది. బి.ఎస్.ఎఫ్ పరిధిని విస్తరించడమంటే రాష్ట్రాల అధికారాల్లో కేంద్రం జోక్యం చేసుకోవడమే అవుతుందని రాష్ట్ర ప్రభుత్వం విమర్శించింది. బి.ఎస్. ఎఫ్ ప్రాదేశిక అధికార పరిధిని 15 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్ల దూరానికి విస్తరిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పంజాబ్ ప్రభుత్వం రాజ్యాంగంలోని ఆర్టికల్ 131 కింద సుప్రీం కోర్టులో సవాలు చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఈ విధమైన నిర్ణయం తీసుకోవడం రాష్ట్రాల సమాఖ్య మూల సూత్రాలకు విరుద్ధమని, శాంతిభద్రతల నిర్వహణలో పంజాబ్ పోలీసులకు ఉన్న అధికారాలను లాక్కోవడమే అవుతుందని రాష్ట్ర ప్రభుత్వం ఆరోపించింది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కూడా ఇదే విధమైన అభిప్రాయాలను వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వ చర్యను వ్యతిరేకిస్తూ ఈ రెండు రాష్ట్రాలు తమ శాసనసభల్లో తీర్మానాలు ఆమోదించడం కూడా జరిగింది.

- Advertisement -

సరిహద్దు భద్రతా దళాల అధికార పరిధిని విస్తరించడాన్ని సవాలు చేస్తూ ఈ ప్రభుత్వాలు దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. సరిహద్దు భద్రతా దళాల చట్టం కింద ఈ దళాల అధికార పరిధిని విస్తరిస్తూ 2021 అక్టోబర్ నెలలో కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. పంజాబ్, అసోం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో బి.ఎస్.ఎఫ్ ప్రాదేశిక అధికారిక పరిధిని 15 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్లకు విస్తరిస్తూ నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం గుజ రాత్ లో మాత్రం ఈ పరిధిని 80 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్లకు తగ్గించింది. రాజస్థాన్ విషయంలో ఎటువంటి మార్పూ చేయకుండా దీన్ని 50 కిలోమీటర్లకే పరిమితం చేసింది. సరిహద్దుల దగ్గర గస్తీ విధులను మరింత పటిష్టంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకే సరిహద్దుల సమీపంలోని రాష్ట్రాల్లో భద్రతా దళాల అధికార పరిధిని విస్తరించడం జరిగిందని కేంద్రం గత 2021 డిసెంబర్ నెలలో రాజ్యసభలో వెల్లడించింది.

భద్రతా దళాల అధికార పరిధిని విస్తరించడానికి కేంద్ర ప్రభుత్వానికి దాని కారణాలు దానికి ఉండవచ్చు. అయితే, రాష్ట్ర ప్రభుత్వాల అధికార పరిధిలోకి ఈ విధంగా చొచ్చుకుపోవడం సమంజసంగా కనిపించడం లేదు. రాజ్యాంగం ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా భద్రతా చర్యలు చేపట్టే అధికారం ఉంది. రాష్ట్ర పోలీసులకు కూడా కొన్ని అధికారాలున్నాయి. వీటిలోకి చొచ్చుకుపోవడం సహజంగానే రాష్ట్రాలకు ఆగ్రహం కలిగిస్తోంది. సరిహద్దుల్ని అక్రమంగా దాటడం, సరిహద్దులకు అవతలి వైపు నేరాలు జరగడం వంటివి మాత్రమే భద్రతా దళాల అధికార పరిధిలోకి వస్తాయి. నేరస్థులను విచారించడానికి, శిక్షించడానికి భద్రతా
దళాలకు అధికారం లేదు. అక్రమ చొరబాట్లు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా వంటివి జరిగినప్పుడు కూడా వారిని రాష్ట్ర పోలీసులకు అప్పగించాల్సి ఉంటుంది. సాధారణంగా భద్రతా దళ సిబ్బంది స్థానిక పోలీసులతో కలిసి పనిచేయడం జరుగుతుంటుంది. వీరి అధికారాలు, అధికార పరిధుల మధ్య ఎటువంటి సమస్యలూ చోటుచేసుకోవు. నేరస్థులు మరింత లోపలికి వచ్చినప్పుడు భద్రతా దళ సిబ్బంది నేరస్థుల కోసం తాము కూడా రావాల్సి ఉంటుందని, అందువల్లే వారి అధికార పరిధి విస్తరించడం జరుగుతోందనే వాదన ఇక్కడ చెల్లదనే చెప్పాలి. భద్రతా దళాల అధికార పరిధిని విస్తరించడానికి సరైన కారణాలను వివరించాల్సి ఉంటుంది. ఈ లోతైన కారణాలను సుప్రీం కోర్టు పరిశీలించి తీర్పు చెప్పాల్సి ఉంటుంది. సరిహద్దు రాష్ట్రాల్లో సరిహద్దు భద్రతా దళాల అధికారాలు, అధికార పరిధుల గురించి సుప్రీం కోర్టు నిర్ణయించడం జరుగుతుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News