భారత ఎన్నికల సంఘం కాలానుగుణంగా దేశవ్యాప్త ఓటర్ల జాబితాను సవరిస్తూ ఉంటుంది. ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ ఉద్దేశం ఓటర్ల జాబితాలను సమగ్రంగా పరీక్షించి, అప్‌డేట్ చేసి, తద్వారా అర్హులైన భారత పౌరులను జాబితాలో చేర్చడం. మరణించిన వారిని, నివాసం మారిపోయిన వారిని, డూప్లికేట్ లేదా బహుళ ఓటరు కార్డులున్నవారిని, ఇతరత్రా అనర్హులైన వారినీ గుర్తించి వారి పేర్లను జాబితా నుంచి తొలగించడం కూడా ఈ ప్రక్రి యలో భాగమే. కాంగ్రెస్ పాలనాకాలంలో 11సార్లు, బీజేపీ పాలనాకాలంలో 2సార్లు జరిగింది. చిట్టచివరి సవరణ జరిగి ఇప్పటికి 22ఏళ్ళు గడిచిపోయింది.
ప్రస్తుత ఎస్ఐఆర్‌పై ప్రతిపక్షాల ఆరోపణలు:
నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్‌డీయే హయాంలో ఇప్పుడు జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రక్షాళన కార్యక్రమం మీద ప్రతి పక్షాలు పలు ఆరోపణలు చేస్తున్నాయి. వాటిలో ప్రధానంగా ఐదు అంశాలు ఉన్నాయి.
1. అర్హులైన ఓటర్లను తొలగించే ప్రమాదం:
ఇప్పుడు జరుగుతున్న ఎస్ఐఆర్‌లో ఓటర్ల తీసివేతల సంఖ్యను చూస్తుంటే నిజమైన ఓటర్లు, ముఖ్యంగా నిరుపేదలు, వలసదారులు లేదా మరే ఇతర విధంగానైనా బలహీనులైన పౌరుల ఓట్లను జాబితా నుంచి తొలగించే ప్రమాదం ఉంది. వారు అవసరమైన డాక్యుమెంట్లను దాఖలు చేయలేరు, ప్రక్రియను పూర్తిచేయలేరన్న కారణంతో వారి ఓట్లను తొలగించవచ్చు.
2. కొన్ని వర్గాల వారిపై అసమానత్వం చూపే ప్రమాదం:
ఓట్ల తొలగింపు ప్రక్రియ ముస్లిములు సహా మైనారిటీలు, ఇతర సామాజికంగా బలహీనమైన వర్గాలపై అసమానమైన ప్రభా వం చూపుతుందని కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలూ ఆరోపిస్తున్నాయి. దీనికి వారు ఎలాంటి సాక్ష్యాన్ని లేదా ఆధారాన్నీ చూపలేదు.
3. నిరూపణ బాధ్యత ఓటర్ల మీద ఎందుకు:
ప్రతిపక్షాలు ప్రధానంగా వాదిస్తున్నది ఏమనంటే… ఇప్పటికే ఓటర్ల జాబితాలో ఉన్న వ్యక్తి తన పేరును కొనసాగించుకోడానికి ఎందుకు పెద్దస్థాయిలో పత్రాల సమర్పణ లేదా ధ్రువీకరణ భారాన్ని నెత్తికి ఎత్తుకోవాలి? అయితే 2026 మే నెలలో సుప్రీంకోర్టు బిహా ర్‌లో చేపట్టిన ఎస్ఐఆర్ విధానాన్ని సమర్ధించింది. ఎస్ఐఆర్ ప్రక్రియ చేపట్టేందుకు ఎన్నికల కమిషన్‌కు చట్టబద్ధమైన అధికారం ఉందనీ, నోటీసులూ లేదా విచారణ వంటి రక్షణ చర్యలతో కూడిన విధానం రాజ్యాంగబద్ధంగా అనుమతించబడినదేననీ స్పష్టం చేసింది.
4. ఈసీఐ పారదర్శకత, స్వతంత్రతలపై సందేహాలు:
ఇప్పుడు జరుగుతున్న ఆందోళనలకు ప్రధాన కారణం ఇదే. సవరణ ప్రక్రియ కోసం ఈసీఐ అమలు చేస్తున్న విధివిధానాలతో ప్రతిపక్షాలు విభేదిస్తున్నాయి. ప్రక్షాళన ప్రక్రియ చాలా ఎక్కువగా కేంద్రీకృతమై ఉందనీ, తగినంత పారదర్శకంగా లేదనీ ఆరోపణలు చేస్తున్నాయి. ఆ కారణంగా సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాల్సిందేనని పట్టుపడుతు న్నాయి. ఆ ఆరోపణలను ఎన్నికల సంఘం త్రోసిపుచ్చింది. సంస్థాగత చర్చల్లో భాగంగా తలెత్తే విభేదాలు, అంతిమంగా తీసుకున్న నిర్ణయాలను ‘చెల్లుబాటు కానివి’గా చేయవని వివరించింది.
5. ఎస్ఐఆర్‌ను రాజకీయ ఉపకరణంగా వాడుకోవచ్చు:
రాహుల్ గాంధీ, ఇతర ప్రతిపక్ష నేతలూ ఎస్ఐఆర్ ప్రక్రియను ‘ఓట్ చోరీ’గా వర్ణిస్తున్నారు. అధికార బీజేపీకి అనుకూలించే విధంగా ఓటర్ల జాబితాల్లో మార్పులు జరుగుతున్నాయని ఆరోపి స్తున్నారు. ఆ ఆరోపణలు సరి కాదని స్పష్టం చేస్తూ ఈసీఐ పలు మార్లు తిరస్కరించింది. మృతుల ఓట్లు, డూప్లికేట్ ఓట్లు, నివాసం మారిపోయినవారి ఓట్లు, ఇతరత్రా కారణాల వల్ల అనర్హులైన వారి ఓట్లను మాత్రమే తొలగిస్తున్నామని వివరించింది. ఓటర్ల జాబితాను కచ్చితంగా ఉంచడమే తమ లక్ష్యమని స్పష్టం చేసింది.
రాజకీయ ఆరోపణలు – వాస్తవాలు:
ఎస్ఐఆర్‌లో భాగంగా 13.39 కోట్లమంది ఓటర్ల పేర్లను తొలగించివేసారన్న భారీ ఆరోపణలు వచ్చాయి. అంత పెద్ద సంఖ్య గణనీయంగా రాజకీయ, మీడియా దృష్టిని ఆకర్షించింది. కానీ ఆ అంకె ఆధారంగా ఒక నిర్ధారణకు వచ్చేయడానికి ముందు, అసలు ఆ అంకెను అర్ధం చేసుకోవాలి.
ఎస్ఐఆర్‌లో ఏకంగా 13.39 కోట్ల ఓటర్ల ఓట్లను తొలగించేసారు అని ఆరోపణలు చేస్తున్నారు. కానీ ఈసీఐ సమాచారం ప్రకారం ఆ అంకె ఓటర్ల జాబితాలో నుంచి తొలగించడానికి అవసరమైన ధ్రువీకరణ చేయదగిన కేటగిరీలు అన్నింటినీ కలుపుకుంటే వచ్చిన సంఖ్య. వాటిని స్థూలంగా పరిశీ లిస్తే 3.01కోట్ల మంది గైర్హాజరయ్యారు లేదా ఆచూకీ తెలియడం లేదు. 6.30కోట్ల మంది శాశ్వతంగా నివాసం మారిపోయినవారు. 2.80కోట్ల మంది మరణించారు. 1.02కోట్లమంది డూప్లికేట్ ఓట్లు ఉన్నవారు. ఇతరులు 26లక్షల మంది ఉన్నారు. దాన్నిబట్టే, 13.39 కోట్లమంది అర్హులైన ఓటర్లను శాశ్వతంగా లేదా తప్పుడు పద్ధతుల్లో తొలగించలేదు అని నిర్ధారణ అయింది.
మేఘాలయ రాష్ట్రంలో ఎస్ఐఆర్‌లో 2,22,786మంది ఓటర్లను పాత ఎస్ఐఆర్ డేటాబేస్తో జతపరచడం అవలేదు. దాంతో వారిని ‘నో మ్యాపింగ్’ కేటగిరీలో ఉంచారు. వారి గురించి చెబుతూ, ‘‘నో మ్యాపింగ్ కేటగిరీలో ఉన్న వారి పేర్లను ఓటర్ల జాబితా నుంచి ఆటోమేటిక్‌గా తొలగించలేదు’’ అని మేఘాలయ ప్రధాన ఎన్నికల అధికారి స్పష్టంగా వివరించారు.
నిజమైన ఓటరు పేరు పొరపాటున తీసేస్తే ఏం చేయాలి?
ఓటర్ల జాబితా సవరణకు నిర్దిష్ట విధానం ఉంది. ధ్రువీకరణ, దాన్నుంచి ముసాయిదా జాబితా, దాన్నుంచి ఫిర్యాదులూ అభ్యంత రాల స్వీకరణ, దాన్నుంచి నోటీసులూ విచారణా, ఆపై ఈఆర్‌ఓ నిర్ణయం, దానిపై అప్పీలు, ఆ మీదట పునరుద్ధరణ, లేదా నిరంతర అప్‌డేటింగ్ ప్రక్రియ… పద్ధతి ఇలా కొనసాగుతుంది.
ఓటర్ల రికార్డులను ధ్రువీకరించుకోవాలి అని భావించినప్పుడు వారికి నోటీసులు ఇచ్చి తగిన పత్రాలు ఇచ్చేందుకు అవకాశం కల్పించాలని ఈసీఐ నిర్దిష్టంగా స్పష్టం చేసింది. ఓటర్లు మ్యాపింగ్ అవని సందర్భాల్లో లేదా జాబితాలో తర్కవిరుద్ధమైన అసమానతలు ఉన్నప్పుడో, బీఎల్‌ఓలు సదరు ఓటరు ఇంటికి వెళ్ళవచ్చు, ఈఆర్‌ఓ పరిశీలన కోసం పత్రాలను సేకరించవచ్చు.
రాజకీయ పక్షాలకూ పాత్ర:
ఓటర్ల జాబితా ముసాయిదా ప్రతి ముద్రణ కంటె ముందు గానే ఏఎస్డీడీ (ఆబ్సెంట్/షిఫ్టెడ్/డెడ్/డూప్లికేట్) కేటగిరీలుగా విభజించిన బూత్ స్థాయి ఓటర్ల జాబితాలను రాజకీయ పార్టీలు నియమించిన బూత్ లెవెల్ ఏజెంట్లకు అందించాలని ఈసీఐ ఆదేశించింది. దానివల్ల పార్టీల ప్రతినిధులైన బీఎల్‌ఏలు ఓటర్లు అందరి వివరాలనూ పరిశీలించగలరు, తప్పులుంటే గుర్తించగలరు. అప్పుడు ముసాయిదా ప్రతిని ప్రచురణకు ముందే దిద్దుకోవడం సాధ్యమవుతుంది. అందువల్ల 13.39కోట్ల మంది ఓట్లనూ తప్పుడు పద్ధతుల్లో తీసివేసారు అనడం సరికాదు.
ఎస్ఐఆర్ ధ్రువీకరణ ప్రక్రియలో భాగమైన వివిధ కేటగిరీలతో గుర్తించబడిన ఓటర్ల సంఖ్య అది. ఆ కేటగిరైజేషన్ తర్వాత కూడా ఓటర్ల జాబితాను మళ్ళీ తనిఖీ చేసి, సవరించుకునే పద్ధతి అమల్లో ఉంది.
ముఖ్యమైన తేడా:
ఓటర్ల జాబితా నుంచి 13.39కోట్ల మందిని తొలగించేసారన్నది ప్రతిపక్షాల ప్రధాన ఆరోపణ. ధ్రువీకరణ, ఫిర్యాదులు, అభ్యంతరాలు, అప్పీళ్ళు, పునరుద్ధరణ తర్వాత వీటిలో ఎన్ని కేసులను వాస్త వంగా తొలగిస్తారు అన్నదే నిజానికి అసలైన ప్రశ్న.
ఆ తర్వాత వచ్చే గణాంకమే అసలైన ఓటర్ల సంఖ్య. అందుకే, ఎస్ఐఆర్ ప్రభావం గురించి తీర్పులు చెప్పడానికి సరైన ప్రాతిపదిక ప్రాథమి కంగా కేటగిరీల్లో లెక్కించిన గణాంకాలు కాదు, తుది ఓటర్ల జాబితా మాత్రమే. ఓటర్ల తుది సంఖ్య అనేది, మూడవ దశలోని మిగతా రాష్ట్రాల్లో ఎస్ఐ ఆర్ ప్రక్రియ తర్వాత తుది జాబితా ముద్రించిన తర్వాతే తెలుస్తుంది.
ఇక్కడ రెండు వేర్వేరు ప్రశ్నలకు జవాబు చెప్పుకోవడం కూడా ముఖ్యమే. ఓటర్ల జాబితాలను ఎప్పటికప్పుడు ప్రక్షాళన చేసుకో వాలా? సవరణకు ఉపయోగించే పద్ధతి నిష్పక్షపాతంగా, కచ్చి తంగా ఉందా? మొదటిది స్థిరపడిన పరిపాలనా అవసరం, రెండ వది పరిశీలనకు అర్హమైన అంశం. కాబట్టి, జాబితా సవరణకు అనుసరించిన పద్ధతి, ఓట్లు తొలగించడానికి ఉపయోగించిన ఆధారాలు, ప్రభావిత ఓటర్లు అందుబాటులో ఉన్న రక్షణలు, ఫిర్యాదులూ అభ్యంతరాలపై కార్యాచరణ విధానం, చివరిగా పునరుద్ధరణ జరిగిన అర్హులైన ఓటర్ల సంఖ్య అనే అంశాల మీద ప్రజాస్వామికమైన చర్చ దృష్టి సారించాలి. ఈ సందర్భంలో, ఇప్పుడు ఆరోపణలు చేస్తున్న కొందరు ప్రతిపక్ష సభ్యులు గతంలో చేసిన ప్రకటనలను గుర్తుచేసుకోవడమూ ముఖ్యమే.
ఓటర్ల జాబితా సవరణ అప్రజాస్వామికమైన విషయం కాదు. ఓటును కోల్పోయిన ప్రతీ నిజమైన ఓటరుకూ దాన్ని తిరిగి పొందడానికి, తమ పేరును ఓటర్ల జాబితాలో మళ్ళీ చేర్చుకోడానికీ తగినన్ని అవకాశాలు ఉన్నాయి. ఈ మాట పార్లమెంటు సాక్షిగా చెప్పినది గతంలో కేంద్ర న్యాయశాఖ మంత్రిగా పనిచేసిన కపిల్ సిబల్. సవరణకు తాము వ్యతిరేకం కాదని డీఎంకే నాయకులు చెప్పారు. ఓటర్ల జాబితా సవరణ చేపట్టడానికి ఎన్నికల కమిషన్‌కు రాజ్యాంగబద్ధమైన అధికారం ఉందని డీఎంకే ఎంపీ ఎన్‌ఆర్ ఎళంగో స్పష్టం చేసారు. ఓటర్ల జాబితా సవరణ ఎన్నికల కమిషన్ చేయవలసిన పని అని 2018లో సచిన్ పైలట్ వెల్లడించారు. రాజస్థాన్ కాంగ్రెస్ చాలాకాలం క్రితమే ఓటర్ జాబితా ప్రక్షాళన కోసం డిమాండ్ చేసింది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో డూప్లికేట్ ఓట్లు రిజిస్టర్ అయి ఉన్న సంగతిని 2018లో కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మను సింఘ్వీ ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్‌లో స్వగ్రామంలో ఒక ఓటు, హైదరా బాద్ నివాసంలో మరొక ఓటు ఉన్న వారు కోకొల్లలుగా ఉండడం నిజమే కదా. డూప్లికేట్ ఓట్ల తొలగింపు వల్ల కాంగ్రెస్కు లబ్ధి చేకూరిందని కేరళకు చెందిన శశిథరూర్ చెప్పారు. మృతుల, వలస పోయినవారి, గైర్హాజరీలో ఉన్న వారి ఓట్లు తొలగించడం సమ స్యేమీ కాదని ఆయన స్పష్టం చేసారు. కాబట్టి ఇప్పుడు సరైన చర్చ జరగాల్సింది కచ్చితమైన ఓటర్ల జాబి తాలు అవసరమా కాదా అనే విషయం గురించి కాదు. జాబితాల ప్రక్షాళన చేస్తున్న పద్ధతి, ఓటర్లకు కల్పిస్తున్న రక్షణలు, వ్యక్తిగత కేసుల్లో కచ్చితత్వం గురించి చర్చ జరగాలి.
తప్పులు లేని ఓటర్ల జాబితా, నిజమైన ఓటరుకు రక్షణ అనేవి ఒకదానితో ఒకటి పోటీ పడే లక్ష్యాలు కావు. ప్రజాస్వామిక బాధ్యత అనే నాణేనికి అవి రెండు ముఖాలు. జాబితా సవరణలో లోపాలు జరిగితే వాటిని గుర్తించాలి, సరిదిద్దుకోవాలి. దానిపై మరోమాటకు ఆస్కారమే లేదు.
ఫణీన్ద్ర పురాణపణ్డ
సీనియర్ జర్నలిస్ట్

