వచ్చే జనవరిలో అయోధ్యలో రామ మందిరాన్ని ప్రారంభించే సమయంలోనే, ఒడిశాలోని పూరీలో జగన్నాథ స్వామి ఆలయ ప్రాంతాన్ని పునర్నిర్మించి, విస్తరించి సాటి లేని మేటి ఆలయంగా మార్చడానికి ప్రయత్నాలు ప్రారంభం అయ్యాయి. ఈ కార్యక్రమంతో పూరీ జగన్నాథ స్వామి పరిసరాలు, స్వరూపం పూర్తిగా మారిపోబోతున్నాయి. జనవరి 17వ తేదీన ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఈ శ్రీమందిర్ పరిక్రమను జాతికి పునరంకితం చేయబోతున్నారు. దాదాపు రూ. 960 కోట్లు ఖర్చు కాగల ఈ జగన్నాథ్ హెరిటేజ్ కారిడార్ ప్రాజెక్టు కోసం ఒడిశా ప్రజలు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. ఈ ప్రాజెక్టుతో ఈ 12వ శతాబ్దపు దేవాలయ శోభ మరింత పెరగడమే కాకుండా, అనేక ఆధునిక సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లతో ఒక కొత్త రూపాన్ని సంతరించుకుంటోంది.
కాగా, 2019 ఎన్నికలకు ముందే బిజూ జనతాదళ్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ప్రకటించింది. 2024 ఎన్నికలకు ముందుగా ప్రారంభం కాబోతున్న ఈ దేవాలయ ప్రాంగణం దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తుల్ని ఆకట్టుకుంటోంది. ఎంతో వైభవంగా, అద్భుతంగా ఈ ఆలయాన్ని ప్రారంభించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం రోజున దేశవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంటున్నట్టే, ఒడిశాలో కూడా జగన్నాథ స్వామి సరికొత్త ఆలయ ప్రారంభోత్సవం రోజున దేశంలో ఒక పండుగ వాతావరణం నెలకొనే అవకాశం ఉంటుందని ఒడిశా అధికారులు చెబుతున్నారు. వేద మంత్రోచ్ఛారణలు, భజనలు, పూజాదికాలు, సత్సంగాలు, యోగ సాధనల మధ్య ఈ ఆలయాన్ని పునఃప్రారంభించాలని పట్నాయక్ ప్రభుత్వం సంకల్పించింది. దేశ విదేశాల నుంచి ప్రత్యేకంగా కొందరు ప్రముఖులను ముఖ్య అతిథులుగా పిలవడం కూడా జరుగుతోంది.
సార్వత్రిక ఎన్నికలకు కొద్ది నెలల ముందుగా నవీన్ పట్నాయక్ ఈ కార్యక్రమం తలపెట్టడం వెనుక రాజకీయ ఉద్దేశాలు లేకపోలేదు. ఆయన ఇందుకు సమయాన్ని, సందర్భాన్ని సరిగ్గా ఎంచుకున్నట్టు కనిపిస్తోంది. ఇక్కడ బీజేపీ హిందువుల ఓట్లను ఆకట్టుకునే అవకాశాలు క్రమంగా మెరుగుపడుతున్న నేపథ్యంలో ఆ ఓట్లను తాను చేజిక్కించుకోవడానికే నవీన్ పట్నాయక్ ఈ కార్యక్రమాన్ని తలపెట్టినట్టు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. సామాజికంగా, రాజకీయంగా బీజేపీ పొందే లబ్ధిని తాను చేజిక్కించుకోవడానికి ఆయన పూరీ ప్రాజెక్టుతో సహా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతోంది. ఇక పూరీకి సంబంధించినంత వరకూ ఇంత పెద్ద కార్యక్రమం నభూతో న భవిష్యతి అని చెప్పవచ్చు. గత ఏడాది కూడా పూరీ జగన్నాథ స్వామిని 21 లక్షల మంది సందర్శించడం జరిగింది. కాగా, జనవరి మొదటి రెండు వారాల్లో కనీసం కోటిన్నర పర్యాటకులు పూరీని సందర్శించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ కోట్లాది మంది పర్యాటకుల కోసం పూరీని కనీస సౌకర్యాల మెరుగుదలతో సన్నద్ధం చేస్తున్నారు.
ఒడిశాలోని కొన్ని ప్రధాన నగరాలను అంతర్జాతీయ స్థాయికి తీసుకు వెళ్లడం జరుగుతుందని, మౌలిక సదుపాయాలను పెద్ద ఎత్తున నిర్మించడంతో పాటు, అత్యంత ఆధునికంగా చేయడం కూడా జరుగుతుందని ఆయన సుమారు నాలుగు సంవత్సరాల క్రితం ఎన్నికల సందర్భంగా ఓటర్లకు వాగ్దానం చేయడం జరిగింది. అందులో భాగంగానే ‘బాగా వెనుకబడిన’ పూరీని కూడా ఒక ఉన్నత స్థాయి నగరంగా అభివృద్ధి చేయడం జరుగుతుందని అప్పట్లో ఆయన ఎన్నికల ప్రచారం వాగ్దానం చేశారు. ఆ వాగ్దానాన్ని ఆయన నిలబెట్టుకోవడం జరుగుతోంది. ఈ ప్రాజెక్టులో భాగంగానే ఆయన పూరీలోని రోడ్లను, హోటళ్లను, విద్యుత్, నీటి సౌకర్యాలను, మురుగునీటి పారుదల సౌకర్యాలను విశేషంగా అభివృద్ధి చేస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి నాటికి పూరీ నగర తీరుతెన్నులు, స్వరూప స్వభావాలు సమూలంగా మారిపోయే అవకాశం ఇప్పటికే స్పష్టంగా కనిపిస్తోంది
Puri Jagannath Corridor: ఎన్నికల వేళ పూరీకి కొత్త కళ
ఒరిస్సా ప్రధాన ఆలయాలకు సరికొత్త రూపురేఖలు