Friday, November 22, 2024
Homeఓపన్ పేజ్Quick inquirey need of the hour: సత్వర విచారణ అత్యవసరం

Quick inquirey need of the hour: సత్వర విచారణ అత్యవసరం

ఇ.డి వ్యవహరించిన తీరు బీజేపీకి బలం పెంచే అవకాశం ఉందా లేక దీనివల్ల తమిళనాడు మంత్రి పట్ల సానుభూతి పెరుగుతుందా ?


తమిళనాడులో గత వారం చోటు చేసుకున్న ఒక నాటకీయ సంఘటన రాష్ట్రంలోనే కాక, దేశవ్యాప్తంగా కూడా తీవ్ర సంచలనం రేకెత్తించింది. రాష్ట్ర మంత్రి వి. సెంథిల్‌ బాలాజీని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు దాదాపు 18 గంటలపాటు విచారించి, తెల్లవారు ఝామున అరెస్టు చేయడం పతాక శీర్షికలకు ఎక్కింది. దరిమిలా కొద్ది సేపు ఛాతీ నొప్పితో అవస్థపడిన ఈ 47 ఏళ్ల సెంథిల్‌ బాలాజీని ఆస్పత్రికి తరలించారు. ఆయనకు శస్త్రచికిత్స అవసరమని డాక్టర్లు తేల్చి చెప్పారు. ప్రస్తుతం ఆయన జ్యుడిషియల్‌ కస్టడీలో ఉన్నారు. సహజంగానే ప్రతిపక్ష నాయకులు ఈ కేంద్ర సంస్థ తీరుతెన్నుల మీద విమర్శల వర్షం కురిపించారు. ప్రతిపక్ష నాయకులను వేధించడానికి బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఈ సంస్థను దుర్వినియోగం చేస్తోందని కూడా పెద్ద ఎత్తున ఆరోపించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇ.డి) అధికారులు సచివాలయంలోని ఆయన చేంబర్‌లోకి ప్రవేశించి సోదాలు జరపడమే కాకుండా, ఆయనను తెల్లవారు ఝామున అరెస్టు చేయడంపై కూడా విమర్శలు రేగాయి. అంతేకాదు, ఆయనను అరెస్టు చేసే ముందు నిర్విరామంగా ఆయనను ప్రశ్నించడం కూడా విమర్శలకు గురైంది.
ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వంలో విద్యుత్తు, ఆబ్కారీ, నిషేధం శాఖల మంత్రిగా ఉన్న సెంథిల్‌ బాలాజీ 2011, 2015 సంవత్సరాల మధ్య అన్నా డి.ఎం.కె ప్రభుత్వంలో రవాణా శాఖ మంత్రిగా పనిచేస్తున్నప్పుడు, కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడ్డారని ఇ.డి ఆరోపించింది.ఆయన 2018లో డి.ఎం.కెలో చేరారు.2020 వరకు పార్టీ సంస్థాగత వ్యవహారాలను చూసిన బాలాజీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో తన సత్తా చూపించారు.2021 ఎన్నికల్లో కూడా ఆయన పార్టీని విజయాల దిశగా నడిపించారు. అన్నాడి.ఎం.కెకు కంచుకోటలుగా ఉన్న ప్రాంతాలలోనూ, బీజేపీ బలం పుంజుకుంటున్న ప్రాంతాలలోనూ ఆయన తమ పార్టీని ఎంతగానో పటిష్ఠం చేశారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు ఎంత వీలైతే అంత త్వరగా విచారణ పూర్తి చేయని పక్షంలో, ప్రతిపక్షాల విమర్శలకు బలం చేకూరే అవకాశం ఉంది. దక్షిణాది రాష్ట్రాలలో, ముఖ్యంగా తమిళనాడులో అధికార డి.ఎం.కె మొదటి నుంచి బీజేపీకి ప్రబల ప్రత్యర్థిగా కొనసాగుతోంది. అది ఈ మధ్య కాలంలో కాంగ్రెస్‌కు గట్టి మద్దతునిస్తూ ఉండడమే కాకుండా, కేంద్రంలో బీజేపీని అధికారం నుంచి దించే దాకా నిద్రపోయేది లేదని శపథం కూడా చేసింది.
తమ మంత్రివర్గ సభ్యుడికి సంబంధించిన ఆస్తుల మీదా, కార్యాలయం మీదా, ఇళ్ల మీదా ఇ.డి దాడులు చేయడం, సోదాలు చేయడం, చివరికి అరెస్టు చేయడాన్ని పాలక పక్ష అధినేత, ముఖ్యమంత్రి అయిన ఎం.కె. స్టాలిన్‌ జీర్ణించుకోలేకపోతున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్ని రకాలుగా వేధించినా, ఎంతగా భయాందోళనలకు గురి చేసినా తాము భయపడేది లేదని స్టాలిన్‌ కేంద్రం మీద విరుచుకుపడ్డారు. ఎటువంటి సాక్ష్యాధారాలు లేకపోయినప్పటికీ, కేంద్రం ఇ.డి ద్వారా ఆరోపణలు చేయించడం, విచారణలు జరపడం, అరెస్టులు చేయించడం జరుగుతోందని, కేవలం ప్రతిపక్ష నాయకులైనందువల్లే కేంద్రం ఇటువంటి అక్రమాలకు ఒడిగడుతోందని ఆయన విమర్శించారు. తమిళనాడులో బలం పుంజుకోవాలని చాలా కాలంగా విశ్వప్రయత్నం చేస్తున్న బీజేపీ ఇక్కడ అన్నా డి.ఎం.కెతో మైత్రి కొనసాగిస్తోంది. నిజానికి ఇక్కడ అన్నా డి.ఎం.కె పరిస్థితి కూడా అంత ఆశాజనకంగా ఏమీ లేదు.
కాగా, ఇందులో ఏమైనా రాజకీయ వ్యూహం ఉందా అన్నది ఇదమిత్థంగా తేలడం లేదు. తమిళనాడు మంత్రి విషయంలో ఇ.డి వ్యవహరించిన తీరు బీజేపీకి బలం పెంచే అవకాశం ఉందా లేక దీనివల్ల తమిళనాడు మంత్రి పట్ల సానుభూతి పెరుగుతుందా అన్నది కూడా అర్థం కావడం లేదు. వాస్తవ దృక్పథంతో ఆలోచిస్తే, తమిళనాడులో ఒక మంత్రిని వేధించడం వల్ల బీజేపీకి ఒరిగేదేమీ లేదనే విశ్లేషకులు భావిస్తున్నారు. సెంథిల్‌ బాలాజీ అవినీతి వ్యవహారాలు రాష్ట్రంలో అందరికీ తెలిసిన విషయాలేనని కూడా వారు అంటున్నారు. ప్రతిపక్ష నాయకులు అయోమయానికి గురి చేసి, వాటిని చెల్లాచెదరు చేయడానికి బీజేపీ నిజంగానే ప్రయత్నిస్తూ ఉంటే, ఇటువంటి చర్యల వల్ల ఆ ప్రయత్నాలు నీరుకారిపోయే అవకాశం ఉందని, ఈ వాస్తవం బీజేపీ నాయకులకు తెలియకపోలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద విచారణను వేగవంతం చేసి, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నిజాలను నిగ్గు తేల్చాల్సిన బాధ్యత కేంద్రం మీద ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News