Sunday, October 6, 2024
Homeఓపన్ పేజ్Quit India Day: 'డూ ఆర్‌ డై' అంటూ గర్జించిన భారతీయులు

Quit India Day: ‘డూ ఆర్‌ డై’ అంటూ గర్జించిన భారతీయులు

క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తిని కొనసాగిద్దాం

క్విట్‌ ఇండియా ఉద్యమం భారత స్వాతంత్య్రోద్యమంలో అతి ప్రధాన ఘట్టం. ఒక దేశ ప్రజలు తమ స్వాతంత్య్రం కోసం కష్టాలు నష్టాలకు ఓర్చి ఎంతవరకు పోరాడగలరో, ఎన్ని త్యాగాలు చేయగలరో క్విట్‌ ఇండియా ఉద్యమం ప్రపంచానికి చాటి చెప్పింది.
‘భారతదేశాన్ని విడిచిపెట్టి వెళ్లండి’ అంటూ బ్రిటీషర్లకు సూచిస్తూ, దేశవ్యాప్తంగా చేపట్టిన ఉద్యమమే క్విట్‌ ఇండియా. ‘మాకు స్వాతంత్య్ర ప్రకటించి మీరు మీ దేశానికి వెళ్లిపోండి’ అంటూ భారతీయులు 1942 ఆగస్ట్‌ 8 క్విట్‌ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించారు. స్వేచ్ఛా వాయువుల కోసం చావో రేవో తేల్చుకుందామంటూ మహాత్మాగాంధీ ఇచ్చిన పిలుపు సమర నినాదమైంది. ఈ నినాదమే యావత్‌ భారతీయులను ఏకతాటిపైకి తీసుకొచ్చి బ్రిటీష్‌ పాలకులకు వ్యతిరేకంగా కదం తొక్కించింది.
భారత ప్రజలలో స్వాతంత్య్రాపేక్ష, భయరాహిత్యం స్థిరంగా నెలకొల్పబడ్డాయి. అందుచేతనే ఆయన ఇచ్చిన నినాదం చావోరేవో తెల్సుకొనే దృఢ నిశ్చయానికి, బానిసత్వం నుంచి పిరికితనం నుండి సంపూర్తిగా విడుదల చేయడానికి భారత ప్రజలను కృతనిశ్చయుల్ని చేసింది. క్విట్‌ ఇండియా ఉద్యమం తర్వాత భారతీయుల్లో పెల్లుబికిన స్వాతంత్ర కాంక్షను గుర్తించిన బ్రిటీష్‌ పాలకులు భారతదేశానికి స్వాతంత్య్రం ఇవ్వక తప్పలేదు.
జాతిపిత మహాత్మా గాంధీ 1916 నుంచి నాయకత్వం వహించారు. సత్యం- అహింసా, సిద్దాంతాలుగా, సత్యాగ్రహం ఆయుధంగా ఆయన చెప్పిన విషయాలు యావత్‌ భారత ప్రజలకూ ఆనాటి నుంచి గాంధీ సిద్దాంతంగా మారింది. ఆయన వ్యక్తి సత్యాగ్రహం, నిరాహార దీక్ష మొదలగు అనేక ప్రక్రియలు చేబూని వ్యక్తిగతంగా ప్రయోగాలు చేశారు. ఎన్ని చేసి ఎంత నైపుణ్యంతో బ్రిటిష్‌ పాలకులతో చర్చలు జరిపినా ఫలితం లేకపోయింది. బ్రిటిష్‌ పాలకులు భారత దేశ ప్రజలతోగాని, జాతీయ నాయకులతోగాని చర్చలూ, సంప్రదింపులూ కూడా జరపకుండా, ఏకపక్షంగా భారతదేశ 40 కోట్ల ప్రజల్ని 1939 నాడు రెండవ ప్రపంచ యుద్ద మారణ హోమంలోకి ఈడ్చారు. ఇది భారత్‌ బ్రిటీషర్ల మధ్య ఘర్షణకు దారితీసింది. ఈ ప్రతిష్ఠంభనను అంతం చేసేందుకు బ్రిటీష్‌ ప్రభుత్వం అప్పటి పార్లమెంట్‌ సభ్యుడు సర్‌ స్టాఫోర్డ్‌ క్రిప్స్‌ను 1942 మార్చిలో భారత్‌కు పంపారు. క్రిప్స్‌ మిషన్‌లో వచ్చిన అనేక ప్రతిపాదనలను భారతీయులు తిరస్కచారు. క్రిప్స్‌ మిషన్‌ ఫెయిల్యూర్‌తో అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ 1942 ఆగస్ట్‌ 8 న ముంబైలోని కొవాలియా ట్యాంక్‌ మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సమావేశంలో ‘డూ ఆర్‌ డై’ అనే నినాదాన్ని మహాత్మాగాంధీ ఇచ్చారు. ఇది భారతీయుల మనసుల్లో నాటుకుపోయి స్వాతంత్ర కాంక్షను రగిలించింది. ప్రతీ భారతీయుడూ గాంధీజీ సందేశం ప్రకారం, తానే నాయకుడై యావత్తు దేశంలో బ్రిటిష్‌ పాలకులపై పోరాటాలు జరిపారు.

- Advertisement -

ఆ పోరాటంలో 5లక్షల మంది జైలు పాలైనారు. 5 వేల గ్రామాలు బ్రిటిష్‌ ఊచకోతకు (ఎయిర్‌ స్ట్రాఫింగ్‌), బాంబులకు ఆహుతైనాయి. 40 వేల మంది భార తమాత చరణాలపై ప్రాణాలు అర్పించారు. వందలాది మంది దేశభక్తులకు కొరడా దెబ్బ శిక్షలు పడ్డాయి. వేలాది గ్రామాలలో గ్రామస్వరాజ్యం స్థాపించగా, బ్రిటిష్‌ అధికారులు, తాబేదార్లూ తరిమివేయబడ్డారు. బ్రిటిష్‌ సామ్రాజ్యం తమకు స్వాతంత్య్రం ఇవ్వాల్సిందేనంటూ భారతీయులు చూపిన తెగువకు బ్రిటీష్‌ పాలకులు తలొంచాల్సిన పరిస్థితులు ‘క్విట్‌ ఇండియా’ ఉద్యమం నుంచే బీజం వేసుకున్నాయి. ఈ ఉద్యమం దాదాపు మూడేండ్ల పాటు కొనసాగింది. చివరకు బ్రిటీష్‌ పాలకులు 1947 ఆగస్ట 14 అర్ధరాత్రి భారత దేశానికి స్వాతంత్య్రం ప్రకటించారు. బ్రిటీష్‌ పతాకం నేలకు దింపబడి భారతీయ స్వేచ్ఛా కేతనం, త్రివర్ణ పతాకం ధర్మచక్రంతో నీలాకాశాన రెపరెపలాడింది.

  • పిన్నింటి బాలాజీరావు
    హనుమకొండ.
    9866776286
    (నేడు క్విట్‌ ఇండియా దినోత్సవం)
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News