ఈ మధ్య ఐక్యరాజ్య సమితికి చెందిన ‘యు.ఎన్ విమెన్ పవర్’ అనే సంస్థ ప్రపంచ వ్యాప్తంగా మహిళా సాధికారికతకు సంబంధించి ఒక సమగ్ర నివేదికను విడుదల చేసింది. “ఏ దేశంలోనైనా లైంగిక సమానత్వాన్ని సాధించాలన్నా, ప్రజాస్వామ్యం శక్తిమంతంగా, చైతన్యవంతంగా పని చేయాలన్నా మహిళలకు రాజకీయ భాగస్వామ్యం పెరగడం అనేది తప్పనిసరి’ అని ఆ నివేదిక స్పష్టం చేసింది. ప్రపంచంలోని అనేక దేశాలు ఈ లక్ష్యానికి చాలా దూరంలోనే ఉన్నాయి. భారత దేశంలో వివిధ రాజకీయ పార్టీలు ముందెన్నడూ లేనంతగా మహిళా ఓటర్లను ఆకట్టుకోవడానికి మరింత ఎక్కువగా పోటీపడుతున్నాయి. దేశంలో ఓటు హక్కు ఉపయోగించుకుంటున్న మహిళల సంఖ్య క్రమక్రమంగా పెరగడం, ఎన్నికల ఫలితాలపై వారి ప్రభావం ఎక్కువగా కనిపిస్తుండడమే ఇందుకు ప్రధాన కారణం. మహిళలను లక్ష్యంగా చేసుకుని రాజకీయ పార్టీలు ఎప్పటికప్పుడు సరికొత్త పథకాలను వెల్లడిస్తున్నాయి. ఇటీవల అయిదు రాష్ట్రాల్లో ఎన్నికల సందర్భంగా మహిళలకు వివిధ రాజకీయ పార్టీలు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు, నెలవారీ నగదు చెల్లింపులు, ఉచితంగా స్కూటీలు, ఉచితంగా మొబైల్ ఫోన్లు, ఉచిత విద్యుత్తు, సబ్సిడీపై వంట గ్యాసు వగైరా వరాలను ప్రకటించడం జరిగింది.
ఈ విషయంలో బీజేపీ మరింత ఎక్కువగా మహిళలను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. చాలా కాలంగా పెండింగులో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆమోదించింది. ఈ బిల్లు ప్రకారం, మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పించడం జరుగుతుంది. ప్రజా ప్రాతినిధ్య సభల్లో మహిళల సంఖ్య అతి తక్కువగా ఉండడంతో ఈ రిజర్వేషన్ బిల్లుకు అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. పాలనా వ్యవహారాల్లోనూ, శాసన వ్యవహారాల్లోనూ మహిళలు ఒక నిర్ణయాత్మక శక్తిగా ఎదగడానికి ఈ బిల్లు తోడ్ప డుతుందనడంలో సందేహం లేదు.
మహిళల అభ్యున్నతికి ప్రధాన అవరోధంగా ఉన్న ఒక సమస్య తొలగిపోవడానికి ఆ విధంగా ఒక మార్గం ఏర్పడింది. మహిళలకు అతి తక్కువ వేతనాలు ఇవ్వడం, తక్కువగా ఉద్యోగాలు ఉండడం వంటి సమస్యలు ఈ రిజర్వేషన్ బిల్లుతో చాలావరకు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. అయితే, ఈ బిల్లు అమలులోకి రావడానికి మరి కొంతకాలం పడుతుంది. ఇది ఇంకా అనేక అడ్డంకులను అధిగమించాల్సి ఉంది. ముఖ్యంగా నియోజకవర్గాల పునర్వి భజన పూర్తి కావాల్సి ఉంది. ఇది జరగాలన్న పక్షంలో జనాభా లెక్కల సేకరణ చేపట్టాల్సి ఉంటుంది. అంటే ఈ బిల్లు అమలు కావడానికి ఎంత లేదన్నా అయిదేళ్ల కాలం తప్పకుండా పడుతుంది.
గత పదేళ్లుగా మహిళల ఓటింగ్ శాతం క్రమంగా పెరుగుతూ వస్తోంది. 2019 ఎన్నికల్లో ఓటు హక్కును ఉపయోగించుకున్న మహిళల సంఖ్య పురుషుల సంఖ్యను మొదటిసారిగా దాటి పోయింది. ఇది కొద్ది పెరుగుదలే కానీ, దీని ప్రభావం ఎన్నికల ఫలితాలపై గణనీయంగా కనిపించింది. ఆ తర్వాత కొన్ని రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో ఈ పెరుగుదల మరింత ఎక్కువగా కనిపించింది. ఇవన్నీ సానుకూలంగానే కనిపిస్తున్నప్పటికీ, మహిళా సాధికారికత మాత్రం అందనంత దూరంలోనే ఉండిపోతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తే, ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు మహిళలపై వరాల వర్షం కురిపించినంత మాత్రాన సరిపోదని, మరింత అర్థవంతమైన చర్యలు చేపట్టాల్సి ఉందని అర్థమవుతోంది. దాదాపు రాజకీయ పార్టీలన్నీ మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతునిచ్చాయి కానీ, ఎన్నికల్లో మాత్రం 10 నుంచి 15 శాతం మాత్రమే మహిళలకు టికెట్లు ఇవ్వడం జరిగింది. ఈ బిల్లు అమలులోకి వచ్చినా రాకపోయినా రాజకీయ పక్షాలు ఈ ఎన్నికల నుంచే మహిళలకు మూడవ వంతు టికెట్లు ఇచ్చి ఉంటే ఎంతో సమంజసంగా ఉండేది. మహిళా రిజర్వేషన్ పట్ల తమకున్న చిత్తశుద్ధిని ప్రకటించుకోవడానికి అంది వచ్చిన అవకాశాన్ని రాజకీయ పార్టీలు చేజార్చుకున్నాయి. నిర్ణయాత్మక విషయాల్లో మహిళా భాగస్వామ్యం పెరగడం వల్ల లైంగిక సమానత్వం ఏర్పడడానికి, మహిళా సాధికారికతకు ఎంతగానో అవకాశం ఉంటుంది.
Quota is best!: వరాల కంటే ‘కోటా’యే ఉత్తమం!
నిర్ణయాత్మక విషయాల్లో మహిళా భాగస్వామ్యం