Sunday, June 30, 2024
Homeఓపన్ పేజ్Rae Bareli & Amethi: సోనియా కుటుంబం పరువు నిలిపిన రాయ్‌బరేలీ, అమేథీ !

Rae Bareli & Amethi: సోనియా కుటుంబం పరువు నిలిపిన రాయ్‌బరేలీ, అమేథీ !

ఉత్తరప్రదేశ్‌లో కీలక నియోజకవర్గాలైన రాయ్‌బరేలీ, అమేథీల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. రాయ్‌బరేలీ నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గెలుపొందగా, అమేథీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి కిశోరీలాల్ శర్మ విజయం సాధించారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని మొత్తం 80 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఒకే ఒక్క చోట గెలిచింది. అది రాయ్‌బరేలీ నియోజకవర్గం. రాయ్‌బరేలీ నియోజకవర్గం నుంచి సోనియా గాంధీ ఒక్కరే నిలిచారు. అయితే ఈసారి రాయ్‌బరేలీ నుంచి ఏకంగా రాహుల్ గాంధీయే బరిలో నిలిచారు.దీంతో రాహుల్‌ను ఓడించడానికి మాజీ కాంగ్రెస్‌వాది అయిన దినేశ్‌ సింగ్‌కు టికెట్‌ ఇచ్చి బరిలో నిలిపింది కమలం పార్టీ. అయితే రాహుల్‌ విజేతగా నిలిచారు. కాగా అమేథీలో కమలం పార్టీ అభ్యర్థిని స్మృతి ఇరానీని కాంగ్రెస్ క్యాండిడేట్ కిశోరీలాల్ శర్మ ఓడించారు.

ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ, అమేథీ నియోజకవర్గాలను గెలుచుకుని ఇందిరా గాంధీ కుటుంబం పరువు నిలుపుకుంది. ఈ రెండు నియోజకవర్గాలు ఇందిర కుటుంబానికి కంచుకోటల్లాంటివి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని మొత్తం 80 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఒకే ఒక్క చోట గెలిచింది. అది రాయ్‌బరేలీ నియోజకవర్గం. రాయ్‌బరేలీ నియోజకవర్గం నుంచి సోనియా గాంధీ ఒక్కరే నిలిచారు. కాగా కిందటిసారి అమేధీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అనూహ్యంగా బీజేపీ టికెట్‌పై బరిలో నిలిచిన టీవీ నటి స్మృతి ఇరానీ పై ఓడిపోయారు. పరాజయం సంకేతాలు అందడంతో రాహుల్ గాంధీ ముందుగానే జాగ్రత్తపడ్డారు. కేరళలోని వయనాడ్ నుంచి పోటీ చేసి లోక్‌సభలోకి ఎంటరయ్యారు. అయితే ఈసారి వయనాడ్ నుంచి పోటీ చేసిన రాహుల్ గాంధీ చివరిక్షణంలో రాయ్‌బరేలీ నుంచి బరిలో దిగాలని నిర్ణయించుకున్నారు. రాయ్‌బరేలీ నియోజకవర్గానికి ఇందిర కుటుంబంతో ఉన్న అనుబంధానికి దశాబ్దాల చరిత్ర ఉంది. 1952, 1957 ఎన్నికల్లో ఇందిర భర్త ఫిరోజ్‌ గాంధీ రాయ్‌బరేలీ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1967లో ఇందిరా గాంధీ తొలిసారి రాయ్‌బరేలీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అప్పటినుంచి రాయ్‌బరేలీతో ఇందిర కుటుంబానికి అనుబంధం ప్రారంభమైంది. ఆ తరువాత 1971 ఎన్నికల్లోనూ ఇందిర గెలుపొందారు. అయితే ఎమర్జెన్సీ నేపథ్యంలో జరిగిన 1977 లోక్‌సభ ఎన్నికల్లో రాయ్‌బరేలీ నుంచి పోటీ చేసిన ఇందిర పరాజయం పాలయ్యారు. అప్పట్లో జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన రాజ్‌ నారాయణ్‌ విజయం సాధించారు. అయితే తిరిగి 1980లో జరిగిన లోక్‌సభ మధ్యంతర ఎన్నికల్లో రాయ్‌బరేలీ నుంచి పోటీ చేసి ఇందిర గెలుపొందారు. ఆ తరువాత ఇందిర కుటుంబసభ్యులే ఇక్కడ్నుంచి గెలుపొందడం ప్రారంభమైంది. ఇక సోనియా గాంధీ విషయానికి వస్తే , 2004 ఎన్నికల్లో ఆమె తొలిసారి రాయ్‌బరేలీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. అప్పటి నుంచి 2019 వరకు రాయ్‌బరేలీకి సోనియా గాంధీయే లోక్‌సభలో ప్రాతినిధ్యం వహించారు. రాయ్‌బరేలీని తమ కుటుంబానికి కంచుకోటగా మార్చారు సోనియా గాంధీ. తాజా ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన దినేశ్ సింగ్‌పై రాహుల్ గాంధీ విజయం సాధించారు. వాస్తవానికి దినేశ్ సింగ్ పూర్వాశ్రమంలో కాంగ్రెస్ మనిషి. అంతేకాదు ఇందిర కుటుంబానికి విధేయుడు. అయితే 2018లో దినేశ్ సింగ్ బీజేపీలో చేరారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో సోనియా గాంధీ పై పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ప్రస్తుతం యోగి ఆదిత్యనాథ్‌ క్యాబినెట్‌లో దినేశ్ సింగ్‌ మంత్రిగా ఉన్నారు.

- Advertisement -

అమేథీలో కాంగ్రెస్ అభ్యర్థి కేఎల్ శర్మ గెలుపు

ఈసారి అటు రాయ్‌బరేలీ లేదా ఇటు అమేథీ నుంచి రాహుల్ పోటీ చేస్తారన్న వార్తలు ఎన్నికలకు ముందే వినిపించాయి. దీనికి ప్రధాన కారణం రాయ్‌బరేలీ అలాగే అమేథీ నియోజకవర్గాలతో ఇందిర కుటుంబానికి ఉన్న అనుబంధమే. దీంతో అనేక తర్జనభర్జనల అనంతరం రాయ్‌బరేలీ నుంచి పోటీ చేయాలని రాహుల్ గాంధీ నిర్ణయించుకున్నారు. రాయ్‌బరేలీ నుంచి రాహుల్ పోటీ చేస్తే …మరి అమేథీ సంగతి ఏమిటన్న ప్రశ్న సోనియా కుటుంబంలో వచ్చింది. ఒకదశలో సోనియా గాంధీ కుమార్తె ప్రియాంక గాంధీ పోటీ చేస్తారన్న ఊహాగానాలు కూడా రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొట్టాయి. అయితే ప్రియాంక గాంధీని ఏ ఒక్క నియోజకవర్గానికో పరిమితం చేయకూడదని కాంగ్రెస్ వర్గాలు భావించినట్లు తెలిసింది. దీంతో సోనియా గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన కిశోరీలాల్ శర్మ పేరు తెరపైకి వచ్చింది. చివరకు అమేథీలో తమ పార్టీ అభ్యర్థిగా కిశోరీలాల్ శర్మను బరిలోకి దించింది హస్తం పార్టీ. రాజకీయవర్గాల్లో కే ఎల్ శర్మ గా ప్రముఖుడైన కిశోరీలాల్ శర్మ …హస్తం పార్టీలో సీనియర్ నేత. అంతేకాదు…సోనియా గాంధీ కుటుంబానికి వీర విధేయుడు. ఇటు రాయ్‌బరేలీ అటు అమేథీ …ఈ రెండు నియోజకవర్గాల్లోనూ కిశోరీలాల్ శర్మకు గట్టి పట్టుంది. గత ఇరవై ఏళ్లుగా సోనియా గాంధీ కుటుంబం తరఫున ఈ రెండు ప్రతిష్టాత్మక నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలను కిశోరీలాల్ శర్మనే పర్యవేక్షిస్తున్నారు. అయితే అమేథీ నుంచి పోటీకి రాహుల్ గాంధీ నో చెప్పడంపై భారతీయ జనతా పార్టీ నాయకులు ఎద్దేవా చేశారు. అమేథీలో ఓటమి భయంతోనే రాహుల్ గాంధీ రాయ్‌బరేలీకి పారిపోయారని రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెటకారమాడారు. కమలనాథుల వెటకారాల సంగతి ఎలాగున్నా, అమేథీ లో కాంగ్రెస్ అభ్యర్థి కిశోరీలాల్ శర్మ విజయం సాధించారు. ఇందిర కుటుంబం పరువు నిలిపారు.

            - ఎస్‌. అబ్దుల్ ఖాలిక్,  సీనియర్ జర్నలిస్ట్  63001 74320
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News