కళాశాలల్లో రాగింగ్ కి వ్యతిరేకంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో చట్టాలు చేశాయి. పోలీసులు ఎందరినో కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. న్యాయస్థానాలు ఎందరికో శిక్షలు విధించాయి. అయినప్పటికీ సీనియర్లు జూనియర్లను ఏడిపించడం, వేధించడం, చిత్రహింసలు పెట్టడం అనే జాడ్యం మాత్రం కళాశాలలను విడిచిపెట్టడం లేదు. జూనియర్ విద్యార్థుల పట్ల సీనియర్ విద్యార్థులు ఒడిగట్టే అమానుషకాండను అరికట్టడానికి కళాశాలలు, విద్యార్థులు తల్లితండ్రులు కూడా చేయని ప్రయత్నం లేదు. అయితే, ఈ విషయంలో అంతా విఫలం కావడమే తప్ప సఫలం అయిన దాఖలాలు లేవు. మూడు నెలల క్రితం పశ్చిమ బెంగాల్ లోని జాదవ్ పూర్ లో ఒక 17 ఏళ్ల విద్యార్థిని సీనియర్ విద్యార్థులు పరమ కిరాతకంగా, పైశాచికానందంతో రాగింగ్ చేయడం, చివరికి ఆ యువకుడు ఆస్పత్రిలో ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఇది జరిగిన కొద్ది రోజులకే తమిళనాడులో పి.ఎస్.జి కాలేజ్ ఆఫ్ టెక్నాలజీలో రెండో సంవత్సరం డిగ్రీ చదువుతున్న విద్యార్థిని సీనియర్లు నానా చిత్రహింసలు పెట్టి, అతని దగ్గర నుంచి డబ్బు లాక్కోవడం, ఈ మానసిక క్షోభను తట్టుకోలేక అతను గుండె ఆగి మరణించడం గుర్తుండే ఉంటుంది.
నిజానికి దేశంలో రాగింగ్ ను నిషేధిస్తూ మొట్టమొదటగా చట్టాలు చేసినవి ఈ రెండు రాష్ట్రాలే. ఎన్ని చట్టాలు చేసినప్పటికీ, రాగింగ్ పేరుతో సీనియర్ విద్యార్థులు తమ జూనియర్ విద్యార్థుల పట్ల, అమానుషంగా, పరమ కిరాతకంగా వ్యవహరించడం అనేది సమాజ ధోరణికి, సమాజం తీరు తెన్నులకు అద్దం పడుతోంది. ఈ పైశాచికానందం కొనసాగడానికి పౌర సమాజం బాధ్యత చాలానే ఉందనిపిస్తోంది. విచిత్రమేమిటంటే, ఈ ఏడాది జూనియర్ విద్యార్థిగా సీనియర్ల చేతుల్లో నానా బాధలూ పడిన విద్యార్థులు వచ్చే ఏడాది తమ జూనియర్లపై ఇదే విధమైన అమానుష వ్యవహారాన్ని కొనసాగించడం జరుగుతోంది. సీనియర్లకు అణగిమణగి ఉండేలా జూనియర్లను వేధించడం, సతాయించడం, మానసికంగా, శారీరకంగా ఒత్తిడి తీసుకు రావడానికి పరిమితం కావలసిన రాగింగ్ క్రమంగా వెర్రితలలు వేసి, చిత్రహింసలకు, లైంగిక వేధింపులకు కూడా దారితీస్తోంది. ఈ వ్యవహారం వల్ల జూనియర్లు కూడా అమానుష ప్రవృత్తిని ఒంటబట్టించుకోవడం జరుగుతోంది. సాధారణ క్రమశిక్షణా రాహిత్యం క్రమంగా నేర ప్రవృత్తి కింద మారుతోంది.
మరొక దారుణమైన విషయం ఏమిటంటే, ఇదివరకటి రోజుల్లో మాదిరిగా ఈ రాగింగ్ కళాశాలలకే పరిమితం కావడం లేదు. అంతేకాదు, ఇది కొత్త విద్యార్థులకే పరిమితం కావడం లేదు. అంతేకాక, ఇది ఒక ఏడాదితోనే ఆగిపోవడం లేదు. ఇది మరింతగా విస్తరిస్తోంది. తమకంటే తక్కువ స్థాయిలో ఉన్న విద్యార్థులు కళాశాలల్లోనే కాదు, ఎక్కడ కనిపించినా, ఎప్పుడు కనిపించినా రాగింగ్ కొనసాగుతూ ఉంటుంది. దీంట్లో ద్వేషం, అసహ్యం, ఏవగింపు, శాడిజం కూడా మిళితమై ఉంటాయి. రాగింగ్ కార్యకలాపాలపై సుప్రీంకోర్టు నియమించిన ఆర్.కె. రాఘవన్ కమిటీ కొన్ని కారణాలను కనుగొని, కొన్ని ఆచరణాత్మక పరిష్కారాలను కనిపెట్టింది. అది 2007లో ఒక నివేదిక సమర్పిస్తూ, విద్యాసంస్థల్లో రాగింగ్ బెడదను నివారించడానికి సంబంధించి కొన్ని సూచనలు, సిఫారసులు చేసింది. “రాగింగ్ అనేది ఒక విధమైన మానసిక వైకల్యం. ఇది వికృత ప్రవృత్తికి నిదర్శనం” అది వ్యాఖ్యానించింది.
ఇక 1999లో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కూడా దీనిపై ఒక నివేదికను రూపొందించింది. రాగింగ్ భూతానికి అడ్డుకట్ట వేయాలన్న పక్షంలో “మొదట దీన్ని నిషేధించాలి. ఆ తర్వాత నివారించాలి. తర్వాత నిరోధించాలి” అని అది సూచించింది. దేశంలో అనేక ప్రభుత్వాలు దీన్ని నిషేధించాయి కానీ, వీటిని నివారించడానికి, నిరోధించడానికి మాత్రం చర్యలు తీసుకోవడం లేదు. ముందుగా నివారించడానికి, నిరోధించడానికి చర్యలు తీసుకున్న పక్షంలో ఆ తర్వాత నిషేధం దానంతటదే జరుగుతుందని రాఘవన్ కమిటీ తన నివేదికలో పేర్కొంది. రాగింగ్ కు అడ్డుకట్ట వేయడానికి విద్యాసంస్థల యాజమాన్యాలు కొత్త విద్యార్థులతో విందులు ఏర్పాటు చేయడం, విద్యార్థులు, వారి తల్లితండ్రుల నుంచి రాతపూర్వక ప్రమాణ పత్రాలు తీసుకోవడం, రాగింగ్ చేయకూడదంటూ నోటీసు బోర్డులు పెట్టడం మినహా మరే చర్యలూ తీసుకోవడం లేదు. అధ్యాపకులు, హాస్టల్ నిర్వాహకులు ఎప్పుడూ బాధితులకు అందుబాటులోనే ఉండాలి. ఎక్కడో ఉండే తల్లితండ్రుల కంటే అధ్యాపకులు, నిర్వాహకులే పూర్తి బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. బాధితులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత విద్యాసంస్థల మీదే ఉంటుంది. విద్యాసంస్థల్లో రాగింగ్ ను నివారించడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం కూడా ఇటువంటి రాగింగ్ కార్యకలాపాల పట్ల కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుంది.
Ragging: వెంటాడుతున్న రాగింగ్ రక్కసి
మానసికంగా ఇది ఇరు పక్షాలకు మంచిది కాదు