Saturday, October 5, 2024
Homeఓపన్ పేజ్Ragging kills another student: మళ్లీ విజృంభిస్తున్న ర్యాగింగ్ భూతం

Ragging kills another student: మళ్లీ విజృంభిస్తున్న ర్యాగింగ్ భూతం

విద్యార్థుల జీవితాలను అతలాకుతలం చేస్తున్న ర్యాగింగ్

దేశంలోని విశ్వవిద్యాలయాలు, కళాశాలల నుంచి ర్యాగింగ్ భూతం నిష్క్రమించిందని భావిస్తున్న వారిని ఇటీవల జాదవ్ పూర్ విశ్వవిద్యాలయంలో జరిగిన సంఘటన ఒక్కసారిగా ఉలిక్కిపడేటట్టు చేసింది. పశ్చిమ బెంగాల్ లోని జాదవ్ పూర్ విశ్వవిద్యాలయంలో ర్యాగింగ్ కారణంగా ఒక విద్యార్థి ప్రాణాలు కోల్పోవడం ఆ రాష్ట్రాన్నే కాక, దేశమంతటినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆందోళనకర విషయమేమిటంటే, జాదవ్ పూర్ విశ్వవిద్యాలయంలో ర్యాగింగ్ జరిగిన వ్యవహారం బయటపడ్డ దగ్గర నుంచి ఈ రకమైన వార్తలు దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి వెలుగు చూడడం ప్రారంభించాయి. నిజానికి, జాదవ్ పూర్ విశ్వవిద్యాలయం దేశంలోని అత్యుత్తమ విశ్వవిద్యాలయాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. హింసాకాండ, వేధింపులు, చిత్రహింసలు పెట్టడం, అవమానించడం వంటి వాటికి ర్యాగింగ్ అన్నది పర్యాయపదంగా మారిపోయింది. నిజానికి ఇది విద్యా సంస్థలోకి కొత్తగా ప్రవేశించే విద్యార్థులలో బిడియం, జంకు, భయం
పోగొట్టడానికి ఉద్దేశించినది.

- Advertisement -

బహుశా ఒక సామాజిక సామరస్యం కోసం, అందరూ ఒక్కటేనన్న భావన కలిగించడం కోసం ఒకప్పుడు ఈ సంప్రదాయం ప్రారంభం అయి ఉంటుంది. అయితే, అది ఇప్పుడు ‘జూనియర్ల’ మీద ‘సీనియర్లు’ తమ ఆటవిక ఆధిపత్యం చలాయించే పద్ధతిగా మారిపోయింది. ఇది సీనియర్, జూనియర్ అన్న అంశాలకు మాత్రమే పరిమితం కాలేదు. కులాలు, మతాలు, ప్రాంతాలు, వర్గాలు, జెండర్ల స్థాయిలకు కూడా వ్యాపించిపోయింది. ఇది తేలికగా తీసుకోవాల్సిన వ్యవహారం కాదు. ర్యాగింగ్ ముసుగులో చాలామంది దీనినొక అవకాశంగా తీసుకుని, తమకు నచ్చనివారిని అనేక రకాలుగా అమానుషంగా వేధించడం, తమకున్న అధికారాన్ని, ఆధిపత్యాన్ని దుర్వినియోగం చేయడం కూడా జరుగుతోంది.

మరింత ఆందోళనకర విషయమేమిటంటే, మారుతున్న కాలానికి తగ్గట్టుగా ఈ ర్యాగింగ్ భూతం ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కుతోంది. కొత్త రూపాలు సంతరించుకుంటుంది. జాదవ్ పూర్ విశ్వవిద్యాలయంతో సహా దేశంలోని అనేక విశ్వవిద్యాలయాల్లో మెస్ కమిటీలకు సీనియర్లే సారథులు కావడం, ఏ హాస్టల్ లో ఏ విద్యార్థులు ఉండాలన్నది వారే ఎంపిక చేయడం, సీనియర్లు ఎంత కాలమైనా హాస్టల్ గదులను ఖాళీ చేయకుండా తమ అజమాయిషీలోనే ఉంచుకోవడం వంటివి కూడా యథేచ్ఛగా జరిగిపోతున్నాయి. దీనికి పరిష్కారం ఏమిటి? నిజానికి, ర్యాగింగ్ నిరోధక చట్టాలు అమలులో ఉన్నాయి. వాటిని సమర్థవంతంగా అమలు చేయడానికి కావాల్సిన యంత్రాంగం కూడా ఉంది. ఈ చట్టాలను సరిగ్గా అమలు చేయడమే జరగడం లేదు. చర్యలు తీసుకుంటామని గానీ, తీసుకున్నామని గానీ చెప్పి విద్యార్థులలో ధైర్యం నింపే సూచనలు మాత్రం ఎక్కడా కనిపించడం లేదు.

ర్యాగింగ్ విషయంలో పాత విద్యార్థుల మీద కొత్త విద్యార్థులు అటు విశ్వవిద్యాలయ అధికారు లకు, ఇటు పోలీసులకు ఫిర్యాదులు చేసిన సందర్భాలున్నాయి. కానీ, అధికారులు ఈ ఫిర్యాదు లను తేలికగా తీసుకోవడం తప్ప సీరియస్ చర్యలు తీసుకున్నసందర్భాలు మాత్రం దాదాపు లేవనే చెప్పాలి. ఏదో ఒక
విషాదం లేదా దుర్ఘటన జరిగినప్పుడు మాత్రం అధికారులు లేదా పోలీసులు రంగప్రవేశం చేయడం జరుగుతుంది. ఆ తర్వాత షరా మామూలే. ఈ ర్యాగింగ్ వల్ల మరణాలు మాత్రమే కాదు, మానసిక భయాలు, మానసిక ఆందోళనలు తదితర మానసిక సమస్యలు విజృంభించడం విద్యార్థుల జీవితాలను అతలాకుతలం చేయడం జరుగుతోంది.

ఈ పెను భూతాన్ని పారదోలడానికి ప్రభుత్వాలు, విశ్వవిద్యాలయాలు ఎన్నో చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ర్యాగింగ్ నిరోధక విధానాలను కచ్చితంగా, పటిష్టంగా అమలు చేయడం ఇందులో ముఖ్యమైనది. బయటివారిని, చదువులు ముగించుకున్న పాత విద్యార్థులను హాస్టళ్ల నుంచి ఖాళీ చేయించడం అత్యవసరం. సీనియర్లు, జూనియర్ల మధ్య ఉన్న అధికార అంతరాలను విద్యార్థి సంఘాలతోనే తగ్గించే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. కొత్త విద్యార్థులను విద్యా సంస్థలో సజావుగా ప్రవేశపెట్టడానికి, వారిలో బిడియం పోగొట్టడానికి ర్యాగింగ్ కంటే సరైన పద్ధతులను ప్రవేశపెట్టడానికి అవకాశం కల్పించాలి. హింసాకాండకు అవకాశం లేకుండా సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడా పోటీలు తదితర మార్గాల ద్వారా విద్యార్థుల మధ్య ‍సామరస్యాన్నిపెంపొందించే మార్గాలను కూడా అన్వేషించాల్సి ఉంటుంది. దీన్ని భవిష్యత్ తరాల వారికి వదిలేయకుండా వెనువెంటనే చర్యలు చేపట్టడం మంచిది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News