పదకొండేళ్ల క్రితం, 2013 డిసెంబర్ 4వ తేదీన ఢిల్లీ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ మొదటి సారిగా పోటీచేసి, 28 స్థానాలు సంపాదించుకున్నప్పుడు ఆ పార్టీ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ నుంచి తాను అనేక విషయాలు నేర్చుకోబోతున్నట్టు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ ప్రకటించారు. నిజానికి ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఒక్క సీటు కూడా గెలుచుకునే అవకాశం లేదని ఎన్నికలు సర్వేలు జోస్యాలు చెప్పాయి. పదకొండేళ్లు గడిచే సరికి రాహుల్ గాంధీ గురువును మించిన శిష్యుడైపోయారు. రాజకీయాలకు సంబంధించి నంత వరకూ కేజ్రీవాల్ కంటే ఇప్పుడు రాహుల్ గాంధీయే ముందున్నట్టు కనిపిస్తోంది. కేజ్రీవాల్ ను మించిపోవాలని రాహుల్ గాంధీ మొదటి నుంచి ప్రయత్నాలు సాగిస్తూనే ఉన్నారని రాహుల్ సన్నిహితులు వాదిస్తుంటారు. రాహుల్ గాంధీ ఉద్దేశంలో తాను రాజకీయంగా పురోగతి చెంద కుండా ఉండడానికి పార్టీలోని సీనియర్ నాయకులు, వృద్ధ నాయకులే ప్రయత్నాలు సాగిస్తున్నారు. అంతేకాదు, తన తల్లి సోనియా గాంధీ ఆచితూచి వ్యవహరించే వైఖరి, తన వారసత్వం తనను ముందుకు వెళ్లనివ్వడం లేదని కూడా రాహుల్ భావిస్తుంటారు.
ప్రస్తుతం రాహుల్ గాంధీ ఎంతో కష్టపడి, స్వయంగా అనేక రాజకీయ చాతుర్యాలను, ఎత్తుగడలను, వ్యూహా లను నేర్చుకుని, ప్రతిపక్ష నాయకుడి స్థాయికి ఎదిగి పోయారు. లోక్ సభ లోపలా, బయటా తన వాగ్ధాటిని ప్రదర్శించే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్ట రేట్ (ఇ.డి) తనను ఏదో క్షణంలో అరెస్టు చేయడానికి అవకాశం ఉందంటూ రాహుల్ గాంధీ ఒక అర్థరాత్రి వేళ 1.50 నిమిషాలకు తన బ్లాగులో వెల్లడించడాన్ని బట్టి ఆయన రాజకీయ పరిణామాల పట్ల ఎంత అప్రమత్తంగా ఉంటున్నదీ అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా రాహుల్ గాంధీ రాత్రి 10 గంటల నుంచి పగలు 10 గంటలకు వరకూ ఎవరికీ అందుబాటులో ఉండరని పార్టీ నాయకులు వాపో తుంటారు. తనను అరెస్టు చేయాల్సిందిగా రాహుల్ గాంధీ అనేక సందర్భాల్లో ఇ.డిని సవాలు చేయడం జరిగింది. ఇ.డి తనకు సమ్మన్లు పంపని పక్షంలో తనకు విజయం లభించినట్టు లెక్క. అరెస్టు చేయని పక్షంలో తనపై రాజకీయ కక్ష సాధింపు ప్రయత్నాలు జరుగుతు న్నట్టు ప్రచారం చేసుకునే అవకాశం ఉంటుంది. పైగా, ఇ.డి అంతర్గత వ్యవహారాలన్నీ తనకు ముందుగానే తెలిసిపోతాయంటూ ఇటీవల ఆయన చేసిన ప్రకటనలకు విశ్వసనీయత కూడా ఏర్పడుతుంది.
కొత్త అడుగు జాడలు
ప్రస్తుత లోక్ సభలో ప్రతిపక్షాలు 47 శాతం స్థలాన్ని ఆక్రమించుకోగా, పాలక పక్షం 53 శాతం స్థలాన్ని ఆక్ర మించుకుంది. అంటే, ఈ రెండు పక్షాలు బాగా దగ్గరగా ఉండే అవకాశమే ఎక్కువగా ఉంది. ఈ కారణంగానే ఆయనకు ముందుగానే అన్ని వివరాలూ అందుతున్నట్టు కొందరు భావించడం జరుగుతోంది. ఇంతకూ కేజ్రీవాల్ పంథాను రాహుల్ గాంధీ అనుసరించడం అనేది ప్రత్యక్షం గానూ, పరోక్షంగానూ కొనసాగుతూనే ఉంది. ఆదానీ, అంబానీ వంటి ప్రముఖ పారిశ్రామిక వేత్తలకు బీజేపీ ప్రభుత్వంతో సన్నిహిత సంబంధాలున్నాయని, ప్రభుత్వ సంపదను వారికి సమర్పించడం జరుగుతోందని 2012-14 సంవత్సరాల్లో కేజ్రీవాల్ విపరీతంగా ప్రచారం చేయ డం జరిగేది. ఆ దుప్ప్రచారం ప్రజల్లోకి బాగా వెళ్లినందు వల్లే కేజ్రీవాల్ ప్రతి ఎన్నికల్లోనూ బీజేపీని దెబ్బ తీయ గలిగారు. ఆ ప్రచారాన్నే రాహుల్ గాంధీ కూడా అందుకు న్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆదానీ, అంబానీతో సన్నిహిత సంబంధాలున్నాయంటూ ఆయన కూడా నిర్విరామంగా ప్రచారం చేసి గత లోక్ సభ ఎన్ని కల్లో కొంత వరకూ కృతకృత్యులయ్యారు.
రాహుల్ గాంధీ ఒత్తిడిని తట్టుకోలేక మోదీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏ విధంగా పారిశ్రామిక వేత్తలను, వాణిజ్యవేత్తలను తమ చెప్పుచేతల్లో ఉంచుకున్నదీ గత ఎన్నికల్లో వివరించాల్సి వచ్చింది. అయితే, రాహుల్ గాంధీ వాణిజ్యవేత్తలు, పారిశ్రామికవేత్తలతో మోదీకి, బీజేపీ ప్రభు త్వానికి ఉన్న సన్నిహిత సంబంధాలను లోక్ సభలో కూడా ఎండగట్టడం ప్రారంభించారు. స్పీకర్, చైర్మన్, మంత్రులు, పాలక పక్ష సభ్యులు ఎంతగా నిరసన వ్యక్తం చేస్తున్నప్ప టికీ, రాహుల్ గాంధీ వాదనకు బలం చేకూరుతూ వస్తోం ది. కేజ్రీవాల్, రాహుల్ గాంధీలిద్దరూ సంప్రదాయ విరుద్ధ మైన భావాలు కలిగిన రాజకీయ నాయకులు. మాజీ బ్యురోక్రాట్ అయిన కేజ్రీవాల్ మొదటి నుంచి ఎన్.జి.ఓల మీద ఆధారపడి రాజకీయంగా పురోగతి చెందుతున్నారు. ఆయన తాను స్థాపించిన ఎన్.జి.ఓనే రాజకీయ పార్టీగా మార్చేయడం జరిగింది. రాహుల్ గాంధీకి కాంగ్రెస్ పార్టీ లోనూ, ఇతరత్రా బాగా సన్నిహితంగా ఉంటున్నవారం దరూ ఎన్.జి.ఓలకు సంబంధించినవారే. రాహుల్ గాంధీ రెండు పర్యాయాలు నిర్వహించిన భారత్ జోడో యాత్రలో ఆయనకు 21 రాష్ట్రాలకు చెందిన సుమారు 150 ఎన్.జి.ఓ లు సహాయ సహకారాలు అందజేయడం జరిగింది.
ఊకదంపుడైనా ఓకే
గత కొన్ని నెలలుగా రాహుల్ గాంధీ ప్రధాని మోదీకి దీటైన పోటీ తానేననే అభిప్రాయం కలిగించడానికి ప్రయ త్నిస్తున్నారు. సత్యాలు, అసత్యాలను కలగలిపి, తన వ్యక్తి గత ప్రతిష్ఠను సైతం పణంగా పెట్టి ఆయన మోదీకి పోటీగా ఎదిగేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నారు. 2014 లో కేజ్రీ వాల్ కూడా సరిగ్గా ఇదే పనిచేశారు. దాదాపు ప్రతి రాజకీయ వేదిక మీదా మోదీ మీద విమర్శలు సంధిం చడమే ఆయన ప్రధాన ధ్యేయంగా పెట్టుకున్నారు. అంతే కాదు, 2014 లోక్ సభ ఎన్నికల్లో వారణాసి నియోజక వర్గంలో ఆయన మోదీ మీద పోటీ చేయడం కూడా జరిగింది. 2024 లోక్ సభ ఎన్నికల్లో రాహుల్ గానీ, ఆయన సోదరి ప్రియాంక గానీ మోదీ మీద పోటీ చేసే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. ఇక గతంలో కేజ్రీ వాల్ చేసిన మాదిరిగానే రాహుల్ గాంధీ కూడా ఎక్కువగా ప్రజలతో కలిసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రయాణాల సంద ర్భంగా రైల్వే లోకోమెన్, రైల్వే కూలీలతో కలవడం కూడా జరుగుతోంది. కారు ప్రయాణాల్లో కూడా మధ్య మధ్య ఆగి, స్థానికులను కలుసుకోవడం, వారి సమస్యలను విన డం, వాటిని లోక్ సభలో ప్రస్తావించడం వంటివి కూడా జరుగుతున్నాయి. పైగా ఆయన తెల్లని టీషర్టు వేసుకో వడం యువజనులకు ఆయనను దగ్గర చేస్తోంది.
ఇతర రాజకీయ పార్టీలన్నిటికంటే, కాంగ్రెస్ పార్టీకి సుదీర్ఘకాల చరిత్ర ఉన్నందువల్ల, దేశవ్యాప్త ప్రభావం కలిగి ఉన్నందువల్ల ఈ నేపథ్యంతో రాహుల్ గాంధీ ఏ ప్రకటన చేసినా, ఎటువంటి విమర్శ చేసినా తేలికగా చెల్లుబాటవు తోంది. రాహుల్ గాంధీ నాయకత్వం మీద ఎంతో నమ్మకం పెట్టుకున్న సమాజ్ వాదీ పార్టీ నాయకుడు అఖిలేశ్ యాదవ్ ఆయనను ఒక ఛాయా ప్రధానిగా అభివర్ణించడం వెనుక ఇదే కారణం ఉంది. రాహుల్ గాంధీ ఒక షాడో ప్రైమ్ మినిస్టర్ గా వ్యవహ రించాలని, ఆయనకు ఓ షాడో మంత్రివర్గం ఉండాలని అఖిలేశ్ ఆకాంక్ష. కేజ్రీవాల్ నుంచి రాజకీయాలు, ఎత్తులు, జిత్తులు నేర్చుకోవడంతో తన రాజకీయ జీవితాన్ని పదును పెట్టుకోవడం మొదలుపెట్టి ఇప్పుడు కూడా కేజ్రీవాల్ పంథానే అనుసరిస్తున్న రాహుల్ గాంధీకి మొదటగా ప్రతిపక్షాల్లో తానే గ్రహరాజులా ఒక వెలుగు వెలగాలని, ఆ తర్వాతే బీజేపీని ఎదుర్కోవాలనే ఆలోచన కూడా ఉంది. ఆ దిశలో కూడా ఆయన అడుగులు వేస్తూనే ఉన్నారు. ఆయన ప్రయత్నాల ఫలితం దేశంలో త్వరలో జరగబోయే జమ్మూ కాశ్మీర్, హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల శాసనసభ ఎన్నికల ఫలితా లతో కొంత వరకూ వెలుగులోకి వస్తుంది.
- కె.వి. శ్యామలరావు,
సీనియర్ జర్నలిస్టు