Homeఎడిటోరియల్ / బహుళRahul Gandhi: రాహుల్‌ నాయకుడా.. తాత్వికుడా!

Rahul Gandhi: రాహుల్‌ నాయకుడా.. తాత్వికుడా!

Rahul Gandhi: రాహుల్‌ గాంధీ ఆధునిక రాజకీయాల్లో కొత్త తొవ్వలా కన్పిస్తున్నారు. ఆయన రాజకీయ నాయకుడా? లేక తాత్విక చింతనాపరుడా? ఈ మధ్య కాలంలో ఈ విపక్షనేత చర్యలు ప్రజల మధ్య నిత్య సంభాషణగా మారాయి. ఆయన మాట్లాడుతున్న మాటలు, చేస్తున్న ఆందోళన, సంప్రదాయ కాంగ్రెస్ పార్టీ ఆలోచనా స్రవం తికి మినహాయింపులా ఉన్నాయి. మన దేశ రాజకీయాల నేటి తీరు తెన్నులకు పునాది నాటి కాంగ్రెస్ ఆచరణలోనే ఉన్నది. ఈ మాటతో కొందరు ఏకభవించక పోవచ్చు. కానీ గడిచిన చరిత్ర పదే పదే మనకు చూపిస్తున్న వాస్తవం అది. రాహుల్‌ గాంధీ ఆలోచనా, ఆచరణల గురించి కొద్ది మాసాల కింద ఈ శీర్షికలోనే నేనో వ్యాసం రాశాను. దానికి కొనసాగింపుగా ఈ చర్చను భావించాల్సి ఉం టుంది. రాహుల్‌ గాంధీపై ప్రజల్లో అభిప్రాయం మారుతోందనేది దాని సారాంశం. సమీప గతపు లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో ఆ మేరకు మార్పు కన్పించింది. తాను లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా కేంద్ర ప్రభుత్వ విధానాలపై చాలా ప్రశ్నలు లేవనెత్తారు. ఆయన వ్యక్తం చేసిన సందేహాలు మొన్నటి జెన్‌జీ ఆందోళన సందర్భంగా సోషల్‌ మీడియాలో చాలా పెద్ద ఎత్తున చర్చకు దారి తీశాయి. వ్యవసాయ రంగం గురించి ఆయన మాట్లా డారు. నీట్‌ పరీక్షా ప్రశ్నాపత్రాల లీకేజీని చర్చనీయాంశం చేశారు. కార్పోరేట్ల రుణాల మాఫీ గురించి మాట్లాడారు. తొలుత తక్షణ స్పందనగా ప్రజల నుండి ఆశించిన స్థాయిలో అనుబంధ ప్రశ్నలుగా తెరపైకి కొత్త ఆలోచనలు రాలేదు. ఇప్పుడు వస్తున్నాయి. రాహుల్‌ గాంధీ క్షేత్ర స్థాయిలోనే ఉన్నారు. ఒకరోజు విద్యార్థులతో ముచ్చటి స్తున్నారు. మరో రోజు ఒక సామాజికాంశాన్ని జాతీయ స్థాయిలో చర్చకు పెడుతున్నారు. ఇంతకు ముందు ఒక సమస్యపై మాట్లాడిన తర్వాత దానికి కొనసాగింపుగా ఆయన ఏమీ చేయలేదు. ఆయన పార్టీ దాని గురించి పట్టించుకోలేదు. ఇప్పుడు దృశ్యం మారినట్లుగా కన్పిస్తూ ఉన్నది.
మొన్నీ మధ్య రాహుల్‌ గాంధీ మనుధర్మం గురించి మాట్లాడారు. మహిళల విషయంలో మనుధర్మం ఏం చెప్తున్నదనే విషయాన్ని విపులంగా మాట్లాడే ప్రయత్నం చేశారు. అంతేకాదు బహుజన వాదులు కొన్నాళ్లుగా లేవనెత్తుతున్న ‘‘ఎవరెంతో వారి కంతే’’, ‘‘ఓట్లు మావి -సీట్లు మీవా’’ వంటి నినాదాలను మరో రూపంలో ఆయన వ్యక్తం చేశారు. దేశ వ్యాప్తంగా కుల గనణ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. మనుధర్మం, -కుల సమస్య వంటి అంశాలను ఆయన ప్రస్తావిస్తున్నారు. ఓ యేడాది కింద మహారాష్ట్రంలో ఓ దళిత రచయిత ఇంటికి వెళ్లారు. వారింట్లోనే భోజనం చేశారు. ఎలాంటి హంగూ ఆర్భాటం లేదు. కుల సమస్య గురించి, దళితులు ప్రధాన స్రవంతి నుండి ఎట్లా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే విషయా లను మాట్లాడారు. ఆయన ప్రజల్లో పర్యటిస్తున్న సంద ర్భాలకు సమీపంలో ఎన్నికలు లేవు. కాబట్టి ఓట్ల కోసం ఆయన తాపత్రాయం కాదనే విషయం అర్థం అవుతున్నది. ప్రధాన స్రవంతికి దూరంగా విసిరి వేయబడిన ప్రజల వద్దకు తాను వెళ్తున్నారు. దళితుల ఇండ్లకు వెళ్లి తాము వెంట తీసుకెళ్లిన అల్పాహారాలు ఆరగించిన వారి గురించి కొన్నాళ్ల కిందట పెద్ద చర్చనే జరిగింది. అది కర్నాటక కావొచ్చు. లేదా మరో రాష్ట్రం కావొచ్చు. కానీ రాహుల్‌ గాంధీ దానికి భిన్నం అని ప్రజల్లో ఒక అభిప్రాయం ఏర్పడుతూ ఉన్నది. ఇంకో విషయాన్ని ఇక్కడ ప్రస్తావిం చాలి. అంబేద్కర్‌ చెప్పిన ప్రజాస్వామ్యం-సామాజిక న్యాయం వంటి వాటి గురించీ రాహుల్‌ గాంధీ మాట్లాడుతున్నారు. ఆర్థిక, సామాజిక, రాజకీయ సమానత్వం పౌరులందరికీ ఉండాలని బాబాసాహెబ్‌ చెప్పారు. రాహుల్‌ గాంధీ ఈ మధ్య వీటి గురించి పదేపదే ప్రస్తావిస్తున్నారు.

- Advertisement -

భారత్‌ జోడో యాత్ర నిర్వహించిన సందర్భంలో రాహుల్‌ గాంధీ వేషధారణ గురించి అననుకూల వ్యాఖ్యలు చేసినవారు కొందరున్నారు. ఆయన ప్రజలతో కలివిడిగా ఉంటున్న తీరును ప్రశంసించిన వారూ ఉన్నారు. ఆ సందర్భంలోనూ, ప్రస్తుతంలోనూ ఆయన ఓ రాజకీయ నాయకునిగా కంటే ఒక తాత్విక చింతనా పరునిగానే అర్థం అవుతున్నారు. మడతపేచీ మాటలు లేవు. అధికార పక్షం గురించి విమర్శలు చేయాల్సి వచ్చినప్పుడు భాషా ప్రయోగాన్ని ఆచీతూచీ చేస్తున్నారు. నిర్దిష్టాంశాలను ఆధారం చేసుకుని మాట్లాడుతున్నారనే అభిప్రాయం ప్రజల్లో కలిగేలా చేస్తున్నారు. ఎన్నికల మ్యాజిక్కుల కోసం పక్కవారిపై బురద చల్లే యత్నాలేమీ చేయడం లేదని కూడా కొందరు అంటున్నారు. వ్యక్తి ఆరాధనకు తాను వ్యతిరేకం అని చెప్తున్నారు. రాజకీయాధికారం గురించిన చర్చను ఆయన కొనసాగించేందుకు ఇష్టపడని సందర్భాలే ఎక్కువగా ఉన్నాయి. ఈ మధ్య విద్యార్థులతో ఆయన భేటీలు అవుతున్నారు. ఇటీవల పూణేలో ఆయన యువ జనులతో భేటీ అయ్యారు. భారత రాజ్యాంగం గురించి, హక్కుల గురించి ఆయన పదే పదే మాట్లాడుతున్నారు. రాహుల్‌ గాంధీ రాజ్యాంగం అంశాన్ని లేవనెత్తిన తర్వాత అదో పెద్ద ఎజెండా అయింది. ఆ తర్వాత బహుజన ఆలోచనా పరులు దాన్ని అందుకున్నారు. జంతర్‌ మంతర్‌ ఆందోళన సందర్భంలోనూ భారత రాజ్యాంగ ప్రతులు విద్యార్థుల చేతుల్లో కన్పించాయి.

మొన్నటి పార్లమెంట్‌ సమావేశాల్లో ఆయన మాట్లా డిన మాటలు చాలామందిని ఆకట్టకున్నాయి. అంతకు ముందు విపక్ష నేతగా ప్రధాని నివాసం ముందు రాహుల్‌ గాంధీ చేపట్టిన నిరసన యావత్‌ దేశం దృష్టిని ఆకర్షిం చింది. అంతేకాదు అనంతరం ఆయన నీట్‌ పరీక్షా ప్రశ్నా పత్రాల లీకేజీ గురించి, జంతర్‌ మంతర్‌ వద్ద విద్యార్థుల ఆందోళన గురించి సభలో మాట్లాడారు. అక్కడ జరిగిన ఘర్షణకు గల కారణాలు, ప్రభుత్వ స్పందన గురించీ మాట్లాడారు. దశాబ్దకాలంగా రాహుల్‌ గాంధీ ఎప్పుడూ ఇట్లా మాట్లాడలేదని చాలామంది వ్యాఖ్యానించారు. నిక్కచ్చిగా మాట్లాడుతున్నారని చెప్పిన వారూ ఉన్నారు. పెరుగుతున్న ధరల గురించి, మధ్యతరగతి ప్రజల జీవితాల గురించీ మాట్లాడుతున్నారు. దశాబ్ద కాలంగా స్తబ్దుగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి కొత్త శక్తిని ఇస్తున్నారు. ఇదే సందర్భంలో ఈయన రాజకీయ నాయకునిగా కంటే కూడా తాత్వికునిగానే ఆ పార్టీ నాయకులు భావిస్తున్న ట్లుంది.

ఇటీవల రాహుల్‌ గాంధీ మహిళల హక్కుల గురించి మాట్లాడుతూ మనుధర్మాన్ని విమర్శించారు. కేవలం మనుధర్మంలోనే కాదు ఇతర మతాల్లో మహిళలకు ఎలాంటి హక్కులను ఇచ్చారో కూడా రాహుల్‌ గాంధీ చెప్పాలనే సలహాలు కూడా ప్రజల నుండి వస్తున్నాయి. సీజేపీ ఆందోళన తర్వాత రాహుల్‌ గాంధీకి ధైర్యం వచ్చిందని, అందుకే ఆయన మోదీపైనా, కేంద్ర ప్రభుత్వ విధానాలపైనా ఆరోపణలు చేస్తున్నారని, నిత్యం ఏదో కార్యక్రమాన్ని తీసుకుంటున్నారని అంటున్న వారూ భారీగానే ఉన్నారు. రాజకీయ పార్టీ నేతగా తాను తాత్వి కతను బోధించడం మంచిదే. రాహుల్‌ గాంధీ నిత్య అధ్యయనశీలి కావడం వల్లనే భారతీయ కుల కోణం గురించి మాట్లాడుతున్నారని కొందరు అంటున్నారు. తన చుట్టూ రాజకీయాలను తిప్పుకోవడం ఒక అంశం అయితే రాజకీయాల చుట్టూ తాను తిరగడం మరో అం శం. తామే ఎజెండాను ఎదుటి వారి ముందు పెట్టగలిగితే అప్పుడు రాజకీయ నేతగా తాను బలపడుతున్నట్లు అంచనాకు రావొచ్చు. ఇంకా అంతటి అంచనా రాహుల్‌ గాంధీ నుండి రావడం లేదు. మేధోపరమైన వ్యక్తిత్వంగా తయారవుతున్నారు కానీ రాజకీయ నేతగా రాటుదేలటం లేదనే చర్చకు కొనసాగింపుగానే ఆయన మాటలుంటు న్నాయి. రాబోయే రోజుల్లో రాహుల్‌ గాంధీ రాజకీయ తాత్విక చింతనాపరునిగా ఓట్ల రాజకీయం చేస్తారా? లేదంటే భారతీయ సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక జీవి తాల సమ్మిళిత మేళవింపు తత్వంగా కొనసాగుతారో చూడాలి.

 

గోర్ల బుచ్చన్న
జర్నలిస్ట్

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News