Friday, November 22, 2024
Homeఓపన్ పేజ్Rahul Gandhi: సమస్యలు సృష్టిస్తున్న ‘పరువు నష్టం’ కేసు

Rahul Gandhi: సమస్యలు సృష్టిస్తున్న ‘పరువు నష్టం’ కేసు

సూరత్‌ న్యాయస్థానం ఒక పరువు నష్టం కేసులో కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీకి కఠిన శిక్ష విధించడం, ఆయన విషయంలో పట్టు విడుపులు ప్రదర్శించకపోవడం విచిత్రంగా కనిపించవచ్చు. అయితే, ఆ న్యాయస్థానం తీర్పును పరిశీలించిన వారికి ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. సాధారణ వ్యక్తి తప్పు చేసినప్పుడు విధించే శిక్ష కన్నా ఒక చట్టసభ సభ్యుడు తప్పు చేసినప్పుడు విధించే శిక్ష మరింత కఠినంగా ఉండక తప్పదు. ఒక బాధ్యతాయుతమైన పార్లమెంట్‌ సభ్యుడుగా ప్రజలకు మార్గదర్శకుడుగా వ్యవహరించాల్సిన వ్యక్తి పరుష పదజాలంతో దేశ ప్రధాని మీద ఇష్టానుసారంగా నిందలు వేయడం, విమర్శలు చేయడం ఏ విధంగానూ సమర్థించుకోలేని తప్పిదమని న్యాయస్థానం తన తీర్పులో స్పష్టం చేసింది. సూరత్‌ న్యాయస్థానంలోని ఎనిమిదవ అడిషనల్‌ సెషన్స్‌ జడ్జి రాబిన్‌ పి. మొగేరా తన తీర్పులో, సాధారణ పౌరుడు తప్పు చేసినప్పుడు పట్టించుకోవాల్సిన అవసరం ఉండదనీ, అయితే ఒక బాధ్యతాయుతమైన శాసనసభ్యుడో లేదా పార్లమెంట్‌ సభ్యుడో తప్పు చేసినప్పుడు మాత్రం కఠిన శిక్ష విధించాల్సిన అవసరం ఉందనీ వ్యాఖ్యానించారు. ఆ వ్యక్తి చేసే వ్యాఖ్యల ప్రభావం సమాజం మీద చాలా తీవ్రంగా ఉంటుందనే విషయాన్ని విస్మరించరాదని కూడా ఆయన అన్నారు. చట్టసభ సభ్యులకు కఠిన శిక్ష విధించడంలో తప్పేమీ లేదని, ఇది అన్ని విధాలా సమంజసమేనని ఆయన స్పష్టం చేశారు.
అందుకనే ఆయన రాహుల్‌ గాంధీకి పడిన శిక్షపై స్టే విధించడానికి కూడా నిరాకరించారు. మోదీ అనే ఇంటి పేరు కలిగినవారంతా దొంగలేనంటూ రాహుల్‌ గాంధీ వ్యాఖ్యానించడాన్ని న్యాయమూర్తి సీరియస్‌ వ్యాఖ్యలుగా పరిగణించారు. ఫలితంగా ఆయన రాహుల్‌ గాంధీకి రెండేళ్ల కఠిన కారాగార శిక్ష విధించడమే కాకుండా, లోక్‌సభ సభ్యత్వానికి కూడా అనర్హుడిగా ప్రకటించారు. రాహుల్‌ గాంధీ ఉన్నత న్యాయస్థానానికి అపీలు చేసుకునే వరకూ ఆయనకు విధించిన శిక్షపైన స్టే ఇవ్వడం జరిగింది కానీ, లోక్‌సభ సభ్యత్వానికి అనర్హుడిగా చేసిన ప్రకటన మీద మాత్రం స్టే ఇవ్వడానికి న్యాయమూర్తి నిరాకరించారు. తనకు శిక్ష విధించినా, తన సభ్యత్వాన్ని రద్దు చేసినా తనకు ఎంతో నష్టం జరుగుతుందని, తాను రాజకీయంగా, వ్యక్తిగతంగా ఎంతో దెబ్బతింటాననే భావంగానీ, పశ్చాత్తాపం గానీ ఆయనలో ఎక్కడా వ్యక్తం కాలేదని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఆయన కొన్ని సుప్రీంకోర్టు తీర్పులను ఈ సందర్భంగా ఉటంకిస్తూ, సభ్యత్వాన్ని రద్దు చేసినా, ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా అనర్హుడిగా ప్రకటించినా ఎవరి జీవితమూ దెబ్బతినదని అన్నారు.
న్యాయ నిపుణుల ఉద్దేశం ప్రకారం, సూరత్‌ కోర్టు న్యాయమూర్తి ఇచ్చిన తీర్పులో కొన్ని లొసుగులు, లోపాలు కనిపిస్తున్నాయి. లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేయడం, ఎన్నికల్లో పోటీచేయడానికి అనర్హుడిని చేయడం వంటి శిక్షలు విధించాల్సిన అవసరం లేదని, పైగా ఈ శిక్షల మీద స్టే ఇవ్వకుండా ఉండాల్సిన అవసరం లేదని వారు అభిప్రాయపడుతున్నారు. రాహుల్‌ గాంధీపై ఫిర్యాదు చేసిన వ్యక్తి ఒక మాజీ మంత్రి. పైగా ఆయనకు కూడా మోదీ అనే ఇంటి పేరు ఉంది. రాహుల్‌ గాంధీ వ్యాఖ్యల వల్ల ఆయన మనస్తాపం చెందాల్సిన అవసరం లేదు. నిజానికి ఇది పరువు నష్టం వ్యవహారమే కాదని, అటువంటి కేసులో కఠిన శిక్షలు విధించాల్సిన అవసరం కూడా లేదని వారన్నారు. రెండేళ్ల కఠిన శిక్ష విధించడానికి అవకాశం కూడా లేదని వారు స్పష్టం చేశారు. సూరత్‌ న్యాయమూర్తి మాత్రం పార్లమెంట్‌ సభ్యులు, శాసనసభ్యులు ఇతరులపై ఘాటైన పదజాలం ఉపయోగించినప్పుడు, మోదీలనందరినీ లక్ష్యంగా చేసుకున్నప్పుడు ఇటువంటి శిక్షలు విధించడం సమర్థనీయమేనని స్పష్టం చేశారు.
నిజానికి పరువు నష్టం అనేదే ఇక అర్థరహితమైన కేసు అని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. “ఇటువంటి కేసును ప్రత్యర్థులను, విమర్శకులను వేధించడానికి ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఎన్నికల ప్రచార సమయంలో వ్యక్తిగత విమర్శలు, రాజకీయ విమర్శలు చేయడం దేశంలో కొత్త కాదు. విమర్శలు చేసినప్పుడల్లా పరువు నష్టం దావాలు వేస్తూ పోవడం వల్ల ఒక కొత్త రకం సంక్షోభాన్ని సృష్టించినవారం అవుతాం” అని నిపుణులు భావిస్తున్నారు. పైగా అటువంటి విమర్శలను అడ్డుపెట్టుకుని, ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుడిగా ప్రకటించడమనే సంప్రదాయం అనేకానేక సమస్యలను సృష్టించే అవకాశం ఉందని కూడా వారు అభిప్రాయపడుతున్నారు. తనకు విధించిన శిక్షలపై రాహుల్‌ గాంధీ హైకోర్టుకు వెళ్లే అవకాశం ఉంది కానీ, న్యాయస్థానాలలో విచారణలు పూర్తయి, తీర్పులు రావడానికి పడుతున్న సమయం మరీ ఎక్కువగా ఉంటున్నందువల్ల, ఒక కీలక ప్రతిపక్ష నాయకుడిని దూరం చేసుకున్నట్టవుతుంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇటువంటి విధానం అంత మంచిది కాకపోవచ్చు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News