Friday, September 20, 2024
Homeఓపన్ పేజ్Rahul Gandhi: తెలిసీ తెలియని విమర్శలు

Rahul Gandhi: తెలిసీ తెలియని విమర్శలు

ప్రముఖ స్వాతంత్య్ర యోధుడు వీర్‌ సావర్కర్‌ పేరెత్తితే చాలు, నెహ్రూ-గాంధీ వారసుడు,కాంగ్రెస్‌ అధినేత అయిన రాహుల్‌ గాంధీ మండిపడుతుంటారు. ఆయనకు వీర్‌ సావర్కర్‌ జీవిత చరిత్ర తెలిసి ఆయన ఇలా మండిపడుతుంటారని అనుకోలేం. నెహ్రూ, గాంధీల కన్నా ఎక్కువగా చాలా కాలం జైలు జీవితం గడిపిన వీర్‌ సావర్కర్‌ గురించి దేశంలో తెలియని వ్యక్తి ఉండకపోవచ్చు. ఇందుకు రాహుల్‌ గాంధీ మినహాయింపు అనుకోవచ్చు. సావర్కర్‌ సుమారు 25 ఏళ్లపాటు, అండమాన్స్‌లోని సెల్యులర్‌ జైలులో, కాలు కదపడానికి కూడా వీలులేని ఒక చిన్న గదిలో ఏకాంత శిక్షననుభవించాడు.ఆయన బ్రిటిష్‌వారికి క్షమాపణ చెప్పి జైలు జీవితం నుంచి తప్పించుకున్నాడంటూ బ్రిటిష్‌వారు, కుహానా చరిత్రకారులు చెప్పిన కథనాలనే రాహుల్‌ గాంధీ నమ్ముతారు కానీ, సావర్కర్‌అసలు చరిత్ర ఆ తర్వాత బయటికి వచ్చిన విషయాన్ని మాత్రం ఆయన పట్టించుకోరు. స్వాతంత్య్ర పోరాటంలో నెహ్రూ, గాంధీలకు మించి ఎవరికి పేరు వచ్చినా సహించలేని కాంగ్రెస్‌ సంప్రదాయానికి ఆయన వారసుడు మరి!
ఆయన ఈ మధ్య సావర్కర్‌ మీద చేసిన వ్యాఖ్యలకు సావర్కర్‌ మనుమడు రంజిత్‌ సావర్కర్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సావర్కర్‌ మీద అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు రాహుల్‌ గాంధీ క్షమాపణ చెప్పని పక్షంలో తాను ఆయనపై ఎఫ్‌.ఐ.ఆర్‌ దాఖలు చేయడం జరుగుతుందంటూఆయన హెచ్చరిక కూడా చేశారు. రాహుల్‌ గాంధీ మూడు రోజుల క్రితం పత్రికా విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ, సావర్కర్‌పై, ఆయన దేశభక్తి, నిబద్ధతలపై తీవ్రంగా వ్యాఖ్యలు చేశారు. సావర్కర్‌ మీద వ్యాఖ్యలు చేయడమే కాకుండా రాహుల్‌ ఇటీవల బ్రిటన్‌లో దేశం గురించి, ఒక సమావేశంలో మోదీ అనే ఇంటి పేరు గురించి తీవ్రస్థాయిలో విమర్శలు, వ్యాఖ్యానాలు చేయడం జరిగింది. భారతదేశం గురించి బ్రిటన్‌లో వ్యాఖ్యలు చేయడంపై సర్వత్రా నిరసన వ్యక్తం అయింది. మోదీ అనే ఇంటి పేరు కలిగిన వారంతా దొంగలే అని అర్థం వచ్చేలా వ్యాఖ్యలు చేసినందుకు సూరత్‌ న్యాయస్థానం ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష వేయడం కూడా జరిగింది. తరచూ నోరు జారడం వల్ల తన ప్రతిష్ఠ, తన విశ్వసనీయత దెబ్బతింటున్నప్పటికీ, ప్రజాదరణ కోల్పోతున్నప్పటికీ ఆయన తన తీరును మాత్రం మార్చుకోవడం లేదు.
తమ తాత వీర్‌ సావర్కర్‌ దేశభక్తిని, నిబద్ధతను శంకిస్తూ అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడం రంజిత్‌ సావర్కర్‌కు ససేమిరా నచ్చలేదు. సావర్కర్‌ స్థాయి వ్యక్తిని విమర్శించడానికి రాహుల్‌కు ఉన్న స్థాయి ఏమిటో చెప్పాలని ఆయన విరుచుకుపడ్డారు. వీర్‌ సావర్కర్‌ను విమర్శించి రాహుల్‌ తన అపరిపక్వతను, అజ్ఞానాన్ని మరోసారి బయటపెట్టుకున్నారని ఆయన ధ్వజమెత్తారు. రాహుల్‌ గాంధీ బహిరంగ క్షమాపణలు చెప్పని పక్షంలో తాము ఆయనపై ఎఫ్‌.ఐ.ఆర్‌ దాఖలు చేయాల్సి ఉంటుందని ఆయన తీవ్రంగా హెచ్చరించారు. “నా ఇంటి పేరు సావర్కర్‌ కాదు. నా ఇంటి పేరు గాంధీ. మాకు క్షమాపణలు చెప్పే అలవాటు లేదు” అని రాహుల్‌ ఆయనకు సమాధానమిచ్చారు. క్షమాపణలు చెప్పే అలవాటు సావర్కర్‌కు ఉంది కానీ, గాంధీకి లేదని చెప్పడం ఆయన ఉద్దేశం. విచిత్రమేమిటంటే, న్యాయపరమైన చర్యల నుంచి తప్పించుకోవడానికి, బయటపడడానికి రాహుల్‌ గాంధీ గతంలో అనేక పర్యాయాలు క్షమాపణలు చెప్పడంజరిగింది.
స్పీకర్‌ ఓం బిర్లాను అనేక పర్యాయాలు వ్యక్తిగతంగా కలుసుకున్నప్పటికీ, లేఖలు రాసినప్పటికీ తనకు పార్లమెంట్‌లో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదని కూడా రాహుల్‌ వ్యాఖ్యానించారు. ఒక్క రంజిత్‌ సావర్కర్‌ మాత్రమే కాదు, శివసేన నాయకుడు ఉద్ధవ్‌ థాకరే కూడా వీర్‌ సావర్కర్‌ను విమర్శించినందుకు రాహుల్‌ క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్‌ చేశారు. “సావర్కర్‌ మాకు దేవుడు లాంటివాడు. ఆయనను అవమానిస్తే సహించం’ అని థాకరే స్పష్టం చేశారు. “గాంధీ, నెహ్రూల కంటే ఉన్నత స్థానాన్ని మరో స్వాతంత్య్ర యోధుడికి ఇవ్వడం రాహుల్‌ గాంధీకుటుంబానికి ఏమాత్రం ఇష్టం ఉండదు. సావర్కర్‌కు అభిమానం పెరగడం, గుర్తింపు రావడం అనేవి ఆయనకు ఒక పట్టాన జీర్ణం కాని విషయాలు” అని కూడా థాకరే వ్యాఖ్యానించారు. ఆ విషయం దేశ ప్రజలకు బాగానే తెలుసు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News