Sunday, July 14, 2024
Homeఓపన్ పేజ్Rahul Gandhi needs a cabinet of his own: రాహుల్‌ గాంధీకీ ఓ...

Rahul Gandhi needs a cabinet of his own: రాహుల్‌ గాంధీకీ ఓ క్యాబినెట్‌ అవసరం!

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఒక మంత్రివర్గం ఏర్పడినట్టే ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీకి కూడా ఒక మంత్రివర్గం అవసరం అనిపిస్తోంది. నరేంద్ర మోదీని ఎదుర్కోవడం కొంచెం కష్టమైన విషయమని దాదాపు ప్రతి ప్రతిపక్ష నాయకుడికీ తెలుసు. ఆయనకు ఉన్న రాజకీయ పరిజ్ఞానం, విషయ పరిజ్ఞానం ముందు ఏ నాయకుడైనా దిగదిడుపేనని కూడా అందరికీ తెలిసిన విషయమే. లోక్‌ సభలో ప్రతిపక్ష నాయకుడుగా ఎదగాలన్నా, పరిణతి సాధించాలన్నా రాహుల్‌ గాంధీకి తనకంటూ ప్రత్యేక సలహాదార్లు, అనుభవజ్ఞులు, నిపుణుల బృందం అవసరం. ఏ అంశం మీదా సరైన అవగాహన లేకుండా, ఏది మాట్లాడాలో, ఏది మాట్లాడకూడదో, ఎలా మాట్లాడాలో, ఎలా మాట్లాడకూడదో తెలియకుండా లోక్‌ సభలో నెగ్గుకు రావడం కష్టం. ఇది వైఫల్యాలకు, అప్రతిష్ఠకు దారితీసే ప్రమాదం ఉంది. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని ఆయన బ్రిటన్‌ లో మాదిరిగా తనకంటూ ఓ షాడో క్యాబినెట్‌ ను ఏర్పాటు చేసుకోవడం వల్ల ఆయన ప్రతిపక్ష నాయకుడి స్థాయి నుంచి ఉత్తరోత్రా ప్రధానమంత్రిగా ఎదగడానికి అవకాశం ఉంటుంది.
వాస్తవానికి, ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతలు చేపట్టిన మొదటి రోజు నుంచే రాహుల్‌ గాంధీ లోక్‌ సభలో మధ్య మధ్య అఖిలేశ్‌ యాదవ్‌, టి.ఆర్‌. బాలు, కల్యాణ్‌ బెనర్జీ, సుప్రియా సూలే వంటి నాయకులను సంప్రదిం చడం కనిపించింది. స్పీకర్‌ను ఎన్నుకునే విషయంలో ఆయన తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంతి మమతా బెనర్జీ సలహాలను కూడా తీసుకోవ డం జరిగింది. ఆ విధంగా ఆయన ప్రతిపక్ష నేతగా రాజ కీయ శిక్షణ పొందుతూనే ఉన్నారు. ఇండీ కూటమికి మమతా బెనర్జీ మద్దతు కీలకంగా మారింది. లోక్‌ సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఆయన మమతా బెనర్జీతో సంప్రదించాల్సిందిగా మల్లికార్జున్‌ ఖర్గే, పి. చిదం బరం, సోనియా గాంధీలకు సూచించారు. ఇండీ కూటమి లో మమతా బెనర్జీ కొనసాగేటట్టుగా, అవసరమైనప్పుడు మద్దతునిచ్చేటట్టుగా ఆమె నుంచి చిదంబరం హామీ తీసుకోవడం కూడా జరిగింది.
నరేంద్ర మోదీ చాణక్య నీతిని సమర్థంగా ఎదుర్కో వాలన్న పక్షంలో రాహుల్‌ గాంధీ ఒక ప్రతిపక్ష నేతగా ఒక షాడో క్యాబినెట్‌ను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా ఇటువంటి షాడో క్యాబినెట్‌ విధానాన్ని బ్రిటన్‌ లో అనుసరించడం జరుగుతుంటుంది. కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడుగా, ఒక ప్రతిపక్ష నేతగా రాహుల్‌ గాంధీ ఒక వెలుగు వెలగాలన్న పక్షంలో ఒక షాడో క్యాబినెట్‌ను ఏర్పాటు చేసుకోవడం, అందులో అఖిలేశ్‌ యాదవ్‌, సుప్రియా సూలే, అభిషేక్‌ బెనర్జీ, టి.ఆర్‌. బాలు వంటి నాయకులకు స్థానం కల్పించడం వల్ల ఉపయోగం ఉంటుంది. తమ పార్టీకే చెందిన శశి థరూర్‌, మనీశ్‌ తివారి, తారిక్‌ అన్వర్‌, కె. సురేశ్‌, గౌరవ్‌ గొగోయ్‌, కుమారి షెల్జా, శశికాంత్‌ సెంథిల్‌ వంటి వారికి కూడా సరైన పదవులివ్వడం, స్థానం కల్పించడం జరగాలి. ఇటు వంటి షాడో క్యాబినెట్‌ ను ఏర్పాటు చేసుకోవడం వల్ల ప్రజల దృష్టి రాహుల్‌ గాంధీ మీద పడి, మరింతగా ప్రాము ఖ్యం పెరిగే అవకాశం ఉంటుంది. ఇండీ కూటమి చెల్లా చెదురు కాకపోయిన పక్షంలో 2029లో ఫలితాలు అను కూలంగా మారే అవకాశం కూడా ఉంటుంది.
సరికొత్త నియామకాలు
ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీకి అసలు సిసలు నాయకు డుగా రాహుల్‌ గాంధీ ఎదిగినందువల్ల పార్టీ పగ్గాలను కూడా పూర్తి స్థాయిలో స్వీకరించడం మంచిది. ఇటువంటి కీలక సమయంలో ఆయన ఒక రాజకీయ కార్యదర్శిని నియమించుకోవడం అవసరం. కె.సి. వేణుగోపాల్‌ అను భవం ఉప యోగపడుతుంది కానీ, శశికాంత్‌ సెంథిల్‌, ప్రణీతి షిండే వంటి నాయకులను నియమించుకోవడం వల్ల మరింత ఉపయోగం ఉంటుంది. ఇతర రాష్ట్రాల నుంచి కాంగ్రెస్‌ నాయకులు సంప్రదించడానికి వీలుగా ఒక పదవిని సృష్టించాల్సిన అవసరం కూడా ఉంది. ఇదివరకు అహ్మద్‌ పటేల్‌ ఈ పాత్రను పోషించేవారు. ఇప్పుడు అటు వంటి పదవికి సరైన వ్యక్తిని ఎంపిక చేయాల్సి ఉంటుంది. కె.సి. వేణుగోపాల్‌ కంటే ప్రియాంక గాంధీని పార్టీ ప్రధాన కార్యదర్శిని చేసి, ఈ బాధ్యతలను అప్పగించడం వల్ల పార్టీకి జవజీవాలు సమకూరే అవకాశం ఉంటుంది.
ముందు అర్హత సంపాదించుకో, ఆ తర్వాత కోరుకో అన్నది రాహుల్‌ గాంధీ ఉద్దేశంగా కనిపిస్తోంది. పద్ధెనిమి దవ లోక్‌ సభలో ప్రతిపక్ష నాయకుడుగా ఎంపికైన రాహుల్‌ గాంధీ పార్టీ సంఖ్యా బలాన్ని 53 నుంచి 99కి చేర్చిన విషయం వాస్తవమే కానీ, ఆయన ఈ ఏడాది నాలుగు రాష్ట్రాల్లో జరగబోయే శాసనసభ ఎన్నికల్లో విజ యాలు సాధించే వరకూ ఆయనను ఒక విజేతగా గుర్తిం చడం కష్టమని రాజకీయ విశ్లేషకులు మాత్రమే కాకుండా, ఆయన పార్టీ నాయకులు సైతం అభిప్రాయపడుతున్నారు. బాధ్యతలను తలకెత్తుకోవడం ఇష్టం లేక, పదవులకు దూరంగా ఉండిపోయిన రాహుల్‌ గాంధీకి ముందున్నది ముసర్ల పండుగ అనే విషయం ఇప్పటికే అర్థమై ఉం టుంది. ప్రతిపక్ష నాయకుడనే పదవిని ఆయన ఎంత బాధ్యతగా నిర్వర్తించగలరన్నది ఈ ఏడాది చివరి లోగా తేలిపోతుంది.
రాహుల్‌ గాంధీ 2004లో మొదటిసారిగా లోక్‌ సభలో అడుగుపెట్టినప్పుడు, ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ కొలువులో కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించా లంటూ అనేక విధాలుగా ఒత్తిడి వచ్చింది. అయితే, ఆయన తనకు వచ్చిన ప్రతి అవకాశాన్నీ తిరస్కరిస్తూ వచ్చారు. 2014 వరకూ ఆయన ఏ పదవినీ స్వీకరించలేదు. కేంద్ర మంత్రివర్గంలో చేరాల్సిందిగా తాను రాహుల్‌ గాంధీని మూడు పర్యాయాలు కోరినట్టు మన్మోహన్‌ సింగ్‌ స్వయంగా చెప్పడం కూడా జరిగింది. కేంద్రంలో మంత్రి పదవిని చేపట్టడానికి అవసరమైన అర్హతలు, అనుభవం తనకు లేవని రాహుల్‌ గాంధీ కూడా తన సన్నిహితులతో పదే పదే చెప్పినట్టు వార్తలు వచ్చాయి. బహుశా, తన తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకోవాలన్న నిశ్చితాభిప్రాయం రాహుల్‌ గాంధీలో ఉండి ఉంటుంది. కొన్ని ప్రతికూల, విపత్కర పరిస్థితుల్లో రాజీవ్‌ గాంధీ 1984లో తన 40వ ఏట ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించాల్సి వచ్చింది.
కాంగ్రెస్‌ సంస్కృతి
రాజీవ్‌ గాంధీ ఆధునిక భావాలు కలిగిన వ్యక్తి. టెక్నాలజీ మీద వ్యామోహం ఎక్కువ. దేశ ఆర్థిక వ్యవస్థను సమూలంగా మార్చే ప్రయత్నం చేశారు. సమాజాన్ని మార్చాలని, ప్రజల దృష్టి కోణాన్ని మార్చడానికి కూడా ప్రయత్నించారు. అయితే, ఆయన అనేక కుట్రలు, కుతం త్రాలు, దుస్సాహసాలు, రాజకీయ వ్యూహాల్లో చిక్కుకు పోయి 1991మేలో అకాల మరణం చెందారు. ప్రస్తుతం 54 ఏళ్ల వయసులో ఉన్న రాహుల్‌ గాంధీ ఇప్పుడు అం దుకు భిన్నమైన పరిస్థితుల్లో ఉన్నారు. రెండు దశాబ్దాలుగా తనకు అవసరమైన రాజకీయ అనుభవాన్ని సంపాదిం చుకున్నారు. 2011-14 సంవత్సరాల మధ్య ఆయన రాజ కీయ జీవితంలో కొన్ని శుభ పరిణామాలు, కొన్ని విజ యాలు, సాఫల్యాలు కూడా చోటు చేసుకున్నాయి. రాజ కీయాల్లో ఒక విధమైన స్థిరత్వాన్ని సంపాదించుకున్నారు. భారత్‌ జోడో యాత్రల ద్వారా ప్రజలకు చేరువకావడం కూడా జరిగింది. తన బాధ్యతలను తెలుసుకున్నారు. ఆలో చనా విధానంలో కూడా మార్పు వచ్చింది.
రాజీవ్‌ గాంధీ అడుగు జాడల్లో నడవాలన్న పక్షంలో రాహుల్‌ గాంధీ తప్పనిసరిగా దేశ సంస్కృతి సంప్రదా యాలను ఆకళింపు చేసుకోవాల్సిన అవసరం ఉంది. తర తమ భేదం లేకుండా ప్రజా సమస్యలను అర్థం చేసుకో వాల్సి ఉంటుంది. మేధోపరమైన స్వేచ్ఛకు ప్రోత్సాహం ఇవ్వాల్సి ఉంటుంది. టెక్నాలజీకి ఊతమివ్వాల్సి ఉం టుంది. యువతీ యువకులకు దేశాభివృద్ధిలో భాగం కల్పించాల్సి ఉంటుంది. సమభావాన్ని, సమానత్వాన్ని పెంపొందించాల్సిన అవసరం కూడా ఉంది. ఇటువంటి భావాలను పూర్తి స్థాయిలో ఒంటబట్టించుకుంటే తప్ప ప్రతిపక్షాలను ఒకే తాటి మీదకు తీసుకు రావడం సాధ్యం కాదు. ప్రతిపక్షాలనే కాదు, కాంగ్రెస్‌ పార్టీని సంఘటితంగా ఉంచడం కూడా సాధ్యం కాదు. ప్రతిపక్ష నాయకుడుగా విజయాలు సాధించాలన్నా ఆయన కాంగ్రెస్‌ పార్టీకి జవ జీవాలు సమకూర్చాల్సి ఉంటుంది. ఇది ఆయనకు ఒక పెద్ద సవాలు కాబోతోంది.
ఈ ఏడాది చివరి లోగా నాలుగు కీలక రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు జరగబోతున్నాయి. జార్ఖండ్‌ జమ్మూ కాశ్మీర్‌, హర్యానా, మహారాష్ట్రలకు జరగబోయే ఈ ఎన్ని కలు ఏ విధంగా చూసినా కాంగ్రెస్‌ పార్టీకి, ముఖ్యంగా రాహుల్‌గాంధీకి, ఇండీ కూటమికి అగ్నిపరీక్ష కాబోతు న్నాయి. మూడు, నాలుగు రాష్ట్రాల్లో ఎన్‌.డి.ఏ కూటమిని ఓడించగలిగే పక్షంలో ఇండీ కూటమికి దశ తిరిగినట్టే భావించవచ్చు. నరేంద్ర మోదీ ప్రభుత్వ ఆయుర్దాయం ప్రశ్నార్థంగా మారుతుంది. ఏతావతా అందరి కళ్లూ ప్రతి పక్ష నాయకుడుగా రాహుల్‌ గాంధీ మీదే కేంద్రీకృతమై ఉన్నాయి.

  • జి. రాజశుక
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News