అందరి ఊహాగానాలకు విరుద్ధంగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ ఉత్తర ప్రదేశ్ లోని రాయబరేలీ స్థానానికే అంటి పెట్టుకునే అవకాశం కనిపిస్తోంది. దేశం మొత్తం మీద రెండు లోక్ సభ స్థానాలకు పోటీచేసిన ఏకైక నాయకుడు ఆయన. కేరళలోని వాయనాడ్, ఉత్తరప్రదేశ్ లోని రాయబరేలీ స్థానాల నుంచి ఆయన గత ఎన్నికల్లో లోక్ సభకు పోటీ చేయడం జరిగింది. ఇప్పుడు ఆయన ఇందులో ఏదో ఒక స్థానాన్ని వదులుకోవాల్సి ఉంటుంది. ఇదివరకటి ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ లోని అమేథీ స్థానం నుంచి ఓడిపోయిన రాహుల్ గాంధీని వాయనాడ్ లోక్ సభ నియోజకవర్గమే ఆదరించింది. ఆ నియోజకవర్గ ప్రజలకు ఎంతో అభిమానపాత్రుడైన రాహుల్ గాంధీకి మలయాళం రాకపోయినప్పటికీ, ఆ నియోజకవర్గ
ప్రజలు ఆయనను గెలిపించారంటే ఆయన పట్ల వారికి ఏ స్థాయిలో అభిమానమున్నదీ అర్థం చేసుకోవచ్చు. ఎవరు ఏ నియోజకవర్గం నుంచి పోటీచేసినప్పటికీ స్థానిక భాష రావడం అనేది అనివార్యమవుతుంది. రాహుల్ గాంధీకి కూడా ఈ కొండప్రాంత జిల్లా అన్నా, అక్కడి ప్రజలన్నా అభిమానమే. రాజకీయాల నుంచి, ఎన్నికల ప్రచారం నుంచి సేదదీరడానికి రాహుల్ గాంధీ ఇక్కడికి వచ్చి, కాఫీ తోటలు, తేయాకు తోటలు, జలపాతాలు, కొండలు, లోయల సందర్శనకు వస్తుంటారు.
కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేకుండా, ఆయన నేపథ్యాన్ని పట్టించుకోకుండా కేవలం ఆయనను వ్యక్తిగతంగా అభిమానించి ఆయనను గెలిపించడానికి ఇక్కడి ప్రజలు కృషి చేయడం నిజంగా ప్రశంసనీయమైన విషయం. ఇప్పుడు ఈ స్థానం ఆయనకు సురక్షిత స్థానంగా మారింది. అందుకని రాహుల్ గాంధీ ఈ నియోజకవర్గంతో మానసిక అనుబంధం పెంచుకున్నారు. 2026 మే నెలలో కేరళ శాసనసభకు ఎన్నికలు జరగాల్సి ఉంది. రాహుల్ గాంధీ ఈ రాష్ట్రం నుంచి లోక్ సభకు పోటీ చేసి గెలిచినందువల్ల శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకత్వంలోని యు.డి.ఎఫ్ విజయం సాధించే అవకాశాలు మెరుగుపడ్డాయి. నిజానికి, రాయబరేలీ నుంచి పోటీ చేయాలని రాహుల్ గాంధీ కోలుకోలేదు. సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ గట్టిగా పట్టుబట్టడంతో ఆయన రాయబరేలీ నుంచి పోటీ చేయడం జరిగింది. పైగా, ఎన్నికల కార్యక్రమం మరీ సుదీర్ఘంగా ఉండడంతో ఆయన వాయనాడ్ ఎన్నిక ముగిసిన తర్వాత రాయబరేలీలో నామినేషన్ వేయడానికి అవకాశం కలిగింది. రాయబరేలీ నుంచి
ఒకప్పుడు ఆయన తాత ఫిరోజ్ గాంధీ, నాయనమ్మ ఇందిరా గాంధీ, తల్లి సోనియా గాంధీ కూడా పోటీ చేయడం జరిగింది.
కనౌజ్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న అఖిలేశ్ యాదవ్ రాయబరేలీ నుంచి పోటీ చేసే విషయంలో రాహుల్ గాంధీకి అనేక విధాలుగా నచ్చజెప్పడం జరిగింది. గత ఎన్నికల్లో ఉత్తర ప్రదేశ్ లో అత్యధిక స్థానాలు సంపాదించుకున్న బీజేపీ ఈసారి దారుణంగా దెబ్బ తినబోతోందని, ఈ పరిస్థితుల్లో రాహుల్ గాంధీ ఇక్కడి నుంచి విజయం సాధించడం తేలిక అవడమే కాకుండా, ఇక్కడ కాంగ్రెస్ మళ్లీ తన ప్రాభవం పెంచుకోవడానికి మార్గం ఏర్పడుతుందనీ అఖిలేశ్ యాదవ్ ఆయనకు సూచించారు. ప్రియాంక గాంధీ కూడా ఇదే విషయాన్ని రాహుల్ గాంధీకి నూరిపోశారు. రాయబరేలీలో నామినేషన్ వేస్తున్న సమయంలో కూడా రాహుల్ గాంధీ వాయనాడ్ ను అట్టె పెట్టుకునే ఉద్దేశంలోనే ఉన్నారు. రాహుల్ గాంధీ రాయబరేలీని వదిలేసుకున్న పక్షంలో ప్రియాంక గాంధీ అక్కడి నుంచి లోక్ సభకు పోటీ చేసే అవకాశం ఉందంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులే కాక, మీడియా సైతం భావిస్తోంది.
రాహుల్ గాంధీకి వాయనాడ్ కంటే రాయబరేలీలోనే ఓట్లు ఎక్కువగా వచ్చాయి. రాయబరేలీలో ఆయనకు 3,89,341 ఓట్లు పడగా, వాయనాడ్ లో 3,64,422 ఓట్లు పడ్డాయి. ఆయన వాయనాడ్ ను ఇప్పటికీ తన రాజకీయ నివాసం కింద భావిస్తున్నారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. అయితే, పార్టీపరమైన ఒత్తిళ్లు, అగత్యాల దృష్ట్యా ఆయన రాయబరేలీనే అట్టెపెట్టుకుని వాయనాడ్ ను వదిలేసే అవకాశం ఉంది. ఉత్తర ప్రదేశ్ నుంచి ఇండీ కూటమి అత్యధిక స్థానాలు గెలుచుకున్నందు వల్ల, రాయబరేలీనే తాను అట్టెపెట్టుకునే పక్షంలో బీజేపీని ఢీకొనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని కాంగ్రెస్ పార్టీ సీనియర్లు ఆయనకు నచ్చజెబుతున్నారు. అఖిలేశ్ యాదవ్ కూడా రాయబరేలీకే ప్రాధాన్యం ఇస్తున్నారు. లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడుగా కొనసాగదలచుకున్న పక్షంలో ఆయనకు ఉత్తర ప్రదేశ్ ప్రాతినిధ్యం ఉంటేనే సమంజసంగా కనిపిస్తోంది. అంతేకాక, ఎన్నికల ప్రచార సమయంలో సోనియా గాంధీ రాయబరేలీ ఓటర్లను ఉద్దేశించి మాట్లాడుతూ, ‘‘నేను నా కుమారుడు రాహుల్ గాంధీని మీకు అప్పగిస్తున్నాను’’ అని చెప్పినందువల్ల ఇప్పుడు ఆయన రాయబరేలీని వదులుకునే అవకాశం లేదు.