బిడ్డకు జన్మనివ్వడానికి అమ్మ తన ప్రాణాన్ని సైతం పణంగా పెడుతుంది. నవమాసాలు కడుపులో మోసి, ప్రసవ వేదన అనుభవించి, బిడ్డకు ప్రాణం పోస్తుంది. పిల్లల ఆకలిని తీర్చడంలో అమ్మ అన్నపూర్ణగా, బిడ్డలకు పోషణను అందిస్తుంది. స్త్రీ శక్తికి, దయకు, త్యాగానికి ప్రతిరూపం. అందుకే ఆమెకు “మాతృదేవోభవ” అని అగ్రతాంబూలం ఇచ్చి పూజిస్తాము. రాజుగా సింహాసనం అధిష్టించబోనని భీష్ముడు తన సవతి తల్లి సత్యవతికి ఇచ్చిన మాట కోసం ఆజన్మ బ్రహ్మచారిగా ఉంటానని ప్రతిజ్ఞ చేశాడని దీనినే “భీష్మ ప్రతిజ్ఞ” అని అంటారని మనకు తెలుసు. శ్రవణ కుమారుడు అంధులైన తన వృద్ధ తల్లిదండ్రుల కోరిక మేరకు వారిని కాశీ వంటి పవిత్ర క్షేత్రాలకు తీర్థయాత్రలకు తీసుకువెళ్లడానికి కావడిలో మోసాడని మనం చదువుకున్నాం. అయితే 19వ శతాబ్దంలో బొంబాయి (ప్రస్తుత ముంబై)లో “కాటన్ కింగ్”గా పేరొందిన దిగ్గజ పత్తి వర్తకుడు ప్రేమ్‌చంద్ రాయ్‌చంద్ తన తల్లి రాజాబాయి కోసం దాదాపు ఐదున్నర లక్షల రూపాయల వ్యయంతో దక్షిణ ముంబైలోని ఫోర్ట్ ప్రాంతంలో రాజాబాయి గడియార గోపురం (క్లాక్ టవర్) నిర్మించాడని మనలో ఎందరికి తెలుసు ! 1869లో ప్రారంభమైన ఈ క్లాక్ టవర్ నిర్మాణం 1878లో పూర్తయ్యింది. ఈ క్లాక్ టవర్ లో బ్రిటన్ నుండి తెప్పించిన రకరకాల గంటలు మరియు వాద్య పరికరాల ధ్వనులను ఏర్పాటు చేశారు. బొంబాయి నగరంలోని దర్శనీయ ప్రదేశాలలో అత్యంత ఆకర్షణీయమైన ఈ క్లాక్ టవర్ ను వీక్షించడానికి దేశవిదేశాల నుండి సందర్శకులు విచ్చేసేవారు.
బ్రిటిష్ వలస పాలకులకు విరాళం:
1857 సిపాయిల తిరుగుబాటు తరువాత, బ్రిటిష్ వారు పట్టణ ప్రాంతాలలో తమ అధికారాన్ని స్థాపించ సంకల్పించారు. ఆధిపత్యం మరియు బ్రిటిష్‌తనానికి దృశ్యమాన చిహ్నాలుగా నిలిచేలా భారీ గడియార గోపురాలను (క్లాక్ టవర్స్)ను రూపొందించారు. ఇవి బ్రిటిష్ వలస పాలకుల పాలనకు మైలురాళ్ళుగా నిలిచాయి. బ్రిటిష్ అధికారులు నగదు మరియు వాణిజ్యంపై నియంత్రణను ఏకీకృతం చేయడానికి భారతదేశం అంతటా ఒక ప్రామాణికమైన “రైల్వే సమయాన్ని” సృష్టించాలని భావించారు. బ్రిటిష్ వలస పాలనకు ముందు స్థానిక సౌర సమయం ప్రకారం పనిచేస్తున్న నగరంలో ఈ గడియారపు గోపురాలు ఒక పారిశ్రామిక, పట్టణ వేగాన్ని బలవంతంగా ప్రవేశపెట్టాయి. విక్టోరియన్ శకం యొక్క సాంస్కృతిక ఆధిపత్యాన్ని, వాస్తుశిల్ప సౌందర్యాన్ని ప్రతిబింబించేలా, రాజాబాయి టవర్‌ను నిర్మించారు. రాజాబాయి టవర్ నిర్మాణ సమయంలో బ్రిటిష్ పాలకులకు నిధుల కొరత ఏర్పడడంతో టవర్ నిర్మాణం అర్థాంతరంగా నిలిపివేయల్సిన పర్తిస్థితి ఏర్పడింది. అప్పుడు 19వ శతాబ్దంలో బొంబాయికి చెందిన “కాటన్ కింగ్” మరియు భారతీయ స్టాక్ బ్రోకర్ మరియు పరోపకారి, “బిగ్ బుల్”గా ప్రసిద్ధి చెందిన ప్రేమ్‌చంద్ రాయ్‌చంద్, ప్రధానంగా అంధురాలైన తన తల్లి రాజబాయిపై ఉన్న ప్రగాఢమైన ప్రేమతో టవర్ నిర్మాణానికి నిధులు సమకూర్చేందుకు తన అంగీకారం తెలిపారు. అయితే, విరాళాలు అందించేందుకు ఆ క్లాక్ టవర్ కు తన తల్లి ‘రాజాబాయి’ పేరు పెట్టాలని షరతు విధించగా అందుకు బ్రిటిష్ అధికారులు కూడా సమ్మతించారు. జైన మత ఆచారవ్యవహారాలను మరియు కట్టుబాట్లను త్రికరణశుద్ధిగా ఆచరించే రాయ్‌చంద్ తల్లి రాజాబాయి చీకటి పడకముందే భోజనం చేసేవారు. రాత్రి భోజనానికి ఉపక్రమించే ముందు ఆమె ప్రతి రోజు సాయంత్రం సూర్యాస్తమయం అయ్యిందా అని ఇంట్లో వారిని అడిగేది. ఒక రోజు సాయంత్రం ఆమె తన కోడలిని “సూర్యాస్తమయం అయ్యిందా” అని రెండు సార్లు అడిగినప్పటికీ ఆమె ఏదో పని ధ్యాసలో ఉండి వెంటనే సమాధానం ఇవ్వలేదు. ఈ విషయాన్ని గమనించిన రాయ్‌చంద్, తన తల్లి సూర్యాస్తమయ సమయం కోసం ఎవరిపైనా ఆధారపడకుండా ఉండేందుకు ఏదైనా ఏర్పాటు చేయాలని దృఢంగా నిశ్చయించుకున్నారు. సరిగ్గా అదే సమయంలో నిధుల కొరత కారణంగా బ్రిటిష్ పాలకులు క్లాక్ టవర్ నిర్మాణానికి విరాళాలు అందించే దాతల కోసం అన్వేషించడం ఆయనకు కలిసి వచ్చింది.
వాగ్దానానికి కట్టుబడిన ప్రేమ్‌చంద్ రాయ్‌చంద్:
1860 మరియు 1865 మధ్య అమెరికాలో అంతర్యుద్ధం కారణంగా బొంబాయిలో పత్తి వాణిజ్యం భారీ పరిమాణంలో ఊపందుకుంది. యుద్ధం కారణంగా అమెరికాకు పత్తి సరఫరాలు నిలిచిపోవడంతో, బ్రిటన్ దృష్టి భారతదేశం వైపు మళ్ళడంతో పత్తి ఎగుమతులు రెట్టింపై బొంబాయి ఒక ప్రపంచ వాణిజ్య కేంద్రంగా అభివృద్ధి చెందింది. ఇది రాయ్‌చంద్‌ను భారతదేశంలోని అత్యంత సంపన్నులలో ఒకరిగా నిలబెట్టింది. అయితే, 1865లో సంభవించిన ఒక పెద్ద ఆర్థిక సంక్షోభంతో అత్యధిక సంపద కోల్పోయినప్పటికీ, రాయచంద్ మాత్రం టవర్ కోసం తాను వాగ్దానం చేసిన విరాళాన్ని ఉపసంహరించుకోలేదు. ఇది పరోపకార నిబద్ధత పట్ల ఆయన చిత్తశుద్ధికి నిదర్శనంగా నిలుస్తుంది. విద్యా రంగానికి మద్దతు అందించే విధంగా ఈ టవర్‌ను బొంబాయి విశ్వవిద్యాలయ గ్రంథాలయానికి అనుసంధానించేలా రూపొందించగా దీనికి కూడా రాయచంద్ పాక్షికంగా నిధులు సమకూర్చడం విశేషం. 1860వ దశకంలో నాటి బొంబాయి నగరంలో పత్తి వాణిజ్య కార్యకలాపాలు తారాస్థాయికి చేరిన సందర్భంలో “కాటన్ కింగ్”గా, బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ వ్యవస్థాపకుడిగా, సంపన్న బ్రోకర్‌గా ఎదిగిన రాయ్‌చంద్ బొంబాయిలో మౌలిక సదుపాయాలు మరియు విద్యాసంస్థల అభివృద్ధి లక్ష్యంగా పరోపకార కార్యక్రమాలలో విస్తృతంగా పాలుపంచుకోవడం ఆయన దాతృత్వానికి అద్దం పడుతుంది.
అమ్మకు అపూర్వమైన బహుమానం:
ఆ విధంగా బ్రిటిష్ పాలకులకు 19వ శతాబ్దపు బొంబాయి కాటన్ కింగ్ మరియు పరోపకారి రాయ్‌చంద్ దాదాపు ఐదున్నర లక్షల విరాళం అందించడంతో “రాజాబాయి క్లాక్ టవర్” నిర్మాణం 1869లో రెండు లక్షల రూపాయలతో పునఃప్రారంభమై దాదాపు ఐదున్నర లక్షల రూపాయలతో 1878లో పూర్తయ్యింది. ఆ మొత్తం ఇప్పుడు దాదాపు వంద నుండి నూట యాభై కోట్ల వరకు ఉండవచ్చు అని తెలిస్తే మనకు ఆశ్చర్యం వేస్తుంది. ప్రతి గంటకు ఈ క్లాక్ టవర్ నుండి గంట శబ్దం వినిపించడంతో రాయ్‌చంద్ తల్లికి సూర్యాస్తమయ సమయం సులభంగా తెలిసేది. ఈ ఏర్పాటుతో ఆమె ఎవరిపై ఆధారపడకుండా సూర్యాస్తమయానికి ముందే తన ప్రార్థనలు ముగించుకుని రాత్రి భోజనం చేసి నిద్రకు ఉపక్రమించేది. ఈ వెసులుబాటు తన తల్లికి అత్యంత అనుకూలంగా ఉండడం రాయ్‌చంద్ కు ఎంతో ఊరటనిచ్చింది. రాజాబాయి టవర్ లోపల ఆకర్షణీయంగా ఉండే రంగుల అద్దాల కిటికీలు సందర్శకుల చూపులను మరల్చనీయదు. టవర్ బయటి భాగంలో పశ్చిమ భారతదేశపు వివిధ జాతులు, దుస్తులను ప్రతిబింబించే రాతి శిల్పాలు ఉన్నాయి. టవర్ బేస్ చతురస్రాకారంలో ఉండి, పైకి వెళ్లేకొద్దీ ఎనిమిది కోణాల (Octagon) ఆకారంలోకి మారుతుంది. లండన్‌లోని ప్రసిద్ధ “బిగ్ బెన్” (Big Ben) తరహాలో దీనిని వెనిషియన్ మరియు గోతిక్ శైలుల అద్భుతమైన సమ్మేళనంతో స్థానిక కుర్లా రాళ్లతో సుమారు 85 మీటర్ల (280 అడుగులు) ఎత్తులో నిర్మించిన ఈ టవర్‌ను లండన్ కు చెందిన సుప్రసిద్ధ వాస్తుశిల్పి సర్ జార్జ్ గిల్బర్ట్ స్కాట్ డిజైన్ చేసినప్పటికీ ఆయన ఎప్పుడూ ఈ అద్భుత కళాఖండాన్ని దర్శించకపోవడం ఆశ్చర్యం. ఇటీవలి కాలంలో బాహ్య లైటింగ్ నిర్వహణకు సంబంధించి కొన్ని ఆందోళనలు తలెత్తినప్పటికీ, రాజబాయి క్లాక్ టవర్ నేటికీ ముంబై వారసత్వంలో ఒక క్రియాశీల భాగంగా నిలిచి ఉండడం మాతృమూర్తులందరికీ గౌరవప్రదమైన విషయం. ఈ టవర్ యొక్క సంక్లిష్టమైన యాంత్రిక వ్యవస్థను వి.ఎస్. టైమ్ సర్వీసెస్ అనే సంస్థ నిర్వహిస్తుంది. ఈ గడియారం ఆటోమేటిక్ లేదా విద్యుత్‌తో నడిచేది కాకపోవడంతో దీని గంటలు ప్రతి 15 నిమిషాలకు మోగేలా చూసుకోవడానికి, మహేంద్ర ప్రసాద్ గుప్తా అనే ఒక టెక్నీషియన్ ప్రతిరోజూ 236 మెట్లు ఎక్కి దీనికి స్వయంగా ‘కీ’ ఇస్తారు. అయితే నిర్మాణ సమయంలో ఏర్పాటైన 14 గంటలలో ప్రస్తుతం ఐదు మాత్రమే పనిచేస్తున్నాయి. 2018లో యునెస్కో (UNESCO) ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటించారు. రాజాబాయి క్లాక్ టవర్ కేవలం ఒక అపురూప కళాఖండమే కాదు, ఇది ఒక కొడుకుకు తన తల్లి పట్ల గల అవ్యాజమైన ప్రేమకు చిహ్నంగా ఆచంద్రార్కం నిలిచి ఉంటుంది.
ఈ నెల 10వ తేదీన “అంతర్జాతీయ మాతృదినోత్సవం” సందర్భంగా ప్రేమ్‌చంద్ రాయ్‌చంద్ ను ప్రేరణగా తీసుకుని ప్రతి ఒక్కరు కూడా తమ తమ మాతృమూర్తుల పట్ల ప్రేమానురాగాలను వ్యక్తపరచుకునే అవకాశాన్ని తప్పక సద్వినియోగం చేసుకుంటారని ఆశిద్దాం.
యేచన్ చంద్ర శేఖర్
మాజీ రాష్ట్ర కార్యదర్శి
ది భారత్ స్కౌట్స్ & గైడ్స్, తెలంగాణ
హైదరాబాద్.

