ప్రముఖ కవి కె. శివారెడ్డి గారు మనిషి ఊహ గొప్పతనం గురించి ఆ ఊహ నుంచి పుట్టుకొచ్చే కథల గురించి
గొప్ప కవితాత్మక వచనాలు చెబుతాడు.
" ఒక కొత్త ఊహ బుట్టాలె గాని
రాజుగారికి ఏడుగురు కొడుకులు ఉంటారు
వేట కెళ్ళి ఏడు చేపలు తెస్తారు
ఎండని చేప అద్భుతమైన కథ చెబుతుంది
పేదరాసి పెద్దమ్మ
చంద్రుడిలో కూర్చొని నూలు వడుకుతుంది
రాహు కేతువులు చంద్రుణ్ణి మింగుతారు
పిల్లి పోరు పిల్లి పోరు కోతి తీరుస్తుంది”
పై విధంగా సాగే కవితా వచనాలు గా మారిన ఈ కథలు మనిషి జీవనంతో ఎంత మమేకం
అయినాయో అర్థం చేసుకోవచ్చు.
భారతదేశంలో అతి ప్రాచీన కాలం నుండి కథా బీజాలు ఉన్నాయని ప్రపంచానికి కధా సాహిత్యాన్ని అందించింది భారతదేశమేనని విదేశీయులు కూడా చెప్తారు. వేద కాలం నుండి కధలు ఉండటం గుణాడ్యుడి బృహత్కథ రాయడం
నన్నయ ప్రసన్న కథ కి ప్రాముఖ్యం ఇవ్వడం, కావ్యాలలోని కథలు, జానపద కథలు, తెనాలి రామలింగడి కథలు, కాశీ మజిలీ కథలు, పంచతంత్ర కథలు ఈ విధంగా మనదేశంలోనూ , తెలుగులోనూ
కథా మూలాలు బలంగా ఉన్నాయి.
బేతాళ కథలు అత్యంత ప్రాచీనమైనవి క్రీస్తుపూర్వం ఒకటో శతాబ్దానికి చెందిన ఈ కథలు తొలిసారిగా గుణాడ్యుని బృహత్కధ లో ఒక భాగంగా చోటు చేసుకున్నాయి. మొట్టమొదట పైశాచిక భాష ( ప్రాకృత భాష ) లో రాయబడిన ఈ కథలు తరువాత కాలంలో సంస్కృత భాషలోకి అనువదించబడ్డాయి, అయితే పైశాచిక భాషలో బృహత్కథ మూల గ్రంథం అలభ్యం కావటంతో సంస్కృత భాషలో అనువదించబడిన కధలే మిగిలాయి. గుణాడ్యుని బేతాళ కథల వలనే
ఉన్నప్పటికీ ఈ కథలు తెలుగులో కొత్తగా
అనుసృజింపబడ్డాయని చెప్పవచ్చు.
పుప్పాల కృష్ణమూర్తి కలం నుంచి జాలువారిన కథాప్రవాహం రాజహంస . ఇది ఒక నవ్య బేతాళ కథ సారంగం. ఈ కథ పుస్తకం పట్టుకొని చూస్తే ప్రతి పేజీ ఓ జిలేబి.ప్రతి వాక్యం మనసుకు సౌఖ్యాన్ని, ప్రతి అక్షరం ఆనందానుభూతిని కలిగిస్తది. పిల్లలను పెద్దలను అసలు ప్రతి పాఠకుడిని శ్వాస కి కూడా విరామం లేకుండా ఉక్కిరి బిక్కిరి చేస్తూ వినోదాన్ని కలిగిస్తది. ఒక్క మాటలో చెప్పాలంటే అదో అమృతానుభూతి. ప్రతిపుట పక్షుల రెక్కలు తగిలించుకొని
స్వేచ్ఛ విహారం చేయిస్తది. 22 కథలతో ఉన్న ఈ పుస్తకం మెదడుకు మరింత పదును పెడుతది.
ఈ రచయిత అక్షర రత్నాలతో పుస్తకాన్ని ఆవిష్కరించిన తీరు రంగేళి హోరును మరిపిస్తది.
ప్రతి కథా సారం నిస్సారమైన జీవితాలలో నవ్వుల పువ్వులను లక్షలలో మొలిపిస్తది. ఇంకేం కావాలి….
నిజమేనా వేటగాడు అనే మొదటి కథ నూటికి నూరుపాళ్లు నిజమైన కధ. మొదటి అక్షరం నుంచి చివరి అక్షరం వరకు పాఠకులలో ఆత్రుతను పెంచేస్తది. విసుగు పుట్టించే విస్తృత లేకుండా ఒకే అంశ లక్ష్యంగా ఆద్యంతం ఆకట్టుకుంటది.
నిర్భరతకు నిలువుటద్దాం ఈ కథ. పాత్ర సమగ్రంగా ఉండి చదువరులను ఆకట్టుకుంటది. విక్రమార్కుడు, బేతాళుడు మధ్య జరిగే సంవాద చాతుర్యం ఆశ్చర్యాన్ని కలిగిస్తది, ఆనందానుభూతికి గురిచేస్తది. ప్రశ్నల చిక్కుముడి విప్పి ఆలోచన పరిధిని పెంచేస్తది.
వికాసానికి వినోదం తోడై కళ్ళను కాంతివంతం చేస్తది. పున్నమి వెలుగును పూయిస్తది.
వేటగాడు బసవయ్య వ్యక్తిత్వం కంసాలి కనకయ్య
సామాజిక బాధ్యతను న్యాయాధికారి ధర్మరాజు మేధోతనం బేతాళుడి లాజిక్ ప్రశ్నలకు విక్రమార్కుడి
సరితూగే సమాధానాలను కూర్చిన తీరు రచయిత
పుప్పాల కృష్ణమూర్తి గారి కలబలంను తెలియజేస్తుంది .
మరో మర్చిపోలేని కథ, ప్రతి మనిషిని కదిలించే కధ
“రంగస్థలం”. వ్యక్తిగత అభివృద్ధిని పక్కనపెట్టి సంస్థ అభివృద్ధికి పాటుపడే ఒక కళాకారుడి కథ. అవసరమైతే తెరముందు పాత్రే గాక తెర వెనక పాత్ర ను నిర్వహించి సంఘం సమైక్యతకు పాటుపడే అసలు సిసలైన కళాకారుడి కథ.
జగత్తు నాటక రంగం జీవనం కోసం నాటకాలు ఎంచుకున్న 20 కుటుంబాల కథ రంగస్థలం. సుబ్రహ్మణ్యం,సంస్థ అభివృద్ధి తన అభివృద్ధి అనుకునే విశాల ఆలోచనలు నింపుకున్న వ్యక్తి కధ. జానకయ్య, తనది నాటక రంగంలో తిరుగులేని పాత్ర అని అహం గల వ్యక్తి కధ.
మొత్తానికి చూస్తే ఈ కథ పాఠకుడిపై ప్రభావం చూపించే మనసు మాలిన్యం తొలగించే కథ.
పాత్రల మధ్య సంవాద చాతుర్యం సమపాలలో ఉన్న కథ. పాత్రలన్నీ సమగ్రతతో నిండిపోయిన కథ. పాఠకుడిలో ఏకాగ్రత నింపే కధ. మొదటి పదం నుంచి చివరి ముగింపు వరకు ప్రతి పదం పంచదార తీపిని కలిగించి చెడును తొలగించే అసలు సిసలైన కధ.
సమాజ శ్రేయస్సు వ్యక్తి శ్రేయస్సు అనే సాంఘిక కొలతను కళ్ళ ముందు ప్రదర్శించే కధ.
పుప్పాల కృష్ణమూర్తి గారి కథలు అల్లే తీరు గిజిగాని గూడు అల్లకంలా అద్భుతం, అమోఘం, ఆశ్చర్యంగా
ఉంటది”.రాజహంస” అనే కథను రక్తి కట్టించిన తీరు
వారి కలకౌశల్యంను తెలియజేస్తుంది. సింహం లాంటి సిరా చుక్క సినిమాలను ఢీకొట్టగలదు. పలు ఆలోచనలు రేకెత్తించగలదు. ఊహ శక్తిని ఉర్రూతలు ఊగించగలదు. సృజన శక్తిని సృజింపజేయగలదు.
కథలు గూడా అంతే.ఏ కార్టూన్ కథలకు అక్షర కథలు
దాసోహం చేయదు. పెరుగుతున్న ఆధునీకరణ అద్భుతాలు చేయగలదేమో గాని అక్షర కథలు మాత్రం
వ్యక్తిని శక్తిగా మార్చగలదు.విలువల వజ్రాలను
పండించగలదు. సృజన కవ్వంను మెదడులో చిలికించగలదు. నిభిడీకృతంగా ఉన్న అక్షరాలతో ఆయుధాలు గా మొలిపించగలదు.
అనుబంధాలు “అణు”బంధాలుగా మారుతున్న నేటి కాలమాన పరిస్థితుల్లో కలకాలం నిలిచి ఉండే కధాపుస్తకం రాజహంస. జయ నగరాన్ని
వజ్రదీప్తుడు ప్రజలను దైవంగా భావించి తన సుఖ సౌఖ్యాలు త్యాగం చేసి రాజ్యాన్ని రక్షించుకున్న తీరు
చూస్తుంటే పాలకులు ప్రజల యొక్క ద్వార పాలకులే కదా! వారికి చేతులెత్తి జోడించి నమస్కరించాలని అనిపిస్తది భారతదేశ చరిత్రలో ప్రజల కోసం వ్యక్తిగత సౌఖ్యం వదిలేసిన రాజులు కోకోల్లలుగా ఉన్నారు
ఈ కథలో విలువలు ప్రతి ఒక్కరిలో మానసిక శుద్ధి చేస్తది. మనోబలాన్ని పెంచుతుంది. ప్రపంచం మొత్తం భారతదేశ కుటుంబ వ్యవస్థకు
చేతులెత్తి నమస్కరిస్తుంది. అనాది నుంచి వస్తున్న
ఈ కుటుంబ వ్యవస్థ భారతదేశం ఉన్నతిని
వెయ్యింతలకి పెంచింది. అంతేగాక కుటుంబం పై సమాజం సమాజంపై దేశం ఆధారపడి ఉంటుంది.
కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేరుతో ఓ కృత్రిమ వాతావరణం ఏర్పడింది. ఈ అభివృద్ధిని తప్పు అనలేంగాని ఒప్పు అని మాత్రం చెప్పలేం.
నేడు మామిడాకుల అరక ముందే విడాకులు కోరుకునే వ్యవస్థ కొంత భయపెడుతుంది.
ఇదే అంశాన్ని తీసుకొని పుప్పాల కృష్ణమూర్తి గారు
వధువు ఎంపికలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో
“వధువు ఎంపిక “అనే కథ ద్వారా తెలియజేస్తాడు.
ఈ కథలో శాంతనయ్య, గోవిందుడు, భద్రయ్య,, నాగరాణి, నారాయణమ్మ
పద్మజ అనే పాత్రలతో కథలు శక్తివంతంగా నడిపించిన తీరు చూస్తుంటే పుప్పాల కృష్ణమూర్తి గారు సామాజిక బాధ్యతను తలకెత్తుకున్నారేమో అనిపిస్తుంది.
శాంతనయ్య పాత్ర గొప్పతనాన్ని చూస్తుంటే
పుప్పాల కృష్ణమూర్తి గారి వ్యక్తిత్వం మనం అర్థం చేసుకోవచ్చు. అంతేగాక భారతీయ కుటుంబాలు మూలాలు తెలియజేసే కథ.
పుప్పాల కృష్ణమూర్తి గారి రాజహంస కధాపుస్తకానికి
ముందుమాట రాసిన డాక్టర్ వి ఆర్ రాసాని గారు
మరింత తేజస్సు తెచ్చిపెట్టారు. ఈ పుస్తకానికి ముఖచిత్రాన్ని గీసిన భావన గ్రాఫిక్స్ వారు సరికొత్త అందం తెచ్చిపెట్టారు. నవతెలంగాణ పబ్లిషింగ్ హౌస్ ముద్రించిన ఈ పుస్తకం ప్రతి ఒక్కరి హస్తాలలో ఉండవలసిన పుస్తకం. ఓ మంచి నేస్తంగా చూసుకోవాల్సిన పుస్తకం.
సాదే. సురేష్
కవి,పుస్తక సమీక్షకుడు
9441692519