Saturday, October 5, 2024
Homeఓపన్ పేజ్Ramacharita Manas: రామచరిత మానసలో ప్రతి అక్షరం ఓ సందేశమే

Ramacharita Manas: రామచరిత మానసలో ప్రతి అక్షరం ఓ సందేశమే

- Advertisement -

బిహార్ విద్యాశాఖా మంత్రి, రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) నేత చంద్రశేఖర్ ఈమధ్య తులసీదాస్ రామచరిత మానస్ పై నోరు పారేసుకోవటం వైరల్ గా మారింది. మంత్రికున్న అజ్ఞానాన్ని బయటపెట్టుకునేలా ఉన్న ఈ వ్యాఖ్యలు కొందరికి ఆగ్రహం తెప్పించగా మరికొందరు మంత్రి అవివేకాన్ని చూసి తెగ నవ్వుకుంటున్నారు. ట్రోలర్స్ అయితే మంత్రి చంద్రశేఖర్ ను చెడుగుడు ఆడుకుంటున్నారు. సమాజంపై ఆగ్రహాన్ని కలిగించేలా, సామాజిక అసమానతలు రెచ్చగొట్టేలా రామచరిత మానస్ ను కవి, భక్తుడు తులసీదాస్ రాసినట్టు చంద్రశేఖర్ తెగ బాధపడిపోయారు. కానీ హిందూయిజంలోని అతి పెద్ద గొప్పతనం ఇదే. ఎవరు హిందూయిజంపై ఎటువంటి దారుణమైన విమర్శలు చేసినా వాటిని ఖాతరు చేయదు. అదే ఇతర మతాలైతే మాత్రం రెచ్చిపోయి నానా రకమైన, అత్యంత కఠినమైన శిక్షలు ఖరారు చేసేసేవి. పరమత సహనమే కాదు హిందువులు, హిందువేతరులు హిందూయిజంపై ఎటువంటి కూతలు కూసినా, రాతలు రాసినా హిందూయిజం వాటిని చాలా ఓపికగా, సహనంగా భరిస్తుంది. దైవ దూషణ అతి పెద్ద నేరంగా ఇతర మతాల్లో ఏకంగా చట్టాలు చేశారు. బృహస్పతి అనే మన ఫిలాసఫర్ ఒకరు క్రీ.పూ. 7వ శతాబ్దంలో చరవాక సిద్ధాంతాన్ని చెబుతూ, వేదాల్లో పవిత్రత నాశనం అయిందని ఆరోపించారు. కానీ దీన్ని దైవ దూషణగా మాత్రం హిందూయిజం ఎన్నటికీ భావించలేదు. అంతెందుకు ఈ చరవాక సిద్ధాంతం హిందూయిజంలోని ఓవర్గం బలంగా విశ్వసిస్తుంది కూడా.

పేదలు, అణగారిన వర్గాల పట్ల మహాత్మా గాంధీ అత్యంత శ్రద్ధ చూపేవారు. అందుకే గాంధీ రామచరిత మానసను అత్యుత్తమైన పుస్తకంగా అభివర్ణించేవారు. హిందూ భక్తి సాహిత్యంలో రామచరిత మానస సర్వ శ్రేష్టమైనదని పేర్కొన్నారు. పేదలు, అణగారిన వర్గాల దృష్టి పరంగానే ఆయన రామచరిత మానసను చదవాలనేవారు. 1532-1623 మధ్య కాలంలో ఉన్న తులసీదాస్ అపర భక్తుడు. ఈయన విరచించిన భక్తి సాహిత్యంలో ప్రధానంగా రాముడి ఆరాధన ఉండేది. మర్యాదా పురుషోత్తంగా ఉత్తరాదిలో రాముడి పాత్రను ఎంతో ఘనంగా చెప్పుకుంటారు. అలాంటి రామ భక్తుడే తులసీ దాస్. తులసీ దాస్ దృష్టిలో రాముడంటే ..అదృష్ట, అచింత్య, అఖండ, సర్వవ్యాపి, పూర్ణ, నిర్గుణ, ఉపనిషత్తుల్లోని బ్రాహ్మణుడు. ఈ భావన ఎంత అత్యున్నతంగా, భక్తిరసం తొణికిసలాడేలా ఉందో అని రామ భక్తులు, హనుమ భక్తులు రామచరిత మానసను ఎంతో భక్తితో పారాయణ చేస్తారు. అసలు చదువు రాని వారికి కూడా రామచరిత మానస అనేది కంఠతా వచ్చేస్తుంది.

అద్వైత సిద్ధాంతకర్త ఆది శంకరాచార్యులు (788-820) రాముడి గురించి ఎంత ఉన్నతంగా చెబుతారంటే.. రామ బ్రహ్మ పరమరథరూప, అబిగతాలలఖాంది అనుప అంటూ కీర్తించారు. అత్యున్నతమైన సత్యం వర్ణింపనలవి కానివానిగా రాముడిని ఆదిశంకరులు కీర్తించిన తత్వం భలే గమ్మతుగా ఉంటుంది.

నిర్గుణ, సుగణ రూప ధారి రాముడంటూ వీరు అభివర్ణించటం విశేషం. నిజానికి ఆది శంకరులు, తులసీదాసు ఇద్దరూ చెప్పేది ఒకటే. అగుణ సగుణ ద్యు బ్రహ్మ స్వరూప నిర్గుణ, సగుణ అంటూ ఇద్దరూ రాముడిలోని గొప్పతనాన్ని తన్మయత్వంతో కీర్తించారు. అగుణారూపాలఖాజియో, భగత ప్రేమ బసస గుణ సో హోయి అంటారు. నిర్గుణుడే కానీ భక్తుల ప్రేమ కారణంగా సగుణుడు అయ్యారంటూ వీరు తమ రచనల్లో పొందుపరచారు. రూపం లేని విశ్వ మనస్సాక్షి రాముడైనప్పుడు, మనందరిలో ఆత్మ రూపంలో రాముడు కొలువై ఉన్నప్పుడు..ఇందులో సామాజిక వివక్ష ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది? రామచరిత మానసను తప్పుపట్టేటప్పుడు వాళ్లకు ఈ కనీస స్పృహ ఉండదా?

ఒక రోజు ఆది శంకరులు కాశిలోని గంగానదికి వెళ్తుంటే దారి మధ్యలో ఓ చండాలుడు ఎదురయ్యాడు. అప్పుడు శంకరులు, ఆయన శిష్యులు ఆ చండాలుడిని అడ్డు తప్పుకోమన్నారు. అప్పుడా చండాలుడు .. సర్వానికి మూలమైన అన్నం నుంచి నిర్మితమైన ఈ శరీరం చండాలుడిలోనూ, బ్రాహ్మణుడిలోనే ఒకటే కదా. మీరు అడ్డు తప్పుకోమన్నది నా ఈ శరీరాన్నా లేక లోపలున్న ఆత్మనా అని అడిగాడు. అప్పుడు అది ద్వందం అవుతుంది కానీ అద్వైతం కాదు కదా అని ఆ చండాలుడు శంకరాచార్యని ప్రశ్నించాడు. అప్పుడు ఆత్మ అందరికీ ఒకటేనని, చండాలుడైనా, బ్రాహ్మణుడైనా ఆత్మ ఒకటేనంటూ శంకరుడు సమాధానం ఇచ్చి.. ఇలా అడుగుతున్నది సాక్షాత్తూ పరమశివుడే కానీ వేరేవారు కారు.. నాలుగు వేదాలతో శివుడు వచ్చి తనముందు నించుని అడుగుతున్నాడని శంకరుడు అర్థం చేసుకున్నాడు. అక్కడికక్కడే మనీషా పంచకం అనే ఐదు శ్లోకాలతో స్తోత్రం చేశారు.

మానవులను విభజించినది మాయ మాత్రమే. అసలు ఈ మాయ అంటే ఏమిటో వివరించమని లక్ష్మణుడు రాముడిని ఓ సందర్భంలో అడుగుతాడు. రాముడు.. (అంటే తులసీదాసు మాటల్లో ఇదంతా).. నేను, నువ్వు, మనం, నీది, నాది ఇదే మాయ అంటే అని రాముడు చెబుతాడు. ఆధ్యాత్మిక జ్ఞానం ఉంటే అది ఊంచ-నీచ అనే తారతమ్యాన్ని అస్సలు చూపదని, గర్వం కూడా ఉండదని అన్ని ఆత్మలను సమానంగా చూస్తుందని రాముడు లక్ష్మణుడికి చెప్పినట్టు తులసీదాసు రాస్తాడు.

సగుణుడిగా రాముడు ఎంతో దయ, జాలి కలిగినవాడు. అందుకే తులసీదాసు రామచరిత మానసలో ఎన్నో కీర్తనలు, భజనల్లో రామతత్వాని రమిస్తూ..మనల్ని కూడా రమించేలా చేస్తాడు. ఓ మనసా ఎంతో దయా గుణం ఉన్న రాముడిని మనసారా పూజించు, చావు అనే భయాన్ని దరి చేరకుండా చేసే రామ మంత్రం పఠించు, అలాగే పునర్జన్మ నుంచి శాశ్వత విముక్తి పొందేందుకు రామనామ జపం చేయమంటాడు. అందుకే లక్ష్మణుడితో రాముడు ఇలా చెబుతాడు ..ఇతరుల మేలు కోరటాన్ని మించిన ధర్మం ఉండదని .. ఇతరులను అణగదొక్కటానికి మించిన నీచమైన పని మరోటి లేదని బోధిస్తాడు. అందుకే భక్తి రసాన్ని మనందరికీ పంచే తులసీదాసు ఆధ్యాత్మిక, భక్తి మార్గంలో మనల్ని ఓలలాడిస్తూనే, సమాజంలో ఎటువంటి విభేదాలు, తారతమ్యాలు, విభజనలు ఉండకూడదని బోధిస్తాడు. వివక్ష లేని సమాజాన్ని భక్తి తత్వంలో పొందుపరిచిన తులసీదాసునే వంకర పెడితే వారి వంకర బుద్ధిని ఏమనాలి. ఇది రామచరిత మానసపైన అవగాహన ఉన్నవారు, తులసీదాసు భక్తి పరంపరను అర్థం చేసుకున్నవారు బిహార్ మంత్రి మాటలతో ఎందుకు విభేదిస్తారనే అంతరార్థం, లోగుట్టు ఇదే. అందుకే చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యలు ఉత్తరాదిన కొందరు రామభక్తులకు, హనుమ భక్తులకు చెప్పలేనంత కోపం తెప్పించాయి.

అంతెందుకు భక్త శబరిని కలిసినప్పుడు లక్ష్మణుడికి రాముడు చెప్పిన మాటలు తులసీదాస్ మాటల్లో ఇలా ఉంటాయి..కులం, లింగం, మతం, వంశం, స్థాయి వంటివేవీ లెక్క చేయరాదని ఇవన్నీ నీళ్లి తేమ లేని మేఘాల వంటివి వీటితో ఉపయోగం లేదని చెబుతాడు. మరి ఇంతటి వసుధైక కుటుంబం, సామాజిక స్పృహ కలిగేలా తులసీదాస్ రాసిన రచనను ఓ మంత్రి తూలనాడటం అంటే ఎంత మూర్ఖత్వం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News