Saturday, November 23, 2024
Homeఓపన్ పేజ్Rape as a political weapon!: అత్యాచారం కేసుపై సరికొత్త రాజకీయాలు

Rape as a political weapon!: అత్యాచారం కేసుపై సరికొత్త రాజకీయాలు

కోల్‌ కతా ఆస్పత్రిలో ఒక జూనియర్‌ డాక్టర్‌ మీద అత్యాచారం, హత్య జరిగి పదిహేను రోజులు కావ స్తున్నా దేశవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు తగ్గలేదంటే అందుకు పూర్తిగా పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వ వైఫల్యమే కారణం. మమతా బెనర్జీ ప్రభుత్వం ఈ కేసును పరిష్కరించడంలో ఏమాత్రం శ్రద్ధాసక్తులు ప్రదర్శించకపోవడం వల్ల ఇది చినికి చినికి గాలివాన అయింది. మహిళల భద్రత విషయంలో ప్రభుత్వం ప్రదర్శించిన నిర్లక్ష్యం, ఉదాసీన వైఖరి పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాన్నే కాదు, దేశమంతటినీ నిర్ఘాంతపరుస్తోంది. ఇది పాలనకు సంబంధించిన వైఫల్యాలను కూడా బహిర్గతం చేస్తోంది. గతంలో కూడా మమతా బెనర్జీ ప్రభుత్వం అనేక విషయాల్లో విఫలం కావడం జరిగింది. మహిళల భద్రత విషయం వచ్చేసరికి మమత ప్రభుత్వం విపరీతమైన నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తుందనే అభిప్రాయం ప్రజల్లో నాటుకుపోయింది. ఇదే అదనుగా రాజకీయాలు తమ పాత్రను పోషించడం ప్రారంభిస్తాయనడంలో సందేహం లేదు. ఈ పరిస్థితిని అవకాశంగా తీసుకుని ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయడానికి ప్రతిపక్షాలు కూడా వెయ్యి కళ్లతో ఎదురు చూస్తుంటాయి. నిజానికి, ప్రతిపక్షాలకు కావలసిన అవకాశాన్ని ప్రభుత్వమే పళ్లెంలో పెట్టి అందిస్తూ ఉంటుంది.
ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, చర్యలు మొదటి నుంచి తప్పుల తడకగానే ఉంటు న్నాయి. ప్రభుత్వానికి పరిస్థితుల మీద అదుపు తప్పిపోయిందనడానికి అనేక సందర్భాల్లో అనేక ఉదంతాలు కనిపించాయి. ఆర్‌.జి. కార్‌ ఆస్పత్రిలో వైద్యురాలిపై అత్యాచారం, హత్య జరిగిన కొద్ది సేపటికే ప్రభుత్వం ఈ ఆస్పత్రి-వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ సంజయ్‌ ఘోష్‌ ను మరో ఆస్పత్రికి బదిలీ చేయడం ఘోరమైన తప్పిదం అనడంలో ఏమాత్రం సందేహం లేదు. అర్ధరాత్రి వేళ డాక్టర్లు సమ్మెకు దిగడాన్ని, కొందరు దుండగులు యథేచ్ఛగా ఆస్పత్రిలో ప్రవేశించి విధ్వంసకాండ చేపట్టడాన్ని ప్రభుత్వం ఏ విధంగానూ నిరోధించలేకపోయింది. ప్రభుత్వం తీసుకున్న చర్యలు, పాలక పక్ష నాయకులు చెప్పిన మాటలు నిజానిజాలను వెలికి తీయడంలో ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి అద్దం పట్టలేకపోయాయి. పైగా, ప్రభుత్వం ఈ అత్యాచారం, హత్య కేసును మసిపూసి మారేడు కాయ చేసే ప్రయత్నంలో ఉందనే అభిప్రాయాన్నే కలిగించాయి. నేరస్థులను కాపాడే ప్రయత్నం జరుగుతోందనే భావనను కూడా కలిగించాయి. ప్రతిపక్షాలు ఈ సంఘటనకు బంగ్లాదేశ్‌ తో పోలికలు తీసుకు రావడం కూడా జరిగింది. విచిత్రమేమిటంటే, మమతా బెనర్జీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నవారికి బెంగాల్‌ పోలీసులు నోటీసులు జారీచేయడం జరిగింది.
ఈ అత్యాచారం, హత్య కేసులో పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం చాలావరకు నిస్సిగ్గుగా వ్యవహరిం చింది. మమతా బెనర్జీ స్థాయి వ్యక్తి ఇతర రాష్ట్రాల్లో కూడా అత్యాచారాలు జరుగుతున్నాయని, హత్యలు జరుగుతున్నాయని వ్యాఖ్యానించడం ఆశ్చర్యం కలిగించింది. ముఖ్యంగా మహిళల భద్రత విషయంలో ఆమె ఇలా వ్యాఖ్యానించడం ఆమె స్థాయికి తగ్గ విషయం కాదు. చివరికి న్యాయ స్థానాలు కూడా ఆమె మీద విమర్శల వర్షం కురిపించాయి. ఆమె చర్యలు, నిర్ణయాలను అవి తీవ్రంగా తప్పుబట్టాయి. పాలనా వైఫల్యానికి సంబంధించి తీవ్ర వ్యాఖ్యలు చేశాయి. కలకత్తా హైకోర్టు మరో అడుగు ముందుకు వెళ్లి ఈ కేసును రాష్ట్ర పోలీసుల నుంచి తీసుకుని, సి.బి.ఐకి అప్పగించడం జరిగింది. సుప్రీం కోర్టు కూడా ఈ కేసును తనకు తానుగా విచారణకు స్వీకరించింది. “గత 30 ఏళ్ల కాలంలో పోలీసులు ఇంత అధ్వానంగా వ్యవహరించడాన్ని నేను చూడలేదు” అని సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఒకరు వ్యాఖ్యానించారు. అత్యంత దారుణంగా సామూహిక అత్యాచారానికి, హత్యకు గురైన ఒక మహిళా వైద్యురాలి విషయంలో పాలకులు, పోలీసులు, నాయకులు ఏక మొత్తంగా విఫలమవడం నిజంగా దేశ చరిత్రలో అత్యంత హేయమైన విషయం అనడంలో సందేహం లేదు. మహిళలకు ఈ ప్రభుత్వం మౌలికమైన భద్రత కూడా కల్పించలేకపోతోందనే అభిప్రాయం ప్రజల్లో తీవ్ర అసంతృప్తికి దారి తీయడమే కాక, ప్రతిపక్షాలకు ఒక వాడి వేడి అస్త్రాన్ని అందించినట్టయింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News