Thursday, September 19, 2024
Homeఓపన్ పేజ్Rapes in India: ఇంకెన్నాళ్ళీ కీచకపర్వం

Rapes in India: ఇంకెన్నాళ్ళీ కీచకపర్వం

ఒక పక్క ఉత్కృష్టమైన చంద్రుని దక్షిణ ధృవంపై ఆగష్టు 23, 2023న అంతరిక్ష నౌకను దింపిన మొట్టమొదటి దేశంగా గర్వంతో తల ఎత్తుకోవాలో లేదా ఆగష్టు 9, 2024న శిక్షణ పొందుతున్న మహిళా డాక్టర్ పై కోల్కతాలోని ఆర్ జి కర్ వైద్య కళాశాలలో అత్యంత పాశవికంగా జరిగిన హత్యాచార సంఘటనపై సిగ్గుతో తల దించుకోవాలో అర్థం కావడం లేదు. ఈ రెండు పరిణామాలు దేనికి సంకేతాలనుకోవాలి? దేశ పురోగమనానికా లేదా తిరోగమనానికా! అత్యాచారం భారతదేశంలో అత్యంత వేగంగా పెరుగుతున్న నేరాలలో ఒకటి అంటే మీరు నమ్ముతారా? 16 డిసెంబర్ 2012 రాత్రి దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన నిర్భయ అ(హ)త్యాచార సంఘటన యావత్ దేశాన్ని కుదిపేసిన నేపథ్యంలో అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా నేరస్థులను ఉక్కుపాదంతో నలిపివేసేందుకు లోక్ సభలో మార్చ్ 19 మరియు రాజ్య సభలో మార్చ్ 21, 2013 “నిర్భయ చట్టం” ఆమోదం పొంది అమలులోకి వచ్చినప్పటికీ పరిస్థితిలో వీసమెత్తు మార్పు కూడా రాకపోవడం అత్యంత శోచనీయం. దేశంలో సగటున ప్రతి 16.6 నిమిషాలకు ఒక అత్యాచారం జరుగుతోందన్న విషయం మనలో ఎందరికి తెలుసు? నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) అధ్యయనం ప్రకారం రాజస్థాన్‌లో ప్రతి గంట 37 నిమిషాలకు, ఉత్తరప్రదేశ్‌ 2 గంటల 22 నిమిషాలకు అత్యాచారాలు జరుగుతుండగా తరువాత స్థానాల్లో మధ్యప్రదేశ్‌ మరియు మహారాష్ట్రలున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ప్రతి 14 గంటల 6 నిమిషాలకు మరియు తెలంగాణలో 10 గంటల 45 నిమిషాలకు మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నట్లు ఎన్ సి ఆర్ బి నివేదిక ద్వారా తెలుస్తోంది. మన దేశంలో కొన్ని కఠినమైన చట్టాలున్నప్పటికీ అవి అత్యాచారాలను అరికట్టడంలో నిస్సహాయంగా మిగిలిపోతున్నాయి.

- Advertisement -

కోల్కతా ఘటన:
కోల్కతాలో డాక్టర్‌పై అత్యాచారం మరియు హత్య కేసు దావానలంలా వ్యాపించి దేశవ్యాప్తంగా వైద్యుల నిరసనలకు, ప్రజాందోళనలకు దారి తీసింది. ఈ సంఘటన వెలుగులోకి వచ్చినప్పటి నుండి విభిన్న కథనాలు మరియు దిగ్భ్రాంతికరమైన నివేదికలు బయటకు వస్తుండడంతో పోలీస్ శాఖ మాత్రం వాటిని నిరాధారమైన నివేదికలుగా కొట్టిపారేస్తూ, నిర్ధారణ లేకుండా నకిలీ సమాచారాన్ని వ్యాప్తి చేయవద్దని ప్రతి ఒక్కరినీ కోరింది. బాధితురాలి ఎముకలు విరగడం లాంటి వార్తలను మరియు ఇతర కోణాలను ఆ శాఖ ఇప్పటికే తోసిపుచ్చింది. రాష్ట్ర ముఖ్యమంత్రి, వైద్య శాఖ మంత్రి, హోం మంత్రి స్వయంగా తానే అయినప్పటికీ, మమతా బెనర్జీ ఈ కేసులో పరోక్షంగా నిందితులను కాపాడేందుకు ఉదాసీన వైఖరి ప్రదర్శిస్తున్నారని సర్వత్రా విమర్శలు వస్తున్న నేపథ్యంలో కోల్కతా హై కోర్టు కేసును సీబీఐకి అప్పగించింది. ఈ కేసును సుమోటోగా స్వీకరించిన సుప్రీం కోర్టు నేరాన్ని ఉదయమే గుర్తించినప్పటికీ కళాశాల ప్రిన్సిపాల్ అది ఆత్మహత్య అన్నట్లు సమాచారం సమాచారం అందించే ప్రయత్నం చేయడం, మృతదేహం బాధితురాలి బంధువులకు అప్పగించిన మూడు గంటల తరువాత రాత్రి 11.45 గంటలకు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం పట్ల రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు శాఖ మరియు కళాశాల అధికారుల వైఖరిపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ దర్యాప్తు నివేదికను 24 గంటల్లో సమర్పించాలని ఆదేశించింది. ఇదిలా ఉండగా ఇటీవల మహారాష్ట్ర, బద్లాపూర్ లోని ఓ పాఠశాలలో నాలుగేళ్ల బాలికలు టాయిలెట్లో ఉండగా శుభ్రం చేసే నెపంతో లోపలికెళ్ళిన స్వీపర్ వారిపై లైంగిక వేధింపులకు పాల్పడడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. దేశవ్యాప్తంగా ఇలాంటి ఉదంతాలు ప్రతి రోజు చోటు చేసుకుంటూనే ఉన్నప్పటికీ కొన్ని మాత్రమే వెలుగులోకి వస్తున్నాయి. 2012లోనే లైంగిక వేధింపుల నుండి బాలలను రక్షించడానికి భారత ప్రభుత్వం లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (POCSO) చట్టాన్ని ఆమోదించినప్పటికీ 2016 నుండి 2022 నాటికి బాలికలపై అత్యాచారాలు 96.8 శాతం అధికం కాగా కేవలం 2022 లోనే 38,911 కేసులు నమోదు కావడం మానవత్వం ఉన్న ఎవరి వెన్నులోనైనా వణుకు పుట్టించక మానదు. ఇలాంటి నేరాలలో కనీస శిక్షను 10 సంవత్సరాల నుండి జీవితఖైదుగా పొడిగించే అవకాశంతో పాటు బాధిత వ్యక్తి 12 ఏళ్లలోపు ఉంటే మరణశిక్ష విధించడం, నేరస్థుడు 16 ఏళ్ల వయస్సు దాటితే బాలనేరస్థుడిగా పరిగణించకపోవడం లాంటి మార్పులు చేసినప్పటికీ కేసుల సంఖ్యలో తగ్గుదల ఉండడం లేదు.

కారణాలు:
2019నాటి ఎన్సీఆర్బీ సమాచారం ప్రకారం, దేశంలో ప్రతిరోజూ సగటున 88 అత్యాచారాలు జరుగుతున్నప్పటికీ 27.80 శాతం కంటే తక్కువ కేసులలో మాత్రమే నేరం నిరూపించబడి నేరస్థులు శిక్షింపబడుతున్నారు. నేర నిరూపణ శాతం తక్కువగా ఉండటంపై ఆందోళన వ్యక్తం చేస్తూ, 90 శాతం కేసులలో నేరస్థులు నిర్దోషులుగా శిక్ష నుండి తప్పించికుంటున్నారని సుప్రీంకోర్టు కూడా అభిప్రాయపడింది. అత్యాచారం ఒక క్రిమినల్ నేరం కావడం, దీని విచారణకు నిర్దిష్టమైన కాల పరిమితి లేకపోవడంతో కీలకమైన సాక్ష్యాలను సులభంగా తారుమారు చేయగలగడం వల్ల తగినంత సమయం గడిచిపోతే అత్యాచారం నేరం జరిగిందని నిరూపించడం కష్టమవుతుంది. అత్యాచారం యొక్క నేరాన్ని నిర్ధారిస్తున్నప్పుడు రుజువు చేయవలసిన బాధ్యత ఎల్లప్పుడూ ప్రాసిక్యూషన్‌పై ఉంటుంది. శిక్ష కూడా దాదాపు పూర్తిగా ప్రాసిక్యూట్రిక్స్ సాక్ష్యంపై ఆధారపడి ఉంటుంది. దీనితో పాటు చట్టం పట్ల నేరస్థులలో భయం లేకపోవడం, అందుబాటులో ఉన్న చట్టాల అమలులో అలసత్వం, పేలవమైన పోలీస్ మరియు న్యాయ వ్యవస్థలు, నేరస్థుడు(లు) పలుకుబడి వర్గానికి చెందినవారైతే బాధిత వ్యక్తి మరియు వారి బంధువులు చట్టపరమైన చర్యలకు వెనుకంజ వేయడం, ఒకవేళ వారు ధైర్యం చేసి అందుకు ఉపక్రమించినప్పటికీ కేసులో పురోగతి ఉండకపోవడం నేరస్థులు పెట్రేగిపోవడానికి కారణమవుతున్నాయి.

ప్రతిస్పందనలో ఆవేశం, కార్యాచరణలో అలసత్వం:
దేశంలో ఇలాంటి అమానవీయ సంఘటనలు జరిగినప్పుడు సాధారణ ప్రజలు, రాజకీయ పార్టీలు, మీడియా, స్వచ్ఛంద సంస్థలు, స్త్రీ అభ్యుదయ సంఘాలు అత్యంత ఆవేశకావేశాలతో పాలపొంగులా అట్టుడికి పోయి కొవ్వొత్తుల ర్యాలీలు, బంద్ లు, రాస్తా రోకోలు, జిందాబాద్, ముర్దాబాద్ నినాదాలతో హోరెత్తిస్తారు. కొన్ని టీవీ ఛానెళ్ళు తమ టీఆర్పీ పెంచుకోవడం కోసం బ్రేకింగ్ లు, వరుస కథనాలను ప్రసారం చేస్తూ స్వీయ లబ్ది పొందేందుకు ప్రయత్నిస్తుంటాయి. అంతే తప్ప సమస్య మూల కారణాలను తెలుసుకుని దానిని పరిష్కరించేందుకు నడుం బిగించరు. అధికారంలో ఉన్న ప్రభుత్వాలు కూడా కేవలం చట్టాలు రూపొందించి చేతులు దులుపుకుంటాయి తప్ప నిర్దిష్టమైన కార్యాచరణతో సమస్య పూర్వాపరాలను శాస్త్రీయంగా అధ్యయనం చేసి పరిస్థితిని మెరుగుపరచే ప్రయత్నం చేయవు. దీనికి తోడు పోలీసు శాఖ మరియు మన న్యాయ వ్యవస్థ ఉదాసీన వైఖరి కూడా పరిస్థితి నానాటికీ మరింత దిగజారేందుకు దోహదపడుతున్నాయి. ఇలాంటి సంఘటనలో సాధారణంగా పరువుకు భయపడి కొందరు బాధితులు ఫిర్యాదు చేయడానికి ముందుకు రాకపోగా, మరి కొన్ని సందర్భాలలో పోలీసులు త్వరితగతిన నిందితులను గుర్తించి కేసులు నమోదుచేసి నేరారోపణను ఋజువు చేసే సాక్ష్యాలను న్యాయస్థానాలలో ప్రవేశ పెట్టకపోవడం, న్యాయస్థానాలు ఇలాంటి కేసులను కూడా సాధారణ కేసుల మాదిరిగా వాయిదా వేయడంతో నేరస్థులలో పరివర్తన రాకపోగా మరిన్ని అఘాయిత్యాలకు కారణమవుతోంది. 16 డిసెంబర్ 2012 నాటి నిర్భయ నేరం ఋజువు కావడంతో 13 మంది నేరస్థులలో నలుగురికి ఢిల్లీ న్యాయస్థానం సెప్టెంబర్ 2013లో ఉరిశిక్ష విధించగా మార్చ్ 2014 హైకోర్టు ఆ తరువాత మే 2017లో సుప్రీంకోర్టు ఉరిశిక్షను ఖరారు చేసాయి. నేరస్థుల క్షమాభిక్ష అభ్యర్థనను జనవరి 2020 రాష్ట్రపతి తోసిపుచ్చడంతో, ఎట్టకేలకు న్యాయమూర్తి జస్టిస్ ధర్మేందర్ రాణా ఉత్తర్వుల మేరకు ఫిబ్రవరి 1, 2020న తీహార్ జైలులో ఉరి తీసారు.

నియంత్రణ చర్యలు:
మొక్కై వంగనిది మానై వంగునా అన్నట్లు ఉపాధ్యాయులు పాఠాశాల స్థాయి నుండి విద్యార్థులకు ఈ విషయంపై అవగాహన కల్పించడం, ఇలాంటి చర్యలకు పాల్పడడం అపరాధం అన్న భావన వారి మదిలో బలంగా నాటుకునేలా చెయ్యడంతో పాటు తల్లిదండ్రులు ఖచ్చితంగా తమ సంతానం కోసం కొంత సమయం కేటాయించి ప్రత్యేకంగా హార్మోన్ల ప్రభావం అధికంగా ఉండే యుక్తవయసులో వారి ప్రవర్తనను నిశితంగా గమనిస్తూ వారు సత్ప్రవర్తన దిశలో పయనించేలా చేయూతనందించాలి. అత్యాచార సంఘటనలలో నేరస్థులను కఠినాతికఠినంగా శిక్షించాలి. ఈ శిక్ష కొన్ని నెలలు/యేళ్ళు జైలు శిక్ష మరియు జరిమానాతో సరిపెట్టకూడదు. భారత రాజ్యాంగం ద్వారా సిద్ధించే అన్ని హక్కులను, పాస్ పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్లను కనీసం పదేళ్ళ పాటు రద్దు చేయాలి. అవసరమైతే చట్ట సవరణ చేసేందుకు అన్ని రాజకీయ పార్టీలు ఏకతాటిపైకి రావాలి. ప్రగతిశీల భావాలు గల సాధారణ పౌరులు, స్వచ్ఛంద సంఘాలు ఈ అంశంలో అన్ని రాజకీయ పార్టీలపై వత్తిడి పెంచే బాధ్యతను తమ భుజస్కంధాలపై వేసుకోవాలి. భారత న్యాయ వ్యవస్థ ఈ సమస్య తీవ్రత దృష్ట్యా, కేసులను విచారించడానికి ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయడంతో పాటు విచారణ ప్రక్రియ పూర్తిచేయడానికి నిర్దిష్టమైన కాలపరిమితి విధించాలి. కోల్కతా డాక్టర్ దుర్ఘటన ఉదంతం నేపథ్యంలో కేరళ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని మెడికల్ కాలేజీల్లోని ఉద్యోగుల భద్రత కోసం “స్పేస్ ఆడిట్‌”ను ఆదేశించడం గమనార్హం. సంస్థ స్థాయిలో ప్రిన్సిపాళ్లు మరియు రాష్ట్ర స్థాయిలో మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఈ ఆడిట్ ను నిర్ధారించాల్సి ఉంటుంది.

సభ్య సమాజం (ప్రత్యేకించి తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు), సమాజాన్ని ప్రభావితం చేయగల సెలెబ్రెటీలు, స్వచ్ఛంద సంస్థలు, మానవ హక్కుల సంఘాలు, పోలీసు యంత్రాంగం, న్యాయ వ్యవస్థ, రాజకీయ నాయకులు ఈ సామాజిక రుగ్మతను అరికట్టేందుకు సంఘటితమై తమదైన శైలిలో కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

యేచన్ చంద్ర శేఖర్
మాజీ రాష్ట్ర కార్యదర్శి
ది భారత్ స్కౌట్స్ & గైడ్స్, తెలంగాణ
హైదరాబాద్
✆ 8885050822

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News