Saturday, November 2, 2024
Homeఓపన్ పేజ్Rare teacher-students won Nobel: నోబెల్‌ బహుమతి గెలుచుకున్న అరుదైన గురుశిష్యులు

Rare teacher-students won Nobel: నోబెల్‌ బహుమతి గెలుచుకున్న అరుదైన గురుశిష్యులు

ప్రపంచం మెచ్చిన ఆస్ట్రో ఫిజిక్స్ సైంటిస్ట్

సుబ్రహ్మణ్యన్‌ చంద్రశేఖర్‌ భారతదేశంలో జన్మించిన సుప్రసిద్ధ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త. అతను నక్షత్రాల పరిణామం, నిర్మాణంపై తన సైద్ధాంతిక అధ్యయనాలకు గాను 1983లో భౌతిక శాస్త్రంలో నోబెల్‌ బహుమతిని విలియం ఆల్ఫ్రెడ ఫౌలర్‌ తో కలిసి సంయుక్తంగా గెలుచుకున్నాడు. కాగా ఆయన విద్యార్థులలో ఇద్దరు, సుంగ్‌-దావో లీ మరియు చెన్‌-నింగ్‌ యాంగ్‌ సంయుక్తంగా, ఆయన కంటే 26 సంవత్సరాల ముందే, 1957లో నోబెల్‌ బహుమతులు గెలుచుకోవడం విశేషం. తన విద్యార్థులతో ఎంతో సఖ్యతగా పనిచేసిన చంద్రశేఖర్‌ కెరీర్‌లో కనీసం 46 మంది డాక్టరల్‌ విద్యార్థులకు మార్గదర్శకత్వం వహించాడు. తన విద్యార్థులు పీహెచ్‌డీలను సంపాదించే వరకు తనను ప్రొఫెసర్‌ చంద్రశేఖర్‌ అని సంబోధించాలని ఆయన పట్టుబట్టేవారు. ఆయన విస్కాన్సిన్‌లోని విలియమ్స్‌ బేలోని యెర్కేస్‌ అబ్జర్వేటరీలో 27 సంవత్సరాలు పరిశోధనలు కొనసాగించారు.

- Advertisement -

అరుదైన ఘనత:
1930 దశకం చివరలో, డాక్టర్‌ చంద్రశేఖర్‌ చికాగో విశ్వవిద్యాలయం ప్రధాన క్యాంపస్‌ నుండి 80 మైళ్ళ దూరంలో గల ఖగోళ అబ్జర్వేటరీలో ఖగోళ భౌతిక శాస్త్రంలో ఒక కోర్సును బోధించవలసి ఉండగా, ఆ కోర్సుకు కేవలం ఇద్దరు విద్యార్థులు మాత్రమే తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ప్రజాదరణ కలిగిన తమ కోర్సులలో అధిక సంఖ్యలో విద్యార్థులు నమోదు చేసుకోగా, చంద్రశేఖర్‌ కోర్సుకు ఇద్దరు విద్యార్థులు మాత్రమే నమోదు చేసుకోవడంతో మిగతా ప్రొఫెసర్లు ఆయనను ఎగతాళి చేశారు. కేవలం ఇద్దరు విద్యార్థుల కోసం 100 మైళ్లకు పైగా అంతగా సౌకర్యం లేని మార్గంలో ప్రయాణించవలసి ఉండడం వలన డాక్టర్‌ చంద్రశేఖర్‌ కోర్సును రద్దు చేస్తారని అందరూ భావించారు. అయినప్పటికీ సబ్జెక్ట్‌పై గల మక్కువ, లోతుగా బోధించే, అన్వేషించే అవకాశాన్ని కోల్పోకూడదనుకున్న పట్టుదలతో డాక్టర్‌ చంద్రశేఖర్‌ ఏమాత్రం నిరుత్సాహం చెందక, ఆ కోర్సును కొనసాగించేందుకే నిర్ణయించుకున్నారు. అత్యల్ప సంఖ్యలో, ఇద్దరు విద్యార్థులు మాత్రమే ఉండడంతో వారికి పరస్పరం చర్చించుకోవడానికి అత్యధిక సమయం ఉండేది. సుంగ్‌-దావో లీ మరియు చెన్‌-నింగ్‌ యాంగ్‌ ఇరువురు చైనాలో జన్మించిన భౌతిక శాస్త్రవేత్తలు. వీరిరువురు బలహీనమైన పరస్పర చర్యలలో సమానత్వం లేని పరిరక్షణపై చేసిన కృషికి భౌతిక శాస్త్రంలో 1957 సంవత్సరంలో నోబెల్‌ బహుమతిని సంయుక్తంగా గెలుచుకోగా, సరిగ్గా 26 సంవత్సరాల తరువాత 1983లో వారి అధ్యాపకుడు సుబ్రహ్మణ్యన్‌ చంద్రశేఖర్‌ 1983లో భౌతిక శాస్త్రంలో నోబెల్‌ బహుమతిని గెలుచుకున్నారు. ఆ విధంగా ఆ తరగతికి చెందిన ముగ్గురు శాస్త్రవేత్తలు భౌతిక శాస్త్రంలో నోబెల్‌ బహుమతి దక్కించుకుని రికార్డు సృష్టించారు. నవంబర్‌ 24, 1926న చైనా లోని షాంఘైలో జన్మించిన సుంగ్‌-దావో లీ ఆగష్టు 4, 2024న అమెరికాలోని శాన్‌ ఫ్రాన్సిస్కోలో మరణించారు. కాగా చెన్‌-నింగ్‌ యాంగ్‌, సెప్టెంబర్‌ 22, 1922న చైనా లోని హోఫైలో జన్మించారు. సమతౌల్య పరిరక్షణ సూత్రం (సబ్‌-అటామిక్‌ పార్టికల్‌ ఇంటరాక్షన్స్‌ యొక్క స్పేస్‌ రిఫ్లెక్షన్‌ సమరూపత యొక్క నాణ్యత) ఉల్లంఘనలను కనుగొనడం ద్వారా కణ భౌతిక సిద్ధాంతంలో ప్రధాన మెరుగుదలలను తీసుకురావడంలో వీరు ప్రశంసనీయమైన కృషి చేశారు.

కుటుంబంలో నోబెల్‌ అందుకున్న రెండవ వ్యక్తి:
1930లో చంద్రశేఖర్‌ కుటుంబంలో నోబెల్‌ బహుమతి అందుకున్న తొలి వ్యక్తి సర్‌ సి వి రామన్‌ కాగా 1983లో ఆ బహుమతి అందుకున్న రెండవ వ్యక్తి సుబ్రహ్మణ్యన్‌ చంద్రశేఖర్‌. కాగా కుటుంబంలోని ఈ ఇద్దరు కూడా భౌతిక శాస్త్రంలో నోబెల్‌ బహుమతి గెలుచుకోవడం విశేషం. సర్‌ సి వి రామన్‌ రాళ్ళు, ఖనిజాలు, కాంతిని వెదజల్లే పదార్థాల సేకరణకు ప్రసిద్ధి చెందడమే కాక అతను వాటిని చేతిలో పట్టుకుని ఉపయోగించే (హ్యాండ్‌హెల్డ్‌ స్పెక్ట్రోస్కోప్‌తో అధ్యయనం చేశాడు. కాగా సుబ్రహ్మణ్యన్‌ చంద్రశేఖర్‌ భారతదేశంలో జన్మించిన అమెరికన్‌ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త. అతను భారీ నక్షత్రాల పరిణామం గురించి ముఖ్యమైన ఆవిష్కరణలు, ముఖ్యంగా శ్వేత కుబ్జ తార ( వైట్‌డ్వార్ఫ్‌) మరియు కృష్ణ బిలాలు (బ్లాక్‌ హోల్‌) గురించి అధ్యయనం చేశారు. ప్రతి వ్యక్తి జీవితంలోను బాల్య, కౌమార, యౌవన, వృద్ధాప్య దశలున్నట్టే, నక్షత్రాల్లో కూడా పరిణామ దశలుంటాయి. వీటిల్లో చెప్పుకోదగ్గ దశలు అరుణ మహాతార (రెడ్‌జెయంట్‌), శ్వేత కుబ్జ తార ( వైట్‌డ్వార్ఫ్‌), బృహన్నవ్య తార (సూపర్‌నోవా), నూట్రాన్‌ తార, కృష్ణ బిలం (బ్లాక్‌హోల్‌) అనే దశలు ముఖ్యమైనవి. వీటి పట్ల అవగాహనను మరింతగా పెంచే సిద్ధాంతాలను, పరిశోధనలను అందించారు సుబ్రహ్మణ్యన్‌ చంద్రశేఖర్‌. సాపేక్ష, క్వాంటం సిద్ధాంతాల్లోని అంశాల ఆధారంగా ఆయన నక్షత్రాల పరిణామాలకు సంబంధించిన పరిస్థితులను విశ్లేషించారు. ఒక నక్షత్రం వైట్‌డ్వార్ఫ్‌ దశకు చేరుకోవాలంటే ఎలాంటి పరిస్థితులుండాలో చెప్పిన సిద్ధాంతమే చంద్రశేఖర్‌ లిమిట్‌గా పేరొందింది. దీని ప్రకారం సూర్యుని ద్రవ్యరాశి కన్నా 1.44 రెట్లకు తక్కువ ద్రవ్యరాశి ఉన్న నక్షత్రాలే వైట్‌డ్వార్ఫ్‌గా మారతాయి. అంతకు మించిన ద్రవ్యరాశి ఉంటే అవి వాటి కేంద్రకంలోని గురుత్వశక్తి ప్రభావం వల్ల కుంచించుకుపోయి సూపర్‌నోవాగా, న్యూట్రాన్‌స్టార్‌గా మారుతూ చివరికి బ్లాక్‌హోల్‌ (కృష్ణబిలం) అయిపోతాయి.

అమెరికా వలస:
1935లో చంద్రశేఖర్‌ను హార్వర్డ్‌ అబ్జర్వేటరీ డైరెక్టర్‌ హార్లో షాప్లీ మూడు నెలల పాటు సైద్ధాంతిక ఖగోళ భౌతిక శాస్త్రంలో విజిటింగ్‌ లెక్చరర్‌గా ఆహ్వానించగా అదే సంవత్సరం డిసెంబరులో ఆయన అమెరికా వెళ్లారు. ఆ తరువాత 1937లో అమెరికాకు వలస వెళ్లిన ఆయన అదే సంవత్సరం చికాగో విశ్వవిద్యాలయంలో అధ్యాపకుడిగా చేరారు. దాదాపు మూడు దశాబ్దాల అనంతరం, 1966లో ఆయన అమెరికా శాశ్వత పౌరసత్వాన్ని అందుకున్నారు. చంద్రశేఖర్‌ కి నోబెల్‌ బహుమానం ఇచ్చినప్పుడు అయన 1930 దశకంలో చేసిన పనికి ఆ బహుమానం అని ప్రకటించారు. తరువాత నాలుగు దశాబ్దాలపాటు అయన చేసిన ప్రాథమిక పరిశోధనలు, సాధించిన ఫలితాలని మాట వరసకైనా ఉటంకించలేదని ఆయన నొచ్చుకున్నారని అంటారు. నిజానికి అమెరికాలోఉన్న నాలుగు దశాబ్దాలలో ఆయన నాలుగు వివిధ దిశలలో పరిపూర్ణమైన సాధికారతతో అపురూపమైన ఫలితాలని సాధించారు. అందుకు తగిన గుర్తింపు లభించకపోవడం దురదృష్టకరం. ఖగోళ భౌతిక శాస్త్రంలో అవిరళ కృషి చేసిన ఆయనను 1953లో రాయల్‌ ఆస్ట్రోనామికల్‌ సొసైటీ గోల్డ్‌ మెడల్‌, 1962లో రాయల్‌ సొసైటీ యొక్క రాయల్‌ మెడల్‌, 1984లో రాయల్‌ సొసైటీ యొక్క కోప్లీ మెడల్‌తో సహా అనేక ఇతర అవార్డులు వరించాయి. ఆయన అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) నెలకొల్పిన ఖగోళ భౌతిక పరిశోధనాలయంలో కీలక బాధ్యత వహించారు. ఆయన సేవలకు గుర్తింపుగా ‘నాసా’ 1999లో ఒక పరిశోధన ప్రయోగశాలకు ‘చంద్ర’ అని ఆయన పేరు పెట్టారు.

బాల్యం, విద్యాభ్యాసం:
19 అక్టోబర్‌ 1910లో బ్రిటిష్‌-ఇండియా లోని లాహోర్‌ (పంజాబ్‌) లో జన్మించిన సుబ్రహ్మణ్యన్‌ చంద్రశేఖర్‌ బాల్యం నుంచే చదువులో చురుకుగా ఉండేవారు. ఆయన చెన్నైలోని హిందూ పాఠశాలలో ప్రాథమిక విద్యను, ప్రెసిడెన్సీ కళాశాలలో భౌతిక శాస్త్రంలో బీఎస్సీ ఆనర్స్‌ పట్టా పొందే నాటికే ఆయనకు అంతరిక్ష భౌతిక విజ్ఞాన శాస్త్రం పట్ల మక్కువ ఏర్పడింది. విశ్వాంతరాళంలో నక్షత్రాలు ఏర్పడే విధానం, నక్షత్రాలలో జరిగే పరిణామాలు, వాటి స్థిరత్వం తదితర అంశాలపై అధ్యయనం చేసి పరిశోధనలు జరిపి శాస్త్రజ్ఞులలో గుర్తింపు పొందాడు. 1929లో పదిహేనేళ్ళ వయస్సులోనే ఆయన తన మొట్టమొదటి పరిశోధనా పత్రం ప్రచురించారు. కాంప్టన్‌ ప్రభావం (Compton Effect) అనే దృగ్విషయం 1923లో ఆవిష్కరించబడగా, కాంప్టన్‌ ను 1927లో నోబెల్‌ బహుమతి వరించింది. ఒక కొత్త గణాంక పద్ధతి అంటూ 1926లో ఫెర్మీ, డిరాక్‌ అనే ఇద్దరు శాస్త్రవేత్తలు ఒక పత్రం ప్రచురించేరు. 1926లో ఫెర్మీ, డిరాక్‌ అనే ఇద్దరు శాస్త్రవేత్తలు ఆవిష్కరించిన ఫెర్మీ-డిరాక్‌ గణాంక పద్ధతిని ఉపయోగించి, ఆర్‌. హెచ్‌. ఫౌలర్‌ అనే శాస్త్రవేత్త ఒక నక్షత్రం కూలిపోయి, శ్వేత కుబ్జ తార (వైట్‌ డ్వార్ఫ్‌) గా ఎలా మారుతుందో 1926లో వివరించారు. ఈ కొత్త గణాంక పద్ధతి ఆధారంగా సోమర్ఫెల్డ్‌ అనే వ్యక్తి లోహాలలో ఎలక్ట్రానుల ప్రవర్తన మీద మద్రాసులో ఒక ఉపన్యాసం ఇచ్చేడు. ఆ ఉపన్యాసంతో ప్రేరణ పొందిన పందొమ్మిదేళ్ల చంద్రశేఖర్‌ కొత్త గణాంక పద్ధతి దృష్టితో కాంప్టన్‌ ప్రభావం అనే పరిశోధనా పత్రాన్ని ప్రచురించగా, ఆ పత్రం కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న ఫౌలర్‌ కంటబడటంతో ఆయన సిఫార్సు చేయగా చంద్రశేఖర్‌కి ట్రినిటి కాలేజిలో ప్రవేశం లభించింది. బీఎస్సీ ఆనర్స్‌ పూర్తయిన వెంటనే ఉన్నత విద్య కోసం 1930లో తన 19వ యేట ఆయన ఇంగ్లాండ్‌ తరలివెళ్లారు.

యేచన్‌ చంద్ర శేఖర్‌
మాజీ రాష్ట్రకార్యదర్శి
ది భారత్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌, తెలంగాణ
హైదరాబాద్‌
8885050822

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News