Saturday, November 23, 2024
Homeఓపన్ పేజ్RBI surplus funds transferred: కేంద్రానికి లంకె బిందెలు

RBI surplus funds transferred: కేంద్రానికి లంకె బిందెలు

87, 416 కోట్ల మిగులు నిధులు

గత వారం కేంద్ర ప్రభుత్వానికి ఆకస్మిక ధన లాభం కలిగింది. కుచేలుడికి కృష్ణుడి మాదిరిగా కేంద్ర ప్రభుత్వానికి ఆర్‌.బి.ఐ చేయూత లభించింది. తన దగ్గర ఉన్న మిగులు నిధులన్నిటినీ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌.బి.ఐ) భారత ప్రభుత్వానికి బదిలీ చేయడం నిజంగా ప్రభుత్వానికి కలలో కూడా ఊహించని అదృష్టమనే చెప్పాలి. ఆర్‌.బి.ఐ బోర్డు కేంద్ర ప్రభుత్వానికి తమ వద్ద నిల్వ ఉన్న 2.11 లక్షల కోట్ల రూపాయాలను బదిలీ చేయాలని నిశ్చయించింది. ప్రస్తుతం నిధులకు కటకటలాడుతున్న కేంద్ర ప్రభుత్వాన్ని ఈ నిధులు ఎంతగానో ఆదుకుంటాయని ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు. ముఖ్యంగా జూన్‌ 4 తర్వాత అధికారంలోకి వచ్చే ప్రభుత్వానికి ఇది లంకె బిందెలు దొరకడం కంటే మించిన అదృష్టం అని భావించవచ్చు. గత ఏడాది కూడా ప్రభుత్వానికి ఇదే విధంగా ఆర్‌.బి.ఐ 87, 416 కోట్ల రూపాయలు బదిలీ చేయడం జరిగింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో కూడా ఆర్‌.బి.ఐ, జాతీయ బ్యాంకులు, ఇతర ఆర్థిక సహాయ సంస్థల నుంచి 1.02 లక్షల కోట్ల రూపాయలు అందవలసి ఉంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వానికి ఇంతకు రెట్టింపు నిధులు లభ్యమవుతున్నాయి. దీనివల్ల కొత్త ప్రభుత్వానికి అనేక ఆర్థిక సమస్యల నుంచి, ఒత్తిళ్ల నుంచి ఉపశమనం లభించే అవకాశం ఉంది.
దేశ, విదేశీ ఆస్తుల నుంచి, విదేశీ మారక నిల్వల నుంచి వచ్చే వడ్డీలన్నీ ఆర్‌.బి.ఐ ఖాతాలోకి వస్తుంటాయి. ఆ నిధులు ఆయేటికాయేడు ఈ ఖాతాలో పేరుకుపోతుంటాయి. అంతేకాక, అతి జాగ్రత్తగా ఖర్చు పెట్టే తత్వం వల్ల కూడా ఆర్‌.బి.ఐ ఖాతాల్లో నిధులు పెరుగుతుంటాయి. భవి ష్యత్తులో చోటు చేసుకునే అవాంఛనీయ, అత్యవసర పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఆర్‌.బి.ఐ ప్రతి ఏటా కొంత మొత్తాన్ని నిల్వ ఉంచుకుంటుంది. 2023-24 సంవత్సర లెక్కల ప్రకారం, ఆర్‌.బి.ఐ దగ్గర ఇటువంటి నిధులన్నీ అవసరానికి మించి 50 శాతానికి పైగా పెరిగిపోవడం జరిగింది. కేంద్రానికి భారీగా నిధులు బదిలీ చేయడమనేది ఆర్థిక వ్యవస్థ పట్ల ఆర్‌.బి.ఐకి పెరిగిన నమ్మకానికి నిదర్శనం. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థల్లో సమస్యలు తలెత్తినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ఆర్థిక సమస్యలను ఎదుర్కోగల స్థితిలో ఉందనే నిశ్చితాభిప్రాయంతోనే ఆర్‌.బి.ఐ ఇటువంటి నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తోంది. ఆర్‌.బి.ఐ మాజీ గవర్నర్‌ బిమల్‌ జలాన్‌ నాయకత్వంలోని ఆర్‌.బి.ఐ బోర్టు ప్రత్యేకంగా సమావేశమై, నిధుల బదిలీకి సిఫారసు చేస్తూ నిర్ణయం తీసుకుంది.
ఈ ఏడాది పూర్తి స్థాయి బడ్జెట్‌ ను ప్రవేశపెట్టే సమయంలో కొత్త ప్రభుత్వానికి ఈ నిధులు ఎంత గానో ఉపయోగపడతాయనడంలో సందేహం లేదు. ఈ నిధులతో ద్రవ్య లోటును గణనీయంగా తగ్గించడానికి వీలుంది. 2023-24 సంవత్సరంలో జి.డి.పిలో ఉన్న 5.8 శాతం లోటును 2024-25 సంవత్సరంలో 5.1 శాతానికి తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నిధులను ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల మీద గానీ, మూలధన వ్యయం మీద గానీ ఎక్కువగా ఖర్చు పెట్టే అవకాశం ఉంది. అనుకోని పరిణామాలను, పెట్టుబడుల ఉపసంహరణలోని లోటుపాట్లను ఎదుర్కోవడానికి కూడా ప్రభుత్వం ఈ నిధులను వ్యయం చేయడానికి వీలుంది. ప్రభుత్వం ద్రవ్య లోటును అదుపు చేయడం వల్ల ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడం కూడా సాధ్యపడుతుంది. చాలా నెలలుగా దేశం ద్రవ్యోల్బణం పెరగడమే తప్ప తగ్గడం కనిపించలేదు. మొత్తం మీద కేంద్ర ప్రభుత్వం ఈ భారీ మొత్తపు నిధులను ఎంత సద్వినియోగం చేస్తే ఆర్థిక వ్యవస్థకు, దేశాభివృద్ధికి అంత మంచిది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News