Friday, November 22, 2024
Homeఓపన్ పేజ్Reforms is the need of the hour: ఆధునిక పాలనకు సరైన సమయం

Reforms is the need of the hour: ఆధునిక పాలనకు సరైన సమయం

ఇది నిజంగా అనూహ్యమైన పురోగతి. సరిగ్గా 33 ఏళ్ల క్రితం, అంటే 1991లో భారతదేశం దగ్గరున్న విదేశీ నిల్వలు ఏడు రోజుల దిగుమతులకు మాత్రమే సరిపోయే స్థాయిలో ఉన్నాయి. కొన్ని రుణాల గడువు సమీపిస్తుండడంతో భారత ప్రభుత్వం 46.1 టన్నుల బంగారాన్ని బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌లో తాకట్టు పెట్టి 40.50 కోట్ల డాలర్లను తీసుకోవాల్సి వచ్చింది. దేశ ఆర్థిక వ్యవస్థ అత్యంత ప్రమాదంలో ఉన్న సందర్భం అది. ఫలితంగా తప్పనిసరిగా సరళీకరణను చేపట్టాల్సి వచ్చింది. గత శుక్రవారం అదే బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌ నుంచి రిజర్వ్‌ బ్యాంక్‌ వంద టన్నుల బంగారం బదిలీ అవడం నిజంగా ఒక పెద్ద విశేషం. మొత్తానికి అనేక సమస్యలు, సంక్షోభాల అనంతరం భారతదేశం నిరుపేద స్థితి నుంచి సంపన్న దేశ స్థాయికి ఎదిగింది. ప్రస్తుతం భారతదేశం దగ్గర 822 టన్నుల బంగారం నిల్వలున్నాయి. అంతేకాక, 64,600 కోట్ల డాలర్ల విదేశీ మారక నిల్వలున్నాయి. ప్రస్తుతం భారత దేశం అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ. ప్రపంచ దిగ్గజ ఆర్థిక వ్యవస్థల్లో అయిదవ స్థానంలో ఉందని అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు సైతం ప్రకటించాయి. ఇది తేలికగా తీసిపారేయాల్సిన వ్యవహారం కాదు. భారత ఆర్థిక వ్యవస్థ ఎంత వడిగా, వేగంగా పురోభివృద్ధి చెందుతున్నప్పటికీ 1991 సంక్షోభాన్ని మాత్రం కలలో కూడా మరచి పోకూడదు.
ఈ వారం కొత్త ప్రభుత్వం ఏర్పడబోతోంది. కొత్త పార్లమెంట్‌ సమావేశం కాబోతోంది. అంతర్జాతీయ పరిస్థితులు అతలాకుతలంగా ఉన్న సమయంలో, యుద్ధాలు, ఆర్థిక మాంద్యాలు అగ్ర రాజ్యాలను సైతం అధోగతికి నెడుతున్న సమయంలో దేశాన్ని అగ్ర రాజ్యాలకు మించిన స్థితికి తీసుకువెళ్లడానికి పోటీపడాల్సిన అవసరం ఉంది. అందుకు ఈ కొత్త ప్రభుత్వం, ఈ కొత్త పార్లమెంటే దోహదం చేయాల్సి ఉంటుంది. పార్టీలకు అతీతంగా గట్టి ప్రయత్నాలు చేయగలిగితేనే దేశ ఆర్థిక వ్యవస్థ నిలదొక్కు కోగలుగుతుంది. అతి కీలకమైన దేశ లక్ష్యాలను సాధించడానికి పార్టీలన్నీ కలిసి రావాలని, అఖిల పక్ష సమావేశాలు నిర్వహించి ఇందుకు కావాల్సిన సమష్టి వ్యూహాలను రూపొందించుకోవాలని కొత్త పార్లమెంట్‌ సమావేశాల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునివ్వాల్సిన అవసరం కనిపిస్తోంది. దేశంలో అభివృద్ధి పథంలో కొనసాగడానికి కొన్ని తప్పనిసరి సూచనలు, సలహాలు పాటించాల్సిన అగత్యం ఉంది.
మారుతున్న ప్రాధాన్యాలు
ముఖ్యంగా కొత్త ప్రభుత్వంలోని ప్రధానమంత్రి, ఇతర మంత్రులు తమ శాఖల నుంచి గరిష్ఠ స్థాయిలో పని రాబట్టుకుని, లక్ష్య సాధనలో కీలక పాత్ర పోషించడానికి పోటీ పడాల్సి ఉంటుంది. ప్రభుత్వ పరిమాణాన్ని బట్టి కాకుండా సమర్థతను బట్టి ప్రజలు ప్రభుత్వ పనితీరును అంచనా వేయడం జరుగుతుంది. దీన్ని గుర్తుంచుకుని ప్రతి శాఖా పూర్తి బాధ్యతతో వ్యవహరించేటట్టు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కొత్త తరహా ప్రభుత్వ నిర్వహణ కోసం ప్రధాని, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులతో ఒక నిపుణుల కమిటీని నియమించడం వల్ల సమగ్ర అభివృద్ధికి, పురోగతికి అవకాశం ఉంటుంది. ప్రపంచ దేశాలు కొత్త పారిశ్రామిక విధానాలను, ద్రవ్య విస్తరణను చేపడుతున్న నేపథ్యంలో మూలధన వ్యయానికి అత్యంత ప్రాముఖ్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది. వడ్డీ రేట్లను హేతుబద్ధ స్థాయిలో ఉంచడం, వనరుల నిర్వహణను మరింత సమర్థవంతం చేయడం, వృథా వ్యయాన్ని గణనీయంగా తగ్గించడం వంటివి ప్రస్తుత పరిస్థితుల్లో కీలకంగా మారాల్సి ఉంది.
దేశంలో 2004 నుంచి కేంద్ర ప్రభుత్వం 28 ప్రభుత్వ రంగ సంస్థలను క్రమబద్ధం చేయడం, పెట్టు బడులను ఉపసంహరించుకోవడం ద్వారా 21 లక్షల కోట్ల రూపాయలను ఆదా చేయగలిగింది. మరింతగా పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా మరో పది లక్షల కోట్ల రూపాయలు గడించడానికి అవకాశం ఉంది. ప్రభుత్వం ఎంత లేదన్నా కనీసం 80 శాతం పెట్టుబడులను తగ్గించుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా ఆర్థిక వనరులను పెంచుకుని వాటిని మానవ వనరులు, ప్రాథమిక సదుపాయాల మీద ఖర్చు చేయడం వల్ల అతి వేగంగా పురోగతి చెందడానికి, ప్రపంచంలో తృతీయ ఆర్థిక వ్యవస్థగా ఎదగడానికి అవకాశం కలుగుతుంది. డిజిటలైజేషన్‌ కారణంగా సంపద సృష్టి జరుగుతోంది. ఉపాధి అవకాశాలు మెరుగుపడుతున్నాయి. సొంతగా వ్యాపారాలు ప్రారంభించుకోవడానికి, ఉద్యోగాలను పెంచడానికి రుణ సహాయాలు లభిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన అవకాశాలు, మార్గాలు సామాన్య ప్రజల ముందుకు వస్తున్నాయి. ప్రైవేట్‌ ఈక్విటీ, యు.పి.ఐ చెల్లిం పులు, జి.ఎస్‌.టి వసూళ్ల వల్ల సంపద సృష్టి నిలకడగా కొన సాగుతోంది.
సంస్కరణలకు పెద్ద పీట
దేశంలో నిరుద్యోగం ఏ స్థాయిలో ఉంది, పేదరికంగా ఏ స్థాయిలో ఉంది అనేవి తేల్చడానికి కొత్త మదింపు వ్యవస్థల అవసరం ఉంది. భారతదేశం ఈ రంగాల్లో పురోగతి చెందాలన్న పక్షంలో తప్పనిసరిగా వీటి మదింపు వ్యవస్థలను గణనీయంగా మెరుగుపరచుకోవాల్సి ఉం టుంది. ఇక ఎన్నికలనే సరికి అవి వివిధ పథకాల మధ్య పోటీగా తయారవుతున్నాయి. సంక్షేమ పథకాల వల్ల ఖర్చు మాత్రమే జరుగుతోందా లేక వాటివల్ల దీర్ఘకాలం లోనైనా ఏవైనా ప్రయోజనాలు సమకూరుతున్నాయా అన్నది బేరీజు వేయాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఏటా అయిదు లక్షల కోట్ల రూపాయలను సంక్షేమ పథ కాలపై ఖర్చు పెడుతోంది. రాష్ట్ర ప్రభుత్వాలు ఏ స్థాయిలో వీటి మీద ఖర్చు పెడుతున్నాయో చెప్పనక్కర లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వీటి ఫలితాలను మదింపు చేయాల్సిన పరిస్థితి వచ్చేసింది. వీటి ప్రతిఫలాలు ఏమిటన్నది కూలం కషంగా బేరీజు వేయాల్సిన అవసరం ఉంది.
భారతదేశంలో ఉద్యోగ విపణి పూర్తిగా వైచిత్రాలతో నిండిపోయి ఉంటుంది. దేశంలో 30 లక్షల ఖాళీలు ఉన్న ప్పటికీ, నిరుద్యోగ సమస్య మాత్రం పూర్తి స్థాయిలో పరిష్కారం కావడం లేదు. అయితే, కాస్తో కూస్తో నిరుద్యోగ సమస్య ఉండడానికి కారణం యజమానులకు లేదా సంస్థలకు ఎటువంటి ఉద్యోగులు అవసరం అన్నది ఎవరూ మదింపు చేయడం లేదు. తమకు ఎటువంటి ఉద్యోగాలు అవసరం, తాము ఎటువంటి ఉద్యోగాలకు పనికి వస్తాం అన్నది నిరుద్యోగులకు అంతుబట్టడం లేదు. టెక్నాలజీ విస్తరిస్తున్న కొద్దీ ఈ అయోమయావస్థ మరింతగా పెరిగిపోతోంది. ఇదివరకు ఉన్నత విద్యకు ప్రాధాన్యం ఉండేది. ఇప్పుడు నైపుణ్యాలకు ప్రాధాన్యం పెరుగుతోంది. అందువల్ల పాఠ్యాంశాలకు, నైపుణ్యాలకు, మార్కెట్‌ అవసరాలకు మధ్య సమన్వయం ఏర్పడాల్సి ఉంది. నైపుణ్యాలను పెంచుకోవాలి. కొత్త నైపుణ్యాలను తగ్గట్టుగా పురోగతి చెందాలి. తరచూ నైపుణ్యాలను మార్చుకుంటూ ఉండాలి. ప్రస్తుత ఆధునిక పరిస్థితుల్లో నిరుద్యోగ సమస్యకు అవకాశం లేకుండా చేయడానికి ఇదే సరైన మార్గం.
కొత్త రకం సవాళ్లు
అన్నిటికన్నా ముఖ్యమైన లక్ష్యం మరొకటి ఉంది. న్యాయ వ్యవస్థలో సంస్కరణలు చోటు చేసుకోవాలి. నేష నల్‌ జ్యుడిషియల్‌ డేటా గ్రిడ్‌ ప్రకారం, దేశంలోని న్యాయ వ్యవస్థలు న్యాయాన్ని అందించలేని స్థితికి చేరుకుంటు న్నాయి. దేశంలో యాభై కోట్లకు పైగా కేసులు అపరిష్కృతంగా ఉండడం దేశ ప్రజలకు తీరని అన్యాయం చేయడం కిందకే వస్తుంది. ప్రభుత్వాలకు సంబంధించిన కేసులే ఎక్కువగా ఉంటున్నాయని న్యాయమూర్తులు సైతం వాపోతున్నారు. ప్రభుత్వం ఈ న్యాయ వ్యవస్థను ఎంతగా ఆధునీకరిస్తే దేశ భవిష్యత్తుకు అంత మంచిది. ప్రతి కేసు పరిష్కారానికీ ఉన్నత న్యాయస్థానాల నుంచి కింది స్థాయి న్యాయస్థానాల వరకు ఒక గడువును పెట్టుకుని అందుకు కట్టుబడి ఉండడం వల్ల కొద్దిగానైనా ప్రయోజనం ఉంటుంది. మంచి నీటి సరఫరా, విద్యుత్‌ సరఫరా వంటి మౌలిక అవసరాలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ వ్యవస్థలను ఆధునికీకరిస్తే తప్ప వికసిత్‌ భారత్‌ అనేది సాధ్యం కాదు. అన్ని సంస్కరణల కంటే ముఖ్యంగా పార్లమెంట్‌ సభ్యులు, మంత్రులు, శాసన సభ్యులు, ప్రభుత్వాలు అవినీతికి అతీతంగా తమను సంస్కరించుకోవడం, అభ్యుదయ దృక్పథాన్ని అలవరచుకోవడం వల్లే వికసిత్‌ భారత్‌ సాధ్యమవుతుంది.

  • జి. రాజశుక
సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News