Wednesday, October 30, 2024
Homeఓపన్ పేజ్ReNEET the NEET: నీట్‌ ప్రక్షాళనతోనే విశ్వసనీయత సాధ్యం

ReNEET the NEET: నీట్‌ ప్రక్షాళనతోనే విశ్వసనీయత సాధ్యం

నీట్‌ విషయంలో మరోసారి పరీక్షలు నిర్వహించాలన్న డిమాండును సుప్రీంకోర్టు తోసిపుచ్చడంతో సుమారు రెండు నెలలుగా సాగుతున్న ఈ వివాదానికి తెరపడినట్టయింది. ఇప్పటికే ఆలస్యం అయిపోయిన కౌన్సెలింగ్‌ కు, ప్రవేశాలకు సుప్రీం కోర్టు తీర్పుతో మార్గం సుగమం అయింది. నీట్‌ ప్రశ్రపత్రాల లీక్‌ విషయంలో ఎటువంటి వ్యవస్థాగత ఉల్లంఘనలు జరగలేదని, నీట్‌ విశ్వసనీ యతకు, నిర్వహణ సామర్థ్యానికి ఎటువంటి భంగమూ జరగలేదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. మళ్లీ పరీక్షలు పెట్టడం వల్ల ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయన్న విషయాన్ని కూడా న్యాయస్థానం కూలంకషంగా పరిశీలించింది. మొదటిసారి పరీక్షలు రాసిన సుమారు 24 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ఈ పునఃపరీక్షల వల్ల దెబ్బతింటుందని, ప్రవేశాల కార్యక్రమం అస్తవ్యస్తం కావడంతో దీని పరిణామాలు తీవ్ర స్థాయిలో ఉండే అవకాశం ఉందని న్యాయస్థానం ఈ కేసు విచారణ సందర్భంగా అభిప్రాయపడింది.
నీట్‌ పరీక్షల నిర్వహణ లోపభూయిష్ఠంగా జరిగింది. ప్రశ్నపత్రాలు ముందుగానే వెల్లడి అయినట్టు పాట్నా, హజారీబాగ్‌ లలో బయటపడింది. పరీక్షల్లో కూడా అనేక అవకతవకలు జరిగాయని, నిబంధనలను ఉల్లంఘించడం జరిగిందని కూడా ప్రాథమిక దర్యాప్తుల్లో తేలింది. ఆ ప్రాంతాల్లో సుమారు నాలుగు లక్షల మంది విద్యార్థుల జీవితాలను ప్రభావితం చేసే ఈ నీట్‌ పరీక్షల తీరుతెన్నులను క్షుణ్ణంగా పరిశీలించవలసిందిగా న్యాయస్థానం నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌.టి.ఎ)ను ఆదేశించింది. ఈ నాలుగు లక్షల మంది విద్యార్థుల్లో 44 మంది విద్యార్థులు సరైన స్కోరును సాధించినట్టు తెలిసింది. భౌతిక శాస్త్రానికి సంబంధించిన ప్రశ్న పత్రంలో ఒక ప్రశ్నను తప్పుడు తడకలతో ప్రచురించడం జరిగిందని, దాన్ని వెంటనే సవరించాలని కూడా న్యాయస్థానం ఆదేశించింది.
మొత్తం మీద పరీక్షల నిర్వహణ, ప్రశ్ర పత్రాల తయారీ వంటి కీలక వ్యవహారాలన్నీ లోపభూయి ష్ఠంగా ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆదేశాలను దృష్టిలో పెట్టుకుని, పరీక్షలు సవ్యం గానే జరిగాయని చెప్పుకోవడం అక్రమమే అవుతుంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ సత్యమే గెలిచిందని వ్యాఖ్యానించడం సమంజసంగా కనిపించడం లేదంటూ ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. నిజానికి, దేశంలో ఎటువంటి పరీక్షలు నిర్వహించినా ఏదో ఒక విధంగా అవకతవకలు, అక్రమాలు జరగడం, విమర్శలకు గురి కావడం జరుగుతూనే ఉంది. పరీక్షల మాఫియాల గురించి సరికొత్త సమాచారాలు వెలువడడం, పలువురిని అరెస్టులు చేయడం, అభ్యర్థుల మీద చర్యలు తీసుకోవడం వంటివి ఇందుకు నిదర్శనాలుగా నిలుస్తున్నాయి. నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ తీసుకున్న అనేక నిర్ణయాలు వివాదాస్పదంగా మారాయి. గత జూన్‌ నెలలో జరిగిన యు.జి.సి-నెట్‌ పరీక్షలను ప్రభుత్వం ఎటువంటి కారణాలు చెప్పకుండానే అర్ధంతరంగా రద్దు చేయడం జరిగింది. నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ అధిపతిని బర్తరఫ్‌ చేసి, ఈ అస్తవ్యస్త పరిస్థితులను చక్కదిద్దడానికి ఒక కమిటీని నియమించడాన్ని బట్టి, ఇటువంటి పరీక్షల నిర్వహణలో లొసుగులు ఉన్నాయన్న వాస్తవాన్ని అర్థం చేసుకోవచ్చు.
జాతీయ స్థాయి పరీక్షల వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయవలసిన అవసరం కనిపిస్తోంది. ఇందులో భాగంగా ముందుగా ఈ పరీక్షల వ్యవస్థలో పారదర్శకతను, విశ్వసనీయతను, జవాబు దారీతనాన్ని, సామర్థ్యాన్ని పెంచాల్సిన అవసరం ఉంది. వైవిధ్యభరితమైన విద్య, సామాజిక పరిస్థితులు, అవసరాలున్న భారతదేశంలో ఒకే దేశం, ఒకే పరీక్ష పేరుతో కేంద్రీకృత వ్యవస్థను ఏర్పాటు చేయడం ఉపయుక్తంగా కనిపించడం లేదు. ప్రశ్న పత్రాలు ముందుగానే వెల్లడి కావడం, ఇతర అవకతవకల వల్ల సుమారు 24 లక్షల పరీక్షార్థుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. విద్యార్థులు, వారి తల్లితండ్రులు కనీ వినీ ఎరుగని విధంగా మానసిక ఒత్తిడికి, క్షోభకు గురి కావడం జరిగింది. పైగా, నీట్‌ వంటి జాతీయ స్థాయి పరీక్షలు కేవలం సంపన్నులకు, నగర, పట్టణ విద్యార్థులకు మాత్రమే పరిమితం కావడం, ఈ పరీక్షలకు శిక్షణ పొందడం అనేది ఖరీదైన వ్యవహారం కావడం జరుగుతోందంటూ విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. కర్ణాటకతో సహా కొన్ని రాష్ట్రాలు ఈ నీట్‌ పరీక్షలకు దూరంగా ఉండాలనే నిర్ణయానికి కూడా వచ్చాయి. అత్యుత్తమ పరీక్షా వ్యవస్థ విషయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను కూడా సంప్రదించడం మంచిది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News