Homeఎడిటోరియల్ / బహుళకాంట్రాక్ట్ అధ్యాపకుల మరణాలకి బాధ్యులెవరు?

కాంట్రాక్ట్ అధ్యాపకుల మరణాలకి బాధ్యులెవరు?

Contract Lecturers Death: తెలంగాణ రాష్ట్రంలో 12 యూనివర్సిటీలలో ఏళ్ల తరబడి పనిచేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు తమ సహా అధ్యాపకులను గుండెపోటు కారణంగా కోల్పోతున్నారు. సాధారణ అనారోగ్య కారణాల రీత్యా ఈ మరణాలు సంభవించడం లేదు.  అధ్యాపక వృత్తిలో ఎదుర్కొంటున్న వివక్ష, మానసిక ఒత్తిడి,  భద్రత లేని కాంట్రాక్ట్ అధ్యాపక జీవితంతో ఇమడలేక, ఆవేదనతో గుండె బరువెక్కడంతో ఈ మరణాలు సంభవిస్తున్నాయి. పది రోజుల క్రితం  కాకతీయ యూనివర్సిటీ, కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్  విభాగంలో 20 ఏళ్లకు పైగా పని చేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్  డా. ఓ రవీందర్ అనే అధ్యాపకుడు అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించారు.  ఇదే విభాగంలో గత సంవత్సరము డా. సురేష్ అనే అధ్యాపకుడు, రెండు నెలల క్రితం తెలంగాణ యూనివర్సిటీలో న్యాయ కళాశాల  పనిచేస్తున్న డా. ఏం నాగజ్యోతి లాంటి అధ్యాపకులు చాలీచాలని వేతనాలతో కుటుంబ పోషణ భారమై, గుండెపోటు కారణంగానే మరణించారు. సామాజిక చైతన్యానికి ప్రతిరూపమైన తెలంగాణ సమాజంలో ఇటువంటి మరణాలపై ఒకింత ఆలోచన చేయడం మేధావి వర్గంపై బాధ్యత ఉంది. స్వరాష్ట్ర ఏర్పాటులో కీలకపాత్ర పోషించిన యూనివర్సిటీలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకుల జీవితాలు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంటే, ప్రభుత్వము, యూనివర్సిటీ అధికార యంత్రాంగం తమ బాధ్యత కాదన్నట్లు వ్యవహరించడం మరింత ఆందోళనకు గురిచేస్తుంది. 

- Advertisement -

విద్యాబోధన భారం

రాష్ట్రంలో దాదాపు 1145 మంది కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు వివిధ యూనివర్సిటీలలో పనిచేస్తున్నారు. కనీసం పది సంవత్సరాల నుండి గరిష్టంగా 25 సంవత్సరాలకు పైగా అనుభవంతో విద్యా బోధన చేస్తున్నారు.  రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరాల తరబడి దాదాపు 80% కాంట్రాక్టు అధ్యాపకులతోనే యూనివర్సిటీలను నిర్వహిస్తుంది. వేలాదిమంది తెలంగాణ గ్రామీణ ప్రాంత విద్యార్థిని, విద్యార్థులను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దిన ఘనత యూనివర్సిటీలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులకు సొంతం. స్వరాష్ట్రం ఏర్పడిన నాటి నుండి ఒక్క రిక్రూట్మెంట్ కూడా యూనివర్సిటీలలో జరగలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెగ్యులర్ పోస్టుల నియామకాల్లో అప్పటి వి. సి. లు చేసిన తప్పిదాల పర్యవసానంగా ఇంకా కాంట్రాక్ట్ అధ్యాపకులుగానే యూనివర్సిటీలలో పనిచేయడం అందరికీ తెలిసిందే. నేడు యూనివర్సిటీలలో 80%కు పైగా విద్యాబోధన భారం కాంట్రాక్ట్ అధ్యాపకుల మీదనే పడుతుంది. అంతేకాకుండా రెగ్యులర్ అధ్యాపకులతో సమానమైన బోధన సామర్ధ్యాలు కలిగి, అదనపు భారం మోస్తున్నారు. 

ఆశ ఉన్నా ఆచరణ లేదు

కాంట్రాక్ట్ అధ్యాపకులకు యూజీసీ వేతనాలను అమలు చేయాల్సిన బాధ్యత నుండి యూనివర్సిటీలు, ప్రభుత్వ యంత్రాంగం సంవత్సరాల తరబడి మాట తప్పుతూనే ఉన్నాయి. గత బిఆర్ఎస్ ప్రభుత్వం జూనియర్, డిగ్రీ కళాశాల అధ్యాపకులను రెగ్యులరైజేషన్ చేసి, యూనివర్సిటీలను నిర్లక్ష్యం చేయటాన్ని వ్యతిరేకిస్తూ యూనివర్సిటీ కాంట్రాక్ట్ అధ్యాపకులు గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు  చేశారు. అప్పటి కాంగ్రెస్ పెద్దల హామీ మేరకు గత ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతుగా కాంట్రాక్ట్ అధ్యాపకులు నిలబడ్డారు. బిఆర్ఎస్ పార్టీ న్యాయం చేయలేదని, కాంగ్రెస్ పార్టీ తమకు న్యాయం చేస్తుందని, వర్సిటీలలో ఏళ్ల తరబడి బోధన చేస్తున్నా మా జీవితాల్లో రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వము వెలుగులు నింపుతుందని  భావించినా కాంట్రాక్ట్ అధ్యాపకులకు తీవ్ర నిరాశే మిగిలింది. ఈ నేపథ్యంలోనే  గత సంవత్సరం ఏప్రిల్ నెలలో 11 రోజులపాటు సమ్మె చేసిన పిమ్మట ఏప్రిల్ 28, 2025 తేదీన సీఎంని ఆయన నివాసంలో కలిసి యూజీసీ పే స్కేల్ అమలుపై హామీ తీసుకున్నారు.  సమాన పనికి సమాన వేతనం వస్తుందనే ఆశతో అధ్యాపకులంతా ఎదురు చూస్తున్నా ఇప్పటికీ ఆచరణకు నోచుకోలేదు. 

ఆత్మ గౌరవ సమస్య

ఒకవైపు జూనియర్, డిగ్రీ కళాశాలలో కాంట్రాక్ట్ అధ్యాపకులుగా పనిచేస్తూన్నా వారిని రెగ్యులరైజ్ చేసి యూనివర్సిటీ అధ్యాపకులను విస్మరించడం తెలంగాణ భూమి పుత్రులకు ఇది ఆత్మగౌరవ సమస్య. దశాబ్దాల తరబడి టీచింగ్ అనుభవం గడించిన ఆత్మనున్యతా భావంతో పనిచేయాల్సి వస్తుందనే దిగులుతో మన జీవితాలు ఇంతేనా అన్నఆలోచనతో కాంట్రాక్టు అధ్యాపకులు గుండెపోటుతో చనిపోవడం విషాదకరమైన పరిణామం.  కాంట్రాక్టు అధ్యాపకులు ఎదుర్కొంటున్న సమస్యలపై  ప్రభుత్వాలకి పట్టింపు లేకపోవడంతో భవిష్యత్ భారమై ఆకస్మాత్ మరణాలు సంభవిస్తే ఎటువంటి ప్రయోజనాలు పొందలేని దుస్థితి నెలకొంది.  కుటుంబ పెద్ద మరణిస్తే పనిచేసే సంస్థ ఎటువంటి ప్రయోజనాల హామీ అమలు చేయకుంటే ఆ కుటుంబం వీధిన పడే పరిస్థితులు దాపురించాయి.

ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అన్ని రకాల ఉద్యోగస్తులకు ఇన్సూరెన్స్ పథకాన్ని ప్రవేశపెట్టింది.  రాష్ట్రంలోని ఏ కాంట్రాక్టు అధ్యాపకుడికి కూడా ఈ బీమా పథకం వర్తింప చేయలేదు. రాష్ట్రంలో యూనివర్సిటీలలో పనిచేస్తున్న అధ్యాపకులలో దాదాపు వారి వయస్సు 40, 45  దాటి ఉంది.  తక్షణమే కాంట్రాక్ట్ అధ్యాపకులకు  జీవిత బీమా, ఆరోగ్య బీమా వర్తింపజేసే విధంగా ప్రభుత్వం యూనివర్సిటీలను ఆదేశించాలి.  

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో గిగ్ వర్కర్ల కోసం ఒక చట్టాన్ని అసెంబ్లీలో ఆమోదించి, సంక్షేమ బోర్డును ఏర్పాటు  చేస్తోంది. కానీ ఉన్నత విద్యారంగంలో కీలక పాత్ర పోషిస్తున్న యూనివర్సిటీలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లకి సమాన పనికి సమాన వేతనం అమలు చేయకపోవడం మూలంగా, అరకొరా వేతనాలతో బ్రతుకు భారమే జీవనం కొనసాగించలేక, భవిష్యత్తు శూన్యమై, అకాల మరణాల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది.  ఎవరికి పట్టింపు లేని కాంట్రాక్ట్ అధ్యాపకుల మరణాలకి ఎవరు బాధ్యత తీసుకుంటారు?.

డా. సాదు రాజేష్ 

అర్థశాస్త్ర విభాగం 

కాకతీయ విశ్వవిద్యాలయం (9849789779)

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News