దేశంలో ఒక ప్రభుత్వ ఉద్యోగి తన జీవితంలో అత్యంత విలువైన కాలాన్ని ప్రజా సేవకే అంకితం చేస్తాడు. దశాబ్దాల పాటు కష్టపడి పనిచేసిన తర్వాత నిర్దిష్ట వయస్సు వచ్చినప్పుడు పదవీ విరమణ చేయాల్సిందే. అతను ఎంత సమర్థుడైనా, ఎంత నిజాయితీపరుడైనా, ఎంత అనుభవజ్ఞుడైనా చట్టం ముందు అతనికి ఎలాంటి మినహాయింపు ఉండదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో వ్యక్తి కంటే వ్యవస్థ గొప్పది. కొత్త తరానికి అవకాశాలు కల్పించడం, పరిపాలనలో నూతన ఆలోచనలకు మార్గం వేయడం, నాయకత్వంలో సహజమైన మార్పును తీసుకు రావడం ప్రజాస్వామ్య వ్యవస్థకు అత్యంత అవసరం. అయితే ఇదే సూత్రం దేశాన్ని పాలించే రాజకీయ నాయ కులకు ఎందుకు వర్తించడం లేదు?
ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ ఉంటే, రాజకీయ నాయకులకు ఎందుకు ఉండకూడదు? ఈ ప్రశ్న కేవలం ఒక వ్యక్తి అభిప్రాయం కాదు. ఇది దేశ ప్రజాస్వామ్య భవిష్యత్తుకు సంబంధించిన కీలకమైన రాజకీయ సంస్కరణ అంశం. ఈ ప్రశ్నపై దేశవ్యాప్తంగా చర్చ జరగాల్సిన అవసరం నేడు మరింత పెరిగింది. ప్రజాస్వామ్యం అంటే కేవలం ఐదేళ్లకోసారి ఎన్నికలు నిర్వహించడం కాదు. ప్రజాస్వామ్యం అంటే నాయకత్వం నిరంతరం పునరుద్ధరించబడే జీవంతమైన వ్యవస్థ. కొత్త ఆలోచనలు ముందుకు రావాలి. కొత్త నాయ కత్వం ఎదగాలి. యువతకు అవకాశాలు లభించాలి. సమాజంలో వచ్చిన మార్పులు పాలనలో ప్రతిబింబిం చాలి. కానీ భారత రాజకీయాలను పరిశీలిస్తే ఇందుకు పూర్తి విరుద్ధమైన పరిస్థితి కనిపిస్తోంది. ఒకసారి రాజకీ యాల్లో ప్రవేశించిన నాయకుడు జీవితాంతం అధికార పదవుల చుట్టూనే తిరుగుతుంటాడు. ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి, ముఖ్యమంత్రి, గవర్నర్, రాజ్యసభ సభ్యుడు, పార్టీ అధ్యక్షుడు… ఇలా ఏదో ఒక పదవిలో కొనసాగేందుకు ప్రయత్నించడం రాజకీయ సంస్కృతిగా మారిపోయింది. ప్రజాసేవ కంటే అధికారాన్ని వదులుకోకూడదనే ధోరణి రాజకీయాలను శాశ్వత వృత్తిగా మార్చేసింది.
ప్రభుత్వ ఉద్యోగికి 60 లేదా 65 సంవత్సరాల వయస్సు వచ్చినప్పుడు ప్రభుత్వం ‘ఇప్పటికే మీరు చాలా కాలం సేవ చేశారు. ఇప్పుడు యువతకు అవకాశం ఇవ్వండి’ అని చెబుతుంది. మరి దేశ భవిష్యత్తును నిర్ణ యించే చట్టాలు చేసే ప్రజా ప్రతినిధులకు కూడా ఇదే సూత్రం ఎందుకు వర్తించకూడదు? ప్రజాస్వామ్యంలో అందరికీ సమాన నిబంధనలు ఉండాలంటే రాజకీయ నాయకులకు కూడా ఒక నిర్దిష్ట పదవీ విరమణ వయస్సు ఉండాలని ప్రశ్నించడం సహజమే.
రాజకీయ నాయకుల విషయంలో ‘అనుభవం’ అనే వాదన తరచూ వినిపిస్తుంది. కానీ అదే వాదనను ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో ఎందుకు అంగీకరించడం లేదు? అనుభవమే ప్రమాణమైతే ఒక శాస్త్రవేత్త, ఒక న్యాయ మూర్తి, ఒక వైద్యుడు, ఒక అధ్యాపకుడు కూడా జీవితాంతం తన పదవిలో కొనసాగేందుకు అవకాశం కల్పించాలి. కానీ చట్టం అలా చెప్పదు. కారణం వ్యక్తుల కంటే వ్యవస్థ బలంగా ఉండాలన్న ప్రజాస్వామ్య సూత్రం. అలాంటప్పుడు రాజకీయాలకు మాత్రమే ప్రత్యేక మినహా యింపు ఎందుకు? వాస్తవానికి వయస్సు పెరుగుతున్నా కొద్దీ శారీరక సామర్థ్యం మాత్రమే కాదు, వేగవంతమైన నిర్ణయాలు తీసుకునే శక్తి, సాంకేతిక మార్పులను అర్థం చేసుకునే సామర్థ్యం కూడా సహజంగానే ప్రభావితమ వుతుంది. ప్రపంచం వేగంగా మారుతోంది. కృత్రిమ మేధస్సు, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ, వాతావరణ మార్పులు, సైబర్ భద్రత, ప్రపంచ పోటీ, యువత ఉపాధి, ఆవిష్కరణలు వంటి సవాళ్లను ఎదుర్కొనేందుకు కొత్త దృక్పథం కలిగిన నాయకత్వం అవసరం. గత అనుభవం విలువైనదే. కానీ భవిష్యత్తును నిర్మించేది నూతన ఆలోచనలే. ఇది పెద్దలను అవమానించడం కాదు. అనుభవాన్ని తిరస్కరించడం అంతకంటే కాదు. పదవీ విరమణ చేసిన న్యాయమూర్తులు న్యాయవ్యవస్థకు మార్గదర్శకత్వం వహిస్తున్నట్లే, పదవీ విరమణ చేసిన అధికారులు ప్రభుత్వాలకు సలహా దారులుగా సేవలందిస్తున్నట్లే, రాజకీయ నాయకులు కూడా తమ అనుభవాన్ని దేశ ప్రయోజనాలకు వినియో గించవచ్చు. విధాన రూపకల్పనలో, యువ నాయకుల శిక్షణలో, ప్రజా చర్చల్లో వారు కీలక పాత్ర పోషించవచ్చు. కానీ అధికార పదవులను జీవితాంతం కొనసాగించే హక్కుగా భావించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. దేశంలోని దాదాపు అన్ని ప్రధాన రాజకీయ పార్టీల్లో నాయకత్వ సంక్షోభం కనిపిస్తోంది. కారణం నాయకులు లేకపోవడం కాదు. కొత్త నాయకులకు అవకాశాలు లేక పోవడమే. ఒకే వ్యక్తి దశాబ్దాల పాటు పార్టీ అధ్యక్షుడిగా, శాసనసభాపక్ష నాయకుడిగా, ముఖ్యమంత్రిగా లేదా ఎంపీగా కొనసాగితే రెండో శ్రేణి నాయకత్వం ఎలా ఎదుగుతుంది? యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపు నిచ్చే నాయకులే తమ స్థానాలను మాత్రం విడిచిపెట్టక పోవడం అతిపెద్ద వైరుధ్యం. దేశంలో నిరుద్యోగం పెరిగిందని ప్రతి రాజకీయ పార్టీ చెబుతోంది. యువతకు అవకాశాలు కల్పిస్తామని ప్రతి ఎన్నికల్లో హామీలు ఇస్తోంది. కానీ రాజకీయాల్లో మాత్రం అదే యువతకు స్థానం కల్పించడంలో వెనుకంజ వేస్తోంది. ఉద్యోగాల్లో రిటైర్మెంట్ ద్వారా కొత్త నియామకాలు చేపట్టే ప్రభుత్వం, రాజకీయాల్లో మాత్రం కొత్త తరానికి మార్గం వేయడంలో ఎందుకు వెనుకబడుతోంది? ప్రజాస్వామ్యం కూడా తరాల మార్పుతోనే బలపడుతుంది. రాజకీయాల్లో కుటుంబ వారసత్వం పెరగడానికి కూడా ప్రధాన కారణం ఇదే. ఒక నాయకుడు జీవితాంతం పదవిలో కొనసాగితే, ఆ తర్వాత అదే పదవి కుటుంబ సభ్యులకు వెళ్లే పరిస్థితి ఏర్పడుతోంది. ప్రజాస్వామ్యంలో అధికారం ప్రజలది కావాలి. కానీ అనేక సందర్భాల్లో అది కొద్దిమంది కుటుంబాల ఆధీనంలోకి వెళ్లిపోతోంది. రాజకీయాలు ప్రజల హక్కు కాకుండా కుటుంబాల వారసత్వంగా మారుతున్నాయనే విమర్శలకు ఈ పరిస్థితులే కారణం. దేశంలోని అనేక రాజకీయ పార్టీల్లో అంతర్గత ప్రజాస్వామ్యం దాదాపు కనిపించడం లేదు. నాయకుల ఎంపిక ప్రజాస్వామ్య పద్ధతిలో కాకుండా వ్యక్తిగత నిర్ణయాల ద్వారా జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త నాయకత్వం ఎదగడం అసాధ్యం. వయో పరిమితితో పాటు పార్టీల్లో అంతర్గత ఎన్నికలు తప్పనిసరి చేయడం కూడా అత్యవసరం. ఈ నేపథ్యంలో రాజకీయ నాయకులకు 65 సంవత్సరాల వయస్సు దాటిన తర్వాత ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేకుండా చట్టం తీసుకురావాలనే ప్రతిపాదనను దేశవ్యాప్తంగా చర్చించా ల్సిన అవసరం ఉంది. అలాంటి నాయకులు రాజ్యాంగ సలహా మండళ్లలో, ప్రజా విధానాల కమిటీల్లో, రాజకీయ శిక్షణా సంస్థల్లో, సామాజిక సేవా కార్యక్రమాల్లో తమ అనుభవాన్ని అందించవచ్చు. కానీ అధికార పదవులు మాత్రం కొత్త నాయకత్వానికి దక్కేలా వ్యవస్థను రూపొందించాలి.
ఈ సంస్కరణ వల్ల రాజకీయాల్లో పోటీ పెరుగు తుంది. కొత్త ఆలోచనలు వస్తాయి. మహిళలకు, యువ తకు, సామాజికంగా వెనుకబడిన వర్గాలకు అవకాశాలు విస్తరిస్తాయి. పార్టీల్లో అంతర్గత ప్రజాస్వామ్యం బలపడు తుంది. వ్యక్తి ఆరాధన తగ్గుతుంది. వ్యవస్థ పట్ల గౌరవం పెరుగుతుంది. రాజకీయాలను శాశ్వత ఉపాధిగా చూసే ధోరణి క్రమంగా తగ్గుతుంది. అయితే కేవలం వయోపరి మితి ఒక్కటే అన్ని సమస్యలకు పరిష్కారం కాదని కూడా గుర్తించాలి. వరుసగా పోటీ చేసే పదవీకాలాలకు పరిమితి విధించడం, రాజకీయ పార్టీల్లో అంతర్గత ఎన్నికలు తప్పనిసరి చేయడం, అభ్యర్థుల ఎంపికలో పారదర్శకత తీసుకురావడం, తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుల రాజకీయ ప్రవేశంపై కఠిన నిబంధనలు అమలు చేయడం, ఎన్నికల ఖర్చులపై సమర్థవంతమైన నియంత్రణ వంటి సంస్కరణలు కూడా సమాంతరంగా అమలు కావాలి. దేశంలో రాజ్యాంగ సవరణలు ఎన్నో జరిగాయి. ఓటు హక్కు వయస్సు తగ్గింది. స్థానిక సంస్థల్లో మహిళ లకు రిజర్వేషన్లు అమలయ్యాయి. ఎన్నికల వ్యవస్థలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. అంటే ప్రజాస్వా మ్యం అవసరానికి అనుగుణంగా మార్పులను స్వీకరించ గలదని చరిత్ర నిరూపించింది. అలాంటప్పుడు రాజకీయ నాయకులకు వయోపరిమితి విధించడం కూడా అసాధ్య మైన విషయం కాదు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యువతను 21 ఏళ్ల వయస్సు నుంచే రాజకీయాల్లోకి రావాలని పిలుపునిస్తున్నారు. యువత రాజకీయాల్లోకి రావాలని కోరడం స్వాగతించదగిన విషయం. అయితే ఆ పిలుపు ఆచరణలోకి రావాలంటే యువతకు అవకాశాలు కూడా కల్పించాలి. అవకాశాలు లేకుండా ఆహ్వానాలు ఇవ్వడం వల్ల ప్రయోజనం ఉండదు. అందుకే కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలోనూ, తెలంగాణ రాష్ట్ర స్థాయి లోనూ రాజకీయ నాయకులకు వయోపరిమితిపై చర్చ ప్రారంభించి, అవసరమైతే తెలంగాణ శాసనసభలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపే దిశగా ముందడుగు వేయాలని యువత, మేధావులు, రచయితలు, ప్రజా సంఘాలు, ప్రజాస్వామ్యవాదులు కోరుకుంటున్నారు. ఈ అంశం కాంగ్రెస్కే పరిమితం కాదు. భారతీయ జనతా పార్టీ, ప్రాంతీయ పార్టీలు, వామపక్షాలు సహా అన్ని రాజ కీయ పార్టీలు ఈ అంశంపై తమ వైఖరిని ప్రజల ముందు స్పష్టంగా చెప్పాల్సిన బాధ్యత ఉంది. ప్రజాస్వామ్యం వ్యక్తుల చుట్టూ తిరగాలా? లేక వ్యవస్థ చుట్టూ తిరగాలా? అనే ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన సమయం ఆసన్న మైంది. ఏ నాయకుడూ శాశ్వతుడు కాదు. కానీ వ్యవస్థ శాశ్వతం. వ్యక్తులు మారాలి. విలువలు నిలవాలి. అధికా రాలు మారాలి. ప్రజాస్వామ్యం బలపడాలి. పాత తరం మార్గదర్శకులుగా నిలవాలి. కొత్త తరం బాధ్యతలు స్వీకరించాలి. ఇదే ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి నిజమైన సంకేతం. ఉద్యోగులకు అమలవుతున్నట్లే రాజ కీయ నాయకులకు కూడా 65 సంవత్సరాల పదవీ విర మణ వయస్సును చట్టబద్ధం చేయాలనే డిమాండ్‌ను కేవలం నినాదంగా కాకుండా దేశ రాజకీయ భవిష్యత్తును నిర్ణయించే సంస్కరణగా చూడాల్సిన సమయం వచ్చింది.
మన్నారం నాగరాజు
సామాజిక, రాజకీయ విశ్లేషకులు

