ఒకటి..
అయితే.. ఇక్కడ ఒక ప్రమాదం కూడా దాగి ఉంది. ప్రభుత్వం పాలసీలు చేయడమే కాదు.. నేరుగా వ్యాపారం చేస్తే ఆ నిర్ణయాల్లో పారదర్శకత సంగతేందనే ప్రశ్న తప్పకుండా తలెత్తుతుంది. భూముల విషయంలో ఎవరికి లాభం జరుగుతుంది? నియంత్రణ ఎవరి చేతుల్లో ఉంటుందన్న ప్రశ్నలు అనేకం భవిష్యత్తులో తలెత్తవచ్చు. ఎందుకంటే ఇప్పుడు భూమి అత్యంత సున్నితమైన అంశం. రాజకీయ నాయకుల మనుగడకూ ఇదే ఆధారం కూడా. ఈ వ్యవహారంలో ఒక చిన్న తేడా వచ్చినా, చిన్న అనుమానం కలిగినా ఓ పెద్ద వివాదానికి దారితీసే అవకాశముంటుంది. ప్రభుత్వం ఓవైపు పాలసీ నిర్ణయాలు తీసుకుంటూనే అదే సమయంలో వ్యాపార కార్యక్రమాల్లో ప్రవేశిస్తే.. రాష్ట్రంలో సమాన అవకాశాలకు ఆస్కారమెక్కడుంటుంది? మూసీ ప్రాజెక్టును ప్రభుత్వం అర్బన్ ఎకనామిక్ కారిడార్‌గా, రియల్ ఎస్టేట్ ఆదాయ వనరుగా మార్చాలని చూస్తున్నది. దీనిపై ఇప్పటికే అటు ప్రతిపక్షాల నేతలు, ఇటు మూసీ పరివాహక ప్రాంత ప్రజలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ సర్కార్ ఈ ప్రాజెక్టును ఏ విధంగా ముందుకు తీసుకెళ్తుందనేది ఆసక్తికరంగా మారిన ప్రశ్న. ప్రభుత్వ భూములు ప్రైవేట్ చేతుల్లోకి వెళ్లి.. ప్రయోజనాలు, లాభాలు కొందరికి మాత్రమే పరిమితమైతే దానిపై ప్రజావ్యతిరేకత వెల్లువెత్తడం ఖాయం. అదే భూములను ప్రభుత్వం అభివృద్ధి చేసి ఆదాయాన్ని ఆర్జించి, ఆ మొత్తాన్ని ప్రజాసంక్షేమానికి.. ప్రత్యేకంగా ఆరు గ్యారంటీల అమలుకు ఉపయోగిస్తామంటే తప్పేముందని కాంగ్రెస్ నాయకులు ఎదురు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక స్వావలంబన కోసం తయారు చేసుకున్న రియల్ వ్యూహంగా అధికార పార్టీ నేతలు ప్రచారం చేసుకుంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఏకంగా ఓ అడుగు ముందుకు వేసి… శనివారం నాడు దేవుడికి ముడిపెడుతూ ఓ ప్రకటన చేశారు. శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని చెబుతూ.. మూసీ నది పునరుజ్జీవ ప్రాజెక్టును దైవేచ్ఛగా చెప్పారు. ఈ విధంగా తాను కర్మసిద్ధాంతాన్ని మళ్లీ తెరపై తెచ్చారు.
హిందువులు ఎక్కువగా నమ్మే కర్మసిద్ధాంతాన్ని పాలనతో కలిపి మాట్లాడడం ఆసక్తికరమైన అంశమే. ఇది కేవలం ఆధ్యాత్మిక వ్యాఖ్య కాదు. ‘విలువల ఆధారిత పాలన’ అనే ఇమేజ్‌ను నిర్మించే ప్రయత్నం కూడా. నూతన రాజకీయ నారేటివ్ నిర్మాణానికి సంకేతం. దీనికి రెండు కోణాలున్నాయి. ఒకటి.. చేసిన పనికి ఫలితం తప్పదు అనే బాధ్యతా భావం. రెండోది.. ప్రజలతో భావోద్వేగ అనుసంధానం కల్పించడం. ఇలా విజన్‌కు విలువలను జోడించి ఒక కార్పొరేట్ లీడర్‌షిప్ శైలిలో రేవంత్ తీరు కొనసాగుతున్నది.
ఇదే తరహా బావజాలం మోడీ పాలనలోనూ తరచుగా కనిపిస్తున్నది. సంస్కృతి, ఆధ్యాత్మికత, జాతీయత – All are integrated into governance messaging. మోడీ మోడల్, రేవంత్ స్టైల్ మధ్య పోలికలు స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ వాటి అమలు స్థాయి, పరిస్థితులు మాత్రం భిన్నంగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న విస్తృత వ్యవస్థలు, సంస్థలు ఒక రకమైన స్థిరత్వాన్ని కలిగి ఉంటాయి. రాష్ట్ర స్థాయిలో అదే మోడల్‌ను అమలు చేయడానికి పరిమితులున్నాయి. ఈ రకంగా ‘సీఈవో స్టైల్ గవర్నెన్స్’ ఇప్పుడు తెలంగాణలోనూ మొదలవ్వడం చూస్తున్నాం. వేగవంతమైన నిర్ణయాలు, స్పష్టమైన లక్ష్యాలు, ఫలితాలపై దృష్టి.. ఇవి అభివృద్ధికి దోహదపడతాయని అనడంలో అనుమానం లేదు. అదే సమయంలో పాలనలో పారదర్శకత, ప్రజల్లో సమానత్వం, వారి భాగస్వామ్యం విషయంలో సమతుల్యతే ఈ మోడల్‌కు విజయాన్ని నిర్దేషిస్తుంది. దీన్ని గుర్తించకుండా కర్మ సిద్ధాంతాన్ని యథావిధిగా సీఎం వాడేస్తే.. ఆ కర్మ ఆయన్ని కూడా వదలబోదన్నది గుర్తించాల్సిన అంశం.
గత కొంతకాలంగా సీఎం రేవంత్ పదేపదే చేస్తున్న మరో వ్యాఖ్య.. ‘పది సంవత్సరాలు నేనే సీఎం’ అని. ఇలా ఆయన ప్రకటించడంలో ఆయన పాలన దృక్పథం మరింత స్పష్టంగా కనిపిస్తున్నది. అది ఆయన ఆత్మవిశ్వాసం, దీర్ఘకాల ప్రణాళికకు సంకేతం. కానీ మరోవైపు, ప్రజాస్వామ్యంలో ఏ నాయకుడూ కాలాన్నీ నిర్ణయించలేడు, నిర్దేషించలేడు కూడా. అంతిమంగా ప్రజలే నిర్ణేతలు. ఈ సూత్రాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇదే తరహాలో వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రులు తర్వాత ఏమయ్యారన్నది కూడా మరిచిపోకూడని అంశం. ఇవేవీ పట్టనట్టుగా సీఎం రేవంత్ అనేక వేదికలపై తరచుగా ఈ ప్రకటన చేయడంలో అంతరార్థం బహుశా ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీతో మైండ్‌గేమ్ ఆడేందుకే అని సరిపెట్టుకోవచ్చు. కానీ ఇక్కడ ఓ గమ్మత్తయిన అంశం అందరినీ ఆశ్చర్యపరుస్తున్నది. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఒకింత ఎక్కువగా ఉంటుంది. పార్టీని నమ్ముకుని ఎదిగిన నాయకులకు ఇక్కడ కొదువలేదు. తెలుగుదేశం నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన రేవంత్ దూకుడుగానే వ్యవహరించారు. ప్రతిపక్షనేతగా వేగవంతంగా నిర్ణయాలు తీసుకోవడమే కాదు ఉధృతమైన పోరాటాలు కూడా చేశారు. బీఆర్‌ఎస్ నాయకత్వాన్ని ఎదురెళ్లి ప్రశ్నించారు. ఆ విమర్శలే ప్రజల్లోకి బలంగా వెళ్లి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చాయి. ఆ తర్వాత రేవంత్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేశాయి. అయితే కుర్చీని లాగేసుకునే సంస్కృతి ఉన్న కాంగ్రెస్‌లో రెండేళ్లయినా తన సీఎం పీఠానికి ఢోకా లేకుండా ఉండడం గుర్తించాల్సిన అంశం. దానికి తోడు వచ్చే ఎన్నికల తర్వాతా తానే సీఎం అని పదేపదే వ్యాఖ్యానిస్తున్నా ఏ ఒక్క నాయకుడూ కాదనలేకపోవడం, విమర్శించకపోవడం ఇక్కడ గమనార్హం. మంత్రి పదవి రాలేదన్న అసంతృప్తితో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడడం మినహాయిస్తే ఇంకెవరూ విమర్శించినట్టు ఎక్కడా రికార్డు కాలేదు. పైగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా అడ్డుకోలేదు, తప్పు పట్టలేదు. దీన్ని బట్టి.. రేవంత్‌కు, కాంగ్రెస్ అధిష్టానానికి మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.
ఇదే అంశంపై కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రముఖ నాయకుడొకరు.. దీనికి బలం చేకూర్చుతూ నాతో ఓ మాట ప్రస్తావించారు. తెలంగాణ రాష్ట్ర సంపాదనను నాలుగు భాగాలుగా విభజించారట. ఒక్కో వంతు ఒక్కో ప్రయోజనం కోసమని అధిష్ఠానంతో డీల్ చేసుకున్నారట. రాష్ట్ర కాంగ్రెస్ భవిష్యత్ అవసరాల కోసం ఒక భాగం, అధిష్టానం అవసరాల కోసం మరో భాగం కేటాయిస్తున్నారని వ్యాఖ్యానించారు. మిగతా రెండు భాగాలు ఎవరికి కేటాయించారన్నది రాష్ట్ర రాజకీయాలను దగ్గరిగా చూస్తున్నవారికి సులువుగా అర్థమయ్యే ఉంటుంది. రాజకీయాల్లో ఇదేమి కొత్త విషయం కాదని, కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ కూడా ఇదే వ్యూహాన్ని అమలు చేస్తున్నదనీ చెప్పుకొచ్చారు. మొన్నటివరకూ పార్టీలకు బాండ్‌ల రూపంలో నిధుల సమీకరణకు అవకాశం ఉండేదని, భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) ఆ విధానాన్ని బాగా అందిపుచ్చుకున్నదని గుర్తుచేశారు. బాండ్‌ల నిధులకు సుప్రీంకోర్టు గండి పెట్టడంతో చిక్కు వచ్చిందనీ వివరించారు. ఇటువంటి వ్యతిరేక పరిస్థితుల్లో కూడా రేవంత్ అదిష్టానాన్ని మెప్పిస్తూ ముందుకు సాగడం ఆయన ఆత్మవిశ్వాసానికి నిదర్శనమని అన్నారు.

