ఒకప్పుడు కార్టూనిస్టులు గీసిన “కామన్ మాన్” ఒక ప్రశ్నార్థక ముఖం. అతను మాట్లాడేవాడు కాదు; నిశ్శబ్దంగా చూస్తూ నిలబడేవాడు. అతని మౌనమే ప్రజాస్వామ్యపు నైతిక అద్దం. ఇప్పుడు ఆ సామాన్యుడు మారిపోయాడు. అతని స్థానంలో వచ్చిన నేటి తరం యువతలో సందేహం తగ్గి, ఆవేశం పెరిగింది. వినడం మానేసి, ఎదుటివాడు డిజైన్ చేసిన కథనాలను రీట్వీట్ చేయడం మొదలు పెట్టారు. పొద్దున్న లేస్తే సామాజిక మాధ్య మాలలో వచ్చే నోటిఫికేషన్లు చూసి, పక్క కాలేజీ స్నేహితులతో గ్రూపుల్లో గొడవ పడే స్థాయికి మనల్ని మార్చేశారు. ఈ మానసిక పరివర్తన వెనుక ఒక “బొద్దింక రాజకీయం” ఉంది. అది ఒకే పార్టీ కాదు; ఒక వింత రాజకీయ సంస్కృతి.బొద్దింక అనే ప్రతీక ఇక్కడ యాదృ చ్ఛికం కాదు. ప్రపంచ యుద్ధం వచ్చినా, అణుబాంబులు పడ్డా, చివరివరకు బ్రతికే జీవుల్లో అది ఒకటి. అది పరిస్థితులకు తగ్గట్టు రూపం మార్చుకునే మనుగడ మనస్తత్వం. నేటి రాజకీయాల్లో కూడా ఇదే సంభవిం చింది. ఒకప్పుడు ఆదర్శాల కోసం పోరాడిన వేదికలు ఇప్పుడు యువత భావోద్వేగాలను మనుగడ సాధనంగా మార్చుకున్నాయి. వాస్తవాలను పక్కన పెట్టి తప్పుడు కథనాలను తయారు చేసే యుగం ప్రారంభమైంది. ఆ కథనాలను యువత మెదడులో తిరిగి అమ ర్చడమే (రీవైరింగ్) ఈ కొత్త రాజకీయ శాస్త్రం.
ఈ మానసిక మార్పు ప్రక్రియ మూడు దశల్లో సాగింది:
మొదటి దశ: భాషా మార్పు
ఒకప్పుడు యువత నోట “పౌరుడు”, “హక్కులు”, “కొత్త ఉద్యోగాలు”, “ఆర్థిక సమానత్వం” వంటి పదాలు వచ్చేవి. ఇప్పు డు వాటి స్థానంలో “దేశభక్తి”, “శత్రువు”, “సంస్కృతి”, “ద్రోహి” వంటి భావోద్వేగ పదాలు వచ్చాయి. ఇది చిన్న మార్పు కాదు. భాష మారితే ఆలోచన విధానం మారుతుంది. పదజాలాన్ని నియంత్రిం చడం అంటే మనిషి ఊహాశక్తినే నియంత్రించడం. నేటి యువత ఇప్పుడు సమస్యలను ఆర్థిక కోణంలో, ఉపాధి కోణంలో కాకుండా భావోద్వేగ కోణంలో చూడడం ప్రారంభించింది.
రెండవ దశ: నిరంతర సమాచారం
ఒకప్పుడు వార్తలు రోజుకు రెండుసార్లు వచ్చేవి. ఇప్పుడు ప్రతి నిమిషం ఫోన్ స్క్రీన్‌పై నోటిఫికేషన్ వస్తోంది. మన మెదడు ఎప్పుడూ అలెర్ట్ మోడ్‌లో ఉంటుంది. భయం, కోపం, అతి గర్వం… ఇవే ఎక్కువ వ్యూస్ తెచ్చే భావాలు. రాజకీయాలు దీనిని అర్థం చేసుకున్నాయి. ఫలితంగా, ప్రజాస్వామ్య చర్చల వేదిక కాస్తా ఒక డోపమైన్ మార్కెట్‌గా మారిపోయిం ది. ప్రతి వైరల్ వీడియో ఒక సూక్ష్మ రాజకీయ ఆయుధంగా పనిచేస్తోంది. డిగ్రీలు ఉన్నాయి కానీ ఉద్యోగం లేదు, చేతిలో రూపాయి లేదు; అయినా, సామాజిక మాధ్యమాలలో ముప్పై సెకన్ల రీల్ చూసి దేశం కోసం రక్తం మరిగిపోతోంది మనకి. యువత ఇప్పుడు ఆలోచించి స్పందించడం లేదు; వెంటనే రియాక్ట్ అవుతోంది.
మూడవ దశ: శత్రువు సృష్టి
ఏ తరాన్నైనా నియంత్రించడానికి సులభమైన పద్ధతి ఒక “ఇతరుడు” ని సృష్టించడం. ఒకప్పుడు పేదరికం, నిరుద్యోగం మన శత్రువులు. ఇప్పుడు మనుషులే శత్రువులుగా మారుతున్నారు. మతం, భాష, ఆహారం, దుస్తు లు.. ప్రతి అంశం ఒక రాజకీయ గుర్తింపుగా మారింది. యువత ప్రశ్నలు అడగకుండా ఉండాలంటే వాళ్లను ఎప్పుడూ ఎవరో ఒకరిపై కోపంగా ఉంచాలి. కోపంలో ఉన్న మెదడు నిజాన్ని విశ్లేషించలేదు, ఏదో ఒక పక్షాన నిలబడి కొట్లాడుతుంది.
ఇక్కడ అత్యంత విషాదకరమైన మార్పు.. యువత తన బాధను కూడా ప్రదర్శనగా మార్చుకోవడం. ఒకప్పుడు యువత ప్రభుత్వాన్ని చూసి “నాకు ఉద్యోగం కావాలి, ఉపాధి కావాలి” అనేవారు. ఇప్పుడు “నా భవిష్యత్తు నాశన మైనా పర్లేదు, నా ఐడెంటిటీ గెలిస్తే చాలు” అంటున్నారు. ఇది రాజకీయ విజయమే కాదు; మానసిక పునర్నిర్మాణం. ప్రజాస్వా మ్యంలో పౌరుడు వినియోగదారుడిగా మారిపోయాడు. అతను విధానాలను కాదు, రాజకీయ బ్రాండ్లను కొనుగోలు చేస్తున్నాడు.
ఆధునిక సమాజంలో వాస్తవం కంటే దాని ప్రదర్శన ముఖ్యమవుతుంది. మన దేశంలో ఇప్పుడు రాజకీయాలు పాలన కంటే ఈవెంట్ మేనేజ్‌మెంట్‌గా మారుతున్నాయి. భారీ వేదికలు, సినిమాటిక్ విజువల్స్, ఎమో షనల్ స్లోగన్స్… ఇవన్నీ యువత చైతన్యాన్ని ఆక్రమించే పద్ధతులు. నేటి యువత ఇక కేవలం ప్రేక్షకులు కాదు; ఆ ప్రదర్శనలో వాళ్లే తెలియకుండా పాత్రలు అయిపోయారు.
అయితే ఈ కథలో మరొక అంతర్ముఖ సత్యం ఉంది. బొద్దింక ఎంత తెలివిగా బ్రతి కినా, అది చీకటిలోనే జీవిస్తుంది. వెలుతురు పడితే పరుగెడుతుంది. అదే విధంగా, ఏ రాజకీయ వైరింగ్ అయినా విమర్శనాత్మక ఆలోచనకు భయపడుతుంది. బాగా చదివే యువత ప్రమాదకరం. చరిత్ర గుర్తుపెట్టు కునే సమాజం ప్రమాదకరం. ప్రశ్నించే హక్కును వాడుకునే యువత అత్యంత ప్రమా దకరం. అందుకే ఇప్పుడు సమాచార యుద్ధం జరుగుతోంది.. నిజం కోసం కాదు, మీ అటెన్షన్‌ను మళ్లించడం కోసం. పాత తరం కామన్ మాన్ నిరుపేద భారత దేశపు మౌనాన్ని ప్రతిబింబించాడు. నేటి యువత ఒక అల్గోరిథమ్‌ల యుగంలో జీవిస్తోంది. మీ కోపాన్ని కొలుస్తున్నారు. మీ భయాలను మార్కె ట్ చేస్తున్నారు. మీ దేశభక్తిని డేటాగా మార్చుతున్నారు. రాజకీయ పార్టీలు ఓట్లు గెలవడం కాదు; మన మనసులను డిజైన్ చేస్తున్నాయి.
చివరికి ప్రశ్న ఒక్కటే. స్మార్ట్‍ఫోన్ అల్గోరిథమ్‌లతో యువత మెదడును రీవైర్ చేయవచ్చు, మన మనస్సాక్షిని కూడా పూర్తిగా మార్చగలమా? చరిత్ర చెబుతుంది- ప్రజలు కొంతకాలం మాయలో జీవిస్తారు, వాస్తవం ఎప్పుడో ఒకప్పుడు తలుపు తడుతుంది. ఆకలి, నిరుద్యోగం, భవిష్యత్తు గురించిన ఆందోళన.. ఇవి నినాదాలతో దాచలేని నిజాలు. ప్రజాస్వామ్యం చివరికి ఓటింగ్ యంత్రం కాదు; జ్ఞాపకశక్తి. ఒక తరం తనను తాను గుర్తుపెట్టుకునే శక్తి. ఆ శక్తి చనిపోతే దేశం మ్యాప్‌లో మిగులుతుంది, పౌరసమాజం మాయం అవుతుంది. ఈ డిజిటల్ యుగంలో అత్యంత విప్లవాత్మక చర్య మళ్ళీ సొంతంగా ఆలోచించడం, స్క్రీన్ వెనుక ఉన్న నిజాన్ని సందేహించడం, మళ్ళీ బాధ్యత గల మనిషిగా మారడం.
డా.నంబూరి చంద్రశేఖర్
రేడియో ఫిజిసిస్ట్

