Friday, September 20, 2024
Homeఓపన్ పేజ్Right to sit: మాల్సులో పనిచేస్తున్న వారూ మనుషులే

Right to sit: మాల్సులో పనిచేస్తున్న వారూ మనుషులే

తీవ్ర ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్న ఉద్యోగులు

ఒకప్పుడు పెద్ద పెద్ద పట్టణాలలో మాత్రమే కనిపించిన మాల్స్, మార్ట్స్ ఇప్పుడు ప్రతీ పట్టణాలలో దర్శనమిస్తున్నాయి. ఇవి ఎక్కువగా వస్త్రాలు, ఎలక్ట్రానిక్స్ మరియు గృహోపకరణాలు, జ్యులరీ రంగాలలో ఉంటున్నాయి. వీటి వలన ఎంతో మంది యువతకు ఉపాధి కలిగించడం చాలా ఆనందించదగ్గ విషయమే. వెళ్ళగానే గ్లాస్ తలుపులు తీసి ఆహ్వానించే వారినుండి సేల్స్మెన్ వరకూ నవ్వుతూ మనకు కనిపిస్తారు. ఇది ఒక కోణం మాత్రమే…! రెండో కోణంలో అక్కడ పనిచేస్తున్న సిబ్బంది అనుభవిస్తున్న బాధలు వారికి మాత్రమే అనుభవనీయం. ఈ మాల్స్ లలో అధికారికంగా కంటే అనధికారికంగానే ఎక్కువ సంఖ్యలో పనిచేస్తుంటారు. వీళ్ళకి చట్ట బద్ధమైన హక్కులు ఏమీ ఉండవు. మాల్స్‌లో, షాపుల్లో సేల్స్‌పర్సన్‌లకు కూర్చోడానికి కుర్చీలు ఉండవు. రోజూ 10-12 గంటల పాటు నిల్చునే తమ పనిచేస్తారు. మాల్స్ పెద్ద రిటైల్ దుకాణాలు, షోరూమ్‌లు, షాపుల్లో చాలా మంది సేల్స్‌మెన్ ఎందుకు కూర్చోరు? ఈ షాపుల్లో పనిచేస్తున్న వారికి కూర్చునే సౌకర్యం ఎందుకు లేదు ? దీనికి కారణం యాజమాన్యం దృష్ఠిలో వారు కూర్చోడానికి అర్హత లేదు. కనీసం దుకాణంలో కస్టమర్ లేనప్పుడు కూడా వారి పని వేళల్లో కూర్చునే హక్కు వారికి లేదు. ఎలాంటి చట్టబద్ధమైన నిబంధనలు లేకపోవడం వలన మరియు తమ ఉద్యోగాలు పోతాయేమనో భయంతో వారు ఇటువంటి పరిస్థితుల్లో పని చేస్తూ ఉంటారు. కొన్ని మాల్సులలో టాయిలెట్ బ్రేక్‌లు కూడా ఉండవు. ఇటువంటి దయనీయమైన పని పరిస్థితుల కారణంగా చాలా మంది కార్మికులు కిడ్నీ సంబంధిత సమస్యలు, మోకాళ్ళ సమస్యలు మరియు వెన్నునొప్పి వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. షాప్ మరియు సంస్థలలో పని పరిస్థితులకు సంబంధించిన సమస్యలు మన దేశంలో షాప్ మరియు ఎస్టాబ్లిష్‌మెంట్ చట్టం ద్వారా నియంత్రించబడతాయి. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 42 ప్రకారం డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ ప్రకారం అసంఘటిత రంగాలలోని కార్మికుల కోసం పని ప్రదేశంలో న్యాయమైన మరియు మానవీయ పరిస్థితుల కోసం నిబంధనలు, విధానాలను రూపొందించడానికి రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత తీసుకోవాలి.

- Advertisement -

గతంలో కోర్టు తీర్పులు:
కన్స్యూమర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్ వెర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా విషయంలో సుప్రీం కోర్టు ఒక కార్మికుని ఆరోగ్య హక్కు అనేది అర్ధవంతమైన జీవించే హక్కులో అంతర్భాగమని, దృఢమైన ఆరోగ్యం మరియు శక్తి లేకుంటే కార్మికుడు దుర్భర జీవితాన్ని గడుపుతాడని, ఆరోగ్యం లేకపోవడం ఉద్యోగుల జీవనోపాధిని నిరాకరిస్తుందని పేర్కొంది. 1992లో సి.ఇ.యస్.సి లిమిటెడ్ వెర్సెస్ సుభాష్ చంద్రబోస్ కేసులో ఆరోగ్య హక్కు కార్మికులకు ప్రాథమిక మానవ హక్కు అని, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అత్యంత ఆవశ్యకమైన రాజ్యాంగ లక్ష్యమని సుప్రీం కోర్టు పేర్కొంది.

కూర్చొనే హక్కు సాధనలో…
2018 సం.లో కేరళ రాష్ట్రం మాల్సులలో కూర్చొనే హక్కు చట్టాన్ని ఆమోదించింది. ఇది భారతదేశంలోనే మొదటి చట్టం. సెప్టెంబరు 2021లో తమిళనాడు ఇలాంటి చట్టాన్ని ఆమోదించిన రెండవ రాష్ట్రంగా ప్రసిధ్ధి చెందింది. పూర్వాపరాలు చూస్తే ..2012 సం.లో కేరళ రాష్ట్రం కోజికోడ్లో ఒక టెక్స్‌టైల్ యూనిట్ షోరూమ్‌లో కస్టమర్లు షాపింగ్ చేస్తున్నప్పుడు అక్కడ పనిచేసే సేల్స్ ఉమెన్ గోడకు ఆనుకుని ఉన్నందుకు యాజమాన్యం సేల్స్‌వుమన్ జీతంలో కోత విధించింది. అప్పుడు కూర్చునే హక్కు కోసం పోరాటం ప్రారంభం అయింది. మనదేశంలో కూర్చునే హక్కును పొందాలనే ప్రచారానికి కేరళ మరియ తమిళనాడులో శ్రామిక తరగతి స్త్రీవాదులు, కార్మిక సంఘాల నిర్వాహకులు, కమ్యూనిస్టులు నాయకత్వం వహించారు. కూర్చునే హక్కు ఉద్యమానికి కేరళకు చెందిన స్త్రీవాద కార్మిక సంఘం పెంకూట్టు నాయకత్వం వహించింది. ఈ లేబర్ యూనియన్‌ను కోజికోడ్ నగరానికి చెందిన టైలర్-కార్యకర్త విజి పలితోడి స్థాపించారు. ఈ పోరాటాల ఫలితంగా కేరళ ప్రభుత్వం డిసెంబర్ 2018లో కేరళ షాప్స్ అండ్ కమర్షియల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ యాక్ట్ 1960ని సవరించింది. ఈ చట్టం పని చేసే మహిళలకు మరింత సురక్షితమైన వాతావరణాన్ని కల్పించింది. పనిచేసే చోట లైంగిక దోపిడీని కూడా నివారించింది. కేరళ దుకాణం మరియు స్థాపన చట్టంలో కొత్తగా ప్రవేశపెట్టిన సెక్షన్ 21బి ప్రకారం ప్రతి దుకాణం మరియు వాణిజ్య సంస్థలలో డ్యూటీ సమయంలో నిల్చునే పరిస్థితిని నివారించడానికి కార్మికులందరికీ కూర్చోవడానికి తగిన ఏర్పాట్లు చేయాలి. తద్వారా వారు తమ పని సమయంలో కూర్చునే అవకాశాన్ని కలిగి ఉంటారు. తరువాత సెప్టెంబరు 2021లో తమిళనాడు రాష్ట్రం తమిళనాడు దుకాణాలు మరియు స్థాపన చట్టంను తీసుకొచ్చింది. ఇందులో సెక్షన్ 22ఎ ప్రకారం దుకాణాలు వాణిజ్య సంస్థల్లో సేల్స్‌మ్యాన్, పని చేసే సిబ్బందికి కూర్చొనే హక్కుని తప్పనిసరి చేసింది.

అన్నీ రాష్ట్రాలు చట్టాలు తీసుకురావాలి…
శ్రామికుల వర్గం పట్ల ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను రుజువు చేసే చట్టాలను ఆమోదించినందుకు కేరళ, తమిళనాడు ప్రభుత్వాలను తప్పక అభినందించాలి. ఈ చట్టాలు ఇతర రాష్ట్రాల్లోని కార్మికులు భవిష్యత్తులో తమ రాష్ట్ర ప్రభుత్వాల నుండి ఇలాంటి సవరణలను డిమాండ్ చేయడానికి మార్గం సుగమం చేశాయి. ఒక సామాజిక ప్రయోజనం కోసం అంకితభావంతో కూడిన ఉద్యమం భారత రాజ్యాంగం కింద పేర్కొన్న తమ విధులను నిర్వర్తించేలా ప్రభుత్వాలను బలవంతం చేయగలదనే వాస్తవాన్ని కూడా ఈ చారిత్రక విజయం నిర్ధారిస్తుంది. కార్మిక కార్యకర్తలు దేశవ్యాప్తంగా కూర్చునే హక్కు చట్టాన్ని కోరుతున్నారు. చట్టాలతో పాటుగా యాజమాన్యం మానవతా దృష్టితో మాల్స్, మార్ట్లు, చిన్న షాపులలో కూడా అక్కడ పనిచేసే వారికి కనీస సదుపాయాలు కల్పిస్తారని ఆశిద్దాం.

జనక మోహన రావు దుంగ
అధ్యాపకుడు
శ్రీకాకుళం
ఆంధ్రప్రదేశ్
8247045230

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News