Saturday, July 13, 2024
Homeఓపన్ పేజ్Rishikonda turned palace: రుణ పర్వతాన్ని పెంచిన రుషి కొండ

Rishikonda turned palace: రుణ పర్వతాన్ని పెంచిన రుషి కొండ

మరింత వేడెక్కిన రాజకీయాలు

రుషి కొండకు తెలుగులో మరొక అర్థం సర్వసంగ పరిత్యాగుల కొండ అని. అయితే, విశాఖ పట్నంలో జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం రుషికొండను నేలమట్టం చేసి నిర్మించిన విలాసవంతమైన ‘రాజ సౌధం’లో ఎక్కడా సర్వసంగ పరిత్యాగం కనిపించదు. మీడియా అంతా జగన్‌ ప్యాలెస్‌ గా అభివర్ణిస్తున్న ఈ సువిశాల భవనాన్ని 9.88 ఎకరాల్లో, అధికార లెక్కల ప్రకారం రూ. 350 కోట్ల ఖర్చుతో నిర్మించడం జరిగింది. జగన్‌ పార్టీని ఓడించి అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం దీని ఖర్చును రూ. 550 కోట్లుగా తేల్చి చెప్పింది. ఇదివరకు ఈ రుషి కొండ మీద బంగాళా ఖాతానికి అభిముఖంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పర్యాటక సంస్థకు చెందిన హరితా రిసార్ట్‌ భవనం ఉండేది. సముద్ర తీరం కనిపించేటట్టుగా విలాసవంతమైన విల్లాలు, సూట్లతో ఇక్కడ అద్భుతమైన భవనాన్ని నిర్మించాలని సంకల్పించిన జగన్‌ ప్రభుత్వం 2021లో దీని నిర్మాణాన్ని చేపట్టింది. ఏడు బ్లాకులతో ఇక్కడ సువిశాలమైన భవన నిర్మాణం జరిగింది కానీ, అది ఇప్పటికే అప్పుల కుప్పగా, రుణ పర్వతంగా ఉన్న రాష్ట్రాన్ని మరింత అప్పుల పాలు చేయడానికి తప్ప మరే విధంగానూ ఉపయోగపడే స్థితిలో లేదు.
విచిత్రమేమిటంటే, అది ఇంతవరకూ ఓ పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకోనే లేదు. ఈ భవనంలో భద్రతా సిబ్బందికి కావలసిన వసతి సౌకర్యాలను అమర్చారు. ముఖ్యమంత్రి కార్యదర్శులకు ప్రత్యేక సదుపాయాలను కల్పించారు. ముఖ్యమంత్రి కార్యాలయాన్ని నిర్మించారు. అతిథులకు కావలసిన ఏర్పాట్లు చేశారు. చివరికి ముఖ్యమంత్రి నివాసాన్ని కూడా అభివృద్ధి చేశారు. ఈ ఏడు బ్లాకుల సువిశాల భవనంలో కేఫ్టేరియా, మసాజ్‌ సెంటర్‌, వ్యాయామశాల, బాంకెట్‌ హాల్స్‌ను కూడా నిర్మించడం జరిగింది. రుషికొండలాంటి పర్యావరణహితమైన ప్రాంతాన్ని కుప్పకూల్చి అత్యంత విలాసవంతమైన భవనాన్ని ఒక ఆధునిక సెవన్‌ స్టార్‌ హోటల్‌ స్థాయిలో నిర్మించడం, దాని మీద రూ. 550 కోట్లు ఖర్చు చేయడం వంటివి జగన్‌ ప్రభుత్వంపై విమర్శలకు అవకాశమి చ్చాయి. ఇది ఒక ముఖ్యమంత్రి స్థాయి భవనంగా కనిపించడం లేదు. మహారాజాలు నివసించే రాజప్రాసాదంలా కనిపిస్తోందని, ఖజానా ఖాళీగా ఉన్న స్థితిలో భారీగా అప్పు చేసి ఈ భవనాన్ని నిర్మించడంలో అర్థం లేదని తెలుగుదేశం పార్టీ నాయకులు విమర్శలు గుప్పించడం జరుగుతోంది. ఈ భవన నిర్మాణం పర్యావరణ నిబంధనలకు విరుద్ధంగా జరుగుతోందని, కోస్టల్‌ రెగ్యులేషన్‌ జోన్‌ (సి.ఆర్‌.జె) నిబంధనలకు పూర్తి వ్యతిరేకమని వాదిస్తూ కొందరు పర్యావరణవేత్తలు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేయడం జరిగింది. ఇవి విచారణలో ఉండగానే భవన నిర్మాణాన్ని పూర్తి చేయడం ప్రభుత్వ బాధ్యతారాహిత్యానికి అద్దం పడుతోంది.
అయితే, 2024లో జగన్‌ తిరిగి అధికారంలోకి వచ్చే పక్షంలో విశాఖ పట్నాన్ని రాజధానిగా ప్రకటించి ఈ భవనాన్ని తన అధికార నివాసంగా చేసుకోదలిచారని, ఆ కారణంగానే దీన్ని ఇంత విలాసవంతంగా నిర్మించడం జరిగిందని అధికారులు చెబుతున్నారు, రాష్ట్రపతి, ప్రధానమంత్రి వంటి వారు విశాఖపట్నానికి వచ్చే పక్షంలో వారికి హోటళ్లలో బస ఏర్పాటు చేసే బదులు ఈ భవనంలో బస ఏర్పాటు చేయాలన్నది జగన్‌ ప్రభుత్వ ఉద్దేశమని ఆయన సహచరులు చెబుతున్నారు. ఇది ప్రైవేట్‌ ఆస్తి కాదని, ఇది ప్రభుత్వ ఆస్తి అని కూడా వారు వాదిస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వం దీని నిర్మాణం తదితర అంశాల మీద ఒక సమగ్ర దర్యాప్తునకు ఆదేశించింది. రోడ్లు, భవనాలు శాఖ, పర్యావరణ శాఖ ఈ భవన నిర్మాణానికి ఎలా అనుమతులు మంజూరు చేశాయన్నది కూడా ప్రభుత్వం దర్యాప్తు చేస్తోంది. గత జూన్‌ 4న వెలువడిన రాష్ట్ర శాసనసభ ఎన్నికల ఫలితాల్లో కేవలం 11 స్థానాలు మాత్రమే సంపాదించుకున్న జగన్‌ పార్టీకి ఈ ఓటమి ఒక పెద్ద దెబ్బ కాగా, రుషి కొండ ప్యాలెస్‌ నిర్మాణం మరొక పెద్ద దెబ్బ అయ్యే అవకాశం ఉంది. జగన్మోహన్‌ రెడ్డి తన వ్యక్తిగత సుఖ సంతోషాల కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారన్న అభిప్రాయం ఇప్పటికే ప్రజల్లో వ్యాపించిపోయింది.
కాగా, 2024 ఎన్నికల అనంతరం చోటు చేసుకుంటున్న పరిణామాలు 2019 నాటి పరిస్థితులను గుర్తు చేస్తున్నాయి. అయిదేళ్ల క్రితం రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన జగన్మోహన్‌ రెడ్డి అంతకు ముందు రూ. 8.9 కోట్ల ఖర్చుతో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అమరావతిలో నిర్మించిన ప్రజావేదిక భవనాన్ని కూలగొట్టించడం జరిగింది. ఈ భవన నిర్మాణంలో అక్రమాలు జరిగినట్టు ఆయన అప్పట్లో ఆరోపించారు. అమరావతి ప్రాంతంలోని ఉండవల్లిలో ఒక భవనాన్ని అద్దెకు తీసుకుని తన నివాసాన్ని ఏర్పాటు చేసుకున్న చంద్రబాబును మరింతగా అవమానించే ఉద్దేశంతో జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం ఆ భవనాన్ని కూడా కూలగొట్టే ప్రయత్నం చేసింది. కృష్ణానది ఒడ్డున ఉన్న ఈ భవనం పర్యావరణ నిబంధనలకు వ్యతిరేకంగా కట్టడం జరిగిందని ఆయన ఇందుకు కారణం చెప్పారు. చంద్రబాబును ఈ భవనం నుంచి వెళ్లగొట్టడానికి కూడా ప్రయత్నాలు జరిగాయి. తాడేపల్లిలోని జగన్మోహన్‌ రెడ్డి నివాసం చుట్టూ ఉన్న భద్రతా వలయాలను, ఏర్పాట్లను ప్రస్తుత ప్రభుత్వం ఇప్పటికే తొలగించింది. ప్రభుత్వ ఫర్నిచర్‌ను కాజేసి జగన్‌ తన నివాసానికి తరలించారని కూడా ప్రభుత్వం ఆరోపిస్తోంది. మొత్తం మీద రాష్ట్ర రాజకీయాల్లో పంటికి పన్ను, కంటికి కన్ను రాజకీయాలు జోరుగా సాగుతున్నట్టు కనిపిస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News