ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన నీడ సూరి. అందరికి గుర్తుండే ఉంటాడు. తెల్లని జుట్టుతో వైఎస్ వెన్నంటే ఉండి, ఆయన బిజీ షెడ్యూల్ లో భాగంగా ఉండేవాడు. ప్రతి ఫోటోలోనూ సూరి ముఖం తప్పక కనిపించేది. అప్పుడెప్పుడో వైఎస్ హయాంలో కనిపించిన ఓ షాడో వ్యక్తి ఇప్పుడు ఇక్కడ రోహిన్ రెడ్డి రూపంలో ప్రత్యక్షమయ్యాడు. పార్టీ అదే సీఎం మారారు అంతే అంటూ ‘తెలంగాణ సూరి’ అని రోహిన్ వ్యవహరించటం కూడా ఆఫ్ ది రికార్డ్‍గా వినిపిస్తోంది. సీఎం క్యాంప్ ఆఫీస్ వేదికగా జరిగే ఆయా కార్యక్రమాల్లో సీఎం పక్కనే ఉంటాడు. అధికారికంగా ఐ అండ్ పీఆర్ సమాచార ప్రోటోకాల్ మీడియాకిచ్చే ఫోటోల్లో ప్రముఖంగా కనిపిస్తారు. సీఎం రేవంత్ వంటి గొప్ప వ్యక్తి పక్కన కనిపించే ఈ వ్యక్తి ఎవరు అంటూ చాలా సందర్భాల్లో సోషల్ మీడియా వేదికగా చర్చ జరిగింది.
ఇంతకీ ఈ రోహిన్ రెడ్డి ఎవరు?
సుమంత్ వ్యవహారంలో ఈ పేరు ప్రముఖంగా వెలుగులోకి రావటంతో ఇప్పుడు అందరి దృష్టి రోహిన్ పై పడింది. రోహిన్ రెడ్డి పేరే కాదు ఆ మనిషి కూడా ప్రత్యేకమే. కొంచెం జాగ్రత్తగా కొంచెం లోతుగా విచారిస్తే రోహిన్ మూలాలు రాజకీయంగా హిమాయత్ నగర్ (పునర్విభజన జరగ ముందు) లో ఉన్నట్టు తేలాయి. మీకు గుర్తుండే ఉంటుంది స్టాంపుల కుంభకోణంలో జైలుపాలై రాజకీయంగా తెరమరుగైన మాజీ మంత్రి సీ కృష్ణ యాదవ్ అనుంగు అనుచరుల్లో ముఖ్యుడిగా రోహిన్ వెలిగారు. స్టాంపుల కుంభకోణం బయటికి రావటంతో రోహిన్ కొంతకాలం తెరవెనుక సైలెంట్ గా డెంటల్ డాక్టర్ వృత్తికే పరిమితం అయ్యారు.
ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ సమీప ప్రాంతంలో డెంటల్ ఆసుపత్రి నిర్వహించారు. కొంతకాలం తరువాత రాజకీయ మార్పుల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీన్ కట్ చేస్తే సౌత్ ఇండియాలోనే పవర్ఫుల్ సీఎంల్లో ఒకరుగా విశిష్ట స్థానం సంపాదించుకున్న రేవంత్ కుడి భుజంగా అందరి కంటికి కనిపిస్తున్నారు.
దీంతో చిన్న వ్యాపారులు మొదలు పెద్ద వ్యాపారుల వరకు, ఫ్యామిలీ సమస్యల నుంచి కార్పొరేట్ సమస్యల వరకు, అధికారుల ప్రమోషన్ నుంచి బదిలీల దాకా సర్వత్రా అందరూ అయ్యవారిని ప్రసన్నం చేసుకునేందుకు పోటీ పడుతున్నారు. ఇదే అదనుగా రోహిన్ తన ఆర్థిక సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. సీఎం కంటికి కూడా తెలీకుండా తాను చేసే సెటిల్మెంట్లు, ఫోన్లు సుమంత్ ఎపిసోడ్ తో బట్టబయలు అయ్యాయి. విశ్వసనీయ సమాచారం మేరకు సుష్మిత నోటి వెంట రోహిన్ రెడ్డి పేరు విన్నవెంటనే సీఎం రేవంత్ సైతం షాక్ తిన్నట్టు సమాచారం.
అప్పుడు 11 కోట్లు ఇప్పుడెంత?
రోహిన్ రెడ్డి గురించి తెలుగుప్రభకు అందిన సమాచారాన్ని క్రోడీకరించే సమయంలో ఆయన ప్రస్తుత ఆస్తుల చిట్టా కూడా చేతికందింది. అనధికారిక లెక్కల గురించి ఇక్కడ ప్రస్తావించదలచుకోలేదు. అధికారికంగా రోహిన్ రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో అంబర్ పేట నుంచి పోటీ చేసినప్పుడు ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్న ఆస్తుల వివరాలనే ప్రస్తుతానికి పరిగణలోకి తీసుకుంటున్నాం.
2018-19 ఆర్థిక సంవత్సరానికి గానూ 15.83 లక్షల ఆదాయం, మళ్లీ 2019-2020కి 16.86 లక్షలు, తరువాత 2020-21లో 15.92 లక్షలు, 2021-2022లో 20 లక్షలు, మళ్లీ 2022-2023లో 19.89 లక్షలు. ఇది ఆయన చూపిన ఆయా ఆర్థిక సంవత్సరాల ఆదాయపు లెక్కలు. అలాగే మొత్తం ఆస్తులు 11.69 కోట్లుగానూ చూపించగా 79 లక్షల రూపాయలు అప్పులున్నట్టు పేర్కొన్నారు. ఈయన భార్య ఆదాయం కూడా 2.5 లక్షలు దాటలేదన్నట్టు చూపారు. ఇది స్థూలంగా గత అసెంబ్లీ ఎన్నికల ముందు రోహిన్ రెడ్డి ఇచ్చిన ఫైనాన్షియల్ హెల్త్ డాటా.
ఎన్నికల్లో ఓటమి
అంబర్పేట నుంచి పోటీ చేసిన రోహిన్ రెడ్డి తన సమీప బీఆర్‌ఎస్ అభ్యర్థి కాలేరు చేతుల్లో ఓటమిపాలయ్యారు. సాధారణంగా ఒక అభ్యర్థి ఓటమిపాలైతే కొంతకాలం రాజకీయంగా కనుమరుగు అవుతారు. కానీ ఇక్కడ మాత్రం గమ్మతైన విషయం జరిగింది. ఆయన ఓడిపోయినా కాంగ్రెస్ పార్టీ గెలిచి, రేవంత్ సీఎం అయ్యారు. మళ్లీ ఇక్కడ సీన్ కట్ చేస్తే సీఎం క్యాంప్ ఆఫీస్ లో రోహిన్ ప్రత్యక్షమయ్యాడు. అనతి కాలంలోనే సీఎంకు ఆంతరంగికుడై సీఎంను కలవాలంటే రోహిన్ ను కలవాల్సిందే అన్న ప్రచారం జోరుగా కార్పొరేట్ వర్గాల్లో అవుతోంది.
ఆ మంత్రిత్వ శాఖ ఈ మంత్రిత్వ శాఖ అన్న తేడా లేదు. ఓ ఆర్థిక శాఖ మినహా అన్ని శాఖల్లో ఈయన వేలుపెడుతున్నాడనే ఆరోపణలు బహిరంగంగానే ఉన్నాయి. సీసీఎల్‌ఏ మొదలు ఆయా జిల్లా కలెక్టర్లకు, మండల స్థాయి, రెవెన్యూ డివిజన్ అధికారులకు నేరుగా ఫోన్ చేసి తన ప్రాపకం పెంచుకున్నట్టు బలంగా ఆరోపణలున్నాయి. ఇంతింతై వటుడింతై అన్నట్టు జరుపుతున్న సెటిల్మెంట్లు, ఆయా శాఖల నుంచి అనుమతులు ఇప్పించటం ద్వారా తన ఆదాయ మార్గాలను కూడా విస్తరించినట్టు చెబుతున్నారు.
సీఆర్‌ఆర్ కన్స్ట్రక్షన్స్ అండ్ ఎస్టేట్స్, శ్రీ వెంకటేశ్వర మూవీ మేకర్స్ ఈ రెండు కంపెనీల్లో మేనేజింగ్ పార్ట్నర్ గా ఉన్నట్టు తానిచ్చిన అఫిడవిట్ లో పేర్కొన్నారు. అలాగే భార్య ఓ ప్రైవేటు టీచర్ అంటూ తెలిపారు. ఇప్పుడు పైన పేర్కొన్న రెండు కంపెనీలు రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ (ఆర్వోసీ)లో యాక్టివ్ గా లేవు. అయితే పేరైనా మారుండచ్చు లేదా కంపెనీ ఎత్తివేసి ఉండచ్చు. ఈలెక్కన తాను పేర్కొన్న కంపెనీల ఆదాయం కూడా ఆయనకు రావటం లేదని తెలుస్తోంది. అయినా రోహిన్ రెడ్డి కోట్లకు పడగలెత్తారు. పరపతిలోనూ, డబ్బులోనూ తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ స్థానానికి పోటీ చేసి ఓడిపోయిన ఏ అభ్యర్థికి అందని ‘మెగా’ అవకాశం ఒడిసిపట్టారు. తదనుగుణంగా కార్యచరణ రూపొందించుకుని రేవంత్ లాంటి ఫైర్ ఉన్న నాయకుడి వెనుకే ఆర్థికపరమైన అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి. ఈరకంగా చూస్తే సురేఖకు నీడలా ఉన్న సుమంత్ కు, సీఎం రేవంత్ కు వెన్నంటే ఉన్న రోహిన్ రెడ్డికి తేడా ఏముందంటూ సురేఖ కుమార్తె సుష్మితా మీడియా ముఖంగా ప్రశ్నించటం హాట్ టాపిక్ గా మారింది. ఇదే విషయాన్ని గురువారం ఎమ్మెల్యే క్వార్టర్స్ లో మీనాక్షి నటరాజన్ ముందు కొండా కుటుంబం ప్రస్తావించినట్టు విశ్వసనీయ సమాచారం.
డెక్కన్ సిమెంట్ కాలుష్య సమస్యకు సంబంధించిన సెటిల్మెంట్ లో రోహిన్ కార్యాలయాన్నే సుమంత్ వాడారని చెప్పటం ఇక్కడ దుమారానికి ప్రధాన కారణం. ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వంలో అటు సుమంత్ లాంటి ఇటు రోహిన్ లాంటి మనుషుల వ్యవహారాలు కాంగ్రెస్ ప్రభుత్వ గ్రాఫ్ దిగజార్చుతోంది.
మీనాక్షి నటరాజ్ కు ఫిర్యాదులు
రోహిన్ రెడ్డి వ్యవహారం ఖైరతాబాద్ కాంగ్రెస్ లో కాకరేపింది. డీసీసీ మీటింగ్ లో నాయకుల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో స్థానిక కాంగ్రెస్ నాయకులపై కేసులు పెట్టిస్తానని రోహిన్ రెడ్డి బెదిరింపులకు దిగాడని మీనాక్షి నటరాజన్ కు స్థానిక కాంగ్రెస్ నాయకులు గురువారం ఫిర్యాదు చేశారు. ఆయా నాయకుల ఫిర్యాదులను విన్న ఆమె, పీసీసీ చీఫ్ తో మాట్లాడి సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చినట్టు సమాచారం.


