Friday, September 20, 2024
Homeఓపన్ పేజ్Sabarimala needs to be modernised: శబరిమలలో భక్తులకు భద్రత

Sabarimala needs to be modernised: శబరిమలలో భక్తులకు భద్రత

భక్తుల రద్దీ ఎక్కువ కానుంది కాబట్టి సదుపాయాలు, భద్రత పెంచాలి

శబరిమలలో వార్షిక దీక్షా కార్యక్రమం ప్రారంభం అయినందు వల్ల అందరి దృష్టీ మళ్లీ భక్తుల భద్రత మీద కేంద్రీకృతమైంది. వచ్చే రెండు నెలల కాలంలో భక్తుల రద్దీని బట్టి, వారు క్షేమంగా తమ తమ ప్రాంతాలకు తిరిగి వెళ్లగలగడాన్ని బట్టి, అధికారులు ఈ రద్దీని తట్టుకోవడానికి, భక్తులకు భద్రత కల్పించడానికి చేస్తున్న ఏర్పాట్లు ఏ స్థాయిలో ఉన్నాయన్నది అర్థమవుతుంది. ఈ దీక్షా సమయంలో ఎంత లేదన్నా 75 లక్షల మంది భక్తులు శబరిమలను సందర్శిస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. గత ఏడాది 56 లక్షల మంది భక్తులు ఈ సమయంలో శబరిమలకు యాత్ర చేయడం జరిగింది. అంటే ఇక్కడికి వస్తున్న భక్తుల సంఖ్య ఆయేటికాయేడు పెరుగుతోందే తప్ప తగ్గడం లేదనేది అర్థమవుతూనే ఉంది. కేరళ ప్రభుత్వం, ట్రావన్‌ కూర్‌ దేవాస్వోమ్‌ బోర్డు, శబరిమల దేవస్థానం అధికారులు తదితరులంతా కలిసి భద్రతా ఏర్పాట్లను మరింతగా పెంచాల్సిన అవసరాన్ని ఇది గుర్తుచేస్తోంది. మొదటగా ఇక్కడ క్యూలను అదుపు చేయడానికి ప్రవేశపెట్టిన వ్యవస్థ సక్రమంగానే పనిచేస్తోంది. భక్తులే ఈ క్యూలను అదుపు చేయాల్సి రావడమన్నది ఒక చక్కని ప్రయోగమేనని చెప్పవచ్చు. అంతేకాక, మొత్తం మూడు ప్రదేశాల్లో సీసీ టీవీలను ఏర్పాటు చేసి క్యూల మీద దృష్టి పెట్టడం కూడా స్వాగతించదగ్గ పరిణామమే.
అంతేకాక, పంబలో ఒక 64 పడకల ఆధునిక ఆస్పత్రిని ప్రభుత్వం నెలకొల్పడం జరిగింది. అంతేకాక, ఆలయం దగ్గరే ఒక 15 పడకల ఆస్పత్రిని నెలకొల్పడం కూడా జరిగింది. రవాణా, వసతి సౌకర్యాలను మెరుగుపరచడంతో పాటు, పారిశుద్ధ్యానికి కూడా అత్యంత ప్రాధాన్యం ఇవ్వడం ప్రారంభమైంది. మొత్తం మీద ఆయేటికాయేడు పెరుగుతున్న భక్తుల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని, సౌకర్యాలను, భద్రతా ఏర్పాట్లను పెంచడం అనేది ఆనందించదగ్గ విషయమే కానీ, ఇక్కడికి వస్తున్న భక్తుల సంఖ్యతో పోలిస్తే ఈ సౌకర్యాలు అంతంత మాత్రమేనని చెప్పాల్సి ఉంటుంది. శబరిమల అభివృద్ధికి సంబంధించి మూడు నాలుగేళ్ల క్రితమే ఒక బృహత్‌ ప్రణాళికను ప్రకటించడం జరిగింది కానీ, అది ఇంతవరకూ ప్రారంభానికి నోచుకోలేదు. ఇందులో భాగంగా కొన్ని ప్రాథమిక సదుపాయాల నిర్మాణ కార్యక్రమాలు ప్రారంభం అయ్యాయి కానీ, అవి అర్ధాంతరంగా ఆగిపోయాయి. ఈ పనుల అమలు మధ్య సమన్వయం కోసం కొద్ది రోజుల క్రితం ముఖ్యమంత్రి పినరాయి విజయన్‌ సారథ్యంలో ఒక అత్యవసర సమావేశం జరిగింది. శబరిమల అభివృద్ధి అథారిటీని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఈ సమావేశంలో ఆదేశించారు. అధికారులు ప్రస్తుతం ఆ పనుల్లో నిమగ్నమై ఉన్నారు.
ఏ విధంగా చూసినా శబరిమలను దేశంలోని ఇతర ముఖ్యమైన దేవాలయాలతో సమానంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం కనిపిస్తోంది. ఆధునిక కాలానికి తగ్గట్టుగా ఆధునిక సౌకర్యాలను ఎంత వీలైతే అంతగా అభివృద్ధి చేయాల్సి ఉంది. రోడ్లు, విద్యుత్‌, తాగునీరు, మరుగుదొడ్లు, ఆరోగ్య సంరక్షణ వంటి సౌకర్యాలు ఇప్పటికీ చాలనన్ని ఏర్పడలేదు. ఇక్కడ అనేక సౌకర్యాలను మెరుగుపరచడంలో ప్రభుత్వం నత్తనడక నడుస్తోందనే విమర్శలు ప్రతి ఏటా దీక్షా కార్యక్రమ సమయంలో వినిపిస్తూనే ఉన్నాయి. ఇప్పటికి అత్యధిక సంఖ్యాక భక్తులు తమకు కావలసిన ఏర్పాట్లను తామే చేసుకోవాల్సి వస్తోంది. పర్యావరణ సమస్యల కారణంగా ప్రభుత్వం కొన్ని ప్రధాన చర్యలు చేపట్టలేకపోతోందని అధికారులు ప్రతిసారీ సంజాయిషీ ఇవ్వడం జరుగుతోంది. ప్రతి ఏటా అక్టోబర్‌ నుంచి జనవరి వరకూ సాగే దీక్షా కార్యక్రమం శాంతియుతంగా, ప్రశాంతంగా, ఎటువంటి దుర్ఘటనలూ జరగకుండా సాగిపోతే చాలని ప్రభుత్వం ప్రతి ఏటా భావిస్తూ ఉంటుంది.
కాగా, 10 నుంచి 50 ఏళ్లలోపు మహిళలు శబరిమల వచ్చి దర్శనం చేసుకోవచ్చంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రస్తుతం డోలాయమాన స్థితిలోనే ఉంది. ఈ తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లు ఇంకా సుప్రీం కోర్టు విస్తృత ధర్మాసనం పరిశీలనలోనే ఉన్నాయి. శబరిమల దేవాలయంలోకి ఎవరైనా ప్రవేశించవచ్చంటూ రాష్ట్ర ప్రభుత్వం ఒక హ్యాండ బుక్‌ ను విడుదల చేసింది కానీ, దానిపై విమర్శలు వెల్లువెత్తే సరికి హడావిడిగా దాన్ని ఉపసంహరించుకుంది. ఇటువంటి చర్యల వల్ల సామాజికంగా సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అందువల్ల ప్రభుత్వం ఈ ఆధ్యాత్మిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించడమే మంచిది. కోర్టు తీర్పు వెలువడే వరకూ వేచి చూడడమే మంచిది. పురాతన కాలం నాటి ఆచారాలు, సంప్రదాయాల జోలికి వెళ్లడం వల్ల ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతినే అవకాశం ఉంది. కోర్టు ఆదేశాలను వెనువెంటనే అమలు చేయాలని ఒత్తిడి తీసుకు వస్తున్న కొన్ని శక్తుల విషయంలో ప్రభుత్వం అప్రమత్తంగా ఉండడం మంచిది. భక్తుల రద్దీని తట్టుకోవడానికి సంబంధించి ఇప్పుడున్న సమస్యలకు తోడు శాంతిభద్రతల సమస్యను కొని తెచ్చుకోవడం ప్రభుత్వానికి సమంజసం కాదు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News