Monday, December 4, 2023
Homeఓపన్ పేజ్Saffron surge in education: విద్యా కాషాయీకరణను ప్రతిఘటించాలి

Saffron surge in education: విద్యా కాషాయీకరణను ప్రతిఘటించాలి

ప్రజా సమస్యలపై దృష్టి పెడితే దేశానికి మరింత మంచిది

దేశంలోని పాఠ్య పుస్తకాల్లో సిలబస్ మార్పునకు సంబంధించి జాతీయ విద్యా పరిశోధనా శిక్షణా మండలి (ఎన్.సి.ఇ.ఆర్.టి) నేతృత్వంలో నిర్వహించిన ఒక ఉన్నతస్థాయి కమిటీ సమావేశంలో పాఠ్య పుస్తకాల్లో ఇండియా అనే పేరుకు బదులుగా ‘భారత్’ అనే పేరును ఉపయోగించాలి అనే ప్రతిపాదన మరోసారి తెర ముందుకు వచ్చింది. ముఖ్యంగా ఎన్.సి.ఇ.ఆర్.టి కమిటీ ఛైర్మన్ సి.ఐ. ఐజాక్ నేతృత్వంలో సాంఘిక శాస్త్రానికి సంబంధించి ఏర్పాటు చేసిన కమిటీ ఈ ప్రతిపాదనను చేయడం గమనార్హం. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒకే గొడుగు కిందకు కలిసి వస్తున్న ప్రతిపక్షాలు తమ వేదికకు ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇంక్లూజివ్ అలయెన్స్ (ఇండియా) అని పేరు పెట్టుకున్న తరుణంలో అప్పటినుండి దేశం పేరును భారత్గా మార్చడానికి కేంద్ర ప్రభుత్వం అనేక విఫల ప్రయత్నాలు చేస్తున్న విషయం అందరికి విదితమే. హిందుత్వ అనుబంధ సంస్థలు కూడా ఈ దిశలో ప్రయత్నాలను ముమ్మరం చేస్తుండడాన్ని చాలా సృష్టంగా గమనించవచ్చు. జి – 20 శిఖరాగ్ర సమావేశాల్లో ప్రభుత్వ ఆహ్వానాలు మొదలుకొని నేమ్బోర్డ్స్ వరకూ ‘భారత్’ పేరును కేంద్రం రూపొందించి ఆ దిశగా ముందుకు సాగిన విషయాన్ని చాలా సృష్టంగా గమనించవచ్చు.

ఎన్.సి.ఇ.ఆర్.టి. పాఠ్య పుస్తకాలను మార్చే ఎజెండాకు 2020 లో ఆమోదించిన నూతన విద్యా విధానంలోనే విష బీజాలు ఇమిడి ఉండడాన్ని సునిశితంగా గమనించవచ్చు. ముఖ్యంగా ఎన్.సి.ఇ.ఆర్.టి కమిటీ ఛైర్మన్ సి.ఐ. ఐజాక్ చరిత్రకారుడిగా కన్నా ఆర్.ఎస్.ఎస్ సిద్ధాంతకర్తగా ఎక్కువ ప్రాచుర్యం పొందారు అనే విషయం అందరికి విదితమే. నేడు ఈ ప్రతిపాదన మరోసారి తెర మీదకు రావడంతో ఒక పక్క దేశవ్యాప్తంగా విస్తృతంగా చర్చానీయాంశంగా మారింది. మరోపక్క ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా తీవ్రస్థాయిలో విమర్శలు వెలువెత్తుతున్నాయి. పాఠ్యప్రణాళిక స్థితిని సమీక్షించేందుకు 2021లో ఎన్.సి.ఇ.ఆర్.టి ఏర్పాటు చేసిన 25 ఉన్నత స్థాయి కమిటీలలో ఐజాక్ కమిటి కూడా ఒక కమిటిగా భాగస్వామ్యాన్ని కలిగి ఉండడం గమనార్హం.

‘భారత్ అనే పేరును విష్ణు పురాణంలో ప్రస్తావించారు. కాళిదాసు కూడా భారత్ అనే మాటను ఉపయోగించారు. అది పురాతన పేరు. తుర్కులు, ఆఫ్ఘన్లు, గ్రీకుల దాడి తర్వాత ఇండియా అనే పేరు వాడారు. సింధు నది ఆధారంగా వారు భారత్ను గుర్తించారు. దీనిని మార్చాలని ప్రతిపాదించాం. 12వ తరగతి వరకూ పాఠ్య పుస్తకాల్లో భారత్ అనే పేరును ఉపయోగించాలని నేను గట్టిగా చెప్పాను. ఇతర సభ్యులు దీనికి అంగీకరించారు. ఇది కమిటీ ఏకగ్రీవ అభిప్రాయం’ అని. ఎన్.సి.ఇ.ఆర్.టి కమిటీ ఛైర్మన్ సి.ఐ. ఇజాక్ పేర్కొనడం గమనార్హం. అలాగే ప్రాచీన చరిత్రను సాంప్రదాయక చరిత్రగా పేర్కొనాలని, హిందూ రాజులు సాధించిన విజయాలను ఎక్కువగా హైలెట్ చేస్తూ వివరించాలి అని, ఆలాగే అన్ని సబ్జెక్ట్ల పాఠ్య పుస్తకాల్లో ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ను ప్రవేశపెట్టాలి అని ఆ కమిటీ సూచించినట్లుగా సిఫార్సు చేసినట్లు ఆయన పేర్కొనడం గమనార్హం.

విద్యార్థుల మెదళ్లలో ఎలా అయినా సరే ఇండియాకు బదులుగా భారత్ అనే పేరును బలవంతంగా రుద్దడానికి కేంద్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది అని నిస్సందేహంగా చెప్పవచ్చు. ‘జాతీయ స్థాయిలో పాఠ్య పుస్తకాలు మరియు ప్రణాళికల యొక్క ఖరారు ప్రక్రియ జరుగుతుంది’ అని ప్యానెల్ ఏర్పాటు చేసిన సిఫార్సులపై ఎన్.సి.ఇ.ఆర్.టి స్పష్టంగా పేర్కొనడం గమనార్హం. ఇండియా బదులు ‘భారత్’ అనే పదాన్నే పాఠ్య పుస్తకాల్లో ఉపయోగించాలి అనే ప్రతిపాదనకు సామాజిక శాస్త్రాల కరిక్యులమ్ ప్యానెల్ ఆమోదముద్ర వేసిందన్న వార్తలకు స్పందించి ప్రతిపక్షాలు, విద్యావేత్తలు, మేధావులు మరియు చరిత్రకారుల నుంచి పెద్ద ఎత్తున తీవ్ర విమర్శలు అంతే తీవ్రంగా రావడంతో ‘ఇంకా తాము ఏ నిర్ణయం తీసుకోలేదు అని, అందువల్ల ఇప్పుడు ఆ ప్రతిపాదనలపై స్పందించడం తొందరపాటు మాత్రమే కాకుండా అసహేతుకం కూడా అవుతుంది’ అని ఎన్.సి.ఇ.ఆర్.టి డైరెక్టర్ దినేష్ ప్రసాద్ సకలాని స్పందించి ‘అది ఇంకా ప్రతిపాదనల దశలోనే ఉంది. ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. అందువల్ల ఇప్పుడే వ్యాఖ్యానించడం సరైనది కాదు’ అని ఆయన తాత్కాలికంగా వెనక్కు తగ్గడాన్ని చాలా సునిశితంగా గమనించవచ్చు.

నేడు దేశంలో ప్రజలు అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటూ విషమ ప్రతికూలతలకు గురవుతున్నారు. కాని కేంద్రప్రభుత్వం ఆయా ప్రజా సమస్యలను పెడ చెవిన పెట్టి అనవసర పేర్ల మార్పిడిపై మరియు పాఠ్య ప్రణాళిక మార్పిడిపై ప్రత్యేక శ్రద్ధను కనబరచడం ఏమాత్రం సహేతుకం కాదు. అందువలన ప్రభుత్వం ఆయా ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలి. మారుతున్న కాలానికి అనుగుణంగా అవసరాలకు పాఠ్యాంశాలలో కూడా మార్పులు మరియు చేర్పులు కూడా శాస్త్రీయంగా ఉండాలి. మతతత్వ పోకడలు పొందపరచే విధంగా పాఠ్య ప్రణాళికలను రూపొందించాలనుకోవడం ఏవిధంగాను సహేతుకం కాదు. హిందుత్వ ఎజెండాను అమలుచేసే ప్రయత్నాలు తీవ్రంగా నిరశిస్తూ శాస్త్రీయ విలువలకు ప్రాధాన్యం ఇచ్చే విధంగా పాఠ్య పుస్తకాల కూర్పు ఉండే విధంగా ఒకపక్క ఉద్యమిస్తూనే మరోపక్క విద్యను కాషాయీకరించడానికి చేస్తున్న విశ్వ ప్రయత్నాలను అన్నింటిని పూర్తిగా నిలువరించే దిశగా ప్రగతిశీల ప్రజాస్వామ్య శక్తులు తీవ్రంగా ప్రతిఘటించాల్సిన సమయం అసన్నమైనది.

  • జె.జె.సి.పి. బాబూరావు
    రీసెర్చ్ స్కాలర్,
    సెల్: 94933 19690.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News