Monday, June 24, 2024
Homeఓపన్ పేజ్Sahithi vanam: అపురూపమైన గ్రంథం ‘రక్త రేఖ’

Sahithi vanam: అపురూపమైన గ్రంథం ‘రక్త రేఖ’

ప్రముఖ సాహితీవేత్త స్వర్గీయ గుంటూరు శేషేంద్ర శర్మ ఏ పుస్తకం రాసినా అపురూపమే. ఏ పుస్తకమైనా అటు సాహితీవేత్తలను, ఇటు సాహిత్య అభిమానులను విశేషం గా ఆకట్టుకుంటుంది. తన డైరీలోని ముఖ్యమైన విశేషాలతో ఆయన రాసిన ‘రక్త రేఖ’ ఆయన ఆలోచనల సమాహారం. ఈ రక్త రేఖను ఆయన ‘ది ఆర్క్‌ ఆఫ్‌ బ్లడ్‌గా కూడా అభివర్ణించారు. అది ఒక విధంగా చూస్తే ఆయన ఆ పుస్తకం మీద రాసినట్టు పొయెట్స్‌ నోట్‌ బుక్‌. ఆయన తన డైరీలోని అంశాలను ఇందులో యథాతథంగా పొందుపరిచారు. శేషేంద్ర శర్మ ప్రచారం కోసం వెంపర్లాడిన వ్యక్తి కాదు. చాలావరకు జనానికి దూరంగానే ఉండేవారు. పైగా అనామ కంగా ఉండడానికే ఆయన ఇష్టపడేవారు. అయితే, ఆయన పండితుడు, పరిశోధకుడు, కవి, విమర్శకుడు, తత్త్వవేత్త, మేధావి అన్న విషయం అందరికీ తెలిసిందే. సంస్కృతాంధ్ర భాషల్లోని పురాణాలను, ఇతిహాసాలను, కావ్యాలను ఆయన క్షుణ్ణంగా, లోతుగా అభ్యసించిన వ్యక్తి. ప్రపంచ సాహిత్యాన్ని కూడా ఆయన మదించారు. ఆయన డైరీ చదివిన వారికి ఆయనకు ఉర్దూ మీద కూడా పట్టున్నట్టు అర్థమవుతుంది. అంతేకాదు, ఆయన రాసిన ‘నా దేశం, నా ప్రజలు’ అనే పుస్తకం నోబెల్‌ సాహితీ పురస్కారానికి కూడా నామినేట్‌ అయింది.
ఇక రక్త రేఖలో ఆయన ఎన్నో విషయాల గురించి తన భావాలను రాసుకున్నారు. ఇందులో అక్కడక్కడా ఆయన కవిత్వం కనిపిస్తుంది. పాశ్చాత్య సాహితీకారుల మీద అభిప్రా యాలు కనిపిస్తాయి. తాత్విక చింతన, పురాణాల మీద అభిప్రాయాలు, నేటి కవిత్వంపై చర్చలు, తాను ఎక్కడికో వెళ్లినప్పటి అనుభవాలు, ఎవరినో కలిసిన ఉదంతాలు వగైరాలన్నీ ఇందులో ప్రత్యక్షమై అలరిస్తాయి. అనేక విషయాల్లో లోతైన భావాలకు అది అద్దం పట్టింది. అంతేకాదు, ప్రతి అంశంలోనూ ఆయనలోని భిన్న కోణాలు కనిపిస్తాయి. విచిత్రమేమింటే, ఆయన ఒకే పుస్తకంలో తెలుగులోనూ, ఇంగ్లీషులోనూ తన ఆలోచనల్ని పంచుకున్నారు. అనేక అంశాలను ఇందులో కలగాపులగం చేయడం జరిగింది. ఒక పక్క అంతరిక్షం గురించి రాస్తూనే, మరొకపక్క ఉప మాలంకారం గురించి రాశారు. ఎంత డైరీ అయినప్పటికీ అన్నిటినీ ఒకే విధంగా గుదిగుచ్చడం పాఠకులకు ఇబ్బందికరంగా ఉండవచ్చు. వెంటనే ఆయన తాత్వికత మొదలవుతుంది. పక్కనే ఓ కవిత్వం ఉంటుంది.
సాధారణంగా డైరీలోని అంశాలు ఈ విధంగానే ఉండే అవకాశం ఉంది కానీ, కొద్దిగా ఎడిట్‌ చేయడం, ఒక వరుసలో క్రోడీకరించడం వంటివి చేపట్టి ఉంటే మరింత రసరమ్యంగా ఉండేది. పుస్తకాన్ని రెండు భాగాలుగా విభజించడం సమంజసంగా ఉండేది. పాఠకులే తమకు ఏ వరుసలో ఏ అంశం అవసరమో, ఇష్టమో చూసుకుని చదవాల్సి ఉంటుంది. తెలుగు సాహితీ రంగంలో తనకంటూ ఒక చిరస్థానాన్ని సంపాదించిన గుంటూరు శేషే్ంరద్ర శర్మ రాసిన అనేక పరిశోధక గ్రంథాల కంటే ఈ రక్త రేఖ కాస్తంత విలక్షణంగా, విభిన్నంగా ఉంటుంది. విచిత్రమేమిటంటే, ఈ పుస్తకం ఆద్యంతం కొద్దిగా కంగాళీగా కనిపించినప్పటికీ, ఇతర గ్రంథాలన్నిటికంటే ఎక్కువగా సాహితీ అభిమానులను ఆకట్టుకుంది. ఇందులో విభిన్న అంశాలను ప్రస్తావించడంతో పాటు, వాటి మీద లోతైన పరిశీలన జరపడం వల్ల పాఠకుల పరిశోధనాసక్తికి ఇది ఎంతగానో తోడ్పడి ఉంటుంది. మొత్తం మీద ఇది వెనుకటి తరం పాఠకులనే కాకుండా భావి తరం పాఠకులను, సాహిత్య అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటుందనడంలో సందేహం లేదు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News