సమకాలీన దేశ చరిత్రను ఆధారం చేసుకుని రాసే నవలలు పాఠకులను ఆకట్టుకోవడం కొద్దిగా కష్టమైన విషయమే. అయితే, భారతదేశ స్వాతంత్య్ర సమరానికి పూర్వమూ, స్వాతంత్య్రానంత రమూ దేశంలో ఉన్న సామాజిక, రాజకీయ పరిస్థితులను ఆధారం చేసుకుని ప్రసిద్ధ రచయిత్రి మాలతీ చందూర్ రాసిన ‘హృదయనేత్రి’ నవల మాత్రం 1990 దశకంలో అశేష తెలుగు పాఠకుల్ని ఉర్రూతలూగించింది. అతి విస్తారమైన ఇతివృత్తంతో ఆమె రాసిన ఈ నవలను చదువుతుంటే, ఒక్కసారిగా ఒక వందేళ్లు వెనక్కిపోయి, అక్కడి నుంచి నిదానంగా ఓ అరవై డెబ్భయ్యేళ్లు ముందుకు ప్రయాణం చేస్తున్న అనుభూతి కలుగుతుంది. 1992లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును అందుకున్న నవల ఇది. దుగ్గిరాల గోపాల కృష్ణయ్య ‘చీరాల-పేరాల’ ఉద్యమ పూర్వరంగంతో మొదలుపట్టి, స్వాతంత్య్ర పోరాటం, కాంగ్రెస్, జనతా పార్టీల పనితీరు మీదుగా ఇందిరా గాంధీ పాలన, ఎమర్జెన్సీ అనంతర పరిస్థితులను కూడా పరామర్శిస్తూ, ఇందిరా గాంధీ హత్యతో ఈ నవల ముగుస్తుంది. ఇది కేవలం దేశభక్తులు, జాతీయవాదుల కథ మాత్రమే కాదు, స్వార్థపరులు, వేర్పాటువాదుల దుష్కృత్యాలు, అకృత్యాలు కూడా ఇందులో భాగమయ్యాయి.
నవలలో ప్రధాన పాత్ర గోపాలం. అతను పదేళ్ల పిల్లవాడిగా ఉండగా కథ మొదలవుతుంది. కొద్ది కాలానికే అతను తన అత్తయ్యతో కలిసి చీరాల చేరుకుంటాడు. అప్పుడే చీరాల-పేరాల ఉద్యమం మొదలైంది. స్థానిక మునిసిపాలిటీలు ఇంటి పన్నును మూడింతలు చేయడంతో ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది. బ్రిటిష్ పాలకులు ప్రజల నుంచి ఎదుర్కొన్న మొదటి తిరుగుబాటు అది. తర తమ భేదం లేకుండా ప్రజలంతా ఒక్కచోటే గుడిసెలు వేసుకుని ఉండడం, ఉద్యమంలో పాల్గొనడం గోపాలం మీద చెరగని ముద్ర వస్తుంది. చీరాల-పేరాల ఉద్యమం ముగిసిన తర్వాత ఖద్దరు ఉద్యమం మొదలవుతుంది. గోపాలంలో క్రమంగా వేళ్లు పాతుకుపోయిన జాతీయ భావాలు తల్లితండ్రులు, ఇతర బంధువులకు నచ్చవు. అతనికి బలవంతాన పెళ్లి చేస్తారు. అయితే, అతను తన భార్య పార్వతి గర్భవతిగా ఉండగా, శాసనోల్లంఘనలో పాల్గొని జైలుకు కూడా వెడతాడు. భర్త ధోరణి నచ్చక పార్వతి ఒక కొడుక్కి జన్మనిచ్చిన తర్వాత పుట్టింటికి వెళ్లిపోతుంది. గోపాలం చీరాలలో ఒంటరి జీవితం గడపడం మొదలుపెడతాడు.
దేశానికి స్వాతంత్య్రం వచ్చిందన్న సంతోషం కన్నా గోపాలానికి దేశం రెండు ముక్కలు కావడమే బాగా బాధను కలిగిస్తుంది. చీరాల నుంచి పోటీ చేసి గెలిచినప్పటికీ, ఆ తర్వాత రాజకీయాలు తనకు సరిపడవని గ్రహించి, వాటికి దూరంగా జరుగుతాడు. ఆ తర్వాత చాలా కాలం వినోబా భావే ఆశ్రమంలో గడుపుతాడు. భార్య దగ్గర పెరిగిన కొడుకు కమ్యూనిస్టు పోరాటంలో ఆయుధం పట్టిన విషయం తెలుస్తుంది. ఏనాడూ కొడుకుని కంటితో చూడకపోయినా, ఆ తర్వాత భార్యతో కలిసి కుమారుడి కూతురు స్వరాజ్య లక్ష్మిని పెంచి పెద్ద చేస్తాడు. జీవిక కోసం గోపాలం ఒక పత్రికలో పనిచేస్తాడు. పొట్టి శ్రీరాములు ఆత్మార్పణనీ, తర్వాతి కాలంలో ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీని గోపాలం ఏమాత్రం అంగీకరించలేకపోతాడు. ఇది కేవలం గోపాలం, అతన్ని ప్రభావితం చేసిన రామలక్ష్మమ్మ తదితరుల కథ మాత్రమే కాదు, దేశ, రాష్ట్ర రాజకీయాల్లో చోటు చేసుకున్న అనేక సంఘటనలను మరో మారు గుర్తు చేయడంతో పాటు కళ్లకు కట్టించే నవల. తాను నమ్మిన విషయాల పట్ల, సిద్ధాంతాల పట్ల గోపాలానికి ఉన్న నిబద్ధత ఆశ్చర్యం కలిగిస్తుంది. స్వాతంత్య్ర సమరం పట్ల, రాజకీయాల పట్ల ఆసక్తి ఉన్నవాళ్లని ఈ నవల ఆపకుండా చదివిస్తుంది. ఎవరైనా ఏకబిగిన చదివి పక్కన పెట్టగల పుస్తకం.