కొందరు వ్యక్తుల్ని చూస్తే వారు వ్యక్తులనే భావన కలగదు. వారు ఒక పెద్ద సంస్థలనో, పరిశ్రమలనో అనిపిస్తుంది. అటువంటి కోవకు చెందినవారు డాక్టర్ అయ్యంకి వెంకట రమణయ్య. ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన అతి సాధారణ వ్యక్తి ఏకంగా దేశవ్యాప్తంగా అతి పెద్ద గ్రంథాలయోద్యమానికి నారు, నీరు పోశారంటే ఆశ్చర్యం కలగక మానదు. 1890 జూలై 24వ తేదీన పుట్టి 1979లో కాలధర్మం చెందిన అయ్యంకి వెంకట రమణయ్య ఏడు దశాబ్దాల పాటు గ్రంథాలయోద్యమ ఉద్యమానికి అంకితమయ్యారంటే అది చిన్న విషయమేమీ కాదు. ఆయన చేపట్టిన గ్రంథాలయోద్యమానికి గుర్తింపుగా ఆయనకు కౌలా స్వర్ణ పతకం కూడా లభించింది. ఈ పతకాన్ని పొందిన మొట్టమొదటి, ఏకైక వ్యక్తి అయ్యంకివారే. తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం తాలూకాలోని కొంకుదురు గ్రామంలో పుట్టి పెరిగిన రమణయ్య మీద పాఠశాల చదువుల కాలంలోనే ప్రముఖ సంఘ సంస్కర్త బిపిన్ చంద్ర పాల్ ప్రభావం పడింది.
సుమారు 1907 నాటికి అంటే 19 ఏళ్ల వయసులో చదువు సంధ్యలు ముగించుకున్న మరుసటి రోజు నుంచే ఆయన గ్రంథాలయోద్యమానికి తెరతీశారు. పుస్తక పఠనం ద్వారానే దేశ ప్రజలను దాస్యం నుంచి, మూఢ నమ్మకాల నుంచి, దురాచారాల నుంచి, అనేక రకాల వివక్షల నుంచి బయటికి తీసుకు రాగలమనే ఏకైక లక్ష్యంతో రమణయ్య గ్రంథ పఠనాన్ని ప్రోత్సహించడం ప్రారంభించారు. గ్రంథ పఠన ప్రాధాన్యాన్ని ప్రజల్లో చాటి చెబుతూనే ఆయన గ్రంథాలయాల స్థాపనకు నడుం బిగించారు. సాధారణ ప్రజానీకంలో మార్పు రావాలనే ఏకైక సంకల్పంతో ఆయన అనేక అత్యుత్తమ గ్రంథాలను గ్రంథాలయాల్లో సమీకరించారు. దేశం నలుమూలల నుంచి అపురూప గ్రంథాలను, ముఖ్యంగా సంఘ సంస్కర్తల గ్రంథాలను, వారి జీవిత చరిత్రలను, మహామహుల ఆత్మకథలను, అనేకానేక పరిశోధన గ్రంథాలను ఆయన సేకరించారు. దేశంలోనే మొట్టమొదటగా ఆయన ఆంధ్ర దేశ గ్రంథాలయ సంఘాన్ని 1914లో నెలకొల్పారు. ఆ తర్వాత వివిధ రాష్ట్రాల్లో ఆయా రాష్ట్రాల పేరిట కూడా గ్రంథాలయ సంఘాలను స్థాపించడం జరిగింది. గ్రంథ పఠనంతో పాటు గ్రంథాలయాల ఆవశ్యతకను గుర్తు చేస్తూ ప్రజల్లో చైతన్యం కలిగించేలా వేలాది వ్యాసాలను రాశారు. జాతీయ స్థాయిలో అఖిల భారత ప్రజా గ్రంథాలయ సంఘం పేరుతో ఆయన ఒక సంస్థను నెలకొల్పి, ప్రముఖులను అందులో సభ్యులుగా చేర్చి, దేశవ్యాప్త పర్యటనలు చేస్తూ గ్రంథ పఠనాన్ని విపరీతంగా ప్రోత్సహించారు.
ఇక 1934-48 సంవత్సరాల మధ్య ఆంధ్ర దేశంలో అత్యధిక సంఖ్యలో గ్రంథాలయాలు ప్రారంభం కావడానికి ఆయనే కారణం. 1920-1934 సంవత్సరాలకు మధ్య ఆయన రాష్ట్రంలో వందలాది మంది గ్రంథాలయ కార్యదర్శులకు శిక్షణనిచ్చారు. ఆంధ్రప్రదేశ్ లోని గ్రామాలన్నిటిలో ఆయన గ్రంథాలయాలను ఏర్పాటు చేశారంటే అందులో అతిశయోక్తేమీ లేదు. ఆయన 1910లో మచిలీ పట్నంలో ‘ఆంధ్ర భారతి’ పేరుతో మొట్టమొదటి గ్రంథాలయ మాస పత్రికను ప్రారంభించారు. గ్రంథాలు, గ్రంథాలయాలు, కొత్త పుస్తకాలు, పాత పుస్తకాలు, పుస్తక సమీక్షలు, పుస్తక ఘనతలు, పుస్తక రచయితలకు సంబంధించిన పూర్తి వివరాలు, వ్యాసాలు ఆ సంచికలో ఉండేవి. 1916లో గ్రంథాలయ సర్వస్వము పేరుతో ఒక సంస్థను నెలకొల్పారు. 1924లో విజయవాడలో మొట్ట మొదటి ఇంగ్లీష్ సంచిక ఇండియన్ లైబ్రరీ జర్నల్‌ను ప్రారంభించారు. గ్రంథాలయ విజ్ఞానానికి సంబంధించిన సంచిక ఇది. ఆయన ఏ పని చేసినా తన కష్టార్జితంతోనే చేశారు.
ఇక విజయవాడలో 1911లో రామ్మోహన్ లైబ్రరీని స్థాపించిన వ్యక్తి ఆయనే. 1919లో ఆయన ఇక్కడే అఖిల భారత గ్రంథాలయ పాఠకుల సంఘాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. అఖిల భారత స్థాయి గ్రంథాలయ సమావేశాలను ఏర్పాటు చేసి, వాటికి రవీంద్రనాథ్ ఠాగూర్, సర్ పి.సి. రాయ్, దేశబంధు చిత్తరంజన్ దాస్ వంటి ప్రముఖులను ఆహ్వానించడం జరిగింది. దేశంలోని ప్రతి రాష్ట్రంలోనూ ఆయన ఇటువంటి సమావేశాలను నిర్వహించారు. ఆయన అయ్యంకి గ్రామంలో పది ఎకరాల స్థలాన్ని గ్రంథాలయ స్థాపనకు, ఆలయ స్థాపనకు విరాళంగా ఇచ్చారు. అక్కడ ఆయన కాలక్రమంలో గ్రంథాలయం, దేవాలయం, విద్యాలయాలను అభివృద్ధి చేయడం జరిగింది. బరోడా మహారాజు ఆయనను గ్రంథాలయ పితామహ బిరుదుతో సత్కరించారు. కేంద్ర ప్రభుత్వం ఆ తర్వాత ఆయనకు పద్మశ్రీ బిరుదును కూడా ప్రకటించింది. గ్రంథాలయోద్యమానికి ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా నవంబర్ 14ను గ్రంథాలయ దినోత్సవంగానూ, నవంబర్ 14 నుంచి 20 వరకు గ్రంథాలయ వారోత్సవాలుగానూ కేంద్ర ప్రభుత్వం గుర్తించడం జరిగింది.